BG

Tuesday, September 3, 2013

క్షమించు నేస్తం!


అరరే... ఇలా ఎలా జరిగిందీ! అప్పుడెప్పుడో దశాబ్దాల క్రితం “నువ్వుండబట్టే ఈ ప్రపంచమింత సుందరమూ, హృదయాకర్షకమూను నాకు “ అని నువ్వంటే, ఆహా ఎంత బాగా చెప్పావు అనుకుని, కవితలూ కోట్స్ రాసుకునే డైరీ కి మాత్రమే పరిమితం చేసేసి అక్కడితో నిన్నెలా మర్చిపోయాను? అంతేగానీ నీ ప్రపంచాన్నింత ఆకర్షణీయం చేసిన వాళ్ళు “జీవితమంతా కాల్చే నిరాశా స్వప్నాలను” ఎన్ని నీలో రగిలించారో తెలుసుకోవాలని తోచనేలేదెందుకో.

ఎప్పుడో ఏ బంధాల గురించీ, ఏమాత్రమూ అవగాహన లేని రోజుల్లో నీ మైదానం చదివి, ఎలా అర్ధం చేసుకోవాలో, అసలు ఎందుకు అర్ధం చేసుకోవాలో కూడా తెలీక నిన్ను పక్కన పెట్టిన రోజులు. తరువాత కాలంలొ నువ్వెప్పుడు కనపడినా అందరూ ‘ఆహా చలమా, అందరికీ అర్ధం కాడులే’ అంటే, కామోసు అనుకుని నిన్ను ఇంకా దూరం తోసేసిన అలక్ష్యం. అప్పుడప్పుడూ ఆంధ్రా యూనివర్సిటీ లైబ్రరీ మెట్లమీద నువ్వు ఎదురయ్యి, మ్యూజింగ్స్ కూనిరాగాలు తీస్తే వినడమే తప్ప ఇంకో అడుగు ముందుకేసి నీతో పరిచయం చేసుకోవాలనే అనిపించలేదెందుకనో. నీ పక్కన రవీంద్రుడు ఉండబట్టి కానీ లేకపోతే గీతాంజలిని మాత్రం పలకరించేదాన్నా.  అసలు నిన్నెలా గుర్తు పట్టలేదు నేనూ?

ఇపుడు ఇన్నాళ్ళకి కళ్ళు తెరిచి నువ్వు ఎపుడో రాసుకున్న “ప్రేమలేఖలు” చదువుదామని విప్పానా! ముందుమాటతోనే నోట మాట రాకుండా చేసావే. నువ్వు రాసుకున్న ఒక్కో వాక్యమూ నన్ను విభ్రాంతురాలిని చేస్తే ఇలా చేష్టలుడిగి కూర్చున్నాను. ఇదుగో అపుడే మొదలయ్యింది ఓ వేదన, అరే నిన్నిన్నాళ్ళూ నేనెందుకు గుర్తు పట్టనేలేదూ అని.

జన్మమాధుర్యంలో సోలిన మన చేతుల్ని చిరునవ్వుతో విడదీసి, మేఘశయ్యల మీద ఆనించి ప్రేమగీతాలు పాడుతూ, నక్షత్ర మార్గాల వూరేగించి, ఇద్దరి మధ్యనూ అగాధమైన వ్యవధిని సృష్టించి ఈ లోకంలో వదిలారు. కనపడవు, కానీ నీవు చిరపరిచయవు. నీవున్నావనీ, నీ నుంచి విడిపడ్డాననీ, నీకోసం వెతక్కుండా ఒక్క నిమిషం నిలువలేననీ, నీవు నాకు వార్తలు పంపుతున్నావనీ, ఎక్కడ దేనినీ ప్రేమించినా నిన్నేననీ వీళ్ళకేం తెలుసు?”  అన్న నీ మాటలు చదవగానే నాకు రాబర్ట్ కింకైడ్  గుర్తొచ్చాడు.  తనేమన్నాడో తెలుసా “It's clear to me now that I have been moving toward you and you toward me for a long time. Though neither of us was aware of the other before we met, there was a kind of mindless certainty bumming blithely along beneath our ignorance that ensured we would come together. Like two solitary birds flying the great prairies by celestial reckoning, all of these years and lifetimes we have been moving toward one another.”  బావుంది కదూ.  నాకెందుకో రాబర్ట్ ని మించిన ప్రేమికుడు లేడని గొప్ప నమ్మకం ఇప్పటివరకూ. ఇపుడేమో నేనున్నానూ అంటూ నువ్వు పోటీ కొస్తున్నావ్.

నువ్వు రాసుకున్న లేఖల్లో ఒక్కో అక్షరం చదివి ఎంత కలవరపడిపోయానో తెలుసా. ఆ ఆరాటం, వేదన, తపన అన్నీ నాకు ఇష్టసఖులు కదా. అసలు నువ్వు దొంగచాటుగా నామనసులో దూరి చూసి రాసేసావేమో అని ఎంత కంగారు పడిపోయానో. నిజం చెప్పు, నాతో ఎపుడు మాట్లాడావ్ నువ్వు? లేదంటావా! మరి ఇది ఎలా సాధ్యం? నువ్వు నేను పుట్టకముందే రాసుకున్నావ్ కదూ ఇవన్నీ. హ్మ్ ... ఏమోలే, మాట్లాడే ఉంటావ్.  నేనసలే ఏ ఊర్ధ్వలోకాలకో చెందినదాన్ననీ, శాపవశాత్తూ ఇలా భూలోకంలో తిరుగుతున్నాననీ తెలుసుకదా.  ముందు జన్మలో నువ్వున్నప్పుడు కూడా ఇక్కడ పుట్టే ఉంటాను.  (జన్మాంతర మోహాలూ, పాశాలూ ఒక్క జన్మతో తీరిపోయేవా? ఎన్ని జన్మలెత్తాలో నీకు మాత్రం తెలీనిదా!)  నువ్వా నది ఒడ్డున కూర్చుని రాళ్ళు విసురుతూ నీలో నువ్వు మాట్లాడుకున్నప్పుడు, నీతో పాటూ ఆ ఒడ్డునే నేనూ కూర్చుని నా వెతలు వొలకబోసుకునే ఉంటాను. లేదా ఇద్దరం ఒకరి వ్యధలొకరు కలబోసుకుని ఉంటాం. కాదని చెప్పకు సుమా, నమ్మలేను. కానీ ఎంత ఆనందంగా ఉందో తెలుసా! ఆత్మతో వియోగాన్ని అనుభవించి, నిలువునా  తపనతో జ్వలించిన ఓ ప్రాణిని కనుగొన్న ఆనందం.

ఏమన్నావ్? “స్నేహంలో దేవత్వాని కెత్తడానికీ, విరహంలో కాలి మసై గాలిలో కలిసిపోవడానికీ దేనికైనా నీవాడిని” అని కదూ. అసలు ఈ ఒక్క వాక్యం కోసమే స్నేహం చెయ్యొచ్చు కదూ నీతో.   “నీ క్రతు హోమగుండమున నా జీవితమునే వ్రేల్చి” అన్న తిలక్ గుర్తొచ్చాడు.  “ఇంత ఒకరికొకరం దగ్గరైనా, మనసులు విప్పి ఎంత మాట్లాడుకున్నా, ఒకరి మింకొకరికి అర్ధం కాము. కానీ ఈ అర్ధం కాకపోడం వల్లనే ఈ ఆకర్షణేమో” -- విశ్వరహస్యాన్ని ఎంత సులువుగా చెప్పేసావు.

ఇంకా అదే ఆశ్చర్యం నాకు, నిన్ను ఇన్నాళ్ళూ నేనెలా గుర్తుపట్టలేదూ అని.  అవునూ నువ్వయినా నా కోసం ప్రయత్నించలేదేం? అయినా నా పిచ్చిగానీ, దేనికైనా సరైన సమయం రావాలంటావా! నిజమేలే. అపుడు నువ్వెదురైనా గుర్తుపట్టి ఉండేదాన్ని కాదేమో. నిన్నూ నీ రాతల్నీ చూసి పిచ్చివాడని నవ్వి ఉండేదాన్ని కాదూ? ఆ రాబర్ట్ మాత్రం ఎన్నిసార్లు నా పక్కనుండే ఆ ట్రక్లో తిరగలేదు?  తనని మాత్రం గుర్తుపట్టానా ఏం?
అంతేలే! జన్మాంతర మోహసమీరాలు మనసుని మొగలిపొత్తులా చుట్టుముట్టనిదే, కాంక్షా తప్త కాసారాల్లో మునకలెయ్యనిదే, వలపు మంజీరాలు ముంగిట్లో నర్తించనిదే నీ బాధను అర్ధం చేసుకోడం ఎలా సాధ్యం ఎవరికైనా?

ఇప్పటికైనా నిన్ను తెలుసుకున్నందుకు సంతోషంగా ఉంది. కానీ నా అదృష్టం యేమని చెప్పనూ. కలయికలన్నీ ఓ జీవితకాలం ఆలస్యం. సరేలే, ఎపుడో నాకీ శాపవిముక్తి కలిగిననాడు, నిన్ను ఆ లోకాల్లో కలుసుకోడానికి రాకపోను. అపుడు నీ రెండు చేతులూ దొరకపుచ్చుకుని ( ఆ చేతులతోనే కదూ ఈ లేఖలు రాసింది ) నిన్ను ఆలస్యంగా గుర్తించినందుకు “క్షమించు నేస్తం” అని అడుగుతాను. అప్పటి వరకూ ఈ లేఖల సాక్షిగా మనం మిత్రులం. సరేనా. 

17 comments:

  1. .......... Great! Interest kaligincharu.chaduvutanu.

    ReplyDelete
  2. nice presentation and the feel carried until end.... good one..

    ReplyDelete
  3. 'చలం' గురించి చలం స్థాయిలో రాసిన అద్భుతమైన జ్ఞాపకం ఇది! మీకు మీరే సాటి పద్దమ్మగారు! :)

    ReplyDelete
  4. చాలా చాలా బాగా రాశారు..:-)

    ReplyDelete
  5. "జన్మాంతర మోహసమీరాలు మనసుని మొగలిపొత్తులా చుట్టనిదే,కాంక్షా తప్త కాసారాల్లో మునకలెయ్యనిదే,వలపు మంజీరలు ముంగిట్లో నర్తించనిదే నీ బాధను అర్ధం చేసుకోడం ఎలా సాధ్యం ఎవరికయినా?"

    అద్భుతం,కొన్ని బ్రాండ్ ఇమేజస్ లాగా ఇది మీ బ్రాండ్ పోస్టంతే

    ReplyDelete
  6. వావ్ పద్మగారూ. ఇక మాట్లలేవ్ అంతే. చలాన్ని సజీవంగా చిత్రించారు.

    ReplyDelete
  7. ఇక 'అసలుది' చదవనవసరంలేదేమో అన్నంత బాగా రాసారు ...simply superb

    ReplyDelete
  8. Chaala chaala bagundi padamati koyila garu. :-)

    ReplyDelete
  9. Very interesting...great feel.

    ReplyDelete
  10. Very interesting about my fav writings...
    Great feel.

    ReplyDelete
  11. వావ్ చాలా బాగా రాశారు పద్మగారు.

    ReplyDelete
  12. ఒకే చలం.. ఎంతమందిని మోహకాసారాల్లో మునకలేయిస్తాడో!! నామటుకు నాకు చలం రచనల్లో ప్రేమలేఖల తరువాతే ఏదైనా..

    ఒక్కటి మాత్రం చెప్పగలను. ఈ పోస్ట్ రాసేముందు మీరెలా ఉండిఉంటారో.. నాకు బాగా అర్ధమవుతుంది. Welcome to the club! (మీకు నచ్చకపోయినా సరే, క్లబ్ లో ఉన్నారింకా.. :))

    ReplyDelete
  13. చాలా బాగా వ్రాసారండి. చలం ని గుర్తుచేస్తే, చిన్న నాటి స్నేహితుణ్ణి గుర్తు చేసినట్లే. Thank You!!

    ReplyDelete
  14. ఈ పోస్టుని మెచ్చిన అందరికీ ధన్యవాదాలు.

    నాకు చలం గురించి ఏమీ తెలియదు. ఇప్పుడిప్పుడే అసలైన చలంతో పరిచయం చేసుకుంటున్నాను. అర్ధం చేసుకోడం తెలీని వయసులో మైదానాన్ని, అర్ధమయ్యే వయసులో ఇంకో రెండు మూడు రచనలు చదివినా అవన్నీ కేవలం కాలక్షేపం కోసమే. అవేవీ చలం మీద ఇష్టం తోనో, ఆరాధనతోనో చదివినవి కాదు. వాటికి ఇప్పటికీ నాదృష్టిలో ఉన్న అభిప్రాయం అదే. అవి కాకుండా కావాలని చదివినవి మాత్రం గీతాంజలి, పురూరవ, కొంచెం కొంచెంగా మ్యూజింగ్స్. ప్రేమలేఖలు కూడా అక్కడక్కడా చదవడమే తప్ప, పూర్తిగా చదివే అవకాశమూ, చదవాలన్న ఆలోచనా ఇప్పటి వరకూ రాలేదు నాకు. అందుకని నాకు చలం శైలీ, స్థాయీ ఏంటో కూడా తెలీవు. చలంతో జ్ఞాపకాలూ లేవు. ఇదుగో అసలయిన చలాన్ని, నాకూ నచ్చే చలాన్ని చూసింది ఇపుడే. ఆ ప్రయాణం మొదలయ్యిందీ ఇక్కడినుండే. చలం నుంచి నేను దొరకబుచ్చుకున్నదేమయినా ఉందీ అంటే, అది ఇదుగో ఈ “దొరకబుచ్చుకుని” అన్న పదమొకటే. ఎందుకో బాగా నచ్చింది.

    యధాలాపంగా పుస్తకం తెరిచి చదవడం మొదలుపెట్టగానే, ముందుమాటలో కొన్ని ఇంతకు ముందే తెలిసిన వాక్యాలు చదివి మళ్ళీ ఆహా అనుకుని, ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే ఒక్కసారి తడబడి , ముందుకు పడి, నిలదొక్కుకుని... అక్కడి నుండి పడుతూ లేస్తూ, ఇంకా చెప్పాలంటే శ్రీశ్రీ భాషలో నిబిడాశ్చర్యంతో కొట్టుకుపోతూ, సంభ్రమంతో నివ్వెర పోతూ, నిట్టూర్పులు విడుస్తూ...వాక్యవాక్యానికీ Gosh..నువ్వు కూడానా అనుకుంటూ ...అలా ఇహపరాలు తెలీక షాక్ కి లోనైన స్థితిలో, ఆ స్థితిలో కలిగిన ఒత్తిడిని భరించలేక దాన్ని తేలికచేసుకునే ప్రయత్నంలో రాసుకున్నది , ఇంకా చెప్పాలంటే ఒకరకమైన ఎమోషనల్ డంప్ ఇది.

    ఓ నేస్తం చెప్పింది, "ఏదైనా చదివి బాగుంది అనుకోవటం వేరు, దాన్ని వోన్ చేసుకోవడం వేరు" అని. అలా నేనీ ప్రేమలేఖలని వోన్ చేసుకున్నాను. ఇంకా ఇంకా చెప్పాలంటే అచ్చంగా నావయిన కొన్ని ఆలోచనల్ని, ఆరాటాలని ఎపుడో ఎనభయ్ ఏళ్ళ క్రితం ఆ గడ్డపాయిన వోన్ చేసుకోవడం చూసి తట్టుకోలేకపోయాను. అంతే కధ.

    ReplyDelete
  15. బావుంది !

    సరే ఇదే చలం గారు రమణ మహర్షి ఆశ్రమం లో కూర్చిని కూడా ఏవో రాసారు కదా వాటి గురించి కూడా మీ మాటల్లో వినాలని ఉంది :-))))) అంటే కొంతమంది అసలు చలం అప్పుడు రచయితా కాదు అవి రచనలూ కానే కావు అంటారు కానీ నేనొప్పుకోను ! ( హ హ కంగారు పడకండీ , ఆ బావుంది తరవాత రాసింది సరదాకి , మీ పోస్ట్ బావుంది )

    ReplyDelete