BG

Monday, February 11, 2013

The Outsiders - Part 2

ఈ వ్యాసం మొదట పుస్తకం.నెట్ లో ఇక్కడ లో ప్రచురించబడింది.
మొదటిభాగం (కధ)  ఇక్కడ చదవండి.
Nature’s first green is gold,
Her hardest hue to hold.
Her early leaf’s a flower;
But only so an hour.
Then leaf subsides to leaf.
So Eden sank to grief,
So dawn goes down to day.
Nothing gold can stay.
- Robert Frost


“Bob is a good guy. He was tough and everything, but he was real person too. His parents spoiled him rotten. I mean most parents would be proud of a kid like that – good looking, smart and everything, but they gave in to him all the time. He kept trying to make someone say ‘NO’ and they never did. They never did. That was what he wanted. For somebody to tell him NO. To have somebody lay down the law, set the limits, give him some thing solid to stand on. That’s what we all want, really.” – Randy with Ponyboy
కథలో పాత్రల మనస్తత్వ చిత్రణ గురించి చెప్పుకోవాల్సింది చాలా ఉంది. కొన్ని పాత్రలు కథ మొదలైననుండీ చూస్తే, జరిగిన పరిణామాలతో పాటూ వాళ్ళ దృక్పథం (perception) లో వచ్చిన మార్పు, మనుషుల్ని అర్ధం చేసుకున్న తీరు గమనించదగ్గవి.
టీనేజ్ అటూ ఇటూ కానీ వయసు. పెద్దలకున్న స్వతంత్రం కావాలి, కానీ బాధ్యతలు, ఆంక్షలు ఉండకూడదు. తల్లిదండ్రులు, శ్రేయోభిలాషులూ శత్రువులు గానూ, స్నేహితులు మాత్రమే నిజమైన శ్రేయోభిలాషులుగానూ అనిపించి, పెద్దల ఆంక్షల మధ్య Life is not fair అనిపించే వయసు.
పోనీ దృష్టిలో డేరీ ఒక హిట్లర్. తనని ఒక టీనేజర్ లా కాకుండా ఆరేళ్ళ పిల్లాడిలా చూస్తుంటాడని తన కంప్లైంట్. ఎన్నో ఆంక్షలు, సరిగా చదువుకోమనీ, ఒంటరిగా తిరగొద్దనీ, రాత్రుళ్ళు ఇంటికి తొందరగా రమ్మనీ, గొడవల్లోకి వెళ్లొద్దనీ … ఇవన్నీ పోనీ కి నచ్చవు. నాకు తెలీదా ఏం చెయ్యాలో, నాన్న కూడా ఎపుడూ ఇంత అరవలేదు నామీద అనుకుంటాడు. డేరీ కోప్పడుతుంటే, పోనీ నొచ్చుకుంటాడని సోడా అడ్డుపడి వెనకేసుకోస్తాడు. దానితో చిన్నన్నకి తప్ప, పెద్దన్నకి తన మీద ప్రేమ లేదనీ, తనతో కలిసి ఉండటం ఇష్టం లేదనీ అనుకుంటాడు. సోడాపాప్ గొడవ పెడతాడేమో అని కానీ, లేకపోతే ఎపుడో తనని ఏదో సపోర్ట్ హోమ్లో పడేసి డేరీ తన దారి తను హాయిగా చూసుకునేవాడు అనుకుంటాడు. గేంగ్ దగ్గర సమయం వచ్చినపుడల్లా డేరీకి తనంటే ఇష్టం లేదన్న విషయం గుర్తుచేస్తుంటాడు. కానీ గేంగ్లో మెంబర్స్ అంతా అది నిజం కాదు అని తనకి చెప్పే ప్రయత్నం చేస్తుంటారు, కానీ ఉపయోగం ఉండదు. ఆఖరున చర్చి ప్రమాదంలో గాయపడి హాస్పిటల్లో ఉన్నప్పుడు, డేరీ కన్నీళ్ళు చూసి, డేరీకి కూడా నేనంటే ప్రేముందన్న మాట అనుకుంటాడు.
గేంగ్ లో ఎవరికీ ఇంట్లో మనుషుల దగ్గర కావాల్సిన ప్రేమాభిమానాలు దొరకవు. అందరూ వాటి కోసం గేంగ్ మీదే ఆధారపడతారు. అందరిలోనూ చిన్నవాడైన జానీ పరిస్థితి అందరికన్నా దారుణం. ఇంట్లో ఫిజికల్ ఎబ్యూజ్ కూడా పడాల్సి వస్తుంది. అందుకనే గేంగ్ అందరికీ జానీ అంటే ప్రత్యేక అభిమానం, ఆఖరికి డేలీకి కూడా. జీవించి ఉన్నంత కాలం తల్లిదండ్రుల నుండి ఒక చిన్న ఆప్యాయకరమైన మాట కోసం తపించిపోతాడు. గేంగ్ అంతా ఎంత ముద్దుగా చూసినా కూడా, అది తనకి సంతృప్తి కలిగించదు. అన్న గురించి పోనీ కంప్లైంట్ చేసినపుడల్లా నచ్చచెపుతాడు “నీకేముందో నీకు తెలీటం లేదు. నీకున్న ఫేమిలీ అనుబంధం నాకు లేదు. నన్ను చూడు, నావాళ్ళకి నేనున్నానో పోయేనో కూడా అనవసరం. నీకోసం పట్టించుకునే అన్నలున్నందుకు సంతోషించు, నువ్వు అదృష్టవంతుడివి” అని. అయినా కూడా పోనీకి అర్ధం కాదు.
పోలీసుల నుండి తప్పించుకోడానికి చర్చిలో ఉండగా, చూడటానికి వచ్చిన డేలీని జానీ అడుగుతాడు, నావాళ్ళు నాగురించి వెదుకుతున్నారా, బాధపడ్డారా అని. జానీ సున్నితమైన మనసు తెలిసిన డేలీ, లేదు అని చెప్పి బాధపెట్టలేక మాట తప్పించబోతాడు. అయినా జానీ పదే పదే ఆ విషయం రెట్టించడంతో, నిస్సహాయతతో జానీ మీద అరుస్తాడు, “ఎందుకు అంతలా బాధపడతావు. నన్ను చూడు. నేను ఈరోజు జైలుకి వెళ్ళినా, లేదా ఏ కార్ రెక్ లోనో చచ్చినా కూడా నావాళ్ళు అసలు పట్టించుకోరు. అయినా నేను వాళ్ళ గురించి ఆలోచిస్తున్నానా? వదిలేయ్.” అని విరుచుకుపడతాడు. కనీసం తల్లిదండ్రులు తన గురించి తలుచుకోలేదని తెలిసి జానీ మనసు విరిగిపోతుంది. జానీ హాస్పిటల్లో ఉండగా తల్లి చూడడానికి వచ్చినపుడు, తనని కలవడానికి వొప్పుకోడు. “నాకిష్టం లేదు, ఇపుడు కూడా నావల్ల వాళ్ళకెన్ని ఇబ్బందులు కలిగుతున్నాయో చెప్పి తిట్టడానికే వచ్చి ఉంటుంది కానీ నామీద ప్రేమతో కాదు” అని తిరస్కరిస్తాడు. వాళ్ళ ప్రవర్తన వల్ల ఆ పసిమనసు అంతగా విరిగిపోతుంది. తను బ్రతకడం కష్టం అని తెలిసినపుడు స్నేహితులతో ‘నాకు ఇపుడే చచ్చిపోవాలని లేదు. నా పదహారేళ్ళ వయసు ఎంత పెద్దదనీ, నేనేం చూశాననీ అపుడే చచ్చిపోడానికి’ అంటాడు. తను రక్షించిన పిల్లల తల్లిదండ్రులు వచ్చి కృతజ్ఞతలు చెప్పిన తర్వాత తన ఆలోచనా పధ్ధతి మారుతుంది. “ఆ పిల్లల జీవితాలు నాజీవితం కంటే ఎంతో విలువైనవి. వాళ్ళని ప్రేమించే తల్లిదండ్రులున్నారు. నేను వాళ్ళ కళ్ళల్లో సంతోషం చూసాను. వాళ్ళని రక్షించినందుకు నాకు చాలా తృప్తిగా ఉంది. ఇక నాకు చావంటే బాధ లేదు.” అంటాడు. నా అనే వాళ్ళ ప్రేమకోసం అల్లాడిన శాపగ్రస్తుడు జానీ. పోనీ మాటల్లో చెప్పాలంటే, if it hadn’t been for the gang, Johnny would never have known what love and affection are.”
డేలీ గేంగ్ అందరిలోనూ రాటుతేలినవాడు. చిన్నతనంలోనే జైలుకెళ్ళి రావటం, రోడ్ల మీద, గేంగ్ గొడవల్లోనూ బ్రతకటంతో జీవితం మీద విపరీతమయిన నిర్లక్ష్యం. ఎవరి మీదా అభిమానం గానీ, దేని మీదా భయం గానీ ఉండదు. దేన్నీ లెక్క చెయ్యడు, కానీ గేంగ్ లో అవసరమైనపుడు రక్షణగా నిలుచుంటాడు. ఆనిర్లక్షాన్ని, దేన్నయినా ఎదుర్కొనే ధైర్యాన్ని చూసి గేంగ్ అందరికీ గౌరవం, భయం తనంటే. ఎవరన్నా లెక్కచెయ్యని డేలీ జానీని మాత్రం విపరీతంగా అభిమానిస్తాడు. సినిమా థియేటర్లో జానీ, అమ్మాయిలని విసిగించవద్దని గట్టిగా మాట్లాడినపుడు, ఆశ్చర్యంగా చూసి వెళ్ళిపోతాడు గానీ ఏమీ అనడు. ‘అదే మాలో ఇంకెవరైనా అయితే ఈపాటికి తల ఎగిరి పోయేది’ అని అనుకుంటాడు పోనీ.
బాబ్ హత్య తరువాత, పోలీసులకి తెలిస్తే తను జైలుకి వెళ్ళాల్సి వస్తుందని తెల్సి కూడా జానీ పారిపోటానికి సాయం చేస్తాడు. ఎవరేమైనా పట్టించుకోనివాడు, జానీ తను పోలీసులకి లొంగిపోతాను అన్నప్పుడు మాత్రం, “చిన్న వయసులో జైలుకు వెళితే ఏం జరుగుతుందో నీకు తెలీదు. ఆ క్రూరత్వాన్ని నువ్వు తట్టుకోలేవు. నువ్వు కూడా నాలా రాటు తేలిపోతావు. నువ్వు కూడా నాలా తయారవటం నేను భరించలేను.’ అని నచ్చచెపుతాడు. మంటల్లో స్కూల్ పిల్లలు ఉన్నారని తెలిసి కూడా లెక్కచెయ్యడు, పైగా రక్షించడానికి వెళ్ళబోయిన పోనీ, జానీ లను కూడా ఆపడానికి ప్రయత్నిస్తాడు. వాళ్ళిద్దరూ లోపలికెళ్ళి పిల్లలని బయటకి ఇచ్చినపుడు, బయటనుండే అందుకుంటాడు కానీ లోపలికి వెళ్ళడు. కానీ జానీ లోపల చిక్కుపోయినపుడు మాత్రం లోపలికి వెళ్ళి, అతనిని బయటకి తెచ్చే ప్రయత్నంలో తను కూడా గాయపడతాడు. జానీ చనిపోయిన తర్వాత డేలీకి జీవితం మీదే విరక్తి వస్తుంది. కావాలని చావుని ఆహ్వానిస్తాడు. మొదటినించీ పోనీకి, డేలీ అంటే భయమే తప్ప ఇష్టం కానీ, గౌరవం కానీ ఉండవు. గేంగ్ అంతా డేలీని హీరోలా ఎందుకు చూస్తారో, జానీకి అంత ఆరాధనెందుకో పోనీకి అర్ధం కాదు.
ఇక బాబ్ విషయానికొస్తే, తల్లిదండ్రులు కావాల్సినంత స్వేచ్చ ఇచ్చారు, కానీ అది హద్దులు దాటినపుడు నియత్రించలేకపోయారు. బాబ్ మితిమీరి తాగి వచ్చినపుడు కూడా తనని మందలించరు సరికదా, తమ వల్లనే కొడుకు అలా తయారయ్యాడని తమని తాము నిందించుకుంటారు. అదే చేతులు దాటి పరిస్థితి విషమించే వరకు వెళ్ళింది. బాబ్ ఫ్రెండ్ రేండీ, పోనీతో “బాబ్ తప్పు చేసినపుడు తండ్రి ఒక్కసారి గనక శిక్షించి ఉంటే ఈరోజు బాబ్ బ్రతికుండేవాడేమో” అంటాడు. చెర్రీ కూడా “బాబ్ మరణానికి దారితీసిన గొడవల ప్రారంభానికి కారణం బాబ్ కావచ్చు కానీ, అతనేమీ చెడ్డవాడు కాదు. After all he is a kid” అంటుంది. తల్లిదండ్రుల బాధ్యతారాహిత్యానికి, అప్రయోజకత్వానికీ, వాళ్ళిచ్చిన హద్దులులేని స్వేచ్ఛకి బలైపోయిన అభాగ్యుడు బాబ్.
ఒక వారం రోజుల వ్యవధిలో, తన బెస్ట్ ఫ్రెండ్ జానీతో సహా ముగ్గురి మరణం, పోనీకి అంతులేని విచారాన్ని కలిగిస్తుంది.అదే సమయంలో జీవితం మీదా, మనుషుల మీదా అవగాహనని కూడా పెంచుతుంది. నల్లనివన్నీ నీళ్ళు, తెల్లనవన్నీ పాలు అన్నట్టుగా మనుషుల్లో కేవలం మంచీ చెడూ అని మాత్రమే కాకుండా, వాళ్ళకి ఎదురైన అనుభవాలు వాళ్ళని మధ్యరకంగా కూడా మారుస్తాయనీ అర్ధమవుతుంది. డేలీ కూడా స్వతహాగా మంచివాడేననీ, జీవితంలో అతను అనుభవించిన కష్టాలు, ఎదురుపడ్డ పరిస్థితులు అలా మార్చాయే తప్ప, తను కావాలని ఆదారి ఎంచుకోలేదనీ అనుకుంటాడు. అతనిలోని మంచితనం, హీరోయిజం జానీని రక్షించడానికి చేసిన ప్రయత్నాల్లో కనిపిస్తుంది.
“డేలీకి ప్రేమగా చూసుకొనే ఫేమిలీ అనేది లేకపోవటం వల్లనే అలా తయ్యరయ్యాడనీ, ఒకరికి ఒకరు లేకపోతే మనం కూడా డేలీ లానే తయారవుతాం. అది మరణం కన్నా కూడా దారుణమైన పరిస్థితి” అని సోడా వివరించినప్పుడు ఫేమిలీ విలువా, అన్న డేరీ తమ మీదా చూపించే ప్రొటెక్షన్ అర్ధమవుతాయి పోనీకి. తల్లి దండ్రులు పోయిన తర్వాత తమని చూసుకోడం కోసం డేరీ ఇరవయ్ ఏళ్లకే పెద్దరికాన్ని నెత్తినేసుకుని, చదువు మానేసి కష్టపడాల్సి వచ్చిందనీ, నిజానికి life is unfair with him అని తెలుసుకుంటాడు. డేరీ తను పడుతున్న కష్టాలు తమ్ముడు పడకూడదనే చదువు విషయంలోనూ, గేంగ్ గొడవల్లో పోలీసుల రికార్డులకి వెళ్ళి భవిష్యత్ పాడుచేసుకోకూడదనీనూ, తల్లిదండ్రులని కోల్పోయిన తను తమ్ముళ్ళని కూడా కోల్పోతానేమో అనే భయంతోనే కఠినంగా ఉన్నాడనీ అర్ధమవుతుంది. డేరీ కావాలంటే తననీ సోడానీ ఎక్కడైనా వెల్ఫేర్ హోమ్లో జాయిన్ చేసేసి, తన కాలేజీ చదువు తను చూసుకుని జీవితంలో స్థిరపడగలిగే అవకాశాలున్నాకూడా, కేవలం తమకోసమే కష్టపడుతున్నాడని అర్ధం అయ్యి, తనని ఇన్నాళ్ళూ అపార్ధం చేసుకున్నందుకు సిగ్గుపడతాడు.

Wednesday, February 6, 2013

The Outsiders - Part 1


ఈ పుస్తకపరిచయం పుస్తకం.నెట్ లో కూడా చూడొచ్చు.

సాధారణంగా నేను చిన్నపిల్లల పుస్తకాలు, యంగ్ అడల్ట్ నావేల్స్, ఫాంటసీలు,స్టార్ ట్రెక్ లూ, సైన్స్ ఫిక్షన్లూ, హేరీ పాటర్లూ లాంటి వాటికి, not my cup of coffee అనుకుని దూరంగా ఉంటాను. ఎంతో అవసరమైతే తప్ప చదవను. ఎప్పుడో చిన్నప్పుడు  చదువుకున్న రెక్కల గుర్రాలూ, రాకుమారులూ ఇప్పటికీ వెంటాడుతుంటే ఇంకా ఫేంటసీలు అవసరమా అనుకుని  వదిలేస్తుంటాను. అలాంటిది ఈ పుస్తకం తీసుకొచ్చి, mom! you need to read this అంటే, పాపం ఎప్పుడూ నేను చదివించే పుస్తకాలు చదువుతాడు కదా, సరే ఈసారికి చూద్దాం అని మొదలెట్టాను.

చాలా నెలల తర్వాత నా చేత ఒక పుస్తకాన్ని పూర్తి చేయించి, నన్ను స్థబ్దత లోంచి బయటకి తీసుకొచ్చి వెంటనే ఏదోకటి  రాయాలన్న ఆరాటాన్ని పుట్టించిన పుస్తకం ఇది. మామూలుగా అయితే, ఏదైనా పుస్తకాన్ని చదివేటప్పుడు ఎన్నోసారైనా సరే, ముందు మాట, వెనక మాట, మధ్య మాట, రచయితల డీటైల్స్ చదవకుండా అసలు మొదలుపెట్టను. అదో అలవాటు నాకు. అలాంటిది ఎందుకనో అసలు ఏమీ చూడకుండా మొదలెట్టాను. పూర్తి చేసేవరకు ఇంకే డీటైల్స్ చూడాలన్న ఆలోచన కూడా కలగనివ్వలేదు. పూర్తి అయిన తర్వాత వెనక చూస్తే రచయిత్రి గురించి తెల్సిన వివరాలు ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించాయి. S.E.Hinton అసలు అమ్మాయని కూడా తెలీదు నాకు. తన రచనలు ఏవీ చదవలేదు. అందులోనూ ఈ పుస్తకం తన మొదటి పుస్తకమనీ, అది కూడా తన పదహారేళ్ళ వయసులో రాసిందనీ తెలిసి ఆశ్చర్యపోయాను. ఏ చెయ్యి తిరిగిన రచయితో రాసినట్టు, సబ్జక్ట్ మీద ఎంతో పట్టుతో, పరిణితితో రాయడం చూస్తే చాలా చాలా ఆశ్చర్యమనిపించింది. దీన్ని అదే పేరుతో హాలివుడ్ దర్శకమహారధి Francis Ford CoppolaTom Cruise, Matt Dillon, Patrick Swazye మొదలైన వాళ్ళతో 1984 లో సినిమాగా తీసాడు.

మనిషికి సమాజంలో తానూ ఒక భాగంగా గుర్తింపబడాలన్న తపనే అన్నిటినీ మించిన కష్టం. ఎన్ని ముసుగులు కప్పుకున్నా, ఏ వెళ్ళకూడని దారుల్లో ప్రయాణించినా గమ్యం ఒక్కటే...అస్తిత్వం. బాల్యం నుంచి కౌమారంలోకి ప్రయాణిస్తున్నసంధికాలంలో పిల్లల్లో ఉండే అయోమయం, అమాయకత్వం, ఫ్రస్టేషణ్, పీర్ ప్రెజర్స్ మొదలైనవి వాళ్ళ భవిష్యత్తు మీద చూపించే ప్రభావం సామాన్యం కావు.  వీటన్నిటికీ తోడు ఇంట్లో తల్లిదండ్రుల ప్రేమ, భాద్యత కూడా కరువైతే పిల్లలు శాపగ్రస్తులుగా మారతారు. వాళ్ళకి వాళ్ళే సమాజంలో వెలివెయ్యబడినవాళ్లుగా భావించుకొని కృంగిపోతారు. ఆ క్రుంగుబాటులో వెళ్ళకూడని దారుల్లో గమ్యం వెతుక్కుంటూ ప్రయాణం సాగిస్తారు. అటువంటి కొందరు శాపగ్రస్తుల కధ ఇది.

కధ లోకి వస్తే, ఇది Ponyboy అనే పద్నాలుగేళ్ళ అబ్బాయి జీవితంలో రెండు వారాల్లో జరిగిన సంఘటనలు, దాని ప్రభావం గురించి ఆ అబ్బాయి దృక్పధం నుంచి  ఫస్ట్ పర్సన్లో ( ప్రధమపురుషలో) చెప్పబడ్డ కధ. ఇది గ్రీజర్స్ అని పిలవబడే ఆర్ధికంగా లో-క్లాస్ వర్గానికీ, సోషల్స్ అనబడే హై-క్లాస్ వర్గానికీ చెందిన రెండు టీనేజర్స్ గ్రూపుల మధ్య జరిగే గొడవలూ, ఐడెంటిటీ కోసం, సర్వైవల్ కోసం ఈ టీనేజర్స్ కష్టాలు, సమాజంలో/ స్కూల్లో తోటి స్టూడెంట్స్ మధ్య వాళ్ళూ ఒక భాగంగా ఇమిడిపోవాలన్న తపన,  ఫేమిలీ రిలేషన్స్ సరిగా లేకపోవడం వల్ల వాళ్ళు పడిన మానసికక్షోభలు, ఆ గొడవలు వాళ్ళ జీవితాన్ని తిప్పిన మలుపులూ...ఇవీ సూక్ష్మంగా సారాంశం. ఒక్కో పాత్రనీ మానసిక విశ్లేషణ చేస్తే, దాన్నుండి  ప్రతీ టీనేజర్ (ఆ మాటకొస్తే పెద్దవాళ్ళు కూడా) గమనించాల్సినవీ, అర్ధంచేసుకోవాల్సినవీ ఎన్నో ఉన్నాయి.


కధాస్థలం ఓక్లహామా రాష్ట్రం లోని ఓ చిన్న వూరు. వూరుకి ఉత్తరాన స్లం ఏరియా (ఈస్ట్-సైడర్స్). ఎగువ మధ్య తరగతి కుటుంబాలు, ధనవంతులూ ఉండేది వూరికి పశ్చిమాన (వెస్ట్ సైడర్స్). ఆ ఈస్ట్ సైడర్స్ ని గ్రీజర్స్ అని పిలుస్తూ హేళన చేస్తుంటారు సోషల్స్ అనబడే వెస్ట్ సైడర్స్. ఈ గ్రీజర్స్ సాధారణ వేషధారణ పొడుగాటి జిడ్డు కారుతున్నట్టు ఉండే జుట్టూ, బ్లూ జీన్స్ మీద టీ షర్ట్, లెదర్ జాకేట్స్. సోషల్స్ కి దేనికీ లోటు లేదు. ఖరీదయిన బట్టలూ, కార్లూ, పాకెట్ మనీ, డ్రింకులూ, వెంట గర్ల్ ఫ్రెండ్స్. మంచి గ్రేడ్స్ తెచ్చుకోవటం, తోచనప్పుడు కిక్ కోసం గ్రీజర్స్ మీద దాడి చెయ్యటం, తాగిన సీసాలు బద్దలు కొట్టి గొడవలు చెయ్యటం. గొడవలు చేసో, లేదా కాస్త సమాజంలో మంచిగా కనిపించేలా ఏదో ఒక పని చేసి పేపర్ల కెక్కడం వీళ్ళ పని, అంతే. వాళ్ళకి గ్రీజర్స్ అంటే సమాజంలో బ్రతకడానికి అర్హతలేని వాళ్ళు అని అభిప్రాయం. గ్రీజర్స్కి సమావేశ స్థలం ఆ కాలనీలో పోనీ ఇంటికి కొంత దూరంలో ఉండే ఖాళీ స్థలం. వీళ్ళకి ఇంట్లో గొడవలయినపుడల్లా ఆ ఖాళీ స్థలం దగ్గరికే వచ్చి గడ్డిలో పడుకుని సేదదీరుతుంటారు. ఆ సోషల్స్ కి ఏమీ తోచనప్పుడు, వినోదం కావల్సినపుడు కార్లలో అటు వచ్చి కనిపించిన వాళ్ళ మీద అన్యాయంగా దాడిచేసి హింసించి పోతుంటారు. అందుకని వీళ్ళంతా వీలయినంతవరకూ ఒంటరిగా వాళ్ళకి దొరక్కుండా జాగ్రత్త పడతారు. ఎపుడు అవసరమవుతుందో అని కొంతమంది చిన్న చిన్న కత్తులు కూడా పాకెట్లో పెట్టుకు తిరుగుతుంటారు, వీళ్ళ దాడి నుండి రక్షించుకోడానికి. ఈ కారణాల వల్ల గ్రీజర్స్ తమని తాము సమాజానికి “outsiders” గా ఫీల్ అవుతూ ఉంటారు.

పోనీ (Ponyboy Curtis, 14) తన ఇద్దరు అన్నలు డేరీ (Darrel (Darry) Curtis, 20), సోడాపాప్ (Sodapop Curtis, 17) ముగ్గురూ కలిసి ఉంటారు. తల్లీ తండ్రీ ఓ కార్  ఏక్సిడెంట్లో కొన్ని నెలల క్రితం చనిపోయారు. పోనీ  హైస్కూల్లో చదువుతుంటాడు. చదువులో అన్నీ A గ్రేడ్స్ తెచ్చుకుంటూ ఉంటాడు. సూర్యోదయాలూ సూర్యాస్థమయాలు చూసి ఆనందించడమన్నా, పుస్తకాలు చదవడమన్నా మహా ఇష్టం. డేరీ తమ్ముళ్ళని పోషించడానికి రోజంతా ఎంతో కష్టమయిన రెండు ఉద్యోగాలు చేస్తూ, నవ్వు అన్నదే మర్చిపోయినట్టు సీరియస్గా ఉంటాడు. ఇద్దరు తమ్ముళ్ళకీ వాళ్ళు గొడవల్లో దూరి పోలీసుల వరకూ వెళ్ళకుండా ఉన్నంత కాలం తను వాళ్ళ మంచి చెడ్డలు చూస్తాననీ, కాని రోజున ఎవరి దారి వాళ్ళదే అని గట్టిగా చెప్తాడు. సోడాపాప్ అమ్మాయిలు మనసు పారేసుకునేంత మహా అందగాడు. చదువులో శ్రద్ధ అంతంత మాత్రమే. హైస్కూల్ చదువు మధ్యలో వదిలేసి ఒక గేస్ స్టేషన్లో పని చేస్తుంటాడు. ఇద్దరన్నల లక్ష్యం ఒక్కటే, పోనీని బాగా చదివించి 
జీవితంలో మంచిగా సెటిల్ చెయ్యడం.

డేలీ (Dally, Dallas Winston, 17) న్యూయార్క్ నుంచీ వచ్చి ఇక్కడ ఉంటుంటాడు. పదేళ్ళ వయసులోనే న్యూయార్క్ గేంగ్ గొడవల్లో జైలుకి వెళ్ళి రాటు దేలినవాడు. చెయ్యని నేరం లేదు... దొంగతనాలూ, మోసాలూ, అబద్దాలూ, తాగుడూ, ఫైట్లూ, గుర్రపు పందేలూ.... గేంగ్ కి దళపతి లాంటి వాడు. గ్రూప్లో ఎవరికైనా అవసరమైతే రక్షణగా నిలబడతాడు. దేనికీ లొంగడు, భయపడడు. ఎవరిమీదా ప్రేమలేదు. జీవితం పదిహేడేళ్లకే మనిషిని రాటు దేల్చింది. కళ్ళలో సమాజం మీద కసీ, ద్వేషం, నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టూ కనిపిస్తుంటాయి. ఏ పనీ చట్టబద్ధంగా చెయ్యడానికి ఇష్టపడని స్థితికి చేరుకున్నాడు.

స్టీవ్ (Steve Randle, 18) సోడా కి ప్రియ మిత్రుడు. తనతో పాటూ అదే గేస్ స్టేషన్లో పని చేస్తుంటాడు. షాపుల్లో వీలుగా కనిపించినదాన్నల్లా, అది అవసరమున్నా లేకపోయినా సరే, దొంగతనం చెయ్యడం ఒక హాబీ. టూ-బిట్ (Keith Mathews, 18) చదువులో మహా మొద్దు. ఇంకా హైస్కూల్లో చదువు పూర్తి కానే లేదు. ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ, దేన్నీ సీరియస్గా తీసుకోని మనిషి. దేన్లోనైనా తన వంతు అభిప్రాయం రెండు ముక్కలు (Two-Bit) ఉండాలంటాడు. అందుకే ఆ నిక్ నేమ్.

జానీ (Johnny Cade, 16) అందరిలోకీ చిన్నవాడు (పోనీ కన్నా కొంచెం పెద్దవాడు). పోనీ మాటల్లో చెప్పాలంటే “బాగా తన్నులు తిని ముడుచుకుపోయిన బెదురుకళ్ళ కుక్కపిల్ల, కొత్తవాళ్ళ మధ్యలో తప్పిపోయినట్టు” ఉంటాడు. ఇంట్లో ఏ మాత్రమూ తల్లిదండ్రుల ప్రేమ అభిమానం అనేవి తెలియవు తనకి. తండ్రి తాగి రోజూ విపరీతంగా చావగొడుతుంటాడు. తల్లికి నిర్లక్ష్యం, విసుగంతా కొడుకు మీద చూపిస్తూ, అస్తమానమూ దారుణంగా తిడుతూనే ఉంటుంది. అసలు కొడుకు ఉన్నాడా పోయేడా అన్నది కూడా పట్టించుకోరు. ఇంటికి వెళ్ళేకన్నా బయట గడపాటానికే  ఇష్టపడతాడు. చిన్నవయసులోనే జీవితం క్రూరత్వాన్ని చూపించింది తనమీద. తల్లిదండ్రుల ప్రేమ కోసం తపించిపోతుంటాడు. తనకి డేలీ అంటే హీరో వర్షిప్.

పోనీ, సోడా, టూ-బిట్, స్టీవ్, డేలీ, డేరీ, జానీ, మరి కొందరు టీనేజర్స్ కలిసి గ్రీజర్స్ గేంగ్. గ్రూప్లో అందరికీ జానీ అంటే అభిమానం, చిన్నవాడనీనూ తన పరిస్థితులవల్లనూ. గేంగ్లో ఎవరికీ కూడా కుటుంబ పరిస్థితులు గానే, సహకారం గానీ చెప్పుకోదగ్గవిగా ఉండవు.
ఇక సోషల్స్ గేంగ్. అందరూ పదిహేడేళ్ళ లోపు వాళ్ళే. దాదాపు అందరూ పోనీ చదువుతున్న స్కూల్లోనే చదువుతుంటారు. ముఖ్యమైన వాళ్ళు బాబ్ (Bob Sheldon, 17), రేండీ (Randy Adderson, 17). బాబ్ ఈ గ్రూపుకి లీడర్ లాంటి వాడు.  తన తల్లిదండ్రులు పిల్లలకిచ్చిన అతి స్వేఛ్చ, భాధ్యతా రాహిత్యానికి బలైపోయిన వాళ్ళలో మంచి ఉదాహరణ. రేండీ బాబ్ బెస్ట్ ఫ్రెండ్స్. చెర్రీ (Sherri ‘Cherri’ Valance) బాబ్ గర్ల్ ఫ్రెండ్. పోనీ చదువుతున్న స్కూల్లోనే చదువుతుంది, ఛీర్ లీడర్. ధైర్యవంతురాలు. తను నమ్మిన దానికోసం గట్టిగా నిలబడే మనస్తత్వం. సన్ రైజ్లూ, సన్ సెట్లూ తన్మయత్వంతో ఆస్వాదించే అమ్మాయి. మార్షా (Marcia) చెర్రీ ఫ్రెండ్, రేండీ కి గర్ల్ ఫ్రెండ్.

పోనీ ఒక్కడే సినిమాకి వెళ్ళి రాత్రి చీకటిలో భయపడుతూ ఇంటికి నడుస్తూ వెళ్ళడంతో కధ మొదలవుతుంది. అంతకు ముందు కొన్ని నెలల క్రితం జానీ ఇంట్లో బాధ భరించలేక ఒక్కడే రాత్రప్పుడు ఆ ఖాళీ స్థలంలో పడుకుని ఉంటే, సోషల్స్ దాడి చేసి, తీవ్రంగా గాయపరచి పోయారు. కొంతసేపటికి గ్రూప్లో కొందరు అటు వెళ్తూ మూలుగులు వినిపించి చూస్తే, పొదల వెనుక మొహం అంతా గాయాలతో , రక్తం కారుతూ వాచిపోయి, వళ్ళంతా దెబ్బలతో ఉన్న జానీ కనిపించాడు. తనని కొట్టిన వాళ్ళు నీలం రంగు కార్లో వచ్చారనీ, అందులో ఒకరి చేతికి చాలా ఉంగరాలు ఉన్నాయనీ, ఆ చేత్తో కొట్టడం వలెనే మొహం అంతా గాయలయ్యాయనీ తప్ప, వాళ్ళ మొహాలు పేర్లూ కూడా తెలీదు. గాయాలు మానినా ఆ సంఘటన మిగిల్చిన భయం మాత్రం జానీని వదలలేదు. తన నీడని చూసి కూడా భయపడే స్థితిలో ఉంటాడు. అప్పటినుంచీ ఒక చిన్న కత్తి జేబులో పెట్టుకుని తిరుగుతుంటాడు ఎవరు ఎపుడు దాడి చేస్తారో అన్న భయంతో. ఆ సంఘటన గుర్తొచ్చి పోనీ భయపడుతూ ఇంటికి నడుస్తుంటాడు. ఆ ఖాళీ స్థలం దగ్గరికి వచ్చేసరికి అనుకున్నంతా అయింది. అక్కడే ఏమీ తోచక తిరుగుతున్న సోషల్స్ దాడి చేసారు. అదృష్టవశాత్తూ పోనీ పెట్టిన కేకలు, అక్కడికి కనుచూపు మేరలో ఉన్న పోనీ ఇంట్లో అన్నలిద్దరికీ, మిగతా ఫ్రెండ్స్కీ వినిపించి పరుగెత్తుకు రావటంతో సోషల్స్ పారిపోయారు. పోనీ చిన్న చిన్న గాయాలతో బయటపడతాడు.

ఓ రెండు రోజుల తర్వాత రాత్రి టైంలో డేలీ, పోనీ, జానీ సినిమా చూడటం కోసం ఒక ధియేటర్కి వెళ్తారు. చెర్రీ, మార్షా కూడా వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ అయిన బాబ్, రేండీలతో కలిసి సినిమాకని వస్తారు, కానీ వాళ్ళు తాగుడు మొదలెట్టటంతో గొడవపడి వాళ్ళని వదిలేసి వీళ్ళు మాత్రం వేరుగా వచ్చారు. ఒంటరిగా ఉన్న వీళ్ళని చూసి డేలీ తన సహజమైన పద్ధతిలో వాళ్ళ మీద కామెంట్స్ చేసి వాళ్ళని అల్లరి పెట్టబోతాడు. చెర్రి వాళ్ళ జోలికి రావద్దని వార్న్ చేస్తుంది. డేలీ బయటకు వెళ్ళిన సమయంలో జానీ, పోనీ లకి అమ్మాయిలతో స్నేహంగా మాటలు కలిసి, డేలీ నుంఛి తప్పించడానికి వాళ్ళకు తోడుగా కూర్చుంటారు. ఈలోగా డేలీ వచ్చి అమ్మాయిలని కూల్ చెయ్యాలని ఇచ్చిన డ్రింక్ తన మొహం మీద విసిరి కొడుతుంది చెర్రీ. చెర్రీతో రూడ్ గా ప్రవర్తించబోయిన డేలీతో, జానీ వాళ్ళని వదిలేయ్యని గట్టిగా చెప్తాడు. డేలీ ఎదురు చెప్పకుండా ఆశ్చర్యంగాచూసి, వాళ్ళని వదిలేసి పోతాడు. మధ్యలో చెర్రీ , పోనీకి జానీ ఎందుకు దేనికో భయపడుతున్నట్టూ, ఏదో దారుణమైన దెబ్బ తిన్నట్టూ ఉన్నాడు అని అడిగితే, జానీ కధ మొత్తం చెపుతాడు. దానితో చెర్రీకి అది ఎవరో కాదు, బాబ్ అని అర్ధమయింది కానీ బయటకి ఏం చెప్పదు. పోనీ చెప్పిన గ్రీజర్స్ కష్టాలు, సోషల్స్ బ్రతుకే నయం అన్న మాటలు విని, “ఎవరి కష్టాలు వాళ్ళకి ఉంటాయి, మాకు మాత్రం కష్టాలు లేవని ఎందుకనుకుంటున్నావు, ‘life is rough everywhere’. వీళ్ళు కూడా మంచి గ్రేడ్స్ కోసం, మంచి కార్లూ, మంచి గర్ల్ ఫ్రెండ్స్ కోసం పడే కష్టాలు నీకు తెలీవు” అంటుంది.

ఆ అర్ధరాత్రి టైంలో సినిమా అయిన తర్వాత, అమ్మాయిలని వాళ్ళ ఇంటి వరకు దింపడానికి తోడుగా వెళ్తారు జానీ, పోనీ, టూ-బిట్. సగం దూరం వెళ్ళిన తర్వాత అమ్మాయిల బాయ్ ఫ్రెండ్స్, మిగతా గేంగ్తో కలిసి వీళ్ళ వెనకే వస్తారు. అమ్మాయిలు వాళ్ళతో రాము పొమ్మన్నారని అసలే కోపంగా ఉన్నవాళ్లు, వాళ్ళు గ్రీజర్స్ తో  కలిసి మంచిగా మాట్లాడుతూ నవ్వుకుంటూ వెళ్లడం చూసి ఇంకా మండిపడి, గ్రీజర్స్ తో గొడవకి దిగుతారు. అమ్మాయిలు వాళ్ళతో రాకపోతే గ్రీజర్స్ మీద అటాక్ చేసి హింసిస్తామని బెదిరిస్తారు. అసలే గొడవలంటే ఇష్టపడని చెర్రీ, వాళ్ళతో కలిసి వెళ్ళడానికి వొప్పుకుని, వీళ్ళని వెనక్కి పంపేస్తూ, ఇంకెప్పుడూ నాతో మాట్లాడే ప్రయత్నం చెయ్యకండి మీరు అనవసరంగా చిక్కుల్లో పడతారు అంటుంది. ఈ ముగ్గురు అబ్బాయిలూ నడుచుకుంటూ వెనక్కి ఇంటికి వచ్చేసరికి రాత్రి దాదాపు రెండవుతుంది. జానీ నేనింకాసేపు ఇక్కడే ఉంటాను, ఇపుడే ఇంటికి వెళ్ళాలని లేదు, నా కోసం ఎవరూ ఎదురు చూసే వాళ్ళు లేరు అక్కడ అని పోనీని ఇంటికి పంపేసాడు.

పోనీ ఇంటికి వెళ్లేసరికి అన్నలిద్దరూ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఎక్కడికెళ్ళాడో తనకి ఏమయిందో తెలీక కంగారు పడుతూ, పోలీసులకి రిపోర్ట్ చెయ్యడానికి సిద్ధంగా ఉంటారు. ఎక్కడికెళ్ళినా పన్నెండుకల్లా ఇల్లు చేరుకోవాలని రూల్. రాగానే డేరీ అరుస్తాడు ఏమయిపోయావు, నీకసలు బాధ్యతా అనేది లేకుండా పోతుంది అని. ఇపుడు తనని ఏమీ అనొద్దు అని అడ్డుపడిన సోడా మీద అరిచినందుకు, పోనీ పెద్దన్నని ఎదిరిస్తాడు. ఆకోపంలో డేరీ పోనీని ఒక్కటి కొడతాడు, కానీ వెంటనే జరిగిన దానికి బాధ పడతాడు. ఈలోగానే పోనీ అన్న కొట్టినందుకు అలిగి, నిజంగానే అన్నకి తను ఉండటం ఇష్టం లేదు అని నిర్దారించుకుని అన్నలు పిలుస్తున్నా వినిపించుకోకుండా ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతాడు. మళ్ళీ ఆ ఖాళీ ప్లాట్ దగ్గరికి వెళ్ళి, జానీతో ‘పద మనం ఇక్కడ నుంచి పారిపోదాం, మనం ఎవరికీ అక్కర్లేదు’ అంటాడు. జానీ అలా కాదు అది తప్పు, నీకు నిన్ను ప్రేమించే ఫేమిలీ ఉంది అని నచ్చచెపుతాడు. సరేలే, ఇంటికి వెళ్ళిపోయి డేరీతో మాత్రం మాట్లాడను, అది నా ఇల్లు కూడానూ, నేనెందుకు పోవాలీ అనుకుంటాడు. దగ్గరలోనే ఉన్న పార్క్ కి వెళ్ళి కాసేపు తిరిగి, కొంచెం సర్దుకున్నాక ఇంటికి 
వెళ్ళిపోదాం అనుకుంటారు. అపుడే కధ కొత్త మలుపు తిరుగుతుంది.

జానీ, పోనీ పార్క్ దగ్గరకు వెళ్ళి అక్కడ రిలాక్స్ అవుతుండగా, ఒక నీలం రంగు కారు పార్క్ చుట్టూ తిరగడం చూస్తారు. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్తో వీళ్ళు చనువుగా ఉన్నందుకు పగ తీర్చుకోడానికి బాబ్, రేండీ ఇంకో ముగ్గురితో కలిసి వచ్చారు. ఆ ఐదుగురు కారు దిగి వీళ్ళ మీద దాడి మొదలెట్టగానే, జానీ తమని రక్షించుకోడం కోసం తన దగ్గరున్న చిన్నకత్తి తీస్తాడు. ఆయుధం చూపి బెదిరిస్తే వదిలేసి పారిపోతారు అనుకుంటాడు, కానీ ఈలోగా సోషల్స్ గ్రూప్ లో ఒకడు నిరాయుధుడైన  పోనీని మెడ పట్టుకుని అతి చల్లటి ఫౌంటైన్ వాటర్లో తలముంచి, వూపిరాడకుండా చేస్తారు. పోనీని వాళ్ళనుంచి రక్షించడానికి వేరే మార్గం లేక, బాబ్ ని పొడిచి చంపెయ్యడంతో మిగిలిన అందరూ పారిపోతారు. ఇద్దరూ భయపడి ఏం చెయ్యాలో తెలీక, తమకి అపుడు సాయం చెయ్యగలిగింది ఒక్క డేలీ మాత్రమే అని అతన్ని వెదుక్కుంటూ వెళ్తారు. డేలీ జరిగింది విని ఒక గన్ యాభై డాలర్ల కేష్ ఇచ్చి, కొంత సేపట్లో వచ్చే గూడ్స్ రైల్లో పక్కనున్న ఓ చిన్న పల్లెటూరికి వెళ్ళి, అక్కడ కొండ మీదున్న ఒక పాడుబడిన చర్చిలో ఉండమనీ, ఇక్కడ కొంచెం పరిస్థితులు సర్దుకున్నాక తనొస్తాననీ, అప్పటి వరకు బయటకు రావద్దనీ చెప్తాడు.

ఇద్దరూ డేలీ చెప్పినట్టుగా ఆ పాత చర్చిలో తలదాచుకుంటారు. అక్కడ ఎవరూ వీళ్ళని పట్టించుకోరు. వూర్లో ఉన్న ఒకే ఒక చిన్న కొట్లో వారానికి సరిపడా తిండి సామాన్లు, కాలక్షేపానికి పేకముక్కలు, ఎపుడో పోనీ చదవాలనుకున్న ‘Gone with the wind’ పుస్తకం తీసుకొస్తాడు జానీ. ఆ కొండ మీద చర్చిలో ఎవరికంటా పడకుండా, పేక ఆడుకుంటూ, ఆ పుస్తకం కలిసి చదువుకుంటూ ఓ ఐదు రోజులు గడిపేటప్పటికీ విసుగొచ్చింది వాళ్లకి. ఐదోరోజున డేలీ వచ్చాడు చూడటానికి. పోలీసులని వీళ్ళు టెక్సాస్ పారిపోయారు అని తప్పు ఆనవాళ్ళు వదిలి దారి తప్పించాననీ, ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉంటే అంతా సెటిల్ అయిపోతుంది అనీ చెప్తాడు. కానీ దానికి జానీ ఒప్పుకోడు. వెనక్కి వెళ్ళి పోలీసులకి లొంగిపోతామనీ, తను ఆత్మ రక్షణకోసం చేసిందే కాబట్టి తక్కువ శిక్ష వేసి వదిలెయ్యొచ్చనీ, పోనీ నిరపరాధి కనక తనకి పర్లేదు,అతని గురించి వాళ్ళ అన్నలు బాధపడటం మంచిది కాదనీ చెప్తాడు. కానీ డేలీ ఒప్పుకోడు, అది అంత తెలివైన పని కాదని వారిస్తాడు. ముగ్గురూ కలిసి భోజనానికని వూళ్ళోకి వెళ్ళి చర్చికి తిరిగి వచ్చేసరికి, దూరం నుండే మంటలు కనిపిస్తాయి. బహుశా వీళ్ళు వదిలిన సిగరెట్ పీకల వల్ల, మంటలు రాజుకొని చర్చి మండుతోంది. బయట జనాలు మూగి ఉన్నారు. ఆ కొండ మీదకి పిక్నిక్కి వచ్చిన స్కూల్ పిల్లల్లో కొందరు, టీచర్స్ కి తెలియకుండా ఆ చర్చిలోకి వెళ్ళి మంటల్లో చిక్కుకున్నారు. లోపలకి వెళ్ళే దారిలేక టీచర్స్ అందరూ బయటే ఉండి, ఏం చెయ్యాలో తెలీక  కంగారు పడుతుంటారు. విషయం తెలుసుకున్న జానీ, పోనీ ఇద్దరూ డేలీ వారిస్తున్నా, పరిగెత్తుకుంటూ వెళ్ళి చిన్న కిటికీని విరగ్గొట్టి లోపలికి దూరి, అందులోనుండి పిల్లలను బయటకు అందిస్తే, డేలీ వాళ్ళని అందుకుని టీచర్స్ కి అప్పచెపుతాడు. ఈ ప్రయత్నంలో పోనీ, డేలీ  కొంచెం గాయపడితే, జానీ మీద మండుతున్న దూలం పడటం వలన తీవ్రంగా గాయపడతాడు. ముగ్గురినీ హాస్పిటల్ కి తీసుకు వెళ్తున్నప్పుడు, కూడా వచ్చిన స్కూల్ టీచర్తో మొత్తం కధ చెప్తాడు పోనీ.  అందరూ వీళ్ళని ప్రాణాలకి తెగించి పిల్లలని రక్షించిన హీరోలుగా వర్ణించి పేపర్లో న్యూస్ రాస్తారు. అన్నలు వచ్చి పోనీని ఇంటికి తీసుకు వెళ్తారు. జానీ బ్రతకడం కష్టం అని డాక్టర్లు చెప్తారు. 

బాబ్ ని చంపినందుకు ప్రతీకారంగానూ, ఆధిపత్యం తేల్చుకోడానికీ సోషల్స్, గ్రీజర్స్ మధ్య ఒక చిన్న మల్లయుద్ధం లాంటిది పెట్టుకుంటారు. రేండీ పోనీని కలిసి, మీరు నిజంగా హీరోలు అని మెచ్చుకుని, జరిగిన దానికి బాధపడుతున్నాననీ, బాబ్ మరణంతో తనకి వీటన్నిటి మీదా విరక్తి వచ్చిందనీ, తను ఆ ఫైట్లో పాల్గోవటం లేదనీ చెప్పి వెళ్ళిపోతాడు. చెర్రీ కూడా పోనీని కలిసి జరిగిన దానికి బాధపడుతున్నానని చెప్పి,  గ్రీజర్స్ కి అన్యాయం జరక్కుండా సోషల్స్ తలబెట్టే కుతంత్రాలు తెలియచేయ్యటానికి ఇన్ఫార్మర్గా పని చేస్తుంది.  డేలీ జానీకి జరిగిన దానికోసమైనా మనం గెలవాలి అని, నర్స్ కి కత్తి చూపించి హాస్పిటల్ నుంఛి పారిపోయివచ్చి ఫైట్లో పాల్గొంటాడు. ఆ ఫైట్లో గ్రీజర్స్ గెలుస్తారు.
జానీ కి అస్సలు బాగోలేదు, నిన్ను అడుగుతున్నాడు అని పోనీని తీసుకుని హాస్పిటల్ కి వెళ్తాడు డెలీ. జానీ తనకి ఇపుడు చచ్చిపోడానికీ ఏమీ బాధగా లేదనీ, ఆ పిల్లల్ని రక్షించినందుకు ఏంతో తృప్తిగా ఉందనీ చెప్పి, పోనీకి ‘ప్రపంచం చాలా మంచిది, మనం చూడలేదు, అది తెలుసుకోడానికి ఇంకా టైముంది, మంచిగానే ఉండు (స్టే గోల్డ్)’ అని చెప్పి చనిపోతాడు. జానీ మరణాన్ని తట్టుకోలేని డేలీ బ్రతుకు మీద విరక్తి చెంది, కావాలని ఒక స్టోర్లో దొంగతనం చేసి పారిపోయి, వెంటబడిన పోలీసుల మీద బుల్లెట్స్ లేని గన్ చూపించి, ఎదురు కాల్పుల్లో 
చనిపోతాడు.

కోర్టులో చెర్రీ, రేండీ చెప్పిన సాక్ష్యాలతో జానీని, పోనీని నిర్దోషులుగా నిర్ణయిస్తారు. స్కూల్లో ఇంగ్లీష్ టీచర్, ఇన్నాళ్ళు మిస్ అయిన దానికి పోనీ ఫెయిల్ అవుతాడనీ, కానీ ఏదైనా విషయం మీద సొంతంగా ఒక  వ్యాసం రాసి తీసుకొస్తే పాస్ చేస్తాననీ అంటాడు. జానీ, డేలీ ల మరణం కలిగించిన బాధలోంచి బయటకు రావాలన్నా, తనలాంటి చాల మంది పిల్లలు తమలా కష్టాల్లో పడకుండా ఉండాలంటే, తన కధని తోటి వాళ్ళకు చెప్పడమే మార్గం అనుకుని అదే వ్యాసంగా రాయటం మొదలు పెడతాడు. ఆ రాత్రి సినిమా నుంచి పోనీ ఒంటరిగా నడుస్తూ 
వస్తున్నట్టు వ్యాసం మొదలు పెట్టడంతో కధ ముగుస్తుంది.

కొన్ని పుస్తకాలు చదివిన తర్వాత, గుండెని పిడికిట్లో పెట్టి నొక్కినట్టు గిలగిలలాడించి, మనసుని కలత పెడతాయి. చాలా సేపు చేతనని మర్చిపోయేలా చేసి, మన ఆలోచనలని ఆ పాత్రల చుట్టూనే తిప్పుతాయి. వాటి గురించే ఆలోచిస్తూ మనమూ అందులో ఒక భాగమైపోతాము. అది కలిగించిన విషాదం, ఏమీ చెయ్యలేని మన నిస్సహాయత ఒక స్తబ్దత ని కలిగిస్తాయి. ఇంకొన్ని పుస్తకాలు పూర్తి చేసిన తర్వాత కూడా వదలకుండా మళ్ళీ, మళ్ళీ తిప్పి తిప్పి చదవాలనిపిస్తుంది. నా చేత రెండూ చేయించింది ఈ పుస్తకం.

దాదాపు 45 ఏళ్ళ క్రితం 1967 లో రాయబడిన ఈ పుస్తకం, యేవో కొన్ని కాలంతో పాటు సమాజంలో మారిన వచ్చిన తేడాలు తప్పితే, ఇప్పటికీ టీనేజ్ స్ట్రగుల్ కి దర్పణం గానే ఉందని చెప్పొచ్చు.  ప్రతీ పాత్ర ఎంతో జాగ్రత్తగా, రచయిత్రి వాటిలో పరకాయ ప్రవేశం చేసినట్టు చిత్రించబడ్డాయి. చివర కొచ్చేసరికీ ప్రతీ పాత్ర దృక్పధంలోనూ చెప్పలేనంత తేడా, బ్రతుకు మీద అవగాహనా పెరిగిన తీరు కూడా చాలా రియలిస్టిక్గా, సహేతుకంగా చూపబడాయి. ఒక అమ్మాయి, ఏ మాత్రం గేంగ్ గొడవల్లో అవగాహన ఉండటానికి ఆస్కారం లేని అమ్మాయి, అబ్బాయిల మనస్తత్వాన్నీ, వేదననీ ఇంత స్పష్టంగా, సాధికారంగా వర్ణించ చెప్పగలగటం నాకు విస్మయాన్ని కలగచేసింది.
సినిమా మాత్రం చాలా నిరాశ పరిచింది. అంత గొప్ప దర్శకుడి చేతిలో పడినా కూడా, కధనంలో ఆత్మ లోపించినట్టు అనిపించింది. బహుశా తక్కువ నిడివికి కుదించడం వల్ల కావచ్చు,  పాత్రల ఎస్టాబ్లిష్మెంట్ కానీ, వాటి మధ్య రిలేషన్స్ గానీ ప్రభావితం చేసేంతగా రూపు దిద్దుకోలేకపోయాయి. దాని వల్ల పాత్రలతో రిలేట్ చేసుకోవటం గానీ, ఎటాచ్మెంట్ ఏర్పరచుకోడం గానీ కష్టం. ఈ సినిమా you tube లో లభ్యమవుతుంది.

పాత్రల మనస్తత్వ చిత్రణ మీద అభిప్రాయం రెండో భాగంలో చదవండి.

***

రచయిత్రి గురించిన వివరాలు ఇక్కడఇక్కడ.
సినిమా గురించిన వివరాలు ఇక్కడ


పుస్తకం వివరాలు:

Number of Pages: 208
Book Availability: