BG

Saturday, June 15, 2013

Wisdom of Our Fathers - Tim Russert

*** ఈ వ్యాసం 06/16/13 న  పుస్తకం.నెట్ లో ప్రచురించబడింది.

“Every now and then, a father says something really important. And once in a great while, a son is listening … and learning.”
నాన్న… దాదాపు ప్రతీ మనిషికీ తమ జీవితంలోని మొదటి పురుషుడు. అమ్మ తొలి గురువు అయితే నాన్న మనకి తెలియకుండానే మనం అనుసరించే రోల్ మోడల్. ఆయన వ్యక్తిత్వం, మాట్లాడే మాట, చేసే ప్రతి పనీ మనమీద తెలీకుండానే ప్రభావం చూపిస్తాయి. ఆయన అడుగుజాడల్లో నేర్చుకున్న పాఠాలు, విలువలు, పొందిన ప్రేమానురాగాలు మనల్ని వెన్నంటే ఉంటాయి.  వాటి సాయంతో మన జీవితపథాన్ని తీర్చిదిద్దుకుంటాం.  చిన్నతనంలోనూ, బాధ్యతరాహిత్యపు యవ్వనంలోనూ నాన్నల ప్రవర్తన, బోధలూ మనకి చాదస్తం గానూ, విసుగ్గానూ అనిపించినా, మనకూ ఓ స్వంత జీవితం ఏర్పడి మనకో గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నంలోనో, లేదా మనమూ తల్లిదండ్రుల అవతారమెత్తినపుడో మనకి బాగా తెలిసి వస్తాయి.
"When I was a boy of fourteen, my father was so ignorant I could hardly stand to have the old man around. But when I got to be twenty-one, I was astonished at how much the old man had learned in seven years ” – Mark Twain
నేను చిన్నప్పుడు అమ్మ నోటినుండి తరచుగా విన్నదీ, ఇపుడు దాదాపూ ప్రతీరోజూ గుర్తుకొచ్చేదీ ఒక వాక్యముంది. అది ‘నీకు పిల్లలు పుడితేనేగానీ నీకు తెలిసిరాదు’ అనేమాట. అమ్మనీ, ఆమాటనీ తలుచుకోకుండా నాకు రోజు దాటదు అంటే అతిశయోక్తి  కానేకాదు. అలానే ఇంట్లో తరచుగా వినిపించే మాటలూ కొన్నుండేవి, “నేను చెప్పేది మీకు ఇపుడు అర్థం కాదు”, “మీకు తెలిసేసరికి సమయం దాటిపోతుంది.”, “ఏదో ఒకరోజు మీరు నామాటల్ని గుర్తుచేసుకుంటారు” లాంటివి.
ఎపుడో నలుగురూ తీరిగ్గా కూర్చుని కబుర్లాడుకునే వేళ ఏదో సంభాషణలో భాగంగానో, ఆకతాయి పిలల్లకి సుద్దులు చెప్తూనో, మా అమ్మ చెప్పేది చిన్నప్పుడు అనో, మా నాన్న ఎప్పుడూ చెప్పేవారు తెలుసా అనో ఒక ముచ్చట బయటకొస్తుంది. అంతే ఒక్కసారిగా అందరి జ్ఞాపకాల తెరలూ పైకి లేస్తాయి. మా అమ్మ కూడా అంతే అనో, నేనిలా చేస్తే మా నాన్న కూడా ఇలానే అనేవారు తెలుసా అనో ముచ్చట్ల కలబోత మొదలవుతుంది. ఏ వర్షాకాలపు సాయంత్రమో తీరిగ్గా బయటకి చూస్తూ ఆలోచిస్తూ కూర్చున్నప్పుడు చిన్నప్పటి జ్ఞాపకమేదో గుర్తొస్తుంది. బయట వానలో తడుస్తూ వడగళ్ళు ఏరుకోవడం, చిన్న చేతుల్లోంచి జారిపోతున్న వడగళ్ళని వేసుకోడానికి నాన్న గ్లాసు తెచ్చివ్వడం, మనతో పాటూ తడుస్తూ వడగళ్ళు ఏరడం, ఆఫీసు నుంచి వస్తూ ఎంత ఆలస్యమయినా సరే మనకిష్టమయిన చిరుతిళ్ళు తీసుకురావటం, వాటికోసం మనం గుమ్మం దగ్గరే కాసుకు కూర్చోవడం, వారం వారం కలిసి గుడికి వెళ్లడం, తిరిగి వస్తూ చేతులు పట్టుకుని బీచ్లో తిరగడం…జ్ఞాపకాల నెమరేత మొదలవుతుంది. క్రిందపడ్డ ఊలు బంతి దొర్లుకెళ్ళినట్టు ఒకదాని వెనుక ఒకటి ఆలోచనలు మనసులోతుల్లో పదిలపరుచుకున్న జ్ఞాపకాల వెంబడి పరిగెడతాయి. అపుడే, ఇంకోసారి నా బాల్యాన్ని నాకిచ్చెయ్యవూ అని దేవుడ్ని వేడుకోవాలనిపిస్తుంది.
