BG

Monday, June 30, 2014

గూడు చెదిరిన గువ్వలు


రెండవ ప్రపంచయుద్ధకాలం. పెరల్ హార్బర్ మీద జపాన్ దాడి తరువాత, అమెరికాలో స్థిరపడిన జపాన్ సంతతి మొత్తం అమెరికన్ల చేత శత్రువుగా ముద్రవేయించుకుంది.  ఆ క్రొత్త గుర్తింపుతో ఎన్నో జీవితాలు చెదరిపోయాయి. గూఢచర్యం, దేశద్రోహం  ఆపాదించబడ్డాయి. ఎందరో చెయ్యని నేరానికి మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ఒక జాతికి చెందినవారు మొత్తం అనుమానం, ద్వేషం, అవమానాలను ఎదుర్కున్న పరిస్థితుల్లో ఒక చిన్న కుటుంబం మీద అది ఏ పరిణామాలు తీసుకొచ్చింది, సాఫీగా సాగిపోతున్న వాళ్ళ జీవితాలు ఏ మలుపులు తిరిగాయి, వాటికి వాళ్ళు చెల్లించిన మూల్యం ఎంత?



Julie Otsuka వ్రాసిన  When The Emperor Was Divine  పుస్తకానికి పరిచయం 'గూడు చెదిరిన గువ్వలు కౌముది సాహిత్య మాసపత్రిక జూన్ 2014 సంచికలో 'పుస్తకం ఓ నేస్తం' శీర్షిక లో. 



Friday, June 13, 2014

The Forgotten Daughter

మనిషికి కుటుంబం అనేది కనిపించని కోటలాంటిది. ఏ పరిస్థితుల్లోనయినా సరే అండగా ఉండే  స్వంతవాళ్ళున్నారు అనే ఆలోచన గొప్ప భరోసాని కలిగిస్తుంది.  మనవాళ్ళని ప్రేమిస్తాము, అలుగుతాము, సాధిస్తాము, పోట్లాడతాము, ఏడుస్తాము, తిరగబడతాము. అవన్నీ మనకి వాళ్ళమీద రక్త సంబంధంతో వచ్చిన హక్కులు అని ధీమా.   అటువంటిది తనవాళ్ళు అని తను నమ్మినవారు  తనకేమీ కారనీ,  అసలు స్వంతవాళ్ళు తనని  అక్కర్లేదు అని దూరం చేసుకున్నారని తెలిస్తే...???  

Renita D'Silva వ్రాసిన  The Forgotten Daughter పుస్తకానికి పరిచయం కౌముది సాహిత్య మాసపత్రిక జూన్ 2014 సంచికలో 'పుస్తకం ఓ నేస్తం' శీర్షిక లో ...


Monday, June 9, 2014

కథకు ముగింపు తెలియడం అవసరమా?

ఓ మంచి పుస్తకం చదివినపుడు దాని గురించి ఎవరికైనా చెప్పాలనిపిస్తుంది. వీలయితే కొందరితో అయినా చదివించాలనీ, మనకి నచ్చినంతగానూ వాళ్ళకీ నచ్చుతుందని అనేసుకుని, ఆత్రం ఆపుకోలేక దాని గురించి చెప్పడం జరుగుతుంది. ఓ పుస్తకాన్ని పరిచయం చేసిన ప్రతీసారీ నాకు రెండు రకాల పాఠకులు ఎదురవుతారు. చివరికి ఏం జరిగిందో తెలిస్తేనే తృప్తి అనేవారు ఒక రకమైతే, ముగింపు చెప్పేస్తే అసలు పుస్తకం చదవాలని కోరిక పోతుంది అనేవారు ఇంకో రకం. అన్నట్టు అతి అరుదుగా మూడో రకం కూడా ఎదురవుతారు.  ముగింపుతో పట్టింపు లేకుండా మన దృష్టి కోణం నుండి, మన స్పందనల వరకూ తెలుసుకుని తృప్తి పడేవారు. చదవాలని పట్టింపూ, ఇక చదవాలనిపించదేమో అన్న వెరపూ ఉండని స్థితప్రజ్ఞులు. :-)

అసలు ముగింపు తెలిస్తే చదవాలన్న కోరిక ఎందుకు పోతుంది? కొందరు పుస్తకం చదివే ముందు ముందుమాటలు పరిచయాలు చదవకుండా అసలు కథ చదువుతామని చెప్పారు చాలాసార్లు. ఊహు..నాకలా సాగదు. ముందుమాటా, చివరిమాటా, ఉంటే గింటే మధ్యమాటా కూడా చదివి అప్పుడు అసలు కథలోకి దూకుతాను. వీలయినన్ని రికమండేషన్లూ కూడా ఉండేలా చూసుకుంటాను. లేకపోతే ఆపుస్తకం గురించి జనాలేమనుకుంటున్నారో, నా అమూల్యమయిన సమయం వెచ్చించడం వృధా ఏమో అన్న సంశయం, భుజం మీది భేతాళుడిలా విసిగిస్తూనే ఉంటుంది. అన్నీ చూసుకుని చేసినా కూడా ఎదురుదెబ్బ తిన్న అనుభవాలూ లేకపోలేదు, అది వేరే సంగతి.

మళ్ళీ నా ప్రశ్న దగ్గరికి వస్తాను. ఒకప్పుడు తెలుగు సాహిత్యాన్ని ఏలిన రచయిత్రుల పుస్తకాలే తీసుకుందాం ఉదాహరణకి. అందులో మెజారిటీ శాతం ఒకే మూస. హీరో ఆజానుబాహుడు, అందగాడు, చిన్నవయసులోనే కోటీశ్వరుడయినవాడు, పడవంత కారున్నవాడు. హీరోయిన్ పేదపిల్ల. అయితే హీరోకి అత్త కూతురో లేదా చిన్ననాటి స్నేహితురాలో అయిఉంటుంది. ఒళ్లంతా మిడిసిపడే అహంభావం ...ఊప్స్ ఆత్మవిశ్వాసం. అప్పుడప్పుడూ హీరో పేదవాడు, ఆత్మాభిమానమున్నవాడు. హీరోయిన్ గొప్పింటి పిల్లా, అహంభావీ. ఏ రాయయితేనేం, చివరికి ఒకటే ముగింపు. హీరోయిన్ హీరో గారి గుండెల మీద వాలి నన్ను క్షమించు రాజా అనో కృష్ణా అనో అంటే, హీరో గారు గాట్టిగా ఆమెని గుండెలకు అదుముకోడం. వామ్మో ... ఈ ముగింపు తప్పదని తెలిసీ ఎన్ని వందల పుస్తకాలు చదవలేదు మనం. అన్నీ ఒక్కటే, పాత్రల పేర్లు తప్ప. (ఆ...ఆ .. ఆ సరదా కూడా తీరింది ఒకామె హీరో పేరు కూడా మార్చలేదు.) అలానే కొన్ని పుస్తకాలు పదే పదే దాచుకుని చదువుకుంటాం. మొదటిసారి చదివినపుడే కథ ముగింపు తెలుసుకుంటాం కదా, అయినా అన్నిసార్లు ఎలా చదువుతాం? అంటే వాటిలో ముగింపు కాకుండా చదివించే విషయం ఇంకేదో ఉందన్నమాట. 

అసలు ఒకరు కథ చెప్పేశాక కూడా ఓ పుస్తకాన్ని ఎందుకు చదవాలీ అని ఆలోచిస్తే నాకిలా అనిపిస్తుంది. కథ కోసమే కాకుండా, కథనం కోసం చదవాలి. రచయిత శైలి కోసం చదవాలి. రచయిత భావోద్వేగం సృజనాత్మకత కలిసి వాక్యాలతో చేయించిన విన్యాసాలు తెలుసుకోడానికి చదవాలి. అక్షరాలు అతని చేతిలో ఎన్ని హోయలొలకబోసి, ఎన్ని సోయగాలు పోతున్నాయో తెలుసుకోవడం కోసం చదవాలి. కదంబమాలలో మరువపు పరిమళంలా కథనంలో అంతర్లీనంగా తొణికిసలాడే రచయిత వివేకాన్ని, ప్రజ్ఞనూ, విషయజ్ఞానాన్ని అందిపుచ్చుకోడం కోసం చదవాలి. అన్నిటినీ మించి ఒక పుస్తకానికి పరిచయం నచ్చితే, పరిచయకర్తని మెప్పించిన అసలు రచన ఇంకెంత సొగసులు పోతుందో, మనల్ని ఇంకెంత సమ్మోహనపరుస్తుందో కదా. ఆ మనదైన అనుభవం కోసం చదవాలి. ఏమో...మనకింకా క్రొత్త లోకాలు కనిపించొచ్చు. 

మంచి కథకులు సాధారణంగానే మంచి శైలి ఉన్నవారయి ఉంటారు. ప్రతీ రచయితకీ తనదైన శైలి ఉంటుంది. పుస్తకాన్ని పరిచయం చేస్తున్నప్పుడు, రచయిత సొంత శైలి మాయమయి, పరిచయకర్త అరువు గొంతులో ఒకే ఫ్రీక్వెన్సీతో ధ్వనిస్తాయి. "ఆమెను చూడగానే అతనిలో యేవో చెప్పలేని భావాలు కలిగాయి" అన్న విషయాన్ని యండమూరి నుంచి రాజిరెడ్డి వరకూ, ఒక వాక్యం నుండి ఒక పేజీలో, ఎలా అయినా చెప్పొచ్చు. ఆ ఒక్క వాక్యంతోనే చాల్లే అనిపించనూవచ్చు. పేజీల కొద్దీ చదివినా తనివి తీరకపోనూ వచ్చు. ఆ శైలిని ఆస్వాదించడం కోసమైనా అసలు రచన చదవాలి. 

ఇంకో ఉదాహరణ. "నువ్వెంత సుదీర్ఘంగానన్నా ఉత్తరాలు రాయి, కానీ సజీవ మానవ కాంతస్వరాన్ని, ముఖ్యంగా నీకు అత్యంత ప్రేమాస్పదమయిన స్వరాన్ని విన్నప్పుడు నీలో ఝల్లుమనే విద్యుత్తరంగాలకి ఆ ఉత్తరాలు సాటిరావు. అక్కడ ఆ స్వరమే సందేశం. అదొక సజీవసంవాదం. కాలాన్నీ స్థలాన్నీ దాటి వికసించే ఐక్యమది." -- వాడ్రేవు చినవీరభద్రుడు (నేను తిరిగిన దారులు: ఢిల్లీ నుండి ఉత్తరాలు లో)(దీన్నే "నువ్వు రోజుకి ఎన్ని సార్లు మెయిల్ చేసినా సరే ఒక్కసారి నీ గొంతు వినకపోతే ఏదోలా ఉంటుంది తెలుసా" అని అతి పేలవంగా కూడా చెప్పొచ్చు.) ఈ వాక్యం తలపుకొస్తే మృదువుగా పిల్లతెమ్మెర తాకినంత హాయిగా మనసు సోలిపోతుంది. రచయిత యొక్క అద్భుతమయిన భావప్రకటనా ప్రతిభనీ, అందులోని సౌకుమార్యాన్నీ అనుభవించి అనుభూతి చెందడానికి వేదిక తన రచన. 

ఎంత చిన్న నవలయినా కనీసం వంద పేజీలుంటుంది కదా. కథంతా పది పేజీల పరిచయంలో చెప్పేస్తే మరి మిగిలిన తొంభయ్ పేజీల్లోనూ ఏమున్నట్టు? టిపికల్ తెలుగు సినిమాలయితే నాలుగు కామెడీ సీన్లు, ఆరు సోది సీన్లు, నాలుగు ఫైట్స్ తోనూ నిండి ఆపై అసలు కథన్నదేమన్నా ఉంటే మిగిలిన మూడు సీన్లలోనూ సర్దుకుంటుంది. మరి ఓ పుస్తకంలో పది పేజీల కథ తప్ప ఇంకేమీ లేకుండా, దానికి పాఠకులని చదివించే శక్తి ఎలా వస్తుంది?

ఇపుడు నా ఇంకో ప్రశ్న. కథకి ముగింపు ఎందుకు తెలియాలి? అన్ని కథలకీ ముగింపు ప్రాణం కాదు. అసలు ప్రస్ఫుటమయిన ముగింపు అంటూ లేని కథలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి Mitch Albom పుస్తకాలు తీసుకుంటే, వాటికి సాధారణంగా మొదలూ ముగింపూ అంటూ ఉండవు. అసలు ఆయన పుస్తకాలని చదవాల్సింది కథ కోసమూ కాదు, ముగింపు కోసమూ కాదు. కథనం ద్వారా ఆయన మన జీవితంలోని అతి మామూలు సంఘటనలని మనకి తెలీని కోణంలోనుంచి చూపించి, మనం ఓవర్ లుక్ చేసే జీవిత సౌందర్యాన్ని, అనుబంధాలనీ సున్నితంగా స్ఫురింపచేస్తారు. దానికోసం డ్రమెటిక్ సీన్లూ, డయలాగులూ ఉండవు. అతి మామూలు మనుషులు, ఇంకా సాధారణమయిన చిరపరిచితమయిన సంఘటనలు. అవి జరుగుతుండగానే, హఠాత్తుగా మన మనోనేత్రాలు తెరుచుకుని ఆసంఘటనని క్రొత్తకోణంలోంచి చూడడం మొదలుపెడతాయి. ఒక్కసారి మన జీవితాన్నీ ప్రవర్తననీ మనం బేరీజు వేసుకోడం అసంకల్పితంగా మొదలుపెడతాం. ఉదాహరణకి అతను వ్రాసిన For One More day తీసుకుంటే అందులోని దాదాపు ప్రతీ సంఘటనా, దాదాపు ప్రతీ ఇంటిలోనూ జరిగేదే. అంతకు మించి భిన్నంగా ఏ తల్లీ బిడ్డా ఉండరని చెప్పొచ్చు. కాకపోతే ఆ సంఘటనల్లో పాత్రల ప్రవర్తన వేరేలా ఉండిఉంటే, మిగిలిన జీవితాలు ఎంత ఉద్దీప్తమవుతాయో సున్నితంగా తెలియచేస్తారు. 

ఫిబ్రవరి కౌముది సంచికలో పరిచయం చేసిన "ఓ మతిమరుపు ప్రొఫెసర్ ప్రేమకథ" తీసుకుంటే, అది అతిమామూలు కథాంశం. అదే థీం తో సినిమాలూ వచ్చాయి. ఇదే కథ ఒక నాసిరకపు రచయిత చేతిలో పడి ఉంటే, ప్రొఫెసర్ జ్వరంతో ఒళ్లుతెలీకుండా ఉన్నప్పుడు, ఆమె అతని ఇంట్లో రాత్రి గడిపినపుడు, పాపం ప్రొఫెసర్ గారు ఆ జ్వరం మత్తులో చెయ్యకూడని పనులేవో చేసేసి ఉండేవారు. అక్కడితో అంత అందమయిన కథా, సాధారణ మసాలా సినిమా కథ అయి ఉండేది. అతి సున్నితంగా, అపురూపంగా కథని నడిపించిన రచయిత్రి గొప్పదనం, విసుగు కలిగించకుండానే లెక్కల చిక్కులతో కథ సాగించిన నేర్పు తెలుసుకోవాలంటే మొత్తం పుస్తకం చదవడం తప్ప వేరే మార్గం లేదు. ఇక ఈ కథకి ముగింపు అనుకుంటే, కథ అవసరం అనుకున్నంత వరకూ చెప్పి వదిలేసాను. దాదాపు ప్రొఫెసర్కి అప్పటికి ఎనభయ్యేళ్ళు. తరువాత ఏం జరుగుతుంది? పుట్టిన వాడు గిట్టక మానడు. ఏదీ శాశ్వతం కాదు. ఇది గుర్తుకు తెచ్చుకుంటే ముగింపు చెప్పకుండానే తెలిసిపోతుంది.

జూన్ నెల కౌముది సంచికలో పరిచయం చేసిన "The Forgotten Daughter" లో 'నిషా తల్లినీ, సోదరినీ కలుసుకోవాలని బయలుదేరింది' అని పరిచయాన్ని ఆపేసాను. ఆ కథకి తరువాత ఏం జరిగిందీ అన్నది అంత ముఖ్యం కాదు. రచయిత్రి కూడా అసలు కథని ఇక్కడితో ఆపేసినా నష్టం లేదని నాకిపుడు అనిపిస్తోంది. ఏం జరుగుతుంది నిషా తల్లిని కలిస్తే? ఆలోచిస్తే నాకు చాలా పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి.

1. శిల్ప నిషాని కౌగలించుకుని 'వచ్చావా నా తల్లీ, నన్ను వెదుక్కుంటూ నువ్వొస్తావని నాకు తెలుసు' అని ఏడ్చి ఉండొచ్చు.
2. నిషా తల్లి వూరు వెళ్లేసరికి ఆమె ఎపుడో ఆ వూరు వదిలి ఎక్కడికో వెళ్ళిపోయి ఉండొచ్చు. ఆమె ఆచూకీ ఎవరికీ తెలిసి ఉండకపోవచ్చు. (నిషాని ఇచ్చేసిన ఇరవయ్యేళ్ళ తరువాత కదా.)
3. ఒకవేళ శిల్ప అక్కడే ఉన్నా, పెద్ద దేవి చెప్పినట్టు నిషాని మళ్ళీ కలుసుకుంటే శాపం తగులుతుందని భయపడి, ఆమెని కలవడానికి ఇష్టపడి ఉండకపోవచ్చు.
4. అప్పటికే కోమాలో ఉన్న శిల్ప, నిషా వెళ్ళినా మెలకువలోకి రాక నిషాని చూడలేకపోనూవచ్చు. (లేదా నిషా స్పర్శతో బాగయిపోనూ వచ్చు.)
5. అసలు నిషానే, తనకి తానెవరో తెలిసింది, తల్లి తనని అక్కర్లేక వదిలేయ్యలేదనీ తెలిసింది కాబట్టి, ఇక కారణాలూ, కలవడాలూ అక్కర్లేదని మధ్యలోనే మనసు మార్చుకుని వెనక్కి వెళ్ళిపోయి ఉండొచ్చు కూడాను. 

ఇందులో ఏవిధంగా జరిగినా, అప్పటి వరకూ నిషా అనుభవించిన మానసికవ్యధ మాత్రం మార్పులేనిది. కథకి అదే ప్రాణం కూడాను. నిషా మానసిక సంఘర్షణ, తనని ఒక్కరైనా నిజంగా ప్రేమించారా అన్న బాధ, తన మూలాలు తెలుసుకోవాలన్న తపన, ఎందుకు తనని వదిలించుకోవాల్సి వచ్చిందన్న ఆవేదన వాటిని రచయిత్రి ప్రెజెంట్ చేసిన తీరు ముఖ్యం. ఇది కూడా చాలా సాధారణమయిన, ఇప్పటికే చాలా సినిమాలు మసాలాలు కూర్చి వండి వడ్డించిన కథ. అయితే కథనంలో రచయిత్రి చూపించిన ప్రజ్ఞ చెప్పుకోవలసింది. పుస్తకపరిచయంలో కథని వీలయినంత విపులంగా చెప్పినా, చెప్పని విషయాలెన్నో ఉన్నాయి. నిషా, దేవి, శిల్ప ముగ్గురి తరపునా కథ సమభాగాల్లో చెప్పబడింది. దేవి మొండి ప్రవర్తనకీ, సమాజపు కట్టుబాట్ల మీద వ్యతిరేకతకి కారణం, శిల్ప జీవితంలో సంఘటనలు కూడా విపులంగా, చాలా నేర్పుగా వ్రాసుకొచ్చారు. అవన్నీ తెలుసుకోవడం కోసమైనా వీలయితే పుస్తకం చదవాలి. అందమయిన మనసున్న వ్యక్తి మేట్ ఉన్నాడు. అతన్ని పూర్తిగా పరిచయం చేసుకోడానికైనా చదవాలి. 

పరిచయకర్తల వాక్యాల్లో కథ మొత్తం తెలిసిపోయిందీ అనుకున్నా, పుస్తకం దొరికే వీలుంటే రచయితల స్వంత గొంతు నుండి కథలని వినడం కోసమైనా చదవాలి. రచయితతో పరిచయం చేసుకోడానికి వాళ్ళ రచనని స్వయంగా చదవడంకన్నా ఉత్తమమయిన మార్గం లేదు.