BG

Wednesday, April 23, 2014

నేనూ, పుస్తకాలూ, రెండువేల పదమూడూ …

*** ఈ వ్యాసం మొదటగా 4/23/14 న పుస్తకం.నెట్ లో ప్రచురించబడింది.

'గతకాలము మేలు వచ్చుకాలము కంటెన్... అన్న నన్నయ మాట, నా పుస్తకపఠనం విషయంలో మాత్రం నిజమని ఋజువవుతోంది. క్రిందటేడాది చిట్టాలెక్కలు చూసుకున్నప్పుడు చదివిన వాటికన్నా, చదవాలనుకుంటూ చేతిలో ఉండి  కూడా ఇంకా చదవలేకపోయినవే ఎక్కువ లెక్క తేలడంతో, ఈ ఏడాదైనా వాటి సంగతి పట్టించుకోవాలనుకున్నాను. ప్రతీ ఉగాదికీ గ్రహఫలాల్లో పొల్లుపోకుండా రాజపూజ్యం రెండూ అవమానం ఇరవైరెండూ అని తేడాలేకుండా నొక్కి చెప్పినట్టూ, ఇప్పటికీ చదివినవి ఆరూ, చదవాల్సినవి అరవై ఆరూ లెక్క అలానే ఉంది. కినిగే పుణ్యమా అని పుస్తకాలు ఖాతాలో చేరుతూనే ఉన్నాయి. దానికి తోడూ ఈ-రీడర్ని కూడా పిల్లిలా తిప్పుకోడం మొదలయ్యినప్పటికీ, బేలన్స్ షీట్ మాత్రం టేలీ కావడం లేదు.

ఈ సంవత్సరం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, పిల్లలతో కలిపి పుస్తకాలు చదవడంవలన, నేను సూచించినవి వాళ్ళు కాదనకుండా చదవడాన్ని ప్రోత్సహించాలంటే, వాళ్ళు చెప్పినవీ నేను చదవాల్సిరావటంతో కాసిని యంగ్ అడల్ట్స్ పుస్తకాలూ,  అలానే అబ్బాయి అడ్వాన్సెడ్ ఇంగ్లీష్ క్లాస్ వలన తనతో కలిసి కొన్ని పాత క్లాసిక్స్ చదివే అవకాశం కలిగింది. అటువంటిలో ముఖ్యమైనవి, నేను మరిచిపోలేనివీ Outsiders, Things Fall Apart. పిల్లలతో పాటూ సమాంతరంగా చదువుతూ వాటిగురించి మాట్లాడుకోవడం అనేది వెలకట్టలేని అనుభవం నాకు. దానికోసం నేను చదవాలనుకున్న పుస్తకాలకి సమయం చాలకపోయినప్పటికీ, I have no regrets.
ముందే చెప్పినట్టుగా కినిగే వలన చాలా పుస్తకాలని సేకరించుకున్నాను. కొన్ని మొదటిసారి కొన్నవీ, కొన్ని ముందు  పోగొట్టుకున్నవాటికి రీప్లేస్మెంట్, కొన్ని నచ్చిన రచయితల పూర్తి రచనలూనూ. వాటిలో కాశీభట్ల రచనలూ, తిలక్ కథల సంకలనాలూ,  పాతకాలం రచయితల కధల సంకలనాలూ ఉన్నాయి. దాదాపు దశాబ్దానికి పైగా చదవాలన్న కోరికతో వెదుకుతున్న పుస్తకాలు నా జీవనయానంలో - దాశరథి రంగాచార్య, హంపీ నుంచి హరప్పా దాకా –తిరుమల రామచంద్ర, నా అనుభవాలూ, జ్ఞాపకాలూ – శ్రీపాద.  అన్నీ ప్రింట్లో లేకపోవడం వల్లా, దొరికినపుడు తెలియకపోవడం వల్లా ఇన్నేళ్ళూ చేతికి చిక్కలేదు. అదృష్టవశాత్తూ మూడు పుస్తకాలూ ఈ సంవత్సరం చెంత చేరాయి. ఈ సంవత్సరం ఎలాగైనా బేలన్స్ షీట్లో వాటి కాలమ్స్ మార్చాలి.  ఒక స్నేహితుల సూచనతో Tahir Shah పుస్తకాలన్నీ సేకరించి ఏడాది దాటినా, చదివే సమయమూ ఆసక్తీ ఇంకా కుదరలేదు. ఈ సంవత్సరమైనా ఆయనతో స్నేహం చేసుకోవాలని ఆశ.

మళ్ళీ ఇంకోసారి ఆచారాన్ని అనుసరిస్తూ నా డిస్క్లైమర్. (క్రిందటి ఏడాది నుండి కాపీ) ఈ జాబితా అంతా నేను చదివి నన్ను నేను ఉద్ధరించుకోడానికి కారణమయిన పుస్తకాల లిస్టు అసలే మాత్రమూ కాదు. అసలు అలా ఉద్ధరించబడే లక్షణాలేమైనా నాలో ఉండుంటే, ఇంకొన్ని గబగబా చదివేసి పూర్తి స్థాయిలో ఉద్ధరింపబడిపోయి ఉండేదాన్ని. (ఇప్పటికీ ఇదే నా ప్రగాఢ నమ్మకమూ, ఆశానూ.) పుస్తకాలు చదవటం నాకు ఇష్టమయిన సంతోషం కలిగించే పని కాబట్టి, పుస్తకాలు నన్ను నానారకాలుగా ఆనందింపచేస్తాయి కాబట్టి, పుస్తకాలు నా మానసిక ప్రపంచానికి కొత్త వెలుగులు చూపిస్తాయి కాబట్టి, పుస్తకాలు నన్ను ఆలోచింపచేస్తాయి కాబట్టి, అతి ముఖ్యంగా పుస్తకాలు చదవడం నానుంచి విడదీయలేని భాగం కాబట్టి నేను పుస్తకాలు చదువుకుంటాను. ఇన్ని పుస్తకాలు చదివానని గోప్పకోసమో,చాటింపు వేసుకోవడమో కారణం కాకుండా, మిగిలిన వారి లిస్ట్ నుండి నేను స్ఫూర్తి పొందినట్టే ఇంకెవరికన్నా అనిపిస్తుందేమోననీ, ఏం చదవాలా అని వెదుక్కుంటున్నప్పుడు ఏ ఒక్కరికన్నా ఇందులో ఏ ఒక్కటన్నా ఆసక్తి కలిగించదా అన్న ఆలోచనా ఒక కారణం.

Holes - Louis Sachar:  Stanley Yelnats (YA: Young Adult)
దురదృష్టం నీడలా వెంటాడే ఓ పిల్లాడు. అనుకోని పరిస్థితుల్లో చెయ్యని దొంగతనం నేరం మోపబడి, శిక్ష కోసం ఎడారి లాంటి ప్రాంతంలో ఉన్న ఓ కేంప్ కి పంపబడతాడు. అక్కడ వీళ్ళని బుద్ధి చెప్పటం కోసం రోజంతా ఎండలో పెద్ద గోతులు తవ్విస్తుంటారు.  ఆ పిల్లాడి ముత్తాత కాలంలో జరిగిన ఒక చిన్న జానపద కథ లాంటి సంఘటన ఆ పిల్లాడి దురదృష్టానికి కారణం.  పూలన్ దేవి లాంటి ఓ బందిపోటు ప్రేమ కధ ఇంకోటి. ఆమె దారి కాచి సంపాదించిన ఆస్తులన్నీ అక్కడే ఎక్కడో పాతిపెట్టిందని తెలిసి, దానిని కనుక్కోవటం కోసమే కొందరు ఆ కేంప్ వంకతో పిల్లల చేత ఈ గోతులు తవ్వించడం వెనుక కథ. స్టాన్లీ కి కేంప్ లో పరిచయమయిన ఇంకో పిల్లాడితో కలిసి ఆ కేంప్ నుండి పారిపోవడం, చివరికి ఆ ట్రెజర్ ఎలా కనుగొన్నారు, దాని అసలు వారసులెవరూ అనేది అసలు కథ. పిల్లలని ఆసక్తిగా చదివించే పుస్తకం. నేషనల్ బుక్ అవార్డు పొందిన పుస్తకం.వాల్ట్ డిస్నీ వాళ్ళు సినిమాగా కూడా తీసారు.

Outsiders - S.E. Hinton: (YA)
ఆర్ధికంగా రెండు వర్గాలకు చెందిన టీనేజర్స్ (హైస్కూల్ స్టూడెంట్స్) గ్రూపుల మధ్య జరిగే గొడవలూ, ఐడెంటిటీ కోసం, సర్వైవల్ కోసం ఈ టీనేజర్స్ కష్టాలు, సమాజంలో/ స్కూల్లో తోటి స్టూడెంట్స్ మధ్య వాళ్ళూ ఒక భాగంగా ఇమిడిపోవాలన్న తపన, ఫేమిలీ రిలేషన్స్ సరిగా లేకపోవడం వల్ల వాళ్ళు పడిన మానసికక్షోభలు, ఆ గొడవలు వాళ్ళ జీవితాన్ని తిప్పిన మలుపులూ... ఇదీ కథా సారాంశం. దీని పూర్తి పరిచయం పుస్తకం.నెట్ లో రెండు భాగాలుగా చదవొచ్చు. Outsiders - Part 1 మరియు  Part 2.

Wisdom of our Fathers - Tim Russert
తన తండ్రితో అనుబంధాన్ని వివరిస్తూ రాసిన Big Russ and Me అనే మెమోయిర్ కి స్పందనగా పాఠకులు తమ తండ్రుల నుంచి తాము పొందిన స్పూర్తి, ప్రేమా, నేర్చుకున్న విలువల గురించి ఉత్తరాల ద్వారా రచయతతో పంచుకున్న విషయాలు ఈ రెండో పుస్తకంగా తెచ్చారు. దీని గురించి పూర్తి పరిచయం Wisdom of Our Fathers పుస్తకం.నెట్ లో చదవొచ్చు.

The pearl - John Steinbeck
ఇది ఒక మెక్సికన్ జానపద కధ ఆధారంగా 1947 లో రాయబడి, విస్తృతమైన గుర్తింపు పొందిన నవల. Kino అనే జాలరికి ఒక అరుదైన ముత్యం దొరకటం, దాన్ని అమ్మి కొడుకు చికిత్సకి డాక్టర్ ఫీజుగా ఇవ్వాలని అతను చేసే ప్రయత్నాలు, ఆ ముత్యాన్ని చూసి మిగిలిన వారిలో రేకెత్తిన అసూయా దురాశలూ, వాటిని ఎదుర్కొనే ప్రయత్నంలో అమాయకుడైన Kino ప్రవృత్తిలో వచ్చిన మార్పులూ, వాటి పర్యవసానాలూ కథాంశం.   ఇది హైస్కూల్ విద్యార్ధుల చేత తప్పక చదివించబడే పుస్తకాల్లో ఒకటి. ఇదే పేరుతో సినిమాగా కూడా వచ్చింది.

The Reader Bernhard Schlink
మైఖేల్ అనే పదిహేనేళ్ళ అబ్బాయికి ఒకరోజు తనకన్నా రెట్టింపు వయసున్న హేనా అనే యువతితో పరిచయమవుతుంది.  ఆ వయసుకున్న క్యూరియాసిటీతో ఆమెని గమనిస్తున్న మైఖేల్తో పరిచయం పెంచుకుని అతనితో శారీరక సంబంధం ఏర్పరచుకుంటుంది. మైఖేల్ ప్రతీ రోజూ స్కూల్ ఎగ్గొట్టి ఆమె దగ్గరికి వెళ్లటం, ఆమె అతని చేత రోజూ పుస్తకాలు చదివించుకోవడం చేస్తుంటుంది. తను ఒక ట్రామ్ డ్రైవర్ అన్నది తప్ప ఆమె గురించిన ఏ విషయాలూ తెలియనివ్వదు. ఒకరోజు చెప్పా పెట్టకుండా హేనా మాయమయిపోతుంది. అప్పటికే బాగా ఆమె ఆకర్షణలో కూరుకుపోయిన మైఖేల్ ఆమె గురించి ఎంత ప్రయత్నించినా ఆమె ఏమయ్యిందో తెలుసుకోలేకపోతాడు. కొన్నేళ్ళ తర్వాత మేఖేల్ లా స్టూడెంట్ గా ఒక కేస్ స్టడీ కోసం కోర్ట్ కి వెళ్ళినపుడు, హేనా హాలోకాస్ట్ సమయంలో జరిగిన ఒక సంఘటనకి బాధ్యురాలిగా నిందితురాలిగా కనిపిస్తుంది. తన మీద ఆరోపణలను కనీసం డిఫెండ్ చేసుకొనే ప్రయత్నం కూడా చెయ్యకుండా శిక్షను అనుభవించడానికి సిద్ధమయిన హేనా వెనుక ఏదో రహస్యం ఉంది అని మైఖేల్ కి అర్ధమవుతుంది కానీ అదేమిటో స్పష్టం కాదు. చివరికి ఆ రహస్యం మైఖేల్ తెలుసుకున్నాడా లేదా, తెలుసుకుని ఏం  చేసాడు, హేనా ఏమయ్యింది అనేది కథ. పుస్తకంలో దాదాపు మొదటి మూడోవంతు భాగం (మైఖేల్ హేనా మధ్య సంబంధాన్ని వివరించే భాగం) కొంత జగుప్సనీ, ఓ రకమైన ఇబ్బందినీ కలిగించినా కూడా మొత్తానికి చదివించే కధ. ఇది మొదట జర్మన్ భాషలో వెలువడి విమర్శలూ, ప్రశంసలూ, అవార్డులూ కూడా పొంది, 37 భాషల్లోకి అనువదించబడింది.  Kate Winslet ముఖ్య పాత్రదారిగా సినిమాగా కూడా వచ్చి ఐదు ఎకాడమీ అవార్డ్స్ కూడా సంపాదించుకుంది. సినిమా యూ ట్యూబ్ లో దొరుకుతుంది.

Eleven Birthdays - Wendy Mass: (YA)
అమాండా అనే అమ్మాయి, లియో అనే అబ్బాయి ఒకే రోజు పుట్టిన పిల్లలు. వీళ్ళు పుట్టినప్పుడు ఒక  ఆసుపత్రిలో ఒకామె చూసి, ఇద్దరూ ఎప్పటికీ బెస్ట్ ఫ్రెండ్స్ లా ఉండాలనీ, కలిసే పుట్టినరోజు జరుపుకోవాలని చెప్తుంది. పదేళ్లు అలానే జరుగుతుంది కానీ పదో పుట్టిన రోజున జరిగిన ఓ సంఘటనతో అమాండాకు లియో మీదా కోపం వచ్చి, ఇద్దరి స్నేహం చెడుతుంది.  ఇద్దరూ తమ పదకొండో పుట్టినరోజు విడివిడిగా జరుపుకోవాలని అనుకుని అలానే ప్లాన్ చేసుకుంటారు. పదకొండో పుట్టినరోజు నుంచీ దాదాపూ పదకొండురోజులు ఇద్దరికీ ప్రతిరోజూ ఒకేలా జరుగుతూ ఉంటుంది. (గ్రౌండ్ హాగ్ డే సినిమాలోలా).  ఏం జరుగుతోందో, ఏం చెయ్యాలో అర్ధం కాని ఇద్దరూ ఒకరికొకరు తమ స్థితి చెప్పుకుని కలిసిపోయి, తమకి కలిగిన విచిత్రమైన పరిస్థితి నుంచి ఎలా బయటపడ్డారు అన్నది కధ.  ఒకే సంఘటన పదేపదే జరుగుతున్నప్పుడు ముందు రోజు తమ ప్రవర్తన వల్ల ఎదురైన కష్టాలూ నష్టాలూ  గుర్తుపెట్టుకుని (మిగిలిన ఎవరికీ అవి గుర్తుండవు) మరుసటి రోజు ఇంకో విధంగా ప్రవర్తించినపుడు కలిగిన ఫలితాలూ లాంటివి, ఏ పరిస్థితుల్లో ఎలా ప్రవర్తిస్తే దాని ఫలితం ఎలా ఉంటుందీ అనేది పిల్లలకి కొంచెం అర్ధమయ్యే విధంగా ఉదాహరణలతో కధలో భాగంగా ఉంటుంది.

The Five People You Meet in HeavenMitch Albom
ఎడ్డీ అనే ఎనభై మూడేళ్ళ వ్యక్తి, ఓ ఎమ్యూజ్మెంట్  పార్క్లో పనిచేస్తూ, ఏ విధమైన జీవితాసక్తి లేకుండా, తన జీవితానికి ఏ సార్ధకత లేదని వగస్తూ గడిపేస్తూ ఉంటాడు. ఒకరోజు అక్కడ జరిగిన ప్రమాదంలో మరణిస్తాడు. తరువాత స్వర్గం చేరినపుడు అక్కడ కొంతమంది వ్యక్తులని (తనకి ప్రత్యక్షంగా తెలిసినవారూ, తెలియని వారూ కావచ్చు) కలిసి వారి ద్వారా తన జీవితాన్ని వేరే కోణంలో తెలుసుకునే అవకాశం  కలుగుతుంది. ఏ జీవితమూ వ్యర్ధం కాదనీ,  ప్రతీ జీవితానికి ఏదో ఒక ప్రయోజనం ఉంటుందనీ చెప్పే కథ. చివరకు మనం ఈలోకం వదలిన తర్వాత మనమెవరిని కలుస్తామా అన్న కుతూహలాన్ని మనలో రేకిత్తిస్తుంది. వదలకుండా చదివించే పుస్తకం. ఈ పుస్తకంతో Mitch Albom అభిమానిని అయిపోయి దాదాపు అతని పుస్తకాలన్నీ చదివేసాను. Jon Voight ఎడ్డీ పాత్రధారిగా సినిమా (టెలివిజన్ మూవీ) గా కూడా వచ్చింది. పుస్తకంతో సరిసమానంగా ఆసక్తికరంగా తీసిన సినిమాల్లో ఇదొకటి. ఈ పుస్తకానికి పూర్తి పరిచయం స్వర్గంలో పాఠాలు కౌముది మార్చ్ 2014 సంచికలో చదవొచ్చు.
                                                                
 The Logic of Life - Tim Harford
జీవితంలో ప్రతీ ఛాయిస్  వెనుకా, దాని ఫలితం ఏదైనా కూడా, ఓ లాజిక్ వుంటుంది అంటూ ఎకనామిక్ రేషనాలిటీని చాలా ఉదాహరణలతో ఫన్నీగా వివరిస్తారు రచయిత. కొన్ని కారణాల వలన పూర్తి చేయలేకపోయాను. ఇంకోసారి టైం చూసుకుని పూర్తిచెయ్యాలి. 

Proof of Heaven: A Neurosurgeon's Journey into the AfterlifeEben Alexander 
రచయిత డాక్టర్ ఈబెన్ ఒక న్యూరోసర్జన్. ఆయనకు దాదాపు అరవయ్యేళ్ళ వయసులో  లో bacterial meningitis వలన వారం రోజుల పాటు కోమాలోకి వెళ్లారు. డాక్టర్లందరూ ఆయనమీద ఆశ వదిలేసుకున్న సమయంలో వారం రోజుల తరువాత కోమాలోంచి బయటపడి, ఆ వారం రోజులూ తాను స్వర్గానికి వెళ్ళి వచ్చాననీ, తను అక్కడ కలుసుకున్న వ్యక్తుల గురించీ, అనుభవాల గురించీ పుస్తకంలో రాసారు. An interesting  probe on the credibility of the cliams Dr. Eben made can be read here...The Prophet.

Bengal Nights - Mircea Eliade 

వాస్తవంగా జరిగిన తన కధకు రచయిత రంగులు పులిమి వక్రీకరించి చెప్పిన కధ. Bengal Nights & It Does Not Die: ఒక ప్రేమ కథ రెండు పుస్తకాలు Part 1 and Part 2  ద్వారా ఈ పుస్తకం గురించి తెలుసుకుని, వేరే స్టేట్ లైబ్రరీ నుంచి తెప్పించుకుని మరీ చదివాను. తన మీద సానుభూతి కోసం లేదా సెల్ఫ్ పిటీ తోనో అమ్మాయి మీద (ఎవరికీ తెలిసే అవకాశం లేదు కదా, నేను ఫ్రెంచ్ భాషలో రాసుకుంటే అనుకుని ఉండొచ్చు) జరగనివెన్నో రాసినందుకు విపరీతమయిన కోపం వచ్చింది. చదవక ముందే కథ అవుట్ లైన్ తెలిసినా కూడా,  అంత వివరంగా వర్ణించినందుకు, అందులోనూ అసలు పేర్లతో సహా వ్రాయడం చాలా అసహ్యం కలిగించింది. ఇండియన్ వేల్యూస్ గురించి తెలుసు అని చెప్పుకున్నవాడిగా, సంఘటనలు నిజంగా జరిగినా కూడా వాటిని బట్టబయలు చెయ్యకుండా అమ్మాయి గౌరవాన్ని కాపాడి ఉంటే కొంతైనా జాలి కలిగేది. నిజమేదైనా సరే ఇక మైత్రేయి రాసిన పుస్తకాన్ని చదవనవసరం లేదు అనిపించింది. బెంగాల్ నైట్స్ అనే పేరుతోనే హ్యూ గ్రాంట్, సుప్రియా పాక్, షబానా ఆజ్మీ నటించిన సినిమా యూ ట్యూబ్ లో ఉంది.

 

The Palace of Illusions - Chitra Benarjee Divakaruni  
2008 లో విడుదలయినపుడు మొదటిసారి చదివిన పుస్తకం, ఈ ఏడాది పుస్తకం.నెట్ లో వచ్చిన పరిచయ వ్యాసం చూసి గుర్తొచ్చి మళ్ళీ చదివాను. నాకు ఎపుడూ కూడా భారతంలో కొన్ని సంఘటనల్ని ద్రౌపది కోణంలోంచి అప్పుడప్పుడూ ఆలోచించడం అలవాటు. దానితో ఆ కోణంలో రాసిన పుస్తకం కావడంతో నచ్చింది. రచయిత్రి అన్ని ఆలోచనలతోనూ కల్పించిన సంఘటనలతోనూ ఏకీభవించకపోయినా, చదివిన  టైం వేస్ట్ అనిపించని పుస్తకం. మొదటిసారికీ ఇప్పటికీ నన్ను ఇబ్బంది పెట్టినది భాష.  బహుశా అమెరికన్ ఇంగ్లీష్ ఎక్కువగా చదవడం అలవాటయినందుకేమో, చాలా చోట్ల మరీ నాటకీయంగానూ కృతకంగానూ  అనిపించింది నాకు.  
  
Tuesdays With Morrie Mitch Albom
స్పోర్ట్స్ జర్నలిస్ట్ అయిన రచయిత చదువు పూర్తియిన తరువాత అందరిలానే జీవితపు పరుగు పందెంలో నిమగ్నమయిపోయి యాంత్రికమయిన జీవితం గడుపుతుండగా, ఒకరోజు టీవీలో తన కాలేజ్ ప్రొఫెసర్ Morrie Schwartz గురించిన వార్త చూస్తాడు (మోరీ అంటే my teacher అని అర్ధమట) ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడని. కాలేజీ రోజుల్లో ఆయన నుంచి ఎంతో ఆప్యాయతనీ, ప్రోత్సాహాన్ని పొందిన తను, కాలేజీ నుంచి బయటకొచ్చిన తరువాత ఆయన్ని ఒక్కసారి కూడా కలవనందుకు బాధపడి, అపుడు వెళ్ళి కలుస్తాడు.  అప్పటి నుంచీ ప్రతీ వారం పద్నాలుగు వారాల పాటు ప్రతీ మంగళవారం వెళ్ళి ఆయనతో కాలం గడుపుతాడు. ఆ పరిస్థితుల్లో కూడా ఆయన క్రుంగిపోకుండా జీవితంలో చిన్న చిన్న ఆనందాలని ఎలా ఓవర్ లుక్ చెయ్యకూడదో,  పాజిటివ్గా బ్రతకడం ఎలానో చెపుతూ, జీవించడం తెలిసిన వాడికి, సంతోషంగా ఎలా చనిపోవాలో కూడా తెలుస్తుందని చెపుతారు. ఆ సంభాషణలన్నీ రికార్డ్ చేసి తరువాత పుస్తకంగా తీసుకొచ్చారు. ఇది రచయిత మొదటి పుస్తకం (నాన్- ఫిక్షన్, మెమోయిర్) . ఇది అత్యధిక ఆదరణ పొందిన  మెమోయిర్ అని చెపుతారు.

For One More Day - Mitch Albom   
Five people you meet in heaven చదివిన తరువాత వరుసబెట్టి ఆయన రాసిన పుస్తకాలన్నీ సంపాదించి చదివేసాను. ఆయన అన్ని పుస్తకాల్లోనూ కొంచెం తక్కువ నచ్చింది ఇదే. కథ విషయానికి వస్తే చార్ల్స్ అనే  మధ్యవయసు వ్యక్తి జీవితంలో విసిగిపోయి ఓడిపోయి, తన ఒకే ఒక్క కూతురి చేత కూడా తిరస్కరింపబడి ఆత్మహత్య చేసుకుందామని, తను పుట్టి పెరిగిన వూరికి వస్తాడు. అక్కడ తన తల్లితండ్రుల ఇంట్లో ఎన్నో ఏళ్ళ క్రితం చనిపోయిన తల్లి కనిపించి ఎప్పటిలాగే అతనికి ప్రేమగా చూస్తుంది. ఆశ్చర్యపోతూనే తల్లితో ఒకరోజు  గడుపుతాడు. ఆ సమయంలో తను చిన్నప్పుడు తల్లి ప్రేమని ఎలా అర్ధం చేసుకోనిదీ, తల్లి తమ కోసం చేసిన పనులని తను ఎంత చిన్న చూపు చూసి కించపరిచిందీ, తమని వదిలేసిపోయిన తండ్రితో చేరి ఆమెని ఎంత నిర్లక్ష్యం చేసి ఎలా ఆమెని దుఃఖపెట్టిందీ లాంటి విషయాలెన్నో అర్ధమవుతాయి. మనల్ని ప్రేమించిన వారితో, మనం కావాల్సిన వాళ్ళతో గడిపేందుకు ఇంకొక్క చాన్స్, మరొక్క రోజు దొరికితే ఒకరి పట్ల ఒకరి ప్రవర్తనా, ఎందుకలా ఎవరైనా ప్రవర్తించాల్సి వచ్చిందీ అన్నది అర్ధం చేసుకోగలిగితే, మసి పట్టని అద్దం లోంచి చూడగలిగితే ఎంత బాగుంటుందీ అన్నది చాలా అందంగా చెపుతారు. ఇందులో చాలా సార్లు Times My Mother Stood Up for Me, and Times I Did Not Stand Up for My Mother అనే రెండు కేటగిరీల్లో వచ్చే సంఘటనలన్నీ దాదాపు మనకు తెలిసినవే. ఇంటింటి రామాయణం అని చెప్పుకోవచ్చు. చాలామందికి కథకుడిగా Mitch తమకి నచ్చరు అనీ, ప్రీచింగ్ ఎక్కువనీ అంటారు కానీ ఇప్పటివరకూ చదివిన ఐదు పుస్తకాల్లో నాకెక్కడా అలా అనిపించలేదు.  క్రిస్టియన్/రెలిజియస్ వాల్యూస్ గురించి మాట్లాడతారు కానీ అవి కథలో అంతర్లీనంగా, కథనానికి అదనపు బలం చేకూరుస్తూ ఉన్నాయనిపించిందే గానీ వాటిని పాకుల మీద రుద్దుతున్నట్టు ఎపుడూ  అనిపించలేదు.

And the Mountains Echoed - Khaled Hosseini  
అబ్దుల్, పరీ అనే అన్నా చెల్లెళ్ళు ఒకరంటే ఒకరికి ప్రాణం. చిన్నతనంలోనే పేదరికం వలన పరీ పాకిస్తాన్లోని ఓ గొప్పింటికి పెంపకానికి ఇవ్వబడుతుంది. అక్కడ నుండీ ఇద్దరి జీవితాలూ ఎన్ని మలుపులు తిరిగిందీ, చెల్లెలు ఏమయ్యిందో తెలీక తన కోసం తపించిపోయిన అబ్దుల్ మళ్ళీ చెల్లెలిని  కలుసుకోగలిగాడా అనేది కథ. ఎన్నో ఉపకథలు, అన్నిటినీ ఎక్కడో జాగ్రత్తగా తీసుకొచ్చి ముడులేస్తాడు. ఆసక్తిగా కథ చెప్పటం ఎలానో తెలిసిన మరో కథకుడు ఈయన. ఈయన మొదటి రెండు పుస్తకాలూ Kite Runner, Thousand Splendid Suns కలిగించిన ఉత్కంత కలిగించకపోయినా, ఇంట్రెస్ట్ పోకుండా చదివించగలదు. కాకపోతే లైలా, మరియం లాంటి మనసులో తిష్ట వేసి కూర్చోగలిగే కేరక్టర్లు కనిపించలేదు నాకిందులో. ఈయన కథల్లో ఆప్ఘనిస్తాన్, కాబూల్ చరిత్ర బేక్ డ్రాప్ గా ఉంటుంది. ఆ చరిత్రని రంగుటద్దాల్లోంచి చూపిస్తాడు అని ఒక ఆరోపణ. టెన్త్ క్లాసులో సోషల్ పరీక్ష గట్టేక్కేస్తే మళ్ళీ జన్మలో చరిత్ర మొహం చూడనని ఒట్టేసుకున్న ఘనచరిత్ర నా సొంతం కావటం మూలానా నాకది పెద్ద ఇబ్బందిగా అనిపించదు.

Beatrice and Virgil - Yann Martel
హెన్రీ, తన మొదటి పుస్తకానికి విపరీతమయిన గుర్తింపు పొందిన రచయిత. హాలోకాస్ట్ ఆధారంగా వ్రాసిన తన తరువాతి పుస్తకాన్ని పబ్లిషర్స్ తిరస్కరిస్తే, మళ్ళీ ఇంకోటి రాసేముందు కొన్నాళ్ళ విరామం కోసం వేరే చోటికి వెళతాడు. ఒక రోజు అతనికి పోస్టులో ఒక కథ, ఒక నాటకం స్క్రిప్ట్, ‘తనకి ఆ నాటకాన్ని పూర్తి చెయ్యటానికి సహాయం చెయ్యమని’ కోరుతూ ఒక ఉత్తరం హెన్రీ అనే Taxidermist నుండి వస్తాయి. ఆ కథేమో చిన్నప్పుడు జంతువులని పాశవికంగా చంపి ఆనందించిన ఒక సెయింట్ కథ. నాటకంలో పాత్రలేమో హార్రర్ గురించి ఆందోళన చెందే Beatrice అనే donkey, Virgil అనే monkey. అడ్రస్ వెదుక్కుని వెళ్ళి కలిసిన హెన్రీకి, Taxidermist ఒక పజిల్ లా కనిపిస్తాడు. ముభావంగా ఉంటూ, ఎంతసేపూ తన నాటకానికి డైలాగులు రాయమని అడగటం తప్ప, ఇంకే విషయాలూ మాట్లాడకుండా, వింత ప్రవర్తనతో ఉన్న అతనిపై నెమ్మదిగా కొన్ని అనుమానాలూ కలుగుతాయి.  ఆ Taxidermist అసలు రూపం ఏమిటి? హెన్రీకి కలిగిన అనుమానాలు నిజమేనా అనేది కథ.  నావరకూ చాలా గందరగోళంగా అనిపించింది. పుస్తకం దాదాపు వంద పేజీలు దాటినా ఏమీ అర్ధం కాకపోయినా, ఆయన కథనం మీద ఉన్న నమ్మకంతోనూ, మొదటి పుస్తకంలోనే మాటలతో మేజిక్ చూపించడంతో, అసలు ఈయన ఏం చెప్పాలనుకుంటున్నాడో తెలుసుకోవాలని ఎంతో శ్రమపడి, వదలకుండా చదివాను.  Life of Pi లా చదివించే శక్తి చాలా తక్కువ దీనికి.

If I Get to Five: (What Children Can Teach Us about Courage and Character) - Fred Epstein 
ఒక pediatric neurosurgeon స్పైనల్ కార్డ్ ట్యూమర్స్, బ్రెయిన్ ట్యూమర్స్ ని ట్రీట్ చెయ్యడంలో నిపుణుడు. తన క్లయింట్స్ చిన్న వయసులోనే ప్రమాదకరమయిన వ్యాధి బారిన పడినవారు. వాళ్ళు చిన్నవయసులోనే చూపించిన పరిణితీ, జీవితం పట్ల ఆశతోనూ నమ్మకం తోనూ పోరాటం, వారి పరిస్థితిని అర్ధం చేసుకుని దాన్ని ధైర్యంగా స్వీకరించిన విధమూ, వారికి ఉన్న కొంచెం సమయంలోనే చూపిన స్పూర్తి, సాధించాలనుకున్న వాటిపై పట్టుదల ... ఇలాంటి ఎన్నో కథలనీ, వాటి నుండీ తనూ, తన స్టాఫ్ పొందిన స్పూర్తినీ వివరిస్తారు. కొన్ని కథలు కళ్ళు తడిపిస్తే, కొన్ని చిరునవ్వులు పూయిస్తాయి. కొందరి కథలు వారితో మనకి అనుబంధం లేకపోయినా కూడా వారిగురించి గర్వపడేలా చేస్తాయి.  అంతిమ ఫలితం కన్నా పోరాటం ముఖ్యం, ఎంతకాలం జీవించాము అన్నదానికన్నా ఎలా జీవించాము అనేది ముఖ్యం, అన్న విషయాన్ని అంత చిన్న వయసులో వారు అర్ధం చేసుకుని, తల్లిదండ్రులతోనూ డాక్టర్లతోనూ సహకరించినతీరు చెప్పుకోదగ్గది. ఈ పుస్తకానికి టైటిల్ కూడా ఒక నాలుగేళ్ల పాప ఆయనతో మాట్లాడిన మాటలోంచి వచ్చిందట.  ఆయన ఆ పాపని చెక్ చెయ్యడానికి వచ్చినపుడల్లా ‘when I get to five’ అని కాకుండా ‘If I get to Five, I do this’ అని చెప్పేదిట. తప్పక చదవాల్సిన స్పూర్తిదాయకమయిన పుస్తకం. 

Adaptations: From Short Story to Big Screen: 35 Great Stories That Have Inspired Great Films - Stephanie Harrison
కథలుగా అంతగా ప్రసిద్ధి పొందనవి, కానీ గొప్ప సినిమాలుగా రూపొందిన కథల గురించి రచయిత్రి, అవి సినిమాలుగా మారే ప్రాసెస్లో, డైరెక్టర్స్ రైటర్స్, ఏక్టర్స్ మధ్య జరిగిన డిస్కషన్స్, మార్పులూ చేర్పులూ, కొన్నిజ్ఞాపకాలతో సహా వివరిస్తారు. సినిమాల గురించీ వాటివెనుక కథల గురించీ ఇష్టం ఉన్నవారికి నచ్చే పుస్తకం. 

Things Fall Apart - Achebe, Chinua 
నైజీరియాలో Ibo తెగకి చెందిన Okonkwo అందరి మన్నన పొందిన నాయకుడు, ఎదురులేని మల్లయోధుడు, కష్టజీవి. అసమర్దుడూ, మాయమాటలతో అందరినీ ఏమార్చి రోజులు గడిపేసేటి తండ్రిని చూసి, చిన్నప్పటినుంచీ అసమర్దులని చూస్తే అసహ్యం. ఎక్కడ చిన్నచూపు చూడబడతాడో అని విపరీతమయిన భయంతో సోమరితనాన్ని, చేతకానితనాన్ని అసహ్యించుకుని దగ్గరకు రానీయడు.  ముగ్గురు భార్యలు, ఎనిమిది మంది పిల్లలు. ఎవరిదగ్గరా క్రమశిక్షణ లోపించడంగానీ, సోమరితనాన్ని క్షమించడు. ఇంట్లో అందరూ అతని మాట వినపడితేనే  గడగడలాడుతారు. బయటకి అతికఠినం గా ఉన్నా, మనసులో మాత్రం ఎక్కడో మూల సున్నితత్వం ఉంటుంది. తప్పని పరిస్థితుల్లో గ్రామ నియమాల్ని అనుసరించి, ఒక అమాయకుడైన పిల్లాడిని చంపాల్సి రావటం, తరువాత జరిగిన కొన్ని సంఘటనలతో దురదృష్టం  వెంటాడుతుంది.  దానివల్ల కొన్నేళ్ళు గ్రామ బహిష్కరణకి గురవుతాడు.  అది ముగిసి తిరిగి వూరికి చేరేసరికి మిషనరీల రాకతో మారిపోయిన పోకడలనీ, సంస్కృతినీ చూసి హతాశుడవుతాడు. ఇది ఒక మనిషి కథ. ఒక కుటుంబం కథ. వెరసి ఒక జాతి కథ. చాలా వరకూ వాళ్ళ పద్ధతులూ నమ్మకాలూ, వాడే సామెతలూ మన పల్లెటూర్ల జీవితాన్ని గుర్తుకుతెస్తాయి. The great African Trilogy అని పిలవబడే Things Fall Apart, Arrow of God  and No Longer at Ease లలో మొదటిది. A very touching and painful story, which narrated the richness of the culture and traditions of a tribe, and its fall. Absolutely great book and a must read.

To kill a mocking Bird – Harper Lee
అమెరికన్ సాహిత్యంలో క్లాసిక్స్ గా చెప్పుకొనే పుస్తకాల్లో ఇదొకటి. రచయిత్రి రాసింది ఇదొక్క పుస్తకమే అయినా, విపరీతమయన గుర్తింపు పొందినది. ఇరవయ్యో శతాబ్దం మొదట్లో అమెరికాలో దక్షిణరాష్ట్రాల్లో  వర్ణ వివక్షత, అన్యాయాలు, న్యాయం కోసం నిలబడినవారు ఎదుర్కున్న పరిస్థితులు ఒక చిన్నపిల్ల దృష్టిలో చెప్పిన కథ. దీనికి ఆధారం రచయిత్రి పదేళ్ళ పిల్లగా ఉన్నప్పుడు జరిగిన సంఘటనలే అని చెపుతారు. దీన్ని హైస్కూల్  విద్యార్ధుల చేత తప్పక చదివిస్తారు.  సాహిత్యం గురించి తెలిసిన వాళ్ళకు తప్పక తెలిసే పుస్తకం ఇది. ఇదే  పేరుతో సినిమాగా కూడా తీయబడి చాలా అవార్డులను పొందింది.

The Mouse-Proof Kitchen - Saira Shah
ఏనా, టోబీ అనే దంపతులు, ఏ ఒడిదుడుకులూ లేకుండా జీవితం సాఫీగా గడిపెయ్యాలనుకునే కోరిక ఉన్నవారు. త్వరలో తమకి పుట్టబోయే కూతురి గురించీ, తరువాత వారి జీవితం గురించీ కలలుకంటూ ఎదురుచూస్తుంటారు.  ఆ కూతురు డౌన్ సిండ్రోంతో పుట్టడం వారికి షాక్ అవుతుంది. ఆ పరిస్థితుల్లో కూతురుని వదులుకోలేక, తమతో ఉంచుకుని దినదిన గండంగా బ్రతకలేక ఆ తల్లిదండ్రుల క్షోభ, ఆ దుఃఖాన్నుంచి తప్పించుకోడానికి వారెన్నుకున్న మార్గాలు,  అవి వారి జీవితంలో తీసుకొచ్చిన అలజడులూ గురించిన కథ. కథాంశం విషాదమే అయినా, చదువరులను కేవలం విషాదమే స్పృశించకుండా, అక్కడక్కడా సున్నితమైన హాస్యమూ, కథకు సంబంధించిన మిగిలిన వివరాలతో చాలా చక్కగా వ్రాసారు. ఇది రచయిత్రి జీవితంలో జరిగిన సంఘటనల మీద ఆధారపడిన కథ. ఈ పుస్తకానికి పూర్తి పరిచయం చెదిరిన స్వప్నాల క్షతగాత్ర గానం కౌముది పత్రిక జనవరి 2014 సంచికలో చదవచ్చు.

The Boy in the Striped PajamasJohn Boyne
రెండో ప్రపంచయుద్ధ సమయంలో బెర్లిన్ నగరంలో Bruno అనే తొమ్మిదేళ్ళ అబ్బాయికి అమ్మా, నాన్న, అక్క, ఇంటినిండా పనివాళ్ళు, బయట స్నేహితులూ ...వీరందరితో చీకూ చింతాలేని బ్రతుకు. నాన్న జర్మన్ సైన్యంలో ఉన్నతాధికారి. అక్కతో పోట్లాటలూ, స్నేహితులతో ఆటలతో కాలం గడిచిపోతున్న బ్రూనోకి ఓపెద్ద కష్టం వస్తుంది. తండ్రిని హిట్లర్ ప్రత్యేకంగా కలిసి, ఒక ముఖ్యమైన బాధ్యతనీ ప్రమోషన్నీ ఇచ్చి, కమాండెంట్గా కాన్సెంట్రేషన్ కేంప్స్ కు పంపుతారు. దానితో కుటుంబం మొత్తం ఎడారుల్లోకి కేంప్ కి దగ్గరగా మారాల్సి వస్తుంది. ఇంట్లోనే చదువూ అన్నీను, స్నేహితులు కూడా ఎవరూ ఉండరు.  ఒంటరిగా విసుగెత్తిన బ్రూనో, తన గది కిటికీలోంచి గమనిస్తూ, ఇంటికి దూరంగా కనిపిస్తున్న ఫెన్స్ అవతల చారల  పైజామా వేసుకుని దాదాపు తన వయసు పిల్లాడు ఉన్నట్టు గమనిస్తాడు. అందరి కళ్ళు కప్పి ఎలానో ఆ పిల్లాడిని కలిసి స్నేహం చేసుకుంటాడు. ఒకరోజు ఆపిల్లాడి తండ్రి కనిపించడం లేదు అని తెలిసి, అతన్ని వెదకటంలో సహాయం చెయ్యడానికి, అలాంటి గీతల పైజామా వేసుకుని ఫెన్స్ దాటి లోపలికి వెళతాడు. ఆ ఫెన్స్ కి అవతల ఏం జరుగుతుంది? మాయమవుతున్నవాళ్ళు ఏమవుతున్నారు? బ్రూనో ఏమయ్యాడు? స్నేహితుడిని తండ్రిని కనుక్కోగాలిగారా? అనేవి  అసలు రహస్యాలు.  హాలోకాస్ట్ , కాన్సెంట్రేషన్ కేంప్స్ నేపధ్యంలో వాటివెనుక రహస్యాల గురించీ, వాటి ఎజెండాల గురించీ తెలీని ఓ అమాయక పసివాడి దృష్టిలో చెప్పబడిన కథ.  కథలోలా జరగడానికీ, ఎవరికీ తెలీకుండా ఒక సంవత్సరం పాటు బ్రూనో ఆ పిల్లాడిని కలుసుంటూ, అక్కడ ఏం జరుగుతోందో సూచనకూడా లేకుండా ఉండటమనేది అసాధ్యమనీ, అది చరిత్ర తెలీని చదువరులని, ముఖ్యంగా పిల్లలను తప్పుదారి పట్టించడమే అనే విమర్శలున్నాయి ఈ పుస్తకం మీద.  కానీ ఇద్దరు అమాయక  పసివాళ్ళ దృష్టికోణం లోంచి చూస్తే హృదయాన్ని బరువెక్కించే కథ. ఇది హలోకాస్ట్నీ చరిత్రనీ రిప్రేజెంట్ చేసేది కాదు. దానిమీద బేస్ చేసుకుని అల్లబడ్డ ఒక ఫిక్షన్. ఒక ఫేబుల్ అంతే. ఇదే పేరుతో సినిమాగా కూడా తీసారు.
  
Drinking Coffee Elsewhere - Packer, Z.Z
ఆఫ్రికన్ అమెరికన్ అమ్మాయిలు (ముఖ్యంగా స్కూల్ పిల్లల నుండి, యువతులు) ముఖ్య పాత్రధారులుగా, ఈ సమాజంలో వాళ్ళు మనుగడనీ, అస్తిత్వాన్ని నిలబెట్టుకోడానికి పోరాటం, వాళ్ళు ఎదుర్కొనే రకరకాల వివక్షలు, అవమానాలూ, వాటిని అధిగమించడానికి ప్రయత్నాలూ కథాంశాలుగా ఎనిమిది కథల సంకలనం. ‘Brownies’, ‘Every tongue shall confess’  అనే రెండు కథలు తప్ప మిగతావి నన్ను పెద్దగా ఆకట్టుకోలేదు. సాహిత్యంలో కొత్త గొంతనీ, వైవిధ్యమైన శైలి అనీ, పుస్తకానికి ముందున్న దాదాపు యాభై acclaims చదివీ, కాఫీ మీద నాకున్న ప్రేమతో టైటిల్ చూసి చాలా వూహించుకునీ చదివినందుకేమో, చాలా నిరాశ పడ్డాను. May be I need to give another shot at it, to better understand the pain behind it.  
  
The Facts behind the Helsinki Roccamatios - Stories by Yann Martel  
ఇవి రచయిత  Life of Pi వ్రాయడానికి  దాదాపు పదేళ్ళ ముందు వ్రాసిన కథలు.  అతని We ate the children Last  అనే కథల పుస్తకం గురించి ఎక్కడో చదివి దానికోసం వెదుకుతుంటే, ఆ పేరుకి లింక్ చేసి ఇది కళ్ళ బడింది. ఇది మార్టేల్ రచయితగా తొలినాటి కథలు. ఇది అతని రెండవ కథల పుస్తకం. 1. The Facts behind the Helsinki Roccamatios, 2. The Time I Heard the Private Donald J. Rankin String Concerto with One Discordant Violin, by the American Composer John Morton,  3. Manners of Dying, 4. The Vita Aeterna Mirror Company: Mirrors to Last till Kingdom Come  అనే నాలుగు కథలు ఉన్నాయి. వీటి గురించి ఇంకెప్పుడన్నా వివరంగా చెప్పుకోవాలి. ఎప్పటిలాగే విషయాన్ని గురించి సూక్ష్మ  పరిశీలనా, విడవకుండా చదివించే గుణం, చదివిన తర్వాత మామూలు మాటల్లో చెప్పలేని ఒక సున్నితమైన రాపిడినీ, పరిమళాన్నీ మనతో వదిలే లక్షణం ఇతని రచనలకి ముందునుంచే ఉన్నాయని మాత్రం అర్ధమయ్యింది.  This book is sure a serendipity.

 

The Raisin in the Sun – Lorraine Hansberry 

ఆఫ్రికన్ అమెరికన్ జాతి పై వివక్ష, ఒక చిన్న కుటుంబం బ్రతుకు సాగించడానికి చేసే ప్రయత్నాలు, పేదరికంలో కూడా కుటుంబ విలువలు నిలబెట్టుకోవాలనుకునే పాతతరం సంఘర్షణ, మెరుగైన జీవితం కోసం క్రొత్తతరం తపన .. వీటన్నిటినీ చాలా నేర్పుతో, పవర్ఫుల్ సంభాషణలతో సహజంగా చిత్రించిన నాటకం. ఈ పుస్తకానికి విపులమయిన పరిచయం ఇక్కడ పుస్తకం.నెట్లో ఎండలో ద్రాక్షపండు.


మంచుపూల వాన - కుప్పిలి పద్మ
ఆధునికతరపు అమ్మాయిల జీవన దృక్పధం, క్రొత్త సంస్కృతి వారి జీవితాల్లోనూ తనవనుకున్న బంధాల్లోనూ చూపిస్తున్న ప్రభావం, ఆ అనిశ్చితతో నలిగిపోయే సున్నితమనస్కులూ ఆధారంగా రాసిన పన్నెండు  కథలు. నాకు కుప్పిలి పద్మ రచనలు అంటే చిన్నప్పటినుంచీ చాలా చాలా ఇష్టం. బోలెడు ప్రేమా , కొంచెం దిగులూ, కొంచెం బాధ్యతా కలబోసుకుని జీవనసౌందర్యంతో వెలిగిపోయే అమ్మాయిలూ,  అప్పుడప్పుడూ ఇంకొంచెం సున్నితమయిన అబ్బాయిలూ, అందమయిన సాయంత్రాలు,  వెచ్చని దిగుళ్ళూ పద్మ కథల్లో వస్తువులు. ఇందులో దాదాపు అన్నికధలూ బావున్నాయి. నా ఫెవేరేట్ కథ ‘మంత్ర నగరి సరిహద్దులలో’. (ఆవిడ ఈ మధ్య రాస్తున్న కథల్లో ఆవిడ మార్క్ లేకపోవడం నాలాంటి హార్డ్ కోర్ అభిమానులకి నిరాశ కలిగించే విషయం.) 

రెండు దశాబ్దాలు (కథ 1990 -2009) – కథాసాహితి
ఎన్నిసార్లు చదివినా సరే క్రొత్తగానూ, మొదటిసారి చదువుతున్నంత పట్టుతోనూ చదివించే ముప్పయి కథలున్నాయి ఇందులో. మాయిముంత, అతడు,  అస్తిత్వానికి అటూ ఇటూ, సుజాత, తాయమ్మ కథ లాంటి అరుదైన కథలెన్నో. దేనికదే చదువుతున్నంతసేపూ, మనల్నీ అందులో భాగంగా మార్చేసుకుని, లీనం చేసుకునే కథలు. కొని దాచుకోవాల్సిన పుస్తకం. పైగా నాకు ఈ కథాసాహితి సంకలనాలంటే ప్రత్యేకమయిన ఇష్టం.

ఆకాశం – బి.వి.వి.ప్రసాద్ 
ఓ రెండేళ్ళ క్రితం ప్రసాద్ గారి హైకూలతోనూ, తర్వాతా ఆయన బ్లాగు పరిచయమయ్యాయి. ఆయన కవితల గురించి చెప్పడమే కాకుండా, ఈ పుస్తకాన్ని బహుమతిగా కూడా పంపిందో స్నేహితురాలు. సున్నితమైన భావాలతో, కొంచెం తాత్వికతా, ఆశాభావంతో కూడిన కవితలు, కొన్ని దీర్ఘమైన ఆలోచనలో ముంచితే, కొన్ని అనిర్వచనీయమయిన సంతృప్తితో పెదవుల మీదొక చిరునవ్వుని పూయిస్తాయి. ‘మానవాళికీ, జీవితానికీ నేను రాసుకొన్న ప్రేమలేఖ ఈ ఆకాశం’. అని కవి స్వయంగా చెప్పుకున్నారు. సరళమయిన కవిత్వాన్ని, అది మిగిల్చే సున్నితమయిన ప్రకంపనలనీ ఆస్వాదించగలిగే వాళ్ళకు నచ్చే పుస్తకం. దీనిమీద ఒక మంచి పరిచయాన్ని, నాకు దీన్ని పరిచయం చేసిన మానస బ్లాగు మధుమానసం లో చదవొచ్చు. 

నేను తిరిగిన దారులు – వాడ్రేవు చినవీరభద్రుడు
ఒళ్లంతా కవిత్వంతో త్రుళ్ళిపడే వచనం చినవీరభద్రుడి స్వంతం. నిజానికి నావరకూ ఆయన రచనని కవిత్వానికీ వచనానికి మధ్య విడగొడుతూ అడ్డగీత గియ్యటమనేది చాలా కష్టం. మొదటిగా ఆయన నాకు ‘నిర్వికల్ప సంగీతం’తో పరిచయం. నాకు తెలిసిన దాన్ని బట్టి ఆయన ఒక మంచి చదువరి, వక్త, భావుకుడు. వీటిని మించి ఒక philanthropist. ‘నేను తిరిగిన దారులు’ ఆయన ఇండియా టుడే లో వ్రాసిన ట్రావేలాగ్స్ అని టేగ్ తగిలించబడ్డ కొన్ని వ్యాసాలు. నిజానికి వీటిని వ్యాసాలు అనడమే మహాపాపం. కొన్ని ప్రదేశాల్లో ప్రయాణించినపుడు, అక్కడ అంతర్లీనమయన జీవనచైతన్యాన్ని అదృశ్య చేతనా శక్తినీ తనలోకి ఆవాహన చేసుకొన్న క్షణాల్లో కలిగిన భావాలూ, ఉద్వేగాలూ పొందుపరుచుకున్న పలవరింతలు. నేను ఎన్నోసార్లు దగ్గరనుంచీ చూశాననుకున్న, ఎంతో తెలుసు అనుకున్న అరకుని క్రొత్తగా పరిచయం చేసింది ఈ పుస్తకం. నాకు బాగా నచ్చినవి అరకు, శ్రీశైలం, పాపికొండలు, సాంచీ యాత్రలు.  ‘ఓ ప్రదేశాన్ని చూసినపుడు అదే మొదటిసారైనా కూడా ఎప్పుడో ఏ పురాజన్మలోనో మనం అక్కడ తిరిగినట్టూ, ఆ పరిసరాలతో మనకి అవిభక్తమైన బంధమేదో ఉన్నట్టూ, అక్కడి గాలి మనల్ని బెంగగా తడిమి కుశల ప్రశ్నలు వేస్తున్నట్టూ, మనకి ముందెప్పుడూ తెలియని ఓ మనిషి జన్మ జన్మలనుండీ మనకి తెలిసినట్టు, మన మధ్య జరుగుతున్న సంఘటనలన్నీ ఎప్పుడో వేల ఏళ్ళ క్రితమే మనకి అనుభవమయినట్టూ’  ఎప్పుడైనా అనిపిస్తే, లేదా అటువంటి అనుభూతుల మీద నమ్మకం ఉంటే, అలాంటి వారు తప్పక చదవాల్సిన పుస్తకం. లేదూ అంటే రంగురంగుల ఫోటోలతో నిండి, ఎక్కడ ఏం  కొనుక్కోవచ్చో, ఏ దారిలో వెళ్తే ప్రయాణం సుఖంగా ఉంటుందో వివరించే అచ్చమైన ట్రావేలాగ్స్ చదువుకోడం ఉత్తమమయిన పని. ఇది 2013 లో నేను చదివిన తెలుగు పుస్తకాల్లో ఉత్తమమయినది అని చెప్పగలను.

ప్రేమలేఖలు – చలం  
చలం రచనలు అర్ధం చేసుకోవాలన్నా, ఇష్టపడాలన్నా, చలం ఆలోచనా దృక్పథాన్ని అర్ధం చేసుకోవాలంటారు.  నా దృష్టిలో ప్రేమలేఖలు ఇష్టపడాలంటే చలాన్ని అర్ధం చేసుకోనక్కర్లేదు, కానీ మనిషికి ఇంకో మనిషి మీద కలిగే అవధులు లేని ప్రేమనీ, ఆ ప్రేమ అతని సమస్త ప్రపంచాన్నీ పునాదులతో కదిలించే మోహోన్మత్త జ్వలనాన్ని స్పృశించగలగాలి.  ‘ఏ బిజిలీ రాఖ్ కర్ జాయేగీ తేరే ప్యార్ కీ దునియా,   న  ఫిర్ తూ జీ సకేగా , న తుఝ్ కో  మౌత్ ఆయేగీ’.  ఆ జీవన్మృత క్షణాలు అనుభవంలోకైనా  రావాలి లేదా అర్ధంచేసుకోగలగాలి. ఈ లేఖలు చదివిన తరువాత నా ఆలోచనలు క్షమించు నేస్తం.  

మ్యూజింగ్స్- చలం
కాదేదీ ఆలోచనకనర్హం అన్నట్టు, అనేక విషయాల మీద చలం ఆలోచనల వ్యాసాలు. వ్యాసాలు అనేకన్నా, మనసులో కలిగే భావాలు ఎలా ఒక ఎజెండా లేకుండా పప్రవహిస్తూ ఉంటాయో, అలానే అక్షరాల్లో పెట్టినవి.

గీతాంజలి – చలం
మొదటగా నాకు చలం రచనలు పరిచయమయింది గీతాంజలితోనే. ఇంగ్లీష్ , కొన్ని ఇతర అనువాదాలు చదివినా ‘ది బెస్ట్’ అనువాదం మాత్రం ఇదే. అసలు చాలామంది తెలుగు వారికి చలం లేకపోతే తమకు  రవీంద్రుడు లేడని చెప్పుకున్న గొప్పదనం ఈ రచనది. చలం మిగతా రచనల మీద ఇష్టాఇష్టాలతో సంబంధం లేకుండా చదువుకోగల్గినవి పై మూడు పుస్తకాలూ.

వేలు పిళ్ళై - సి. రామచంద్రరావు
అంతర్జాతీయ స్థాయి కథలు అని విపరీతమయిన ప్రచారం పొందిన కథలు. అసలు కథలకి ఒక స్థాయి, అందులోనూ అంతర్జాతీయ స్థాయి అనేది ఎలా ఏ విషయాల మీద బేస్ చేసుకుని నిర్ణయిస్తారూ అనేది నాకెప్పుడూ అర్ధం కాదు. ఉన్న తొమ్మిది కథల్లోనూ నల్లతోలు, ఏనుగుల రాయి, గాళిదేవరు, కంపనీ లీజు, టెన్నిస్ టోర్నమెంట్  కొంచెం నచ్చిన కథలు. వేలుపిళ్లై, ఉద్యోగం , క్లబ్ నైట్ అతి మామూలు కథలు. ఇక ‘ఫాన్సీ డ్రెస్ పార్టీ’ అయితే చదవకపోయినా పరవాలేదు అనిపించింది. ఎవరినైనా ఈ మొత్తం కథల్లో వారికి నచ్చిన పాత్ర ఏదని అడిగితే వేలుపిళ్లై లోని ‘సెందామరై’ అని చెప్పడమే ఇప్పటివరకూ విన్నాను. ‘ఊరంతా ఒకదారి ఉలిపి కట్టేదొకదారి’ అనే సామెతని ఇంకో సారి నిజంచేస్తూ, నాకైతే ఆ పాత్ర అసలు నచ్చలేదు. ఆకథలో నచ్చిన పాత్ర పేరు చెప్పమంటే ‘వేలుపిళ్లై’ అనీ, మొత్తం కథల్లో చెప్పమంటే కంపెనీ లీజ్ లో సునీత, ఏనుగుల రాయిలో కడకరై అనో, లేదా గాళిదేవరులో ఏంథోనీ చిన్నప్ప అనో చెపుతాను.

శ్రీకాంత్ – శరత్
వయసుతో పాటూ మన ఆలోచనలూ, ఇష్టాయిష్టాలూ,  కొలమానాలూ, అంగీకార పరిమితులూ ఎలా మారిపోతుంటాయో నాకు అతిస్పష్టంగా రుజువు చేసిన పుస్తకం. ఎపుడో పదేళ్ళ వయసులో మొదటిసారి చదివి, అదే సమయంలో ఫరూక్ షేక్, సుజాతా మెహతా నటించిన టీవీ సీరియల్ చూసి బాగా ఇష్టం పెంచేసుకున్నాను. మళ్ళీ చదవాలని దాదాపు గత పదేళ్ళ నుండి ఎంత ప్రయత్నం చేసినా దొరకనే లేదు. లాస్ట్ ఇయర్ ఒక స్నేహితురాలు ప్రత్యేకంగా గుర్తుంచుకుని మరీ తీసుకొచ్చింది నాకోసం.  చదువుతుంటే శ్రీకాంత్ కేరక్టర్ ని అసలంటే అస్సలు భరించలేక పోయాను. ‘కమాన్ బడ్డీ, గెట్ ఏ లైఫ్’ అని ఎన్ని సార్లో విసుక్కున్నాను. అతనిని అంత పేంపర్ చేసి సోమరిని చేసిన రాజ్యలక్ష్మి మీద కూడా బలే కోపం వచ్చింది. కాకపోతే నాకు శరత్ రచనల మీద ఏ కంప్లయింటూ లేదు. 

వందేళ్ళ తెలుగు కథ – (సంకలనం) వాడ్రేవు చినవీరభద్రుడు
ఇరవయ్యో శతాబ్దంలో వచ్చిన మంచి కథల్లో నుండి ప్రతీ దశాబ్దం నుండి రెండు మూడు కథలు ఎంచుకుని, దాదాపు ముప్పయి కథలతో చేసిన సంకలనం. ఆ కథల వస్తువు, వాటి ప్రత్యేకత వివరిస్తూ,అవి ఎందుకు గొప్ప కథలయ్యాయో చెపుతూ వ్రాసిన ముందు మాటలు  బావున్నాయి. కొన్ని కథలు చలం - సుశీల, పాలగుమ్మి పద్మరాజు గాలివాన, కళ్యాణ సుందరీ జగన్నాధ్ – అలరాసపుట్టిళ్ళు, కారా – యజ్ఞం (పెద్దదవడం వల్ల ఆఖరు భాగం మాత్రమే వేసారు).  

నాన్న-నేను – బుజ్జాయి
కృష్ణశాస్త్రి గారి అబ్బాయి బుజ్జాయి రాసుకున్న స్వీయ కథ. బడి చదువులకు పోకుండా తండ్రి వెంటే తిరిగుతూ, గొప్ప గొప్ప వాళ్ళ సాంగత్యంలో పోగేసుకున్న అనుభూతుల నెమరేత. సరళంగా ఉండి ఆసక్తిగా చదివించే పుస్తకం. దీనికి ఒక పరిచయం ఇక్కడ పుస్తకం.నెట్ లో నాన్న-నేను : చిన్న పరిచయం.

కొత్తగూడెం పోరగాడికో లవ్ లెటర్ – సామాన్య
పది కథలున్న పుస్తకంలో రెండు మూడు కథలు తప్ప ఏవీ చదివిన తర్వాత కొంతకాలం గుర్తుండిపోయేవి కాదు. మహిత, పీయూ, పుష్పవర్ణమాసం (ఇది నాకు ఒక పాత కథ, బహుశా తిలక్ కథ అనుకుంటా గుర్తుకువచ్చింది.) బావున్న కథలు.

చందనపు బొమ్మ - అరుణ పప్పు
ఇది ఒక పది కథల పుస్తకం.  ఇంతకూ ముందు వేర్వేరు పత్రికల్లో చదివినవే.  కొన్ని కథలు అప్పుడప్పుడూ ఇంకోసారి చదువుకోవచ్చు. నాకు బాగా నచ్చిన కథలు ‘కరిగిపోయిన సైకత శిల్పం’, ‘ఏకాంతంలో చివరిదాకా’. అసలు నన్ను చదివించలేకపోయిన కథ ‘24×7 క్రైమ్’ (అది నా తప్పే, హాస్యరసం నా వొంటికి పడదు.) 

అతడు - నేను – కె. వరలక్ష్మి
దాదాపు ఇరవై కథలున్న ఈ పుస్తకంలో, చదివినపుడు దాదాపు అన్నీ కథలూ బానే ఉన్నాయి. కానీ మర్నాటికే ఏ ఒక్కటీ గుర్తు లేదు నాకు, పలానా కథ అని గుర్తుచేసుకోడానికి.

నన్ను చదివించలేకపోయిన పుస్తకాలు:
Guns, Germs, and Steel: The Fates of Human Societies - Jared Diamond
History and Evolution of mankind and civilizations...నాకు అంతుబట్టని, నాకు కొరుకుడు పడని టాపిక్స్ అని ఇంకోసారి ఋజువు చేసిన పుస్తకం. ఓ యాభై పేజీలు కష్టపడి చదివి ఆపై నావల్ల కాక వదిలేసాను.

హాస్యకథలు - పొత్తూరి విజయలక్ష్మి
హాస్యం అనేది నావరకూ పాలలో వెన్నలా కనిపించకుండా ఉండి, చదవగానే అప్రయత్నంగా  నవ్వు రావాలి తప్ప, నవ్వించడం కోసమనే ప్రత్యేకంగా వ్రాయడమనేది చాలా కృతకంగా అనిపిస్తుంది. ఒక్క కథ చదవడానికి ప్రయత్నించి నావల్ల కాక వదిలేసాను. మల్లిక్, యర్రంశెట్టి సాయి, పొత్తూరి .. వీళ్ళ పేర్లు చూడగానే మైలు దూరం పారిపోతాను. మళ్ళీ ఇంకోసారి ... హాస్యరసం నా వొంటికి పడదు.

వోడ్కాతో వర్మ  సిరాశ్రీ

వర్మ ఐడియాలజీకి  (అలాంటిది ఏదన్నా ఉంటే)  వీరాభిమానిని అయినప్పటికీ, అసలు ఆసక్తి కలిగించని పుస్తకం. ఇంతకన్నా మాట్లాడటం అనవసరం.