మన పిల్లలు పొరపాట్లు చేసినపుడు ఆయాసపడిపోయి, చిన్నప్పుడు మేమిలా కానేకాదు తెలుసా అంటూ నీతులు చెప్పేసి, లెక్చర్లు దంచేస్తుంటాం. కావాల్సినన్ని కోతలూ కోసేస్తాం, అవి అబద్ధమని చెప్పి మన బండారం బయటపెట్టేవాళ్ళు ఎవరూ చుట్టుపక్కల లేరు కదా అని. కానీ మన అంతరాత్మ మాత్రం ‘ఓసారిటు చూడు బాసూ’ అంటూ మనల్ని పలకరిస్తూనే ఉంటుంది.  తెలివిగా దాన్ని మనం వెనక్కి తోసేసినా, మనల్ని, మన ఆగడాల్ని, ఆకతాయితనాల్ని, అతితెలివిలనీ, మూర్ఖత్వాలనీ సహనంతోనూ ప్రేమతోనూ భరించిన అమ్మా నాన్నా కళ్ళముందు మెదులుతారు. మన ప్రమేయం లేకుండానే మనసు కృతజ్ఞతతో చెమ్మగిల్లుతుంది. ఓసారి వాళ్ళతో మనసు విప్పి మన అజ్ఞానాన్ని ఒప్పుకోవాలనీ అనిపిస్తుంది.
Tim Russert అనే ఆయన 2004లో తన జీవితచరిత్ర రాసుకుని దానికి తన తండ్రి Timothy Joseph Russert (Big Russ) పేరుతో Big Russ and Me అని పేరు పెట్టుకున్నారు. అందులో ముఖ్యంగా తన తండ్రి జీవితమూ, వ్యక్తిత్వమూ తనని ఎలా ప్రభావితం చేసాయో, తన తండ్రి నుంచి తను నేర్చుకున్న నిజాయితీ, క్రమశిక్షణ, విలువలూ తనని ఎలా తీర్చిదిద్దాయో గుర్తు చేసుకుంటూ తండ్రికి కృతజ్ఞత చెప్పుకున్నారు. ఆ పుస్తకం 2004 మే నెలలో విడుదలయి చాలా ప్రతులు అమ్ముడుపోయింది. పుస్తకం  పబ్లిసిటీ పెంచడంలో భాగంగా రచయితని కలిసే అవకాశాన్ని పబ్లిషర్స్ కలిగించినపుడు, వెళ్ళిన ప్రతీచోటా జనాలు పెద్ద సంఖ్యలో వచ్చారు. పుస్తకాన్ని తమ తండ్రులకి ఫాదర్స్ డే బహుమతిగా ఇవ్వడం కోసం, తండ్రుల పేర్ల మీద ఆటోగ్రాఫ్ చేయించుకున్నారు. ఆ పుస్తకం వాళ్ళ నాన్నలని ఎలా గుర్తు చేసిందో, అందులోని సంఘటనలు తమ జీవితాలకి ఎంత సారూప్యంతో ఉన్నాయో, వాళ్ళ ఆలోచనలని ఎలామార్చిందో రచయితతో చెప్పుకున్నారు.
“ For many years, fathers who have said or done things that may not always made sense to their children, have found themselves saying, or thinking, just as their fathers had “Someday you’ll thank me”.  For most of the fathers whose sons and daughters wrote the stories you are about to read, that day is finally here.”
WisdomofFathers3

ఈ పుస్తకాన్ని చదివిన ప్రతీవారూ తమ తండ్రులతో, తమ అనుభవాలతో అన్వయించుకున్నారు. వారికి తమ తండ్రుల గురించీ చెప్పుకోవాలని అనిపించింది. పాఠకుల స్పందనతో దాదాపు అరవైవేల ఉత్తరాలు, ఈమైల్స్ అందుకున్నారు Tim. దాదాపు అన్నిటిలోనూ సారాంశమూ ఒకటే …తమ నాన్నల వ్యక్తిత్వం, ధైర్యం, త్యాగం, వివేకం, మార్గదర్శకత్వం, స్నేహం, ప్రేమ, స్ఫూర్తిని ఇంకొకసారి తలుచుకోవడం, ఈ అవకాశాన్ని తీసుకుని తమ జీవితానికి చక్కని మార్గనిర్దేశం చేసిన మనిషికి కృతజ్ఞత తెలియచేసుకోవడం. ఆ ఉత్తరాల్లో కనిపించిన తండ్రుల అపురూపమైన వ్యక్తిత్వాలు రచయితని ఎంతో కదిలించాయి. వాటిలో కొందరి తండ్రుల గురించయినా ప్రపంచానికి తెలియచెప్పాలని ఆయనకి అనిపించింది. అతికష్టం మీద వాటిలో కొన్నిటిని మాత్రం ఎంచుకుని 2006 లో తన రెండవ పుస్తకం ‘Wisdom of Our Fathers’ ప్రచురించారు. అది కూడా మొదటి పుస్తకంలాగే పాఠకుల అంతులేని అభిమానాన్ని సంపాదించుకుంది. కారణం అందులోని కథల్లో కనిపించే తండ్రులు గానీ పిల్లలు గానీ మనకి పరాయివాళ్ళు కారు. అందులో చాలా కథల్లో మన తండ్రులు కనిపిస్తారు, మనమూ కనిపిస్తాము. మన జీవితాలే కొద్దిగా రంగులు మార్చుకుని కనిపిస్తాయి. మనుషులూ సంఘటనలు మాత్రమే వేరు కానీ అనుభూతులు మాత్రం ఒకటే. ఆ తండ్రులందరి లక్ష్యమూ, కోరికా ఒక్కటే… నాన్న అనే పదవిని బాధ్యతతోనూ ప్రేమతోనూ సమర్థవంతంగా నిర్వర్తించడం. ఒక సైనికుడికన్నా ఒక తండ్రిగా నాకు కలిగిన సంతృప్తి ఎక్కువ అంటారు జనరల్ మెకార్ధర్.


“By profession I am a soldier and take pride in that fact, but I am prouder – infinitely prouder – to be a father. A soldier destroys in order to build; the father only builds, never destroys. The one has the potentiality of death; the other embodies creation and life. And while the hordes of death are mighty, the battalions of life are mightier still. It is my hope that my son, when I am gone, will remember me not from the battlefield but in the home, repeating with him our simple daily prayer, Our Father Who Art in Heaven.”  – General MacArthur
ఈ నాన్నలందరూ ప్రపంచానికి తెలిసిన గొప్పవారో, లేదా తీరి కూర్చుని పాఠాలు నేర్పడానికి నోట్లో సిల్వర్ స్పూన్ తో పుట్టినవాళ్ళో కాదు. మనుషులకుండే చిన్న చిన్న బలహీనతలకూ, లోపాలకూ అతీతం కాని అతిసాధారణ వ్యక్తులు. కుటుంబాన్ని పోషించడానికి, కనీస అవసరాలు తీర్చడానికే ఒకటి కన్నా ఎక్కువ చిన్నచిన్న ఉద్యోగాలు చేస్తూ రాత్రీ పగలూ కష్టపడ్డవారు. అయినా సరే ఏరోజూ ఏవిషయంలోనూ విలువలతో రాజీపడలేదు, ఏపరిస్థితిలోనూ స్థైర్యాన్ని, వివేకాన్ని కోల్పోలేదు. ఉన్నదానితోనే నిజాయితీగా సంతోషంగా మంచి వ్యక్తిత్వంతో బ్రతకడం ఎలానో తమ పిల్లలకి ఆచరించి చూపించారు. కుటుంబ బాధ్యతలతో వూపిరి తీసుకోవడానికి కూడా తీరికలేని పరిస్థితుల్లో కూడా పిల్లలతో వీలయినంత కాలం గడపడానికీ, పిల్లల జీవితంలో గుర్తించుకోదగ్గ ప్రతిఘటనలోనూ తోడుండి వారిలో ధైర్యాన్ని స్ఫూర్తిని, ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికే ప్రాముఖ్యతనిచ్చారు. ఆ ప్రేమా, ఆప్యాయతా, మార్గనిర్దేశకత్వం పిల్లల మనసులో ముద్ర వేసుకుని వాళ్ళని ప్రేమతోనూ కృతజ్ఞతతోనూ తలుచుకునేలా చేసాయి. ఈ తండ్రులు ఏచరిత్రా కీర్తించని unsung heroes, but sure they are heroes to their own kids.
 “A father’s presence can extend well beyond the course of his life.“
నాన్నల ప్రేమ అమ్మ ప్రేమలా బయటకి కనిపించదు. పిల్లల మీద ఎంత ప్రేమ ఉన్నా దాన్ని వ్యక్తీకరణ చాలా అరుదు. ఆ ప్రేమ వేరే రూపాల్లో బయటపడుతుందే తప్ప, నోరువిప్పి మాటల్లో చెప్పడం అనేది దాదాపు శూన్యం. కానీ వారి చేతలు పిల్లల జీవితాల్లో చూపిన ప్రభావం మాత్రం అనంతం. కేవలం ఒక చిన్న స్పర్శతోనూ, ఒక మాటతోనూ పిల్లల్లో దిగజారిపోతున్న ఆత్మవిశ్వాసాన్ని ఎగదోసి, కర్తవ్యాన్ని తెలియచేసి వాళ్ళ విజయాన్ని ఆనందించిన నాన్నలు ఎందరో. తండ్రులు అందించిన ధైర్యం నమ్మకం, విలువలూ జీవితంలో ప్రతీసారీ తమ తోడుగా ఉండి నడిపించాయనీ, ఇపుడు అవి తమ పిల్లలకి తాము వారసత్వంగా అందించగలుగుతున్నామనీ కృతజ్ఞతగా చెప్పుకున్న బిడ్డలు ఎందరో.
“If real estate is about location, location, location, fatherhood is about time, time time.”
ఎప్పుడు నాన్నని తలుచుకున్నా నాకు ముందుగా గుర్తొచ్చేది, డిగ్రీ ఫైనల్ పరీక్షలప్పుడు వొళ్ళు తెలీని జ్వరంతో ఉదయాన్నే లేచి కాలేజీకి వెళ్ళిపోతే, పరీక్ష రాసి బయటకి వచ్చేసరికి ఆఫీసుకు వెళ్లడం కూడా మాని, బయట ఎర్రటి మధ్యాన్నపు ఎండలో కందిపోయి ఎదురు చూస్తున్న పచ్చటి నాన్న మొహం. జరిగి ఇరవయ్యేళ్ళు దాటినా ఇంకా నిన్నో మొన్నో అన్నట్టు పచ్చగానూ, పచ్చిగానూ జ్ఞాపకం. ఇంకా ఆఫీసుకి సెలవు పెట్టి మరీ నావెంట ఎంట్రన్స్ల కోసం వూర్లు తిరిగినదీనూ. అడక్కుండానే తీర్చిన మురిపాలూ, అడిగి సాధించుకున్న సరదాలూ, కూతురు చదువుల తల్లి అని మురిసిపోయిన విషయాలూ … అన్నీ ఆ తర్వాతనే.
తనకొచ్చిన అన్నివేల ఉత్తరాల్లోనూ ‘తల్లిదండ్రులు ఇచ్చిన బహుమతులు తమకి ఎక్కువ సంతోషం కలిగించాయి అనో, తండ్రి అనగానే ఆయన కొనిచ్చిన కొత్త టీవీనో, లేదా సైకిలో గుర్తొస్తుంది అనో’ చెప్పుకున్నవి ఒక్కటంటే ఒక్కటి మచ్చుకి కూడా లేదంటారు Tim. ఒక స్కూల్ ఫంక్షన్లోనో, పోటీల్లోనో వెంట ఉండటం అయితేనేం, పడుకునే ముందు కథలు చెప్పి నిద్ర పుచ్చడం అయితేనేం, కలిసి చూసిన ఓ సినిమా అయితేనేం, తమ తల్లిదండ్రులు కేవలం తమతో గడిపిన సమయం మాత్రమే తమకి విలువైనది అనేది ఏకాభిప్రాయం.
 రోజుకి పద్దెనిమిది గంటలు పని చేసి కూడా నిద్రని త్యాగం చేసి టీనేజ్ కొడుకు సమస్యలు ఓపికగా విని సలహాలు ఇచ్చిన నాన్న ఒకరైతే, కొడుకు స్కూల్ లీగ్ గేమ్లో ఆడుతున్నప్పుడు తనతో ఉండి ప్రోత్సహించడానికి వీలుగా సెలవు దొరకలేదని ఉద్యోగాన్ని విడిచిన నాన్న ఒకరు. కొడుకుతో మొట్టమొదటగా చూసిన గేమ్ టికెట్ని భద్రంగా చివరి వరకూ దాచుకున్న నాన్న ప్రేమ ఒకటైతే, తనకి ఇష్టమైన ఆటగాడు ట్రోఫీ గెలిచిన సమయంలో ఆ విషయాన్నీ కొడుకుతోనే మొదటగా పంచుకోవాలని స్కూల్ టైంలో బయటకు పిలిచిన నాన్న ఒకరు. ఇంకా ఎందరు నాన్నలో …ఎన్ని కథలో…
కొడుకుతో కలిసి ఫుట్బాల్ ఆట చూడడానికి వెళ్ళినపుడు టికెట్ కొనకుండా లోపలి వెళ్ళే అవకాశం వచ్చినా కూడా టికెట్ కొనే స్టేడియం లోపలికి అడుగుపెట్టిన నాన్న ఒకరైతే, తన దగ్గర ఎక్కువున్న గేమ్ టికెట్లని బ్లాక్లో ఎక్కువ రేటుకి అమ్మే అవకాశాన్ని వదిలేసి, తనలాగే చిన్న పిల్లలతో గేమ్ చూడ్డానికి వచ్చిన ఇంకో తండ్రికి అసలు రేటుకే టికెట్ అమ్మిన నాన్న ఇంకొకరు. “the words and actions are the yard stick others measure us” అని సున్నితంగానే కొడుకు వ్యక్తిత్వాన్ని బాధ్యతారాహిత్యాన్ని సరిదిద్దిన నాన్న, ‘don’t ever get into a situation you owe anything to a man, because I know in return what they expect’ అని కూతుర్ని హెచ్చరించిన నాన్న. ఇలా ఎందరు నాన్నలో … ఎన్ని బ్రతుకు పాఠాలో…
“When women are pleased with their fathers, it’s often because of their father’s guidance and protection. And when they are disappointed in their fathers, it’s often for the same reason they are disappointed in their boy friends and their husbands.“
‘Every daughter is her dad’s princess. It’s very difficult for her boy friend/husband to live up-to that’ అని ఎక్కడో చదివిన జ్ఞాపకం. ఓ పురుషుడిలోని సున్నితత్వాన్ని, ప్రేమని బయటకి తెచ్చే పని అతడి తల్లి, భార్య, ప్రియురాలి కన్నా కూతుర్లు చాలా సునాయాసంగానూ, సమర్ధవంతంగానూ చేస్తారు అనిపిస్తుంది. అమ్మ ప్రేమకో లేదా భార్య ప్రేమకో బద్ధుడిని అని చెప్పుకోడానికి సంశయించే మనిషి కూడా, కూతురి గురించి ‘she has me wrapped around her finger’ అని గర్వంగానూ, మురిపెంతోనూ చెప్పుకోడానికి ఏమాత్రమూ సందేహించరు. అలాంటి నాన్నలకూ ఓ భాగం ఉంది ఈ పుస్తకంలో. కూతుర్ల చేత గోళ్ళకి రంగు వేయించుకున్న నాన్న, ‘నా కూతురి చేత కన్నీళ్ళు పెట్టిస్తే నీ రక్తం కళ్ళ చూస్తానని’ అల్లుడుని బెదిరించిన నాన్న … ఇలా ఎందరో పుత్రికాదాసులు.
అన్నిచోట్లా ఎల్లప్పుడూ మంచే ఉండనట్టు, మంచి నాన్నలు కాలేకపోయినవాళ్ళూ ఉన్నారు. అటువంటి నాన్నల నుండి తామెలా ఉండకూడదో నేర్చుకున్నామని చెప్పినవాళ్ళు కొందరున్నారు. పరిస్థితుల వల్ల కలిసి జీవించలేకపోయినా, అవకాశం దొరికినపుడు పిల్లల్ని ప్రేమలో ముంచెత్తిన వాళ్ళూ ఉన్నారు. ఆ తండ్రుల ప్రేమా, ప్రభావమూ కూడా దేనికన్నా తక్కువేం కాదంటారు వారి పిల్లలు.
 తన మొదటి పుస్తకం Big Russ & Me చదివిన తరువాత,
  • మనస్పర్ధలతో ఏళ్ళకొద్దీ దూరంగా ఉన్నవాళ్ళు లేదా చిన్నతనంలోనే తమని వదిలేసిన తండ్రుల బలహీనతలని అర్థం చేసుకుని క్షమించి వాళ్లకి దగ్గరయ్యామని కొందరు చెప్పటం…
  • చాలామంది మగవారికి మల్లే తండ్రులు ప్రేమని ఎపుడూ బయటకి వ్యక్తపరచకపోవడాన్ని వాళ్ళ నిర్లిప్తతనీ అపార్థం చేసుకున్నవాళ్ళు ఈపుస్తకం చదివాక సరిగా అర్థం చేసుకోగలిగామని, తిరిగి తమ తండ్రులకు చేరువయ్యామని చెప్పటం…
  • తండ్రుల మీద తమకున్న ప్రేమనీ, గౌరవాన్ని, కృతజ్ఞతనీ వాళ్ళకి తెలియచెయ్యడం అనేది చాలా ముఖ్యమని గుర్తించి, ఆచరించి తమ తండ్రుల సంతోషాన్ని చూడగలిగామని చాలామంది చెప్పటం…
తనకి చాలా సంతృప్తి కలిగించిన విషయాలు అంటారు Tim.
పాఠకుల సంగతి సరే, రచయిత స్వంత మనుషులు ఎలా స్పందించారో తెలుసుకోవాలని అనిపిస్తుంది కదా! మొదటి పుస్తకం విడుదలయిన తర్వాత, మొదటిసారి తండ్రి దగ్గరికి సెలవులకి వెళ్ళి తిరిగిరావటానికి సిద్ధమవుతున్నప్పుడు, ఎప్పుడూ లేని విధంగా కొడుకుని గాఢంగా కౌగలించుకుని “I love You” అని చెప్పారట. ఆయన కొడుకు Luke తన చేతిమీద తండ్రి తాత ఇద్దరూ ఎప్పటికీ తనకి తోడుగా ఉండాలని ఇద్దరి పేర్లూ కలిసి వచ్చేలా TJR అని పచ్చబొట్టు వేయించుకున్నాడట. తను వృత్తిలో సాధించిన విజయాలు, పొందిన సంతోషం కన్నా, ఈ పుస్తకం వలన తనకు కలిగిన సంతృప్తి అమూల్యమని అంటారు Tim.
ఈ పుస్తకాన్ని నేను చదివించిన వాళ్ళలో పిల్లలూ (8 ఏళ్ళ వయసు పైవాళ్ళు), పెద్దలూ కూడా చాలా ఇష్టపడ్డారు. కొన్ని ఉత్తరాలు చదువుతుంటే మనసు ఆహ్లాదంతో నిండిపోతుంది. కొందరిని చూసి బాధతో కొంచెం సేపు మూగబోతుంది. కొందరి తండ్రుల సెన్స్ ఆఫ్ హ్యూమర్ చూసి తెలీకుండానే బయటకి నవ్వేస్తాం. కొందరిని చూసి అబ్బురపడతాం కూడా. దాదాపు 270 పేజీలున్న పుస్తకాన్ని లేఖల స్వభావాన్ని బట్టి Small Moments, Memories, Honor, Daddy’s Girl, The teacher, Forgiveness … అంటూ ఓ ఇరవై భాగాలుగా కూర్చారు. ప్రతీ భాగానికి ముందు రచయిత వాఖ్యానం చాలా ఆసక్తికరంగా ఉంది.  ప్రతీవారూ కనీసం ఒకసారైనా  చదవాల్సిన పుస్తకం అని నా అభిప్రాయం.
*** To Dad, the very first man I ever knew in my life, with love and gratitude. – పద్మవల్లి
Some Interesting Links:
A video aired after Tim died, in which Tim and dad were present, and Tim talked about some interesting events of his childhood, his book, his confessions, his dad.  A must watch.
Today Show in 2004 A video in which father and son together talking about the book and their feelings, after the first book Big Russ & Me was released.
Showing Love, Spending Time : An interview of Tim Russert about the book ‘Wisdom of Our fathers’. Some of the chapters can be listened in his voice.
An excerpt from the book ‘Wisdom of Our Fathers’, a chapter on Forgiveness.
A video in Luke Russert talking about his dad, after Tim Russert died in 2008.
A beautiful and touching eulogy by Luke Russert to his dad Tim Russert.

Images Courtesy: Internet.