సారంగ పత్రికలో మొదటి ప్రచురణ, తెలుగు కథ - 2016: విమర్శలను సహించలేని రచయితలు
నేను సాధారణంగా కథలు సారంగ, వాకిలి, ఈమాట, కౌముది, ఈనాడు ఆన్లైన్ పత్రికలలోనూ, కొన్ని బ్లాగుల్లో వచ్చినవీ చదువుతాను. అప్పుడప్పుడూ ఎవరైనా షేర్ చేసినపుడు నవ్య, ఆంధ్రజ్యోతి, సాక్షి మొదలైన ఆన్లైన్ పత్రికల్లోనూ చదువుతాను. నాకు ప్రింట్ పత్రికలు చదివే అవకాశం లేదు. అపరాధ పరిశోధనలు, హాస్యం, సైన్స్ ఫిక్షన్ నేను దూరంగా ఉండే అంశాలు కాబట్టి ఆ కథలు కూడా నేను చదివిన వాటిలో ఉండవు. నా ఈ అభిప్రాయాలు నేను చదివిన కొన్ని కథల మీద ఆధారపడి మాత్రమే తప్ప సంవత్సరం మొత్తంలో వచ్చిన కథలన్నిటి మీదా ఎంత మాత్రమూ కాదు. అలానే రచయితల మీద నా అభిప్రాయాలు కూడా అందరు రచయితలకూ చెందవు. నా అభిప్రాయాలు గత నాలుగైదేళ్ళుగా నేను గమనిస్తున్న వాటి మీద ఆధారపడినవి.
కథ అంటే సమాజానికి సందేశాన్నివ్వాలీ, సమస్యకి పరిష్కారం చూపించితీరాలీ లాంటి భ్రమలేమీ నాకు లేవు. నేనో సాధారణ పాఠకురాలిని. మంచి కథ అంటే నా దృష్టిలో, అది ముందు నన్ను పూర్తిగా చదివించగలగాలి. భాషా, శైలీ బావుండాలి. కథ పరిధులు దాటి వ్యాసాలుగా మారకూడదు. ఇవీ నాకు ఓ కథ నచ్చడానికి ఉండాల్సిన కనీస లక్షణాలు. ముఖ్యంగా చదివిన తరువాత అది చదవడానికి పెట్టిన నా సమయం వృధా అనిపించకూడదు.
1. 2016లో వచ్చిన కథల పై వస్తు పరంగా, శిల్ప పరం గా మీ అభిప్రాయాలు -
కథలు చాలానే ఉన్నా, చదివించగలివినవి గుప్పెడు కూడా లేవని చెప్పొచ్చు. మంచి కథ నాలుగు కాలాలు నిలుస్తుంది అనేవారు, అయితే వీటిలో చదివిన తరువాత నాలుగు రోజులు కూడా గుర్తుండే కథ ఏదీ లేదనే చెపుతాను. చాలామంది కొత్త రచయితలూ కనిపించారు. ఇప్పుడొస్తున్న కథల్లో ఏదో చెప్పాలన్న తాపత్రయం తప్ప, ఎలా చెప్పొచ్చో తెల్సినదనం తక్కువ. చాలా కథలు వస్తుపరిధి దాటి విస్తరించి, వ్యాసాల్లా తయారయి పూర్తిగా చదివించకుండానే మిగిలిపోయాయి. కొన్నిటి శైలి చిరాకు తెప్పిస్తే, కొన్నిటి కథాంశాలే విసుగెత్తించాయి.
ముఖ్యంగా నేను గమనించిందీ, నన్ను బాగా విసిగించి చాలా కథలను పూర్తిగా చదవకుండా చేసినదీ భాష. కథకు అవసరమున్నా లేకున్నా మాండలికం ఉపయోగించడం అనేది ఒక ఫాషన్ అయినట్టుంది. మాండలికం వాడటం తప్పు అని నేను అనడం లేదు, కానీ వ్రాస్తున్న దాని మీద శ్రద్ధ పెట్టడం అవసరం. ఒక పాత్ర చేత ఓ యాస మాట్లాడిస్తే, మొత్తం కథంతా అదే కంటిన్యూ అవ్వాలి. అలా కాకుండా హటాత్తుగా కొన్ని వాక్యాలు మామూలు భాషలో యాస లేకుండా మాట్లాడేస్తాయి. రచయిత నేరేట్ చేసే భాగాలలో కూడా అంతే. కొంతసేపు యాస, కొంత సేపు మామూలు భాష. చదువుతుంటే అయోమయం, అసహనం కలిగించాయి. కాస్త పేరున్న రచయితల నుండీ క్రొత్త రచయితల వరకూ ఇది సాగింది. ఈ రకం కథల్లో శ్రద్ధగా వ్రాసినవి నాకు తెలిసి రెండు. ఒకటి జూపాక సుభద్ర ‘కంపనవడ్డ కాళ్ళు’, సాయి యోగి వ్రాసిన ‘ఖుష్బూ’. (ఇది ఈయన మొదటి కథ అని చెప్పుకున్నట్టు గుర్తు.)
చిరాకు కలిగించిన ఇంకో విషయం, చాలా కథలు ఎడిటింగ్ అంటూ ఒకటి ఉంటుందన్నసంగతి రచయితలు మర్చిపోయినట్టు ఉండటం. వాక్యాల్లో తప్పులు, అర్ధం పొసగని వాక్యాలు. కనీసం ఓ రెండు సార్లయినా శ్రద్ధగా తన కథని చదువుకుంటే తమకే తెలిసే తప్పులు ఎన్నో. ఇలాంటివి కథను పూర్తిగా చదివించడంలో విఫలమవుతాయి.
మొత్తం మీద కథలు పెద్దగా సంతృప్తిని కలిగించలేదు. మంచి కథలు రాయగలిగిన వారి నుండి కూడా ఈసారి వచ్చిన కథలు నిరాశనే మిగిల్చాయి.
2. మీకు నచ్చిన లేదా నచ్చని కథల గురించి కొంచెం వివరంగా -
ఎన్నెలో ఎన్నెలా - అట్టాడ అప్పలనాయుడు (సారంగ): రోహిత్ మరణం నేపథ్యంలో నేను చదివిన వాటిలో, అతి నాటకీయత లేకుండా, గాడి తప్పకుండా, నన్ను పూర్తిగా చదివించగలిగిన ఒకే ఒక్క కథ.
బౌండరీ దాటిన బాలు – మధు పెమ్మరాజు (వాకిలి): ప్రతి ఒక్కరి బాల్యంలోనూ ఇలాంటి సంఘటన కనీసం ఒకటయినా ఉండే ఉంటుంది. నాస్టాల్జిక్ కార్నర్స్ ని టచ్ చేసిన కథ. చక్కటి కథనం.
ఏం జీవితం – చంద్ర కన్నెగంటి (ఈమాట): ఒక మనిషి జీవితంలోని వర్ణాలను, సరళమైన భాషలో, చక్కని వచనంతో చూపించిన కథ.
ద్వారబంధం – మైథిలి అబ్బరాజు (ఆంధ్రప్రదేశ్ పత్రిక): ఫీల్ గుడ్ స్టోరీ అంటాను దీన్ని. చక్కని వచనం మైథిలి గారి స్వంతం. ఈ కథ చదవగానే నాకెందుకో కళ్యాణ సుందరీ జగన్నాథ్ కథలు గుర్తుకు వచ్చాయి.
హృదయం ఇక్కడే ఉంది – ఆర్. దమయంతి (ఈమాట): తప్పులు లేకుండా, మంచి శైలిలో, క్లుప్తంగా అవసరమైనంత వరకూ మాత్రమే చెప్పడం తెలిసిన వారిలో దమయంతి గారు ఒకరు. ఇది ఇంకో ఫీల్ గుడ్ స్టోరీ.
డీహ్యూమనైజేషన్ – దేశరాజు (సారంగ): ఇది కూడా అతి తక్కువ నాటకీయతతో, ప్రస్తుత సామాజిక పరిస్థితుల మీద వచ్చిన సున్నితమైన సెటైర్.
నచ్చిన ఇంకొన్ని కథలు - బ్లాక్ ఇంక్ – సాంత్వన చీమలమర్రి (సారంగ), కొన్ని ముగింపులు – చంద్ర కన్నెగంటి (సారంగ), సుచిత్ర చెప్పిన కథ – కొత్తావకాయ (బ్లాగ్), అద్భుతం – అరిపిరాల సత్యప్రసాద్ (వాకిలి), కంపనవడ్డ కాళ్ళు – జూపాక సుభద్ర (సారంగ), కొంచెం గెడ్డపు నురగ, ఒక కత్తి గాటు - ఉణుదుర్తి సుధాకర్ (సారంగ?), గంగమ్మే బెదరిపోయే – ఎండపల్లి భారతి (వాకిలి), సంసారంలో సరిగమలు – తమస్విని (కౌముది), డాక్టర్ చెప్పిన కథలు – చందు శైలజ (కౌముది)
3. మీ దృష్టికి వచ్చిన కొత్త కథకులు -
మధు పెమ్మరాజు, సాంత్వన చీమలమర్రి, ఎండపల్లి భారతి. సాంత్వన రచనా శైలి బావుంటుంది. భారతి గారు ‘మావూరి ముచ్చట’ శీర్షికన వాకిలిలో వ్రాసిన కథానికలు మంచి మాండలికంతో శ్రద్ధగా వ్రాసినట్టు ఉంటాయి. ఉణుదుర్తి సుధాకర్ గారి రెండు కథల్లో కూడా కథనం బావుంది. ఆయన పేరు వినడం ఇదే మొదటిసారి నాకు.
4. తెలుగు కథా సాహిత్యం లో 2016 లో వచ్చిన కథలు ఎలాంటి మార్పులని సూచిస్తున్నాయి? వ్యక్తిగతంగా, సాంఘికంగా, అంతర్జాతీయంగా వస్తున్న మార్పులని తెలుగు కథలు ఏమైనా స్పృశించ గలిగాయా?
సమాజంలో వస్తున్న మార్పులని స్పృశించే ప్రయత్నం అయితే జరిగింది. అయితే సమస్యకు సహజంగా స్పందించి కాకుండా, మేమూ ఏదో చెప్పాలన్న ఆత్రుతతో వ్రాస్తున్నట్టుగా ఉంటున్నాయి. మధ్యలో వాదాలూ, కులాలు ప్రాముఖ్యం సంపాదించుకుని, అసలు సమస్యను వదిలి ఎక్కడికో పోతాయి. వెరసి చాలావరకు విసుగు కలిగించే వ్యాసాలుగా మిగిలిపోతున్నాయి. నిజానికి ఎక్కడన్నా ఏదన్నా జరిగింది అంటే భయం వేస్తుంది, ఆ తర్వాత తెచ్చిపెట్టుకున్న ఉద్వేగాలతో వెల్లువలా వచ్చే పసలేని కథలూ, కవితలూ చూడాల్సి వస్తుందని. అసలు కష్టాన్ని మించిన కష్టం ఇది ఒక్కోసారి నాకు.
5. మంచి కథలు మీరు ఎక్కువగా ఎక్కడ చదువుతున్నారు?
ఇక్కడా అని చెప్పడం కష్టం. ప్రతీ చోటా నచ్చినవీ ఉంటున్నాయి, నచ్చనివీ ఉంటున్నాయి. అయితే ఎక్కువ నాసిరకపు కథలు ఈనాడులో వస్తున్నాయని మాత్రం అనిపిస్తుంది.
6. కథావిమర్శ-2016 మీకు తృప్తినిచ్చిందా?
కథా విమర్శా? అంటే ఏమిటీ, ఎక్కడుందీ అని అడగాలని ఉంది. నావరకూ నాకు మంచి కథలు రాకపోవడం కన్నా, మంచి విమర్శ లేకపోవడమే ఎక్కువ అసంతృప్తిగా ఉంటుంది. కథలను కాకుండా రచయితలను విమర్శించడం/పొగడటం రానూ రానూ ఎక్కువయి, నిజమైన విమర్శ అనేది మాయం అయిపోయింది. ఈ సందర్భంగా కొన్ని విషయాలు చెప్పాలి. ఒకటో రెండో మంచి కథలు వ్రాయగానే, ఇక వాళ్ళు ఏం వ్రాసినా (అది ఎంత నాసిరకంగా ఉన్నప్పటికీ) అద్భుతంగా ఉందనీ, వాళ్లు తప్ప ఇంకొకరు అలా వ్రాయలేరనీ ఆకాశానికి ఎత్తెయ్యడం. ఇక సోషల్ నెట్వర్క్ లో గ్రూపులు. గ్రూపులో ఒకరు ఏదైనా వ్రాస్తే, అది ఎలా ఉన్నా సరే మిగిలిన వాళ్ళు భట్రాజులను మించిపోతూ పొగడ్తలు. ఎవరి రాతలైనా నచ్చలేదని ఎవరైనా అన్నారో, అందరూ కలిసి సామూహకంగా అన్నవాళ్ళని టేస్ట్ తెలీని వాళ్ళనీ, అహంకారులనీ ముద్రలు వేసెయ్యడం. సోషల్ మీడియాలో రచయితల ఇన్వాల్వ్మెంట్ పెరిగాక ఈ ధోరణి ఇంకా ఎక్కువయిపోయింది.
ఇప్పటి రచయితల్లో పొగడ్తలు తప్ప, విమర్శలు సమన్వయంతో తీసుకునే వాళ్ళు దాదాపు లేరనే చెప్పాలి. పొగిడినంత సేపూ సంతోషం. ఎప్పుడన్నా ఎవరైనా ఒకటి నచ్చలేదు అంటే, అక్కడి నుండీ రాజకీయాలు మొదలు. తన కథలోని లోపాలను సహేతుకంగా చూపినందుకు ఒకరిని, ‘వాచాలత్వం, ప్రేలుడూ, అహంకారం’ అంటూ రభస చేసిన వారొకరు. విశ్లేషణలో తన కథను తను అనుకున్నట్టుగా పొగిడి ఆకాశానికి ఎత్తకుండా విమర్శించినందుకు, వేరొకరు ఫేస్బుక్ లో నడిపిన నాటకాలూ, అస్మదీయుల ఓదార్పులూ. ఇలాంటివి చూస్తూ ఎవరైనా కూడా సరైన విమర్శ చెయ్యాలన్నా వెనుకాడతారు. కొద్దో గొప్పో రచనలు చేసిన వారి నుండి, చెయ్యి తిరిగిన రచయితలు అనిపించుకున్న వాళ్ళ వరకూ, దాదాపు అందరిలోనూ విమర్శల పట్ల ఇదే అసహనం.
అయితే ఈ సందర్భంలో చెప్పవల్సినది ఒకటి ఉంది. దీనికి భిన్నంగా ఓ రెండేళ్ళ క్రితం, ‘అపర్ణ తోట’ తన కథపై వాకిలిలో ఎంతో ఘాటైన విమర్శలు వచ్చినా, సంయమనంతో, హుందాగా ప్రవర్తించడం అభినందనీయం.
చాలాసార్లు కథ మీద చర్చలు పక్కదారి పట్టి, అస్తిత్వాలు, ఇజాలు, పరస్పర దూషణలతో నిండిపోతున్నాయి. కథకు సంబంధించి వాఖ్యానించడానికి కూడా ఇక మరెవరూ అక్కడ అడుగు పెట్టే సాహసం చెయ్యరు. ఇక విమర్శలు చెయ్యడానికి ఎవరు ముందుకొస్తారు?
7. కథాసంకలనాలు తెలుగు కథా ప్రయాణానికి ఏవిధంగా దోహద పడుతున్నాయి?
నావరకూ కథల సంకలనాలు అవసరమనే అనిపిస్తుంది. వాటిల్లో అన్నీ మంచి కథలే ఉంటాయని కాదు. వీటి వల్ల చదవని క్రొత్త కథలు చదివే అవకాశం వస్తుంది. అలానే ఎక్కడెక్కడో చదివిన కథలు మళ్ళీ మళ్ళీ కావల్సినపుడల్లా చదువుకునే వీలుంటుంది. కథాసాహితి సంకలనాల వల్ల నేను ఇంతకు ముందు చదవలేకపోయిన ఎన్నో మంచి కథలు చదవగలిగాను. మళ్ళీ మళ్ళీ చదువుకోగలుగుతున్నాను. అలాగే రచయితల కథల సంకలనాలు కూడా అవసరమనే అనిపిస్తుంది. ఒక్కోసారి ఏదైనా కథ నచ్చినపుడు ఆ రచయితవి మిగిలిన కథలు కూడా చదవాలనిపిస్తుంది. అలాంటప్పుడు ఈ సంకలనాలే అక్కరకు వస్తాయి.
8. మీరు చదువుతున్న ఇతర భాషల కథలకు, తెలుగు కథలకు తేడా కనిపిస్తోందా? అయితే అది ఎలాంటి తేడా?
నేను సాధారణంగా ఇంగ్లీష్, అదీ కూడా ఎక్కువగా నవలలే చదువుతాను. నవలకు స్కోప్ ఎక్కువగా ఉంటుంది కథ కన్నా. కాబట్టి వాటితో తెలుగు కథలను పోల్చలేను. ఇతర భాషల కథల అనువాదాలు శారద గారు, కొల్లూరి సోమశంకర్ గారు, ఇంకొందరు చేసినవీ కొన్ని చదివాను, అయితే వాటి మూల కథలు ఎప్పుడో వ్రాసినవి కాