BG

Monday, June 1, 2015

The Art of Hearing Heartbeats

(Picture Source: google.com)
జూలియా తండ్రి ఆమెకు ఇరవైరెండేళ్ళ వయసులో, బిజినెస్ పని అని వెళ్లినవాడు మాయమయిపోయాడు. ఎంత ప్రయత్నించినా అతని ఆచూకీ తెలియలేదు. అందరూ అతనెక్కడో హత్య చెయ్యబడ్డాడనే అనుకున్నారు. నాలుగేళ్ల తరువాత, తన తండ్రి ఒకామెకు ఏభయ్యేళ్ళ క్రితం వ్రాసిన ప్రేమలేఖ ఆధారంగా, అతనేమయ్యాడో తెలుస్తుందేమో అని బర్మా వెళ్ళింది. బయలుదేరే ముందు ఆమెలో తండ్రి తమని మోసం చేసి, ప్రియురాలి దగ్గరకు వెళ్ళిపోయాడేమో అనే కోపం, దుఃఖం మాత్రమే ఉన్నాయి. అక్కడ ఆమెకు తండ్రి గురించి ఏం రహస్యాలు తెలిసాయి? తెలిసిన విషయాలు ఆమెలో ఏం మార్పులు తెచ్చాయి? Jan-Philipp Sendker  వ్రాసిన The Art of Hearing Heartbeats అనే పుస్తకానికి పరిచయం కౌముది సాహిత్య మాసపత్రిక జూన్ 2015 సంచికలో, "పుస్తకం ఓ నేస్తం" శీర్షికన.  


Friday, May 22, 2015

యాన్ మార్టెల్ కథలు

(ఈ పుస్తకపరిచయం మొదట మార్చ్ 15, 2015 న పుస్తకం.నెట్ లో ప్రచురించబడింది.)

(Picture Source: Google.com)
నాలుగేళ్ల క్రిందట ఓ స్నేహితులు, మీకు నచ్చుతుందేమో చూడండి అని యాన్ మార్టెల్ వ్రాసిన లైఫ్ ఆఫ్ పై రికమెండ్ చేసారు. మొదటిసారి చదివినపుడు కొన్ని చోట్ల కావలసిన దానికన్నా వివరణలు ఎక్కువయ్యాయేమో అనిపించినా పూర్తి చేసేసరికి మళ్ళీ ఇంకోసారి చదవాలనిపించింది. మొదటిసారి చదువుతూ ఉండగా అనవసరమేమో అనిపించినవన్నీ కూడా, ముందు జరగబోయే కథకూ, పాత్రల మానసిక ప్రవర్తనకూ బిల్డింగ్ బ్లాక్స్ అని అపుడు నా కాటన్ కేండీ బుర్రకి అర్థమయింది. They started making more sense at the second time, and I started liking the author. ఒకసారి ఎవరన్నా రచయిత నచ్చడం మొదలుపెడితే వాళ్ళ మిగతా రచనలు వెదికి చదువుకోవడం నాకున్న మాచెడ్డ అలవాటు. అదే అలవాటుతో వెదికితే, లైబ్రరీలో Beatrice & Virgil దొరికింది. అయితే ఆ పుస్తకం నన్ను కొంచెం నిరాశ పరిచింది. నిరాశ పరిచింది అనే కన్నా రచయిత స్థాయిని నేను అర్థం చేసుకోలేకపోయాను అని చెప్పుకోవడం మర్యాద. యాన్ రచనలు ఇంకా ఏమున్నాయా అని వెదుకుతుండగా,లైఫ్ ఆఫ్ పై వ్రాయడానికి చాలా ఏళ్ళ ముందే కొన్ని కథలు ప్రచురించారనీ అందులో We ate our children last‘ అనే కథ అతనికి చాలా పేరు తెచ్చిందనీ తెలిసింది. ఆ కథ గురించి రెండు మూడు చోట్ల గొప్పగా చదివి, దానికోసం వెదికితే అది ఎక్కడా ప్రింట్ లో లభ్యం లేదు అని కూడా తెలిసింది. పట్టువదలని విక్రమార్కురాలిలా కొన్ని నెలలు వెదగ్గా, ఎక్కడో ఇంగ్లాండ్ లోని పబ్లిషర్స్ సైట్ లో ఒక్క కాపీ దొరికింది. తీరా అది చేతికి వచ్చాక చూస్తే వేరే కథల సంపుటి. అయినప్పటికీ అదో serendipity గా మిగిలింది.

అలా అనుకోకుండా చేతికి చిక్కిన The Facts behind the Helsinki Roccamatios అనే కథల సంపుటి, మొదటిసారి 1993 లో ప్రచురించబడి, రచయిత ముందు మాటతో రెండవ ముద్రణ 2004 లో వచ్చింది. ఇందులో నాలుగు కథలున్నాయి. దేనికదే వైవిధ్యంగా ఉన్న కథలివి. రెంటిని నవలికలు అనొచ్చు. ఈ నాలుగు కథలూ రచయితకు బహుమతులు తీసుకొచ్చాయట.

మొదటి కథ: The Facts behind the Helsinki Roccamatios
ఈ కథ ఉత్తమపురుషలో చెప్పబడింది. కథ కోసం ప్రొటాగనిస్ట్ పేరు బాబ్ అనుకుందాం. కథాకాలం 1986, కథాస్థలం కెనడాలోని,టొరాంటో నగరానికి దగ్గరలోని ఓ చిన్న ఊరు. ఇరవైమూడేళ్ళ బాబ్, డిగ్రీ ఆఖరి సంవత్సరం చదువుతున్న కాలేజీలో, పంతొమ్మిదేళ్ళ పాల్ జూనియర్ క్లాస్ లో కొత్తగా చేరాడు. ఇద్దరి మధ్యా తొందరలోనే మంచి స్నేహం కుదిరి, ఎక్కువ కలిసి గడపటం మొదలుపెడతారు.తరువాత కొద్ది నెలల్లోనే పాల్ ఆరోగ్యం పాడయ్యి తొందరగా క్షీణిస్తుండటంతో, డాక్టర్లు పరీక్ష చేసి అతనికి ఎయిడ్స్ అని తేల్చారు. ఆ విషయం తెలియడంతోనే అతని కుటుంబంలోని ఆనందమంతా ఎగిరిపోయింది. అతనికా వ్యాధి రావడానికి కారణం ఏమై ఉంటుందా అని ఆలోచిస్తే, అప్పటికి ఓ రెండేళ్ళ క్రిందట వారంతా వెకేషన్ కోసం బయట దేశానికి వెళ్ళినపుడు, కార్ ఏక్సిడెంట్ జరిగిన సమయంలో అతనికి ఎక్కించిన రక్తం కారణం అని తేలింది. పాల్ వ్యాధి గురించి తెలియగానే అతని తండ్రి, తల్లి, అక్క ముగ్గురూ విషాదంలో ములిగిపోయి, వాళ్ళ ఉద్యోగాలూ, చదువులూ ఎక్కడివక్కడ వదిలేసి జీవచ్ఛవాల్లా రోజులు గడుపుతున్నారు. విషయం తెలియగానే బాబ్ పాల్ ని చూడాడానికి వెళ్ళాడు. అక్కడ పరిస్థితి చూసిన బాబ్ ఓ రెండు రోజులు అక్కడే ఉండి తనకి చేతనయిన సాయం చేస్తాడు.అప్పటి నుండీ ప్రతీ వీకెండ్ పాల్ దగ్గరికి వెళ్ళి అతనితో టైం స్పెండ్ చెయ్యడం, ఇంట్లో వాళ్ళకు సాయం చెయ్యడం, పాల్ తో హాస్పిటల్ కు వెళ్లడం లాంటివి చేస్తుంటాడు. నెమ్మదిగా పాల్ ఇంట్లో వాళ్ళు షాక్ నుంచి అయితే తేరుకున్నారు కానీ, విషాదం మాత్రం తగ్గలేదు.

స్నేహితుడు అన్యాయంగా జబ్బుకి గురయి చనిపోబోవడాన్ని జీర్ణించుకోలేని బాబ్ కలత చెంది, చదువు మీద కాన్సంట్రేట్ చెయ్యలేక కాలేజీ మానేసి, ఎక్కువ కాలం పాల్ తోటే గడుపుతుంటాడు. పాల్ మాత్రం తన జబ్బు తగ్గుతుందని, జీవితం మీద ఎంతో ఆశతో ఉండటం బాబ్ మానసికంగా భరించలేకపోతాడు. స్నేహితులిద్దరి మధ్యా ఎంత వద్దనుకున్నా, మిగిలిన విషయాలతో పాటూ ఎక్కువగా పాల్ జబ్బు గురించిన చర్చలూ వస్తున్నాయి. వీలయినంతవరకూ వాటి నుంచి పాల్ దృష్టి మరల్చాలని ఆలోచించిన బాబ్ కు ఒక ఆలోచన వచ్చింది. అప్పటివరకు జరిగిన చరిత్రని తిరిగి వాళ్ళ మాటల్లో ఒక కథగా వ్రాయాలన్న ఆలోచనని పాల్ కి చెపితే, అతను కూడా ఒప్పుకున్నాడు. ఫిన్లాండ్ రాజధాని Helsinki ను కథాప్రాంతంగా తీసుకుని, Roccamatios అనే ఒక ఇటాలియన్ ఇమిగ్రంట్ కుటుంబాన్ని సృష్టించుకున్నారు. వారి కథ వ్రాయడానికి చరిత్రలో ఆ శతాబ్దంలో 1901 నుండి మొదలు పెట్టి ప్రస్తుతం, అంటే 1986వరకూ ప్రతీ సంవత్సరం జరిగిన ముఖ్యమైన సంఘటనలు తీసుకుని, వాటిని ఈ కుటుంబానికి అన్వయించి కథ వ్రాయాలి. ఒక సంవత్సరం కథ బాబ్ చెపితే, మరుసటి సంవత్సరం కథ పాల్ చెప్పాలి. దానికోసం బ్రిటానికా ఎన్సైక్లోపీడియా దగ్గర పెట్టుకుని ప్రతీ సంవత్సరం జరిగిన ముఖ్యమయిన విషయాలు చూసి, కథ తయారు చేసుకునేవారు. అలా కొంచెం పాల్ దృష్టి మరల్చగలుగుతాడు.అయితే మొత్తం అన్ని సంవత్సరాల కథ చెప్పకుండానే, పాల్ వ్యాధి బయటపడిన తొమ్మిది నెలలకు చనిపోతాడు.

“When you’re with people who are really sick, you discover what an illusion science can be.”

మొదట పాల్ ఫోన్ చేసి తనకు ఎయిడ్స్ అని చెప్పినపుడు బాబ్ ఆలోచన - అతనికి ఆ జబ్బు ఎలా వచ్చి ఉంటుంది? శారీరక సంబంధాలా, లేక పాల్ గే నా, లేక డ్రగ్స్ వల్ల వచ్చిందా అని రకరకాలుగా ఆలోచిస్తాడు. వెళ్ళి పాల్ ని అసలు కలవాలా వద్దా, తనకీ ఆ జబ్బు అంటుకుంటుందా అని కూడా ఆలోచిస్తాడు. ఆ జబ్బు కేవలం తాకటం వల్ల, దగ్గర కూర్చోడం వల్ల రాదు అని పదే పదే నచ్చచెప్పుకుంటాడు. అలాగే పాల్ మధ్యలో ఒకరోజు రక్తం కక్కుకున్నప్పుడు, వెంటనే రెస్ట్ రూం లోకి వెళ్ళి ఒళ్ళంతా సబ్బుతో కడుక్కుని, తనకి ఎక్కడన్నా శరీరం మీద చిన్నదయినా గీటు ఉందేమో, దాన్నుండి తనకీ అంటుకుంటుందేమో అని హిస్టీరికల్ గా వెదుక్కోవడం, ఆ భయం లోంచి బయట పడగానే గిల్టీగా ఫీల్ అవడం, పాల్ దగ్గర కూర్చుని ధైర్యం చెప్పడం  ఎదుటి వాళ్ళంటే మనకి ఎంత ప్రేమున్నా సరే, ఒక్కోసారి మన మీద మనకున్న ప్రేమ ముందు అది దిగదుడుపే అనిపిస్తుంది. పాల్ మానసికస్థితిని డైవర్ట్ చెయ్యడానికి బాబ్ ప్రయత్నమే హిస్టరీని తిరిగి సృష్టించాలనుకోవడం.

కుటుంబంలో ఒక్కరి పరిస్థితి, మిగిలిన అందరి జీవితాలనీ ఎలా మార్చేస్తుందీ అన్నది అతి కొన్ని వాక్యాల్లో, ఎంతో ఆలోచింపచేసేలా చెపుతారు రచయిత. కథను పాల్ కు ఎయిడ్స్ అన్న విషయం, విషాదం ఓవర్ టేక్ చెయ్యకుండా బేలన్స్ తో వ్రాసారు. మొదటి రెండు పేజీల్లోనే మనకి పాల్ తొందరలోనే చనిపోతాడని తెలుస్తుంది, అయినా మిగిలిన కథ చదువుతున్నంతసేపూ ఆ విషయం మనని బయాస్ చెయ్యదు. పాల్ నీ, అతని చుట్టూ ఉన్నవాళ్లని ముంచిన నైరాశ్యం, వాళ్ళు అనుభవించిన నరకం, ఆ విషాదాన్ని వాళ్ళు అనుభవించిన తీరు చెప్పడానికే ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చారు రచయిత. అయినా కథ పూర్తయ్యేసరికి మళ్ళీ మన కళ్ళు తడవుతాయి.

ఈ కథను రచయిత అతని క్లోజ్ ఫ్రెండ్ ఎయిడ్స్ తో చనిపోయినప్పటి అనుభవం ఆధారంగా వ్రాసానని ముందుమాటలో చెప్పారు.బహుశా ఈ కథని రచయిత 1989- 1991 మధ్యలో వ్రాసి ఉండాలి. దీనికి 1991 లో కెనెడియన్ Journey Prize లభించిందట. ఈ కథ నాటకంగా మలచబడి, కెనడాలో సినిమాగా కూడా వచ్చిందట.

రెండవ కథ: The Time I Heard the Private Donald J. Rankin String Concerto with One Discordant Violin, by the American Composer John Morton

ఈ కథ కూడా ఉత్తమపురుషలో చెప్పబడింది. ఈ కథ కోసం ప్రొటాగనిస్ట్ పేరు జేమ్స్ అనుకుందాం. జేమ్స్ తన స్నేహితుడి దగ్గరకు కొన్ని రోజుల కోసం వాషింగ్టన్, డి.సి వస్తాడు. ఆ స్నేహితుడు ఒక పెద్ద కంపనీలో పని చేస్తూ, ఉద్యోగంలో రాత్రీ పగలూ బిజీగా ఉండటం వలన, జేమ్స్ ఒక్కడే ఊరు చూస్తూ కాలక్షేపం చేస్తుంటాడు. ఒకరోజు సాయంత్రం అలా తిరుగుతున్నప్పుడు ఒక మ్యూజిక్ కాన్సర్ట్ ప్రకటన కనిపిస్తుంది. అది వియత్నాం వార్ వెటరన్స్ చేస్తున్న ప్రోగ్రాం అని తెలుసుకుని కుతూహలంతో వెళతాడు. ఒక శిధిలమైన నాటకం థియేటర్లో ఆ ప్రోగ్రాం జరుగుతుంది. మ్యుజీషియన్స్ అందరూ కూడా తమ హాబీ గా ఆ ప్రోగ్రామ్స్ చేస్తుంటారు. ప్రొఫెషనల్ గ్రూప్ కాకపోవడంతో పెద్దగా ఆర్థిక సాయం గానీ, పబ్లిసిటీ గానీ దొరకదు వాళ్లకి. జేమ్స్ ఆ ప్రోగ్రాం మొత్తం బాగా ఆనందిస్తాడు, ముఖ్యంగా జాన్ మోర్టన్ అనే అతను చేసిన వయోలిన్ కాన్సర్ట్ అతన్ని ఏదో లోకాలకి తీసుకెళుతుంది. ప్రోగ్రాం అయిన తరువాత మోర్టన్ తో మాట్లాడాలని, అతని కారుని వెంబడిస్తాడు.

మోర్టన్ రాత్రి పూట ఒక బేంక్ క్లీన్ చేస్తుంటాడు. అతనితో మాట్లాడాలని వచ్చానని బయట నుంచే సైగ చేసిన జేమ్స్ ని లోనికి రానిస్తాడు మోర్టన్. అతని కాన్సర్ట్ తనకి ఎంతో నచ్చిందనీ, ఇప్పటివరకూ తనని అంతగా కదిలించిన ప్రోగ్రాం తను వినలేదనీ చెపుతాడు జేమ్స్.జేమ్స్ ని తను చేస్తున్న ఆఫీస్ క్లీనింగ్ పనుల్లో సాయం చేస్తూ మాట్లాడమని చెప్పి, వార్ రోజుల్లో తనని తను ఆ టెన్షన్స్ నుంచి తప్పించుకోడానికి మ్యూజిక్ ఎలా సాయపడిందో, ఎలా తను స్వంతంగా పాటలు వ్రాయడం ఎలా మొదలుపెట్టాడో మొదలైన విషయాలు చెపుతాడు. అలానే ప్రపంచం తీరూ, రొటీన్ ఉద్యోగాలు చేస్తూ గడిపేసే రొటీన్ బ్రతుకులూ, ఉన్నదానితో సరిపెట్టేసుకుని జీవితంలో కొత్తదనం ఎందుకు కోరుకోరూ అంటూ, జీవితం గురించి తను చుట్టూ చూస్తున్నవీ తన అభిప్రాయాలూ చెపుతాడు మోర్టన్.

I come here during the day. I like it and nearly fall for it. I say to myself, you should get a daytime job here. … Then I catch myself. This place is dangerous, it’s so cunning. It crawls up on you stealthily. You get used to it, the routine, you know. You start to think it’s normal. Finally you think there’s nothing else. Then you blink, forty years have gone by, and your life’s over. Sometimes I come here during the day and I look in from the outside and I ask myself, Why don’t these people ask for more?“

అలా ఇద్దరూ కొన్ని గంటలు మాట్లాడుకున్నాక జేమ్స్ వెళ్ళిపోతాడు. మోర్టన్ మాటలు జేమ్స్ మీద ప్రభావం చూపించి అతనిలో కొన్ని తాత్వికాలోచనలు రేకెత్తిస్తాయి. అప్పటివరకూ వియత్నాం వార్ అమెరికాకూ, వియత్నాం కూ మధ్య జరిగిన యుద్ధం అనీ, దానికీ కెనడా దేశస్థుడయిన తనకూ ఎటువంటి సంబంధమూ లేదని అనుకునే జేమ్స్, మరుసటి రోజు వియత్నాం మెమోరియల్ చూడటానికి వెళ్ళి, అక్కడి మృతవీరుల సమాధులు తడిమి చూసి కన్నీళ్ళు కారుస్తాడు. ‘ఎన్ని డిగ్రీలు చదివినా, ఏం సాధించినా కొన్నాళ్ళకి తనూ అందరిలాగే సూట్ వేసుకుని టై కట్టుకుని ఏదో ఆఫీసులో ఓ ఉద్యోగం చేస్తాడు. అన్ని భోగభాగ్యాలు చెయ్యి చాస్తే అందేంత దూరంలో ఉంటాయి? అయితే మాత్రం ఏంటి?’ అనుకుంటాడు జేమ్స్. మోర్టన్ జేమ్స్ మధ్య సంభాషణలో కొన్ని వాక్యాలు ఆలోచింపచేస్తాయి.మనిషి ప్రాపంచిక విజయాలను సాధించడానికీ, సర్వం పోగొట్టుకోడానికీ మధ్య ఉండే కొన్ని క్షణాల అస్తిత్వాన్ని ఎత్తిచూపే కథ.

మూడవ కథ: Manners of Dying
మిస్టర్ హేరీ ఒక జైలు వార్డెన్. ఆ జైల్లో కెవిన్ బార్లో (Kevin Barlow) అనే యువకుడికి ఉరిశిక్ష అమలు చేసాక, అతని తల్లికి ఆ విషయం తెలియచేస్తూ వార్డెన్ ఒక ఉత్తరం వ్రాస్తాడు. అందులో ఉరిశిక్ష తేదీ తెలియచేసినపుడూ, ఆ తరువాతా కెవిన్ స్పందనా, అతని మానసిక స్థితి, ఉరి తీసే ముందురోజు అతని ప్రవర్తనా, అతను తన శిక్ష ఎలా అనుభవించాడూ అనేవి వ్రాస్తాడు. ఆ ఉత్తరానికి తొమ్మిది వర్షన్స్ వ్రాసారు రచయిత. ప్రతీ ఉత్తరం ఈ రెండు లైన్లతో మొదలవుతుంది. “మిసెస్ బార్లో, మీ కొడుకు కెవిన్ అతనిపై నిరూపించబడిన నేరాలకు గానూ విధించబడ్డ ఉరిశిక్షను ఎలా అనుభవించాడో మీకు తెలియచెయ్యడం, వార్డెన్ గా నా విధిగా భావిస్తున్నాను.” అలాగే దాదాపు ప్రతీ ఉత్తరం ఈ రెండు లైన్లతో ముగుస్తుంది. “ఉదయం 7:01 సమయానికి ఉరి తీయబడి, మీ కొడుకు ఏ విధమైన బాధా తెలియకుండా చనిపోయాడు. మీతో పాటూ మీ విచారంలో నేను కూడా భాగం పంచుకుంటున్నాను.

ఉత్తరంలో మిగిలిన విషయాలు కెవిన్ అతని లాస్ట్ భోజనం కోసం ఏం అడిగాడు - అది తిన్నాడా లేదా - చర్చ్ ఫాదర్ తో మాట్లాడటానికి అవకాశం ఇచ్చినపుడు అతని స్పందన - ఫాదర్ తో ఎంత సేపు గడిపాడు - ఆ చివరి రాత్రి అతను ఎలా గడిపాడు - మరణం చెయ్యి చాస్తే తగిలేంత దూరంలో ఉన్నప్పుడు అతని మానసికస్థితి, ప్రవర్తన ఇవన్నీ ఒక్కో ఉత్తరంలో ఒక్కోరకంగా క్లుప్తంగా చెపుతారు.

ఒకదాంట్లో కెవిన్ తనకి ఇష్టమయినవి అడుగుతాడు, కానీ అసలు తినడు. ఒక దాంట్లో ఇష్టమయినది మళ్ళీ మళ్ళీ అడిగి తింటే ఇంకో దాంట్లో మద్యం అడుగుతాడు. ఒకదాంట్లో ఫాదర్ సేవలని మౌనంగా తిరస్కరిస్తే, కొన్నిటిలో అతనితో కొంత సమయం మాట్లాడతాడు.ఒకదాంట్లో ఫాదర్ ఒళ్ళో తలబెట్టుకుని చిన్నపిల్లాడిలా ఏడుస్తాడు.

ఒక దాంట్లో మౌనంగా కిటికీ లోంచి బయటకు చూస్తూ రాత్రంతా నిద్రపోకుండా గడుపుతాడు. ఒక దాంట్లో కలతగా ఉంటూ తనలో తనే గొణుక్కుంటూ అసహనంగా రాత్రంతా గడుపుతాడు. ఒక దాంట్లో రాత్రంతా కూర్చుని తల్లికి పేజీల కొద్దీ ఉత్తరం రాస్తాడు. ఒకదాంట్లో చివరి నిమిషం వరకూ, ప్రతీ విషయం గురించీ పిచ్చిగా నవ్వుతూనే ఉంటాడు. ఒకదాంట్లో రాత్రంతా భయంగా అరుస్తూ, కేకలు వేస్తూ గడుపుతాడు. ఒకదాంట్లో ప్రశాంతంగా జైలు బయటి తోటలో గడుపుతాడు.

ఆఖరుగా ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా అని అడిగినపుడు, ఒకదాంట్లో నా తల్లికి నా ప్రేమని తెలియచెయ్యండిఅని చెపితే, ఒక దాంట్లో జరిగిన దానికి తన తల్లికి క్షమాపణలు చెప్పమనిఅడుగుతాడు. ఒకదాంట్లో వ్యంగ్యంగా నవ్వుతూ మీ అందరికీ తొందరగా ప్రమోషన్స్ రావాలని కోరుకోండిఅంటాడు.

ఒకదాంట్లో ఉరికి తీసుకెళ్ళే ముందు మౌనంగా గార్డ్స్ వెంట నడిస్తేమరొక దాంట్లో ఏడ్చి రానని గొడవచేస్తాడుఒకదాంట్లో తన తప్పుని క్షమించి ప్రాణబిక్ష పెట్టమని హృదయవిదారకంగా ప్రాధేయపడతాడుఒక దాంట్లో తనే టెన్షన్ భరించలేక, ‘తొందరగా కానివ్వండిఅని పరుగున వెళ్ళి ఉరితాడు తగిలించుకుంటాడుఒకదాంట్లో భయపడకుఉరి తీసినపుడు నొప్పి తెలియదువెంటనే ప్రాణం పోతుందనిచెప్పిన డాక్టర్ నుఉక్రోషంగా నీకెలా తెలుసని అడిగితేఇంకొక దాంట్లో భయంతో బట్టలు తడుపుకుంటాడుఒకదాంట్లో రాత్రంతా ప్రశాంతంగా కనిపించిమధ్య రాత్రి ఆత్మహత్య చేసుకుని చనిపోతేఒక దాంట్లో దగ్గర నుంచి ఉరికంబాన్ని చూసి కార్డియాక్ అరెస్ట్ అయి చనిపోతాడు.

ఏ ఉత్తరమూ రెండు పేజీలకు మించదు, కానీ అది కలిగించే ఇంపాక్ట్ మాత్రం చెప్పలేనిది. ఇన్నిటిలో కెవిన్ ఏ రకంగా చనిపోతేనేం, ఆ ఉత్తరం చదివిన తల్లి మనసు గిలగిలలాడక మానుతుందా? అలాంటి పరిస్థితి ఏ తల్లికీ రాకూడదనిపిస్తుంది. ఈ ఉత్తరాల నంబర్లు 18, 213, 319… 1096 ఇలా ఉంటాయి. మొత్తానికి రచయిత ఎన్ని వర్షన్స్ వ్రాసారో తెలియదు కానీ, బహుశా ఇన్ని రకాల ప్రవర్తనలు రచయిత ఊహించారేమో అనిపిస్తుంది. ఈ కథ చదువుతున్నంతసేపూ నాకు ఎపుడో చదివిన ఒక కథ/నవలిక, ఇలాంటిదే(యండమూరి వ్రాసినట్టుగా గుర్తు) గుర్తొస్తూనే ఉంది. ఎంత ఆలోచించినా ఎక్కడ చదివానో గుర్తు రాలేదు కానీ అచ్చం ఇదే సెట్టింగ్, ఇదే ఉత్తరాల పద్ధతిలో వ్రాయడం ఎన్నో ఏళ్ళ క్రితం చదివినట్టు బాగా గుర్తు. 1986 లో కెవిన్ బార్లో అనే ఆస్ట్రేలియన్ యువకుడిని,మాదకద్రవ్యాల స్మగ్లింగ్ నేరానికి మలేషియాలో ఉరి తీసారట. ఆ సంఘటన ఆధారంగా ఈ కథ వ్రాసారు రచయిత. ఈ కథ ఆధారంగాManners of Dying అనే సినిమా తీసారు. ఈ కథ నాటకంగా కూడా ప్రదర్శించారట.

నాలుగవ కథ: The Vita Aeterna Mirror Company: Mirrors to Last Till Kingdom Come
కథ స్థూలంగా జ్ఞాపకాలు, అనుభూతుల ఆధారంగా జీవితాన్ని ప్రతిబింబించుకోడం. అనగాఅనగా ఓ యువకుడు. అతనికి తన గ్రాండ్ మదర్ అటక మీద మూల పడేసిన సామాన్లలో అద్దాలు తయారు చేసే పాతకాలపు మిషన్ ఒకటి కనిపిస్తుంది. దాంట్లో అతి మెత్తని తెల్లని ఇసుక పోసి, ఓ పక్క మెర్కురీ పోసి, దాని హేండిల్ పట్టుకుని తిప్పుతూ, జ్ఞాపకాలని కలబోసుకుంటూ ఉంటే, కొంతసేపటికి ఆ మిషన్ లోంచి అద్దం తయారయి బయటకొస్తుంది. బయటకొచ్చిన అద్దం మీద ఆ జ్ఞాపకాలన్నీ ప్రింట్ చేయబడి ఉండి, నెమ్మదిగా కరిగిపోయి చివరికి మెరిసే అద్దం మిగులుతుంది. ఆ జ్ఞాపకాల గాఢతను బట్టి ఆ మిర్రర్ ఎంత స్వచ్చంగా లోపాలు లేకుండా ఉందీ అనేది ఆధారపడుతుంది.

ఈ కథ వ్రాసిన విధం కూడా కొత్తగా ఉంది. పేజీలో టెక్స్ట్ రెండు కాలమ్స్ గా విడదీయబడ్డాయి. ఎడమవైపు గ్రాండ్ మదర్ గుర్తుచేసుకుంటున్న తన జ్ఞాపకాలన్నీ ఉంటాయి. ఎపుడో అరవయ్యేళ్ళ క్రిందట తన భర్తని ఎలా కలిసిందీ, అతనితో ఎలా ప్రేమలో పడిందీ, పెళ్ళీ పిల్లలూ, భర్త మంచితనం, అతని మరణం తనలో మిగిల్చిన లోటూ అన్నీ ట్రాన్స్ లో ఉన్నట్టూ మాట్లాడుకుంటూ ఉంటుంది. కథలో ఎక్కువ భాగం బ్లాబ్లా బ్లా అనే నింపుతారు రచయిత. కుడివైపు కాలంలో అసహనంతో మనవడు తనలో తాను విసుక్కుంటున్న మాటలు ఈవిడ ఇప్పుడప్పుడే ఆపేలా లేదు, ‘ఈ వాగుడికి నా తల పగిలిపోయేలా ఉందిఇలా స్వగతం ఉంటుంది.

I thank the Lord every day for having put that man in my way. He took him away from me after tewnty-two years of bliss, but even if I had to go through that pain ten times over, those twenty-two years would still be worth it.”కథ నోస్టాల్జియా, దూరమయిన ఆప్తులూ, జ్ఞాపకాలతో ఆ దూరాన్ని పూరించుకునే ప్రయత్నం  ఇవీ కథలో చెప్పాలనుకున్నవి అనిపించిది. అయితే కథ సరిగా నాకు సరిగా అర్థం అయిందా అనేదీ అనుమానమే. ఈ కథలన్నీ కూడా యాన్ బహుశా అతని వయసు 25 నుండి 28 మధ్య ఉన్నప్పుడు, లైఫ్ ఆఫ్ పై వ్రాయడానికి దాదాపు పదేళ్ళ క్రితం వ్రాసినవి. మొదటగా ఇది 1993 లో పుస్తకంగా వచ్చినా, అపుడు కెనడా బయట పెద్దగా గుర్తింపు పొందలేదట. అయితే లైఫ్ ఆఫ్ పై కి బహుమతి రాకుండా ఉండి, అంతర్జాతీయ గుర్తింపు పొందకుండా ఉంటే, ఈ కథలు మళ్ళీ పైకి వచ్చేవా అనేది అనుమానమే.అయితే ఈ కథలేవీ కూడా తక్కువగా చూడాల్సినవి కాదు అనే నా అభిప్రాయం. ఒక రకంగా ఇవన్నీ ప్రయోగాత్మక కథనం అనే చెప్పాలి. Manners of Dying లో తప్ప మిగిలిన మూడు కథల్లోనూ ప్రోటాగనిస్ట్ వయసు రచయిత అప్పటి వయసుకి దగ్గరగా ఉండటం, నేను నేను అంటూ కథ చెప్పడం, కథలో అతని వివరాలు కొన్ని చూస్తే ఇవి semi-autobiographical ఏమో అనిపిస్తుంది.రచయిత లై ఆఫ్ పై లో చూపించిన పరిణితికి మూలం, ఈ కథలు వ్రాసే కాలం నుండే ఉంది అనేది మాత్రం స్పష్టం. ఇందులో అన్ని కథలూ కూడా ఏదో ఒకరకంగా జ్ఞాపకాలు, వాటిని పదిలపరుచుకునే తీరు, వాటి ఆసరాతో కష్టాల్లో కూడా తట్టుకుని జీవితాన్ని ఈదగలిగే స్థైర్యం చూచాయగా చెపుతాయి. ఈ పుస్తకం ప్రస్తుతం అమెజాన్లో లభ్యం అవుతోంది.

Friday, May 1, 2015

For One More Day

మనుషులం...పెర్ఫెక్ట్ గా ఉండకపోవటమే ప్రధమలక్షణమైన వాళ్ళం. తెలిసో తెలియకో మనకి బాగా కావాల్సినవారి హృదయాలని ఎపుడో గాయపరుస్తాం. ఆ సందర్భంలో అలా కాకుండా వేరేలా ప్రవరించి ఉంటే బావుండేదనో, ఆ క్షణాలు తిరిగివస్తే మరోసారి ఆ పొరపాటు చెయ్యననో అనుకునే పరిస్థితి కలగని మనిషి సాధారణంగా ఉండకపోవచ్చు. ఆ పొరపాట్లు దిద్దుకునే అవకాశమూ అన్నిసార్లూ దొరకకపోవచ్చు.  

తల్లి బ్రతికున్నప్పుడు తను ప్రదర్శించిన నిర్ల్యక్షానికి, ఆమె ప్రేమను అర్ధం చేసుకోకుండా ఆమె నుంచి దూరంగా జరిగిపోయి, తరువాత పశ్చాత్తాపంతో కృంగిపోయిన ఒక కొడుకు చార్లీ. చనిపోయిన తన తల్లితో అనుకోకుండా మళ్ళీ ఒకరోజు గడిపే అవకాశం కలిగితే అపుడతడు ఏం చేసాడు? అపుడు కొత్తగా ఏం తెలుసుకున్నాడు? అతని వేదన పోగొట్టి, గిల్టీ ఫీలింగ్ నుంచి విముక్తుడిని చెయ్యడానికి ఆ తల్లి ఏం చేసిందీ, ఆ తరువాత అతను చేజార్చుకున్న అనుబంధాలను ఎలా సరిచేసుకున్నాడూ అన్నది మిచ్ అల్బోం వ్రాసిన For One More Day పుస్తకానికి పరిచయం కౌముది సాహిత్య మాసపత్రిక మే 2015 సంచికలో, "పుస్తకం ఓ నేస్తం" శీర్షికన. 


Friday, April 10, 2015

నేనూ, పుస్తకాలూ, రెండువేల పద్నాలుగూ …

*** ఈ వ్యాసం మొదటగా 4/10/15 న పుస్తకం.నెట్ లో ప్రచురించబడింది.

'గతకాలము మేలు వచ్చుకాలము కంటెన్ ...’ – నా పుస్తకపఠనం విషయంలో ఈమాట నిజమని మళ్ళీ మళ్ళీ ఋజువవుతోంది. పెద్దలమాట చద్దిమూట అని వూరికే అన్నారా మరి? చదువుల చిట్టాలెక్కలు ఈ ఏడాది కూడా బేలన్స్ అవ్వమని భీష్మించుకున్నాయి. అమెజాన్ వాడు ప్రైమ్ మెంబర్లకి నెలకో రెండు కొత్త పుస్తకాలివ్వడం తోనూ, కిండెల్ అన్లిమిటెడ్ ప్రోగ్రాం తోనూ, ఇటు కినిగే వల్లా కుప్పలుగా పుస్తకాలు చేరుతున్నాయి. అయినా అల్లుడి నోట్లో శని అన్నట్టుగానే ఉంది పరిస్థితి. పెరిగిన ఉద్యోగ బాధ్యతలూ, పర్సనల్ బాధ్యతలూ చదువుకీ రాతకీ కావాల్సిన సమయాన్నీ, ఓపికనీ మిగల్చడంలేదు. దొరికిన కొద్దిసమయం కౌముది పత్రికలో వ్రాస్తున్న పుస్తకపరిచయాలకు బొటాబొటీగా సరిపోతుంది. అయితే వ్రాయటంలో కూడా ఆనందం పొందుతున్న సంగతీ నిజమే. ఈ సంవత్సరం కూడా మా అబ్బాయితో కలిసి తన లిటరేచర్ క్లాస్ కోసం కొన్నిమంచి పుస్తకాలు చదివే అవకాశం కలిగింది. అందులోనూ కొన్ని మాత్రమే పూర్తిచెయ్యగలిగాను. చాలా పుస్తకాలు లిమిట్ అయిపోయేవరకూ రెన్యూ చేసీ చేసీ, అప్పటికీ పూర్తిచెయ్యకుండానే తిరిగి ఇవ్వాల్సి వచ్చింది.

క్రిందటి సంవత్సరం కినిగే నుండి సేకరించిన కాశీభట్ల వేణుగోపాల్ పుస్తకాలన్నీ చదవటం పూర్తి చెయ్యగలిగాను. కాశీభట్ల వ్రాసిన ఒక పుస్తకం ముందుమాటలో గుంటూరు శేషేంద్రశర్మ ఇలా అంటారు. “రచన అంతా గగనంలోకి ఎగిరే విస్ఫులింగాలు. దారినంతా దగ్ధం చేస్తూ ప్రవహించే కొండచిలువల్లాంటి లావా ప్రవాహాలు. వాక్యాలు వాక్యాలు కావు, భాష భాష కాదు. వ్యాకరణానికి డైనమైట్ పెట్టినట్లయింది. శబ్దాలు శబ్దాలుగా ముక్కలు ముక్కలై ఎగిరిపడుతున్న అగ్నికణాలు. మీద పడితే ఒళ్ళు కాలుతుంది. హృదయం జ్వలిస్తుంది. భావావేశా విస్ఫోటనాన్ని ఏ భాష పట్టుకోగలదు?అలాగే రచయిత స్వయంగా ఇక కదలండి నా అక్షరాలతో కదనానికి, I wish you win.అంటారు. ఆ కదనంలో గెలవడం కష్టమే. అయితే చల్లని మల్లెపూల సుగంధం నిండిన రచనలూ చెయ్యగలరని కొన్ని కథల ద్వారానూ, కాలం కథలు సంకలనం ద్వారానూ తెలుస్తుంది. కాశీభట్లను నాకు సరికొత్తగా, ఆప్యాయంగా పరిచయం చేసిన పుస్తకం అది.

విషాద ఏకాంతం - కాశీభట్ల వేణుగోపాల్ 

ఇది పది వైవిధ్యమైన కథలున్న సంకలనం. ఇందులో నాకు బాగా నచ్చిన కథలు నిశ్శబ్ద స్వరం, నామాలసామి పీరాసాయిబు, సగం మనుషులు, విషాద ఏకాంతం, నీడ మనిషి, ఛన్న రమణం. కాశీభట్ల మార్క్ శైలికి విరుద్ధమయిన కథలు, భాషలోనూ, కథావస్తువులోనూ కూడా. నిశ్శబ్ద స్వరం, నామాలసామి పీరాసాయిబు కథలను రచయిత పేరు లేకుండా ఇస్తే అవి కాశీభట్ల గారి రచనలని ఊహించగలిగేదాన్ని కాదు. ఆకలి బహువచనం, నిసర్గం, చావు బావురుమంది కథల్లో మళ్ళీ కాశీభట్ల శైలి కనిపిస్తుంది.

కాలం కథలు - కాశీభట్ల వేణుగోపాల్

నాకెందుకో జ్ఞాపకాలని పలవరించే వాళ్ళన్నా, ఆ పలవరింతల్లో తమని తాము వెదుక్కుంటూ పులకరించే వాళ్ళన్నా ప్రత్యేకమైన అభిమానంనాకెందుకో ఎప్పుడూ ఓ నమ్మకం, ఆయన నవలల్లో కనిపించే కథాంశాలు, పాత్రల పోకడలూ, జీవితచిత్రణా, విచ్చలవిడితనమని ముద్ర వెయ్యించుకున్న వాటివెనుక, ఒక సున్నితమయిన మనసు దాగుండే ఉంటుందని. లేకపోతే ఆ తపనా, ఆవేదనా కోరి తెచ్చుకుంటే వచ్చేవి కాదు. కాశీభట్లలోని ఇంకో కోణం ప్రస్ఫుటంగా కనిపింపచేసిన పుస్తకం. చీకట్లూ నికషాలూ మాత్రమే చదివినవాళ్ళు, ఆయనవన్నీ చీకటి రాతలూ బూతులూ అని తేల్చి పడేసినవాళ్ళు తప్పక చదవాల్సినది.

ఇది ఒక్కోటి దాదాపు రెండేసి పేజీల నిడివున్న, 68 వ్యాసాలున్న సంకలనంఇవన్నీ ఆయన ఓ దశాబ్దకాలంపాటు ఒక మేగజైన్ లో వ్రాసినవి. వాడ్రేవు వీరలక్ష్మీదేవిగారు ఒకింత కన్నీరూ ఒకింత కరుణాఅంటూ ఆప్యాయంగా వ్రాసిన ముందుమాటలు పుస్తకానికే అందం. వీరలక్ష్మి గారు అన్నట్టుగా పజిల్ లాంటి కాశీభట్ల ఇమేజ్ కి భిన్నమయినకాశీభట్ల కనిపిస్తారు ఇందులో. ఇవన్నీ ఆయన ఇతర రచనలు (ప్రపంచపు కుళ్ళూ చీకట్ల మీద ధిక్కారంతో వ్రాసినవి) వ్రాసిన సమయంలోనే వ్రాసినవని తెలిస్తే భలే ఆశ్చర్యమేస్తుంది. ఈ వ్యాసాలన్నీ ఆయనకు జీవితంలో తారసపడిన వ్యక్తుల, అనుభవాల నెమరువేతలు.

నేనూ చీకటి - కాశీభట్ల వేణుగోపాల్

నేనుఅనబడే కథానాయకుడు, జానకి అని మారు పేరుతో ఒళ్లమ్ముకునే - మనోహరమైన అంతర సౌందర్యం ఉన్న- గౌరీ మనోహరి, స్నేహానికి మారుపేరు లాంటి భగవాన్లు...వీళ్ళిద్దరూ చీకటిలో కూరుకుపోయిన కథానాయకుడికి ఏ మానసిక వెలుగులు చూపించారు? ఏ జీవితపు విలువలని నేర్పారు? గుంటూరు శేషేంద్ర శర్మ గారు ఈ పుస్తకానికి ముందు మాటలో ఈ నవల ఒక బౌద్ధిక భూకంపంఅంటారు.

ఒక బహుముఖం కాశీభట్ల వేణుగోపాల్ 

ఇది కవితల పుస్తకం. కవితలతో పాటూ కవికథకుని కన్ఫెషన్ దస్తావేజుఅనే పెద్ద స్వగతం లాంటి వ్యాసం ఉంది. ‘ఓ అంతర్ముఖం.. ఆనందావేదనా..నిస్సహాయత...ప్రేమా, క్రోధం, పొగరూ అన్ని ముఖాల నేనూ ఈ పుస్తకంఅని ఆయన చెప్పుకున్నట్టు, ఈ కవితల్లో అన్ని బహుముఖాలూ కనిపిస్తాయి.

రంగుల గది కాశీభట్ల వేణుగోపాల్

మొత్తం పదిహేను కథలున్న సంకలనం ఇది. అన్ని కథలూ బావున్నాయి. రంగుల గది, సహజాతాలూ- సరిహద్దులూ, కావేరి, దిగంత గానం, చావూ పుట్టుకల మధ్య, రాళ్ళెత్తిన కూలీ కొంచెం ఎక్కువ నచ్చిన కథలు. ఆయన అక్కలు ఇద్దరూ వ్రాసిన ముందుమాటతో, వ్యక్తిగా కాశీభట్ల గురించి కొంచెం తెలుస్తుంది.

తెరవని తలుపులు – కాశీభట్ల వేణుగోపాల్

ఇందులో కథానాయకుడు 52 ఏళ్ళ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు. అతనికి భార్యా, ఒక కొడుకూ, అదే ఇంట్లో వారితోపాటూ ఉండే అత్తగారూ. ఒకే ఇంట్లో ఉన్నా ఒకరికి ఒకరు అపరిచితులు. ఎవరితోనూ ఏ అనుబంధమూ లేని యాంత్రిక జీవితం. ఆప్త మిత్రుడు డాక్టర్ ఉమానాథ్, కాస్త కూస్తో అతన్ని అర్థం చేసుకున్న అతని పి.ఏ బాలు...వీళ్ళు మాత్రమే అతనికి ఉన్న ఆప్తులు. ఎపుడో తండ్రిని దూరం చేసుకున్న అతను, తండ్రిపోయిన తర్వాత కూడా ఆస్తిని అమ్మి కొడుకు విదేశీ చదువులకు ఇవ్వడం లేదని భార్యా కొడుకులిద్దరికీ కోపమూ, చులకనా. మనశ్శాంతి కోసం ఒంటరిగా గదిలో తలుపులు మూసుకుని తాగుతూ కూర్చుంటాడు. అతిగా సిగరెట్స్ త్రాగడం వల్ల అతని కాళ్ళు పుచ్చిపోయాయనీ, యాంప్యుటేషన్ చేసి కాళ్ళు తీసెయ్యకపోతే ప్రమాదమనీ చెప్పాడు ఉమానాథ్. తను స్వతంత్రుడిగా సంపాదనాపరుడిగా ఉన్నప్పుడే తనంటే లెక్కచెయ్యని తనవాళ్ళు, అవిటివాడై వాళ్ళపై ఆధారపడాల్సి వస్తే తన గతేమవుతుంది? మనిషికి అన్నీ ఉండీ, అందరూ ఉండీ కూడా ఎవరూ లేనట్టు మిగిలిపోయిన విషాదాన్ని చూపించిన కథ. ‘Kehne ko saath apane ek duniya chalti hai, Per chupke is dil mein tanhaayi palti hai’ అన్న వాక్యాలు పదేపదే గుర్తు చేసిన కథ. ఇది ముగింపుతో సహా, ఒకరి నిజజీవిత కథ అని చెపుతారు ముందుమాటలో రచయిత.

దిగంతం – కాశీభట్ల వేణుగోపాల్

మధ్యవయసు దాటిపోయినా పెళ్ళికాని, ఓ అనాకారి. ప్రింటింగ్ ప్రెస్ లో ఓ చిన్న ఉద్యోగం. చాలీచాలని జీతం, చాలీచాలని బ్రతుకూ. అతనికి జీవితంలో ఉన్నవాళ్ళు కుంటీ, మూగా, చెవుడూ అయినటువంటి ముసలి తల్లి, అప్పుడప్పుడూ కోరిక తీర్చుకోడంతో పాటూ ఇష్టం కూడా పెంచుకున్న వేశ్య నాగరత్న. ఏ పరిస్థితిలోనయినా నిర్వికారంగా ఉండే తల్లి మొహంలో ఒక్కసారయినా నవ్వు చూడాలనేది అతని కోరిక. అతనికా చిన్న కోరిక తీరిందా? తనవారనుకున్న వారిద్దరూ అతనికి జీవితంలో ఎంతవరకూ తోడొచ్చారు? ‘మన ప్రపంచపు అస్తిత్వం మనది మాత్రమే. మన ప్రపంచం వేరు. మన ప్రాణప్రదమయిన వ్యక్తుల ప్రపంచం వేరు. జీవితంలో ప్రతీ సంబంధం ఓ దిగంతం.అని చెప్పే నవల. మొదట్లో రచయిత పుస్తకాన్ని అంకితమిస్తూ చావకే అన్నా వినకుండా చచ్చిపోయిన అమ్మకుఅన్నది చదవగానే ఎలా గుండెలో ఓ నరాన్ని మెలితిప్పినట్టు అనిపిస్తుందో, పుస్తకం పూర్తయ్యేసరికి అదే భావం కలుగుతుంది.

ఘోష - కాశీభట్ల వేణుగోపాల్

ఒక పదిహేను కథల సంకలనం ఇది. కొన్ని కథల ఇతివృత్తం సామాన్యమయినప్పటికీ, కథనం వాటిని చదివిస్తుంది. ఉదాహరణకి ఘోష, రాగమాలిక కథలలాంటివి. నీతీ నిజాయితీలకీ, పాప పుణ్యాలకీ, మంచీ చెడులకీ లొంగని మనిషి ఆలోచనాతత్వం గురించి తన ఆత్మఘోష ఈ కథలు అని చెప్పుకున్నారు రచయిత.

మియర్ మేల్ (పోయెమ్స్ ఫర్ మెన్ ఇన్ తెలుగు) – అరుణ్ సాగర్ 

పూడూరి రాజిరెడ్డి మధుపం గురించి మాట్లాడుతూ, చాలామంది అరుణ్ సాగర్ మేల్ కొలుపుగురించి కూడా గొప్పగా ప్రస్తావించడంతో, దానికోసం ఎంత వెదికినా దొరకలేదు. అయితే కినిగే లో మియర్ మేల్, మేక్జిమం రిస్క్ దొరికాయి. ఇందులో కొన్ని కవితలు, కొన్ని వచన కవిత్వపు మోనోలోగ్స్ ఉన్నాయి. హోమ్ కమింగ్ అనే నోస్టాల్జిక్ కవితలో, ఎవరైనా తమని అందులో చూసుకోవచ్చు. సెంట్ ఆఫ్ ఎ ఉమన్, సిల్సిలా, మూన్ వాకర్, వేర్ వర్ యు ఆల్ మై లైఫ్, లవ్ ఆజ్ కల్ అనే మోనోలోగ్స్ బావున్నాయి. పేరు చూస్తే ఇదేదో స్త్రీవాద కవిత్వంలా, పురుషవాదమేమో అని భయం పుడుతుంది. కానీ ఎవరో అన్నట్టు పోయెమ్స్ ఫర్ మెన్ అని పేరే గానీ, మొత్తం అంతా విమెన్ పలవరింతే.

మాజ్గిమమ రిస్క్ – – అరుణ్ సాగర్ 

మెయిన్ స్ట్రీం మనుషులూ కవిత్వం రాయొచ్చు అని నిరూపించడానికే నేను కవిత్వం రాసానుఅని చెప్పుకున్న అరుణ్ సాగర్ మొదటి కవితల పుస్తకం ఇది. ‘ఆంధ్ర విశ్వకళా పరిషత్తుఅనే కవిత అక్కడ చదివిన ప్రతీ ఒకరికీ నోస్టాల్జియా పుట్టిస్తుంది. ‘కభీ కభీ మేరే దిల్ మేకవిత అతనికి ఛాయాగీత్ అంటే ఉన్న ప్రేమను చూపిస్తుంది. ఇక్కడే కాదు చాలా చోట్ల అతను ఈ ప్రోగ్రాంనీ, పాటగాళ్ళనీ, పాటలనీ పలవరిస్తాడు. ‘పాట ఒంటరిగా రానే రాదు, ఒక జ్ఞాపకాన్ని బాకులా వెనుక దాచుకుని తప్ప, ‘బతుకుతూ ఉండేందుకు చేతిలో స్మృతి చిహ్నం ఒకటి ఎపుడూ కొత్తగా తళతళలాడుతూ ఉండాలిఅనే సాగర్ లో నోస్టాల్జియాతో పాటు, సామాజిక పరిస్థితుల పట్ల ఆవేదనా తపనా, మానవ సంబంధాల పట్ల ప్రేమా ఉన్నట్లు అర్థమవుతుంది ఈ కవితల వల్ల.

మోహం - నరేష్ నున్నా

మో చనిపోయిన రెండు సంవత్సరాల తరువాత, మో స్మృతికి నివాళిగా నరేష్ నున్నా ప్రచురించిన పుస్తకం. ఇందులో మో గురించి వ్రాసిన కె.సి.’ అనే కవిత, ‘తిరిగిపోయే పడవఅనే ఎలిజీ, మో ప్రభావంతో రాసుకున్నానని నరేష్ గారు చెప్పిన అతని మొదటి కవితా సంకలనంలోని కవిత రెండ్నిమిషాలు (మౌ) మోనంగాఉన్నాయి. వీటితో పాటు మో రచనల గురించి నరేష్ ఇంతకు ముందు వ్రాసిన కొన్ని వ్యాసాలు, మోహం (1997), ‘మోనిషాదం నిర్నిద్రం, రెండు వైరుధ్య ప్రపంచాలు: వంతెనై నిలిచిన రెండు కవితలు (1995) (వయోనాయ్ - స్త్రీని వయోలిన్, పురుషుడిని షహనాయ్ తో పోలుస్తూ,  హేమాంగీ ధనుర్దాసు - ‘నేనులోని రెండు పార్శ్వాలే హేమాంగీ ధనుర్దాసులనే దేహమూ, ఆత్మ అని విశ్లేషిస్తూ), ఓ డెస్పరుడు! అతని ఇమ్మోర్టల్ గుండె చప్పుడు: మో పునరపి గురించిన వ్యాసం (1994), ‘మోనిషాదం (1993) ఉన్నాయి. మొదట మృత్యురాగాలాపన చేస్తూ వ్రాయటమే మో ప్రభావంఅని భ్రమించానని చెప్పుకున్న నరేష్, అసలయిన మో ప్రభావం ఏమిటో, మో మందలింపుతోనే తెలుసుకున్నానని అంటారు. కవిత్వం అంటే ఆసక్తి ఉన్నవాళ్ళకు ఎక్కువగా నచ్చే వ్యాసాలు ఇవి.

అపరిచితం - నరేష్ నున్నా 

ఇది నరేష్ గారి రెండో నవల. మొదటి నవల లాగానే, ఇదికూడా ఆయన జీవితంలోని కొన్ని సంఘటనల ఆధారంగా వ్రాసినది. తనకు బాగా దగ్గరయిన ఒక కవి గారి కూతురి మీద, నరేష్ ఆరాధనా తపనా, అది చెప్పలేని మోమాటం, ఆ విషయం తెలియని ఆమె నిర్మల స్నేహం, ఏ దారీ తేలకుండానే గోదార్లో కథ చేరిన వైనం. కథగా చూస్తే చాలామందికి ఉండే వన్ సైడెడ్ ప్రేమకథ. అయితే వాటినుంచి దీన్ని వేరు చేసిందేమిటీ అంటే, నరేష్ తన భాషా పాండిత్యంతో, తేనెలో ముంచి పంచిన వైనం. నరేష్ గారి రచనల్లో భావుకత్వం చాలా ఎక్కువ. అదే నాకు ఎక్కువగా నచ్చేది కూడానూ. ఆయన వాడే మెటాఫర్స్ కోసమైనా చదవాల్సినది.

సోమయ్యకు నచ్చిన వ్యాసాలు వాడ్రేవు చినవీరభద్రుడు 

ఇవి వివిధ పత్రికల్లో కాలమ్స్ గా రాసిన వ్యాసాలు. ప్రపంచ సాహిత్యాన్నీ, తాత్విక సిద్ధాంతాలనీ, జీవిత సత్యాలనూ, గొప్ప వ్యక్తుల జీవితాలనూ వివరంగా పరిచయం చేసే వ్యాసాలివి. అన్నీ వరసపెట్టి చదివి అయిపోయిందనిపిస్తే, అజీర్తి చేస్తుంది. ఒక్కొక్కటీ నెమ్మదిగా ఆస్వాదిస్తూ, ఆలోచిస్తూ జీర్ణం చేసుకోవాల్సిందే. అదే పనిలో ఉన్నాను ప్రస్తుతానికి. కొన్ని వ్యాసాలు మళ్ళీ మళ్ళీ చదివిస్తాయి.

ప్యాసా - తనికెళ్ళ భరణి

ఇది రుబాయీలనబడే సున్నితత్వం నిండిన భావకవిత్వం. భరణి అంటే నటుడిగా కన్నా రచయితగానే నాకు ఎక్కువ ఇష్టం. ఈ పుస్తకానికి నటుడు ప్రకాష్ రాజ్ రాసిన ముందుమాటలు అదనపు ఆకర్షణ. "నువ్వు జీవించాలంటే ప్రేమలో పడిచావుఅంటారు ఒకచోట. ‘దేవుడున్నాడో లేడో నే చెప్పగలను / నీవు కలికివో కలవో నే చెప్పలేను / నీవు లేకున్న దేవుడున్న నేమి ఫలము/ నీవు ఉన్నచో అతడు లేకున్న నేమి?’ ప్యాసా గురించి చెప్పడానికి ఈ వాక్యాలు చాలు. ‘నాలోన శివుడు గలడుతో శివుడి పట్ల ఎంత భక్తినీ ప్రేమనీ కలిగించారో, ప్యాసాతో విరహపు దాహాన్ని అంతగానే రుచి చూపించారు. అక్కడక్కడా ఖయ్యాం రుబాయీలు, గాలిబ్ కవితలు గుర్తొచ్చాయి.

ముక్త - కుప్పిలి పద్మ 

నిర్ణయం, మమత, మసిగుడ్డ, వి.డి.ఆర్.ఎల్ లాంటి మంచి కథలతో పాటు , మొత్తం పద్దెనిమిది కథలున్న సంకలనం. అమ్మాయిలు ఇంట్లోనూ, బయట ప్రపంచంలోనూ తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవాలంటే ఎలాంటి పోరాటం చెయ్యాల్సి వస్తుందో సున్నితంగా తెలియచెప్పే కథలు. అన్నీ కూడా వదలకుండా చదివిస్తాయి.

చదువుతూ ఉన్న పుస్తకాలు/మళ్ళీ మళ్ళీ చదివే పుస్తకాలు:

కోకిల ప్రవేశించే కాలం - వాడ్రేవు చినవీరభద్రుడు
సాహిత్యం అంటే ఏమిటి? - వాడ్రేవు చినవీరభద్రుడు
రెండు దశాబ్దాల కథ: సుజాత, మాయిముంత, అతడు, చీకటి, భారతం బొమ్మలు, కప్పడాలు, లోయ లాంటి కథలు మళ్ళీ మళ్ళీ చదివిస్తాయి.
కథా వార్షిక సంకలనాలు

The First Phone Call from Heaven - Mitch Albom

ఇది 2013 లో విడుదలయిన మిచ్ ఆల్బోం కొత్త పుస్తకం. మిషిగన్ రాష్ట్రంలోని ఓ చిన్న పల్లెటూరు. అకస్మాత్తుగా ఓ ఉదయం పూట ఒకామెకు, చనిపోయిన ఆమె సోదరి నుంచి ఫోన్ కాల్ వస్తుంది. తరువాత ఇంకొందరికి కూడా చనిపోయిన తమవాళ్ళ నుండి ఫోన్ కాల్స్ వస్తాయి. సల్లీ ఒక మాజీ పైలట్. ఒక ఫ్లైట్ ప్రమాదానికి అతను కారణం అని జైలుకి వెళ్ళి వస్తాడు. అతని ఏడేళ్ళ కొడుకు, చనిపోయిన తన తల్లి కాల్ చేస్తుందని నమ్మి, ఎపుడూ బొమ్మ ఫోన్ పట్టుకుని ఎదురుచూస్తుంటాడు. సల్లీ కి ఇవన్నీ చూసి పిచ్చెక్కుతుంది. అవన్నీ నిజం కాదని చెప్పినా కొడుకు నమ్మడు. ఆ సంగతేదో అంతు చూసి, కొడుకుని ఆ అపనమ్మకం నుండి రక్షించాలని మొదలు పెడతాడు సల్లీ. ఈలోగా ఆ వార్త ఊరంతా వ్యాపించి, టీవీల్లో కూడా సంచలనం రేగుతుంది. స్పెషల్ రిపోర్ట్స్ కోసం, ఫోన్ కాల్స్ ను ప్రత్యక్షంగా ప్రసారం చెయ్యడం కోసం నేషనల్ టీవీలు ఊర్లోకి చేరతాయి. చనిపోయినవాళ్లు మళ్ళీ ఫోన్ చేస్తామని చెప్పిన సమయానికి చుట్టుపక్కల ఊర్లనుంచీ వచ్చిన జనాలతో, టీవీ వాళ్ళతో ఊరు పోటెత్తింది. మళ్ళీ స్వర్గం నుంచి ఫోన్ కాల్ వచ్చిందా? అసలు ఆ కాల్స్ ఎక్కడి నుండి వస్తున్నాయి? సల్లీ అసలు విషయం కనిపెట్టాడా? ఆశ, నమ్మకం మనుషులకి ఎంత భరోసానిస్తాయో చెప్పే కథ. చదువుతున్నంతసేపూ నాకు ఇర్వింగ్ వాలెస్ వ్రాసిన The Almighty’ గుర్తుకొచ్చింది, అయితే ముగింపు నేనూహించిన దానికి భిన్నంగా ఉంది. మిచ్ మిగతా అన్ని పుస్తకాల్లానే ఇది కూడా ఆపకుండా చదివిస్తుంది.

The Forgotten Daughter - Renita D'Silva

లండన్ లో ఉండే నిషా, బాగా చదువుకుని ఉద్యోగం చేస్తూ, ఆత్మవిశ్వాసం కలిగిన అమ్మాయి. విద్యావంతులైన తల్లిదండ్రులు ఆమెను క్రమశిక్షణతో సంస్కారంతో, దేనికీ లోటు లేకుండా పెంచారు. ఆమెకు పాతికేళ్ళ వయసులో తల్లిదండ్రులిద్దరూ ప్రమాదంలో మరణించగా, లాయర్ ఆమెకోసం వాళ్ళు వ్రాసి పెట్టిన ఒక ఉత్తరం ఇచ్చాడు. అందులోని You were adopted’ అన్న వాక్యం నిషా లోకాన్ని తలకిందులు చేసింది. తనకెందుకు ఎపుడూ నిజం చెప్పలేదు? తన పుట్టుక ఎలాంటిది? తన కన్నతల్లి తనని ఎందుకు వద్దనుకుని వదిలేసింది? లాంటి ప్రశ్నలతో ఆమె నలిగిపోయింది. పెంపుడు తల్లిదండ్రులు తనని ఏ లోటూ లేకుండా పెంచారన్న సంగతి ఊరటనిచ్చినా, నిజం తెలుసుకోవాలన్న ఆరాటం ఆమెను ఆగనివ్వలేదు. ఇంట్లో దొరికిన కొద్ది ఆధారాలతో నిజం తెలుసుకోడానికి ఇండియా ప్రయాణమయింది నిషా. ఆమె తల్లిని కలుసుకోగలిగిందా?ఆమెకు తెలిసిన నిజాలేమిటి? ఈ పుస్తకానికి ఒక పరిచయం The Forgotten Daughter కౌముది మాసపత్రికలో.

Who the Hell Is Pansy O'Hara? The Fascinating Stories Behind 50 of the World's Best-Loved Books - Jenny Bond

ఒక యాభై పేరొందిన నవలల వెనుక కథలు, రచయితల జీవన నేపథ్యం, అది వాళ్ళు వ్రాసిన పుస్తకాల మీద ఎలాంటి ప్రభావం చూపించింది అనేది వివరిస్తూ వ్రాసిన వ్యాసాల సంకలనం. ఇందులో చాలావరకూ ఆసక్తికరంగా చదివించే వ్యాసాలున్నాయి. Gone with the wind వ్రాసిన మార్గరెట్ మిషెల్ ఒక సాధారణ్ గృహణి అట. ఒకసారి కొన్ని నెలలపాటు ఆమె జబ్బుపడి బెడ్ రెస్ట్ లో ఉన్నప్పుడు, భర్త రోజూ లైబ్రరీ నుండి పుస్తకాలు తెచ్చిచ్చేవాడట. వాటిని ఆమె ఉఫ్ మని ఊదేసినట్టు చదివి పారేస్తూ ఉంటే ఆయనకు విసుగెత్తి, లైబ్రరీలో పుస్తకాలన్నీ అయిపోయాయి. ఇక నువ్వే సొంతంగా రాసుకో అన్నాడట. అపుడు ఆమె వ్రాసిన పుస్తకమే గాన్ విత్ ద విండ్అండ్ ద రెస్ట్ ఈజ్ హిస్టరీ. అందులో హీరోయిన్ కు ఆమె మొదటపెట్టిన పేరు పేన్సీ ఓహారా, అయితే ఆ పాత్ర స్వభావాన్ని బట్టి పబ్లిషర్ సూచన మీద స్కార్లెట్ అని మార్చిందట. వార్ అండ్ పీస్ వ్రాసిన టాల్ స్టాయ్ యుద్ధంలో తన అనుభవాలు, తన స్నేహితుడిని పోగొట్టుకున్న దుఃఖంతో అది వ్రాసాడట. అలానే మేరియో ప్యూజో చిన్నప్పుడు తనుండే గల్లీ అంతా మాఫియా వాళ్ళతో నిండి ఉండేదట. చాలామంది యుద్ధం గురించి వ్రాసిన రచయితలందరూ వాళ్ళ జీవితంలో ఏదోరకంగా యుద్ధం ప్రభావం ఉన్నవాళ్ళే. దాదాపు అన్ని వ్యాసాలు ఆసక్తి కలిగించేవే, కథ వెనుక కథల్లాంటివి ఇష్టపడేవాళ్ళకు నచ్చుతుంది.

Antigone - Sophocles

ఇది ఒక గ్రీక్ నాటకం. థీబ్స్ చక్రవర్తి ఈడిపస్ కొడుకులు ఎటియోకిల్స్, పోలినేసిస్. వారి సోదరి యాంటిగని. రాజ్యాధికారం కోసం సోదరులిద్దరి మధ్యా జరిగిన యుద్ధంలో ఇద్దరూ మరణిస్తారు. క్రియోన్ అనే రాజప్రతినిథి అధికారంలోకి వస్తాడు. రాజ్యం మీద యుద్ధం మొదలుపెట్టిన పోలినేసిస్ కు అంత్యక్రియలు జరపకుండా అవమానించాలని క్రియోన్ తీర్మానిస్తే, అది నచ్చని యాంటిగని అతన్ని వ్యతిరేకించి పోలినేసిస్ కి అంత్యక్రియలు చేస్తుంది. క్రియోన్ రాజధిక్కార నేరం మీద యాంటిగనికి మరణశిక్ష విధిస్తాడు. ఆమెను ప్రేమించిన క్రియోన్ కొడుకు ఆత్మహత్య చేసుకుంటాడు. దానితో క్రియోన్ భార్య కూడా ఆత్మహత్య చేసుకుంటుంది. విరక్తి చెందిన క్రియోన్ కూడా మరణిస్తాడు. ఇది మా అబ్బాయి లిటరేచర్ క్లాస్ లో భాగంగా చదువుతుంటే తనతోపాటు చదివాను. అయితే అపుడు నాకు కేవలం కథ మాత్రమే అర్థమయింది. చాలా నెలల తరువాత పుస్తకం.నెట్ లో వాడ్రేవు చినవీరభద్రుడు గారు వ్రాసిన వ్యాసం యాంటిగనీ చదివిన తరువాతే, నాకు గ్రీక్ నాటకాల చరిత్రా, విషాదాంత నాటకలక్షణాలూ, ఈ నాటకంలో అసలైన విషాదాలూ వివరంగా తెలిసాయి.

China Dolls - Lisa See

1938 లో గ్రేస్, హెలెన్, రూబీ ముగ్గురు టీనేజ్ అమ్మాయిలు శాన్ ఫ్రాన్సిస్కో లో కలుస్తారు. గ్రేస్ ఇంట్లో తండ్రి క్రూరత్వాన్ని భరించలేక ఇంటి నుండి పారిపోయి వచ్చింది. హెలెన్ తన పెద్ద సాంప్రదాయ కుటుంబంతో కలిసి అక్కడే చైనా టౌన్ లో ఉంటుంది. రూబీ ఎక్కడి నుండో బ్రతుకు తెరువు కోసం వచ్చింది. ముగ్గురి వెనుకా బయటకు తెలీని కథలు. అప్పుడే శాన్ ఫ్రాన్సిస్కోలో మొదటి వరల్డ్ ఫెయిర్ ఓపెన్ అవుతుంది. అందులో వివిధ దేశాలకు సంబంధించిన ఎట్రాక్షన్స్ దగ్గరా, చైనీస్ నైట్ క్లబ్స్ లో డాన్సర్స్ గానూ ఉద్యోగాలు సంపాదించుకుని, ముగ్గురూ ఒకరికొకరు తోడుగా ఉంటారు. అందరిలోనూ అందగత్తె, చురుకూ అయిన రూబీ అందరికన్నా మంచి డిమాండ్ ఉన్న డాన్సర్ గా మారుతుంది. వాళ్ళ విఫలమయిన ప్రేమలూ, రెండో ప్రపంచ యుద్ధం నేపధ్యంలో ఆర్థిక ఒడిదుడుకులు, క్షీణిస్తున్న షో బిజినెస్ లో వాళ్ళ ఉద్యోగం నిలుపుకునే ప్రయత్నాలూ, పోటీలూ...అయినా ముగ్గురి స్నేహం కొనసాగుతూనే ఉంది. ఈలోగా పెరల్ హార్బర్ బాంబింగ్ జరిగి, దాని నేపథ్యంలో జపనీస్ సంతతి అందరినీ అనుమానించి అరెస్ట్ చెయ్యడం, లేదా దూరంగా కేంప్ కు పంపడమో జరుగుతున్న రోజులు. రూబీ చైనీస్ కాదు జపనీస్ అని తెలిసి, ఉద్యోగం లోంచి తీసెయ్యడమే కాకుండా, ఎవరో పోలీసులకి వార్త కూడా ఇవ్వడంతో ఆమెను అరెస్ట్ చేసి కట్టుబట్టలతో తీసుకుపోతారు. అయితే ఆమె రహస్యం తెలిసింది ఆమె స్నేహితురాళ్లిద్దరికే. దాన్ని బయటపెట్టి మిత్రద్రోహం ఎవరు చేసారు? దాని వెనుక కారణాలేంటి? వాళ్ళ జీవితాలు ఆ తరువాత ఎన్ని మలుపులు తిరిగాయి. ముగ్గురికీ నిష్కల్మషమయిన ఆ స్నేహం మళ్ళీ దొరికిందా? Snow Flower and Secret Fan వ్రాసిన రచయిత్రి లీసా, కొత్త పుస్తకం ఇది. ఆపకుండా చదివించే శైలి లీసా సొంతం. స్నో ఫ్లవర్ అంతగా కాకపోయినా ఆసక్తిగానే చదివించింది.

The Book Thief - Markus Zusak

తొమ్మిదేళ్ళ లీసెల్ తల్లిదండ్రులిద్దరూ జర్మనీలో కమ్యూనిస్ట్లుగా గుర్తించబడి, హిట్లర్ సైన్యం ఆధీనంలోకి తీసుకోబడతారు. లీసేల్ ను ఆమె తల్లి మ్యూనిక్ లోని ఒక ఫాస్టర్ పేరెంట్స్ దగ్గరకి పెంపకానికి వదులుతుంది. రెండో ప్రపంచ యుద్ధకాలం, నాజీల దౌర్జన్యాలు, ఎటు చూసినా పేదరికం, భయం. అయినా ఆ ఫాస్టర్ పేరెంట్స్ లీసేల్ ని ప్రేమగా చూసుకుంటారు. లీసెల్ కు వాళ్ళతోనూ, ఆ ఇంటికి ఆశ్రయం కోసం వచ్చిన యూదు యువకుడు మేక్స్, ఏకైక స్నేహితుడు రూడీ లతో ఏర్పడ్డ అనుబంధం, పుస్తకాలతో ఆమె పొందిన సాంత్వన, యుద్ధం తన చుట్టూ ఉన్నవారిపై చూపించిన ప్రభావం ...ఇవన్నీ మృత్యువు ఆమెను గమనిస్తూ చెప్పిన ఆమె కథ. కథ కన్నా కథనం బలమైన పుస్తకాలకు ఇది మంచి ఉదాహరణ. రచయిత మృత్యువు చేత చెప్పించిన కొన్ని వాక్యాలు మళ్ళీ మళ్ళీ చదివిస్తాయి. ఈ పుస్తకానికి ఒక పరిచయం మృత్యువుని మోహపరిచిన పిల్లకౌముది మాసపత్రికలో.

Angela's Ashes - Frank McCourt

ఫ్రాంక్ తండ్రి మేలకీ, తల్లి ఏంజెలా. ఇద్దరూ తమ టీనేజ్ లో ఐర్లాండ్ నుండి అమెరికాకు వలస వచ్చి, అక్కడ కలిసారు. మేలకీతో ప్రేమలో పడిన ఏంజెలా పెళ్ళి కాకుండానే తల్లి అయితే, ఆమె కజిన్స్ బలవంతంగా ఇద్దరికీ పెళ్ళి చేసారు. మేలకీ త్రాగుబోతు, పని దొంగ. ఏ ఉద్యోగమూ వారం రోజులు కూడా చెయ్యలేదు. వచ్చిన డబ్బులన్నీ తాగుడుకే ఖర్చు పెట్టేవాడు. ఇద్దరికీ ఆ దారిద్ర్యంలోనే వరసగా ఐదుగురు పిల్లలు పుట్టి, ఆఖరున పుట్టిన పిల్ల చనిపోతుంది. ఇక అమెరికాలో ఉండటం కన్నా ఐర్లాండ్ వెళ్ళిపోతే తనవాళ్ళు ఆసరా ఉంటారని అనుకుని, ఐర్లాండ్ వెళ్ళిపోతారు. అయితే మేలకీ పేరెంట్స్ వాళ్ళని ఒక్కరోజుకే పంపించేస్తారు. ఏంజెలా తల్లీ, చెల్లెలూ మేలకీని ఇష్టపడకపోయినా ఏంజెలాకు పిల్లలకూ తోచినంత సాయం చేస్తుంటారు. మేలకీ ఇక్కడ కూడా కుదురుగా ఉండకుండా, ఉద్యోగం లేకుండా తాగుడుతోనే రోజులు గడిపేస్తుంటాడు. ఏంజెలా పిల్లలని పోషించుకోడం కోసం, ప్రభుత్వం ఇచ్చే వెల్ఫేర్ ఫండ్ కోసం ప్రయత్నిస్తుంది. అయితే దాన్ని కూడా మేలకీ ఒక్కోసారి ముందే తెచ్చుకుని వాడేసుకుంటూ ఉంటాడు. వాళ్లకి ఇద్దరు పిల్లలు చనిపోయి, ఇంకో ఇద్దరు పుడతారు. మేలకీలో మాత్రం ఏమాత్రం మార్పూ రాదు. నెమ్మదిగా పెద్దవాడు ఫ్రాంక్, అతని తమ్ముడు మేలకీ. జూ, ఇద్దరూ చిన్న పనులు చేసి, ఒకోసారి చిన్న చిన్న దొంగతనాలు చేసి తిండి సంపాదిస్తుంటారు. ఫ్రాంక్ కి ఒకటే కోరిక, ఎలా అయినా డబ్బు సంపాదించి, అమెరికా వెళ్ళి చదువుకుని మెరుగయిన జీవితం సంపాదించుకోవాలని. వాళ్ళ పేదరికంతో పడిన కష్టాలు, తండ్రి వల్ల ఎదుర్కొన్న తిరస్కారాలు, కుటుంబపోషణకి వాళ్ళు చేసిన ఉద్యోగాలు, తల్లిపడిన కష్టాలు, ఫ్రాంక్ అమాయకత్వం, తమ్ముడు మేలకీ దైర్యం... ఇవన్నీ చాలా సున్నితమయిన హాస్యంతో కలిపి చెపుతారు. ఎంతో బాధ కలిగించే సన్నివేశాల్లో కూడా ఫ్రాంక్ అమాయకత్వపు ఆలోచనలకి నవ్వకుండా ఉండలేము. ఇందులో ఫ్రాంక్ పుట్టడం నుండీ మొదలుపెట్టి, పందొమ్మిదేళ్ళ వయసులో అమెరికాకి వలసరావడం వరకు ఉంటుంది. దాని తరువాత కథతో ఇంకో రెండు పుస్తకాలూ వచ్చాయి. ఈ పుస్తకానికి పులిట్జర్ బహుమతి లభించింది. అత్యత్తమ మెమోయిర్స్ లో ఒకటిగా గుర్తించబడినది. (దీన్నికూడా మా అబ్బాయితో తన లిటరేచర్ క్లాస్ లో భాగంగా చదివాను.)

After Dark - Haruki Murakami

పందొమ్మిదేళ్ళ మారీ అసాయ్ ఒక స్టూడెంట్. సాధారణమయిన అందం కలిగిన ఆమె, పెద్దగా ఎవరితోనూ కలవకుండా, తన చదువూ పుస్తకాలూ లోకంగా ఉంటుంది. ఆమె అక్క ఎరీ అద్భుతమయిన అందగత్తె. చలాకీగా ఉండే ఎరీ కాలేజీలో చాలా పాపులర్. ఆమె మోడలింగ్ కూడా చేస్తుంటుంది. తల్లిదండ్రులు కూడా ఆమెను అపురూపంగా బొమ్మలాగా చూస్తుంటారు. వీటన్నిటితో మారీ ఇంకా ఒంటరిగా ఉంటుంది. కథంతా టోక్యోలో ఒకరాత్రి లో జరిగిన సంఘటనలు వివరిస్తుంది. మారీ అర్థరాత్రపుడు టోక్యో నగరంలోని ఒక రెస్టారంట్ లో కూర్చుని పుస్తకం చదువుకుంటూ ఉంటుంది. ఆ రాత్రికి తన ఇంటికి వెళ్ళే చివరి లోకల్ ట్రైన్ వెళ్ళిపోయినా, ఆమె ఆ ధ్యాసే లేనట్టు కూర్చుని ఉంటుంది. ఈలోగా టకహాషీ అనే ఓ యువకుడు వచ్చి, ఆమెతో మాట్లాడి తనకి ఆమె అక్క తెలుసనీ, కొన్నాళ్ళు ఇద్దరూ కలిసి తిరిగామని చెప్పి, ఆ దగ్గర్లో ఉన్న షాపులో తన గ్రూప్ తో కలిసి మ్యూజిక్ ప్రాక్టీస్ చేసుకోడానికి వెళ్ళిపోతాడు. కొంతసేపటికి దగ్గరలో ఉన్న ఒక హోటల్ మేనేజర్ వచ్చి, మారీని తనతో వచ్చి తమ హోటల్లో గాయపడి ఉన్న ఒక చైనీస్ ప్రాస్టిట్యూట్ తో చైనీస్ భాషలో మాట్లాడి తమకి సహాయం చెయ్యమని అడుగుతుంది. ఆమెతో వెళ్ళిన మారీ, ఆ అమ్మాయితో మాట్లాడి, ఆమెను ఒక విటుడు కోపంతో గాయపరచి ఆమె పర్స్ కూడా తీసుకుని వెళ్ళిపోయాడని తెల్సుకుంటుంది. ఆయన్ని ఆచూకీ కోసం పోలీసులూ, ఆ వేశ్యని కొనుక్కున్న మాఫియా గేంగ్ వాళ్ళూ వెదుకుతుంటారు. ఈలోగా తెల్లవారుతుంది. టకహాసీ, మారీ మాట్లాడుకుంటూ ట్రైన్ స్టేషన్ కి వెళ్ళి మళ్ళీ కలవాలని అనుకుంటూ ఫోన్ నంబర్స్ తీసుకుని వెళ్ళడంతో ముగుస్తుంది. ఈ కథంతా జరుగుతున్న సమయంలో మారీ అక్క, తనకి బాగా రెస్ట్ కావాలని తన రూంలో టీవీ పక్కన బెడ్ మీద పడుకుని అచేతనంగా నిద్రపోవడం, ఆ టీవీలోనుండి ఎవరో ఆమెను కంట్రోల్ చేస్తూ, కల్లోల పరుస్తున్నట్టు ఉలికి పడటం, హోటల్లో చైనీస్ వేశ్యను గాయపరిచినవాడే ఆమెను కంట్రోల్ చేస్తున్నట్టు ఆల్టర్నేట్ భాగాల్లో చెపుతారు. నాకయితే కొన్ని చోట్ల అస్పష్టంగానే ఉండిపోయింది కథ. జపనీస్ సాహిత్యంలో మాస్టర్ స్టోరీ టెల్లర్ అనబడే మురకామి రచనలు చదవాలని ఎప్పటినుండో అనుకుంటే ఇప్పటికి కుదిరింది. అయితే మొదలుపెట్టడమే నేను కాంప్లికేటెడ్ సైకో అనాలిసిస్ సబ్జక్ట్ తో మొదలుపెట్టినట్టున్నాను. ఈసారి అతని మిగిలినవి, కొంచెం సరళమయినవని పేరొందిన Kafka on the shore’, ‘The wind-up bird chronicle’ లాంటివి చదవాలి.

I Am the Messenger - Markus Zusak

ఎడ్ కెన్నెడీ, ఒక గమ్యం, లక్ష్యం లేని పందొమ్మిదేళ్ళ వయసున్న కేబ్ డ్రైవర్. అతనికి ఒక ముగ్గురు ఫ్రెండ్స్ తప్ప, అతని తల్లితో గానీ, తమ్ముడితో గానీ సత్సంబంధాలు లేవు. ఖాళీ సమయంలో ఫ్రెండ్స్తో కలిసి పేకాట ఆడుకోవటం తప్ప అతనికి ఇంకేం పనిలేదు. ఒకరోజు అతనికి పోస్టులో మూడు అడ్రెస్లు వ్రాసి ఉన్న ఒక డైమండ్ ఏస్ పేక ముక్క వచ్చింది. అతనికి దానితో ఏం చెయ్యాలో, అవేమిటో కూడా తెలియదు. అయితే ఆ అడ్రెస్ కు వెళ్ళి బయటనుండే పరిశీలిస్తే, అ ఇళ్లలో వాళ్ళు చిన్నదో, పెద్దదో సమస్యలతో బాధపడుతున్నారని తెలుస్తుంది. అయినా కూడా అతనికి తనేం చెయ్యగలడో తెలీదు, కానీ తన మనసుకు ఏది తోస్తే అది చెయ్యాలని నిర్ణయించుకుని, అలానే చేస్తాడు. దాంతో వాళ్ళ సమస్యలు తీరి సంతోషంగా ఉంటారు. దానితో ఎడ్ కి తన జీవితం కూడా ఎవరికైనా పనికొస్తుంది అని నమ్మకం కలుగుతుంది. మళ్ళీ కొన్నాళ్ళకి ఇంకొక కార్డ్ , ఇంకొన్ని అడ్రెస్ లతో వస్తుంది. ముందటి అనుభవంతో ఈసారీ తోచినట్టుగా ఆ అడ్రస్లో వాళ్లకు సాయం చేస్తాడు. అలా వచ్చిన కార్డ్స్ సాయంతో తన తల్లితో అపోహలు పోయి తన ఫేమిలీకి దగ్గరవటం, తను ప్రేమించిన అమ్మాయికి తన ప్రేమని ధైర్యంగా చెప్పి దగ్గరవటం, మిగిలిన స్నేహితుల జీవితాలు మెరుగవడం జరుగుతుంది. అయితే ఆ కార్డ్స్ ఎవరు పంపిస్తున్నారో అతనికి అర్థం కాదు. అయితే తను ఒక మెసెంజర్. ఆ మెసెజెస్లో వచ్చిన పనులు చెయ్యటమే తన బాధ్యత అనుకుంటాడు. చివరికి పంపిన వాళ్ళెవరో, ఎందుకు అలా చేసారో అతనికి తెలుస్తుంది. ఇది బుక్ థీఫ్ వ్రాసిన మార్కస్ వ్రాసారు. మొదట దాదాపు పావు భాగం కథ చాలా స్లోగా నడుస్తూ విసుగెత్తిస్తుంది. అయితే ఒకసారి కార్డ్స్ రావటం మొదలయిన తరువాత ఆసక్తిగా సాగుతుంది. దీన్ని యంగ్ అడల్ట్ కేటగిరీ అని పేర్కొన్నారు. అయితే పిల్లలకు మొదటి బోరింగ్ పార్ట్ ని భరించే ఓపిక ఉంటుందా అని నాకనుమానం.

Those Who Save Us - Jenna Blum

ట్రూడీ మిన్నేసోటా యూనివర్సిటీలో జర్మన్ స్టడీస్ హిస్టరీ ప్రొఫెసర్. ఆమెకు మూడేళ్ళ వయసులో, రెండో ప్రపంచ యుద్ధం తరువాత, ఆమె తల్లి ఏనా ఒక అమెరికన్ సైనికుడిని పెళ్ళి చేసుకుని అమెరికాకు వలస వచ్చింది. ఆ తరువాత దాదాపు ఏభై ఏళ్ళ పాటు ఏనా, జర్మనీలోని తన గత జీవితం గురించి ఒక్కమాట కూడా మాట్లాడటానికి ఇష్టపడలేదు. చిన్నప్పుడు జరిగిన కొన్ని సంఘటనల వల్ల, తన తల్లి జర్మనీలో ఒక నాజీ ఆఫీసర్ కు ఉంపుడుగత్తె అని మాత్రం ఆమెకు లీలగా గుర్తొచ్చింది. తనూ, తల్లీ కుర్చీలో కూర్చుని ఉంటే పక్కన యూనిఫాంలో ఉన్న ఒక జర్మన్ నాజీ ఆఫీసర్ నిలబడి ఉన్న ఒక పాత ఫోటో తప్ప ట్రూడీకి తన తండ్రి వివరాలేమీ తెలీవు. ఆ ఫోటోలో కూడా తండ్రి మొహం సగం మాత్రమే కనిపించేది. జర్మన్లు యూదుల మీద చూపిన క్రూరత్వానికీ, వాళ్ళ అమానుషమయిన ద్వేషానికీ, పుట్టుకతో జర్మన్ పౌరురాలిగా, ఒక నాజీ ఆఫీసర్ కూతురుగా తనకీ పాపంలో భాగం ఉందని ట్రూడీకి నమ్మకం. ఒక హిస్టరీ ప్రాజెక్ట్ లో భాగంగా, రెండో ప్రపంచయుద్ధకాలం నాటి ఘాతుకాలను స్వయంగా చూసినవాళ్ళు, పాల్గొన్నవాళ్ళు ఆ చర్యల గురించి ఇపుడు ఏమనుకుంటున్నారో ఒక డాక్యుమెంటరీ తీయాలని అనుకుంది. దానికోసం జర్మన్లూ, యూదులూ ఇద్దరినీ ఇంటర్వ్యూ చెయ్యసాగింది. దానిలో భాగంగా నాజీలతో హలోకాస్ట్ లో బంధించబడి, అమెరికా సైన్యం జోక్యం వల్ల బయటపడ్డ యూదులు కొందరిని కలవడం జరిగింది. ఆ సంభాషణలో అనుకోకుండా ఆమెకు తన జీవితరహస్యాలు బయటపడ్డాయి. జర్మనీలోని తల్లి జీవితం గురించి కూడా చూచాయగా తెలుస్తుంది. తెలిసిన నిజాలు ఆమె మీద ఏం ప్రభావం చూపించాయి? తను అనుకున్నట్టుగా తను ఆ నాజీ ఆఫీసర్ కూతురేనా? తల్లి గతజీవితం గురించి తెల్సుకున్న ట్రూడీ, ఆమె ఎందుకు అలా చెయ్యాల్సి వచ్చిందో అర్థం చేసుకోగలిగిందా? కథ ఒక భాగం ప్రస్తుతకాలంలో ట్రూడీ జీవితం, ఉద్యోగం, ప్రాజెక్ట్ వివరాలతో నడిస్తే, ఒక భాగం ఏనా గతజీవితం గుర్తు తెచ్చుకుంటూ నడుస్తుంది. అక్కడక్కడా ఏనా, నాజీ ఆఫీసర్ ఉన్న భాగం కొంచెం సాగదీసినట్టు అనిపించినా, ఆసక్తిగా చదివించింది.

The Time Keeper - Mitch Albom

ఇప్పటికి ఓ ఆరువేల ఏళ్ళ క్రితం డార్ అనే వ్యక్తి మొట్టమొదటగా కాలాన్ని లెక్కించడం మొదలుబెట్టాడు. అతను చేసిన తప్పుకి శిక్షగా చీకటి గుహలో ఒంటరిగా వేల సంవత్సరాలు గడపాల్సి వచ్చింది. అతనికి శాపవిమోచనం కలగాలంటే ఇద్దరు మనుషుల్ని వెదకిపట్టుకుని, వాళ్ళకి తను నేర్చుకున్నది నేర్పాలి. ఆ ఇద్దరూ ఎవరు? అసలు అన్నేళ్ళ ఒంటరి జీవితంలో డార్ ఏం నేర్చుకున్నాడు? వాళ్ళకి ఏం నేర్పాడు? అతను మొదలెట్టిన కాలాన్ని లెక్కపెట్టడమనేది, అతని తరువాత తరతరాల జీవితాలను ఎలా మార్చేసింది? ‘ప్రతీ పనికీ ఓ సరైన సమయం ఉంటుంది. ఏదీ ముందూ కాదు, ఆలస్యమూ కాదు. ప్రతీదానికీ ఓ కారణం ఉంటుంది. అది అర్థం చేసుకుంటే అసంతృప్తులుండవు, చేజారిన క్షణాలుండవు’ అంటూ మనిషికి కాలాన్ని లెక్కించడం అనేది శాపంగా ఎలా మారిందో చెప్పే కథ. దీనితో నాకిష్టమయిన Mitch Albom వ్రాసిన పుస్తకాలన్నీ చదవటం దాదాపు పూర్తయినట్టే. అతని మిగిలిన పుస్తకాల్లాగే ఇది కూడా ఆసక్తిగా చదివించింది.  పుస్తకానికి పరిచయం The Time Keeper కౌముది మాసపత్రికలో చదవొచ్చు.

The Assembler of Parts - Dr. Raoul Wientzen 

జెస్ అని ముద్దుగా పిలవబడే జెస్సికా (Jessica Mary Jackson) అనే అమ్మాయి ఏడేళ్ళ వయసులో చనిపోయి పైలోకానికి వెళ్ళాక, ఆమెకు అక్కడ దేవుడు కనిపించాడు. అతను ఆమెకు కొన్ని వీడియో టేపులు ఇచ్చి, 'ఇందులో భూమి మీద గడిచిన నీ కథ ఉంది. ఇవి చూడు' అని చెప్పాడు. వదిలివచ్చిన జీవితాన్ని చూసి తను ఇపుడు తెల్సుకోవాల్సిందేమిటి? తన జీవితంలో తనకి తెలీనివి క్రొత్తగా ఏముంటాయి? తెల్సిన విషయాలు ఆ పాప మీద ఏం ప్రభావం చూపించాయి?  మనుషుల్ని మిగిలిన జీవాల నుంచి ప్రత్యేకం చేసేదేమిటి? నిజంగా మనుషులు ఆ ప్రత్యేకతను నిలబెట్టుకుంటున్నారా? రచయిత వృత్తిపరంగా చిల్డ్రన్స్ స్పెషలిస్ట్. తన ముప్పయ్యేళ్ళ వృత్తిజీవితంలో ప్రాణాంతకమయిన వ్యాధులున్న ఎందరో చిన్నపిల్లలని ట్రీట్ చేసినపుడు, అది పిల్లలా మీదా, ఫేమిలీస్ మీదా చూపించిన ప్రభావం, డాక్టర్లు తమ పేషెంట్స్తో పెంచుకునే అనుబంధం, కొందరి డాక్టర్ల నిర్లక్ష్య వైఖరి, లీగల్ మరియు మెడికల్ సంస్థలు పేరెంట్స్ మానసిక పరిస్తితితి తమకి అనుకూలంగా ఎక్స్ప్లాయిట్ చెయ్యడం ఇవన్నీ అతన్ని మానసికంగా కలతపరచి ఈ పుస్తకం వ్రాయడానికి కారణమయ్యాయట. ఈ పుస్తకాని ఒక పరిచయం The Assembler of Parts అనే పుస్తకానికి పరిచయం కౌముది మాసపత్రికలో చదవొచ్చు.

The Boy Who Said No: An Escape to Freedom - Patti Sheehy

ఫ్రాంక్ మేదోరాస్ క్యూబాలో ఒక సాధారణ కుటుంబానికి చెందినవాడు. చిన్నప్పటి నుంచీ తాత దగ్గరా, తండ్రి దగ్గరా మనిషి స్వేచ్ఛకు మించింది లేదనీ, నమ్మిన విలువల కోసం న్యాయం కోసం ఎవరినైనా సరే ప్రశ్నించాలనీ వింటూ పెరిగాడు. అతనికి పదహారేళ్ళ వయసున్నప్పుడు క్యూబాలో ఫిడేల్ కాస్ట్రో అధికారంలోకి వచ్చాడు.. అతని పరిపాలనా విధానాలు, ఆర్థిక సంస్కరణలు, వాటి ఫలితాలు చాలామందికి అసంతృప్తిని కలిగించాయి. చాలామంది ధనికులు దేశం వదిలి అమెరికాకు వలసపోవడం మొదలుపెట్టారు. పదిహేనేళ్ళు వచ్చిన బాలురందరినీ తప్పక మిలటరీలో చేరాలని రూల్ పెట్టాడు కాస్ట్రో. ఫ్రాంక్ కూడా మిలిటరీలో చేరి, తొందరలోనే ఆయుధ రక్షణ విభాగంలో కీలక స్థానానికి చేరుకున్నాడు. ఫ్రాంక్ మిలిటరీలో చేరకముందు హైస్కూల్లో ఉండగానే మాగ్దా అనే ధనికుల అమ్మాయిని ప్రేమించాడు. వారి ప్రేమను అందరూ అంగీకరించారు. అయితే కొన్నాళ్లకే మాగ్దా కుటుంబం అమెరికాకు వలస పోవాలని నిర్ణయించుకుంటారు. మాగ్దా కోసం ఫ్రాంక్ కూడా అమెరికా వెళ్లిపోవాలని అనుకుంటాడు. అయితే ఫ్రాంక్ కు తెలిసిన మిలిటరీ రహస్యాల వల్ల దేశం దాటివెళ్లడం అంత సులభం కాదు. ప్రేమించిన అమ్మాయితో జీవితం గడపడం కోసం ప్రాణాలకు తెగించి, ఫిడేల్ కాస్ట్రో మిలిటరీని ఒక ఆట ఆడించి, దొంగతనంగా క్యూబా నుండి అమెరికాకు చేరుకున్న అభినవ తోటరాముడు ఫ్రాంక్ నిజజీవిత కథ ఇది. ఇది ఈ రచయిత్రికి మొదటి నవల. దీన్ని ఆమె ఫ్రాంక్ స్వయంగా తన కథ చెప్పగా వ్రాసారు. ఈ పుస్తకానికి ఒక పరిచయం 'సాహసం చేయరా డింభకా' కౌముది మాసపత్రికలో చదవొచ్చు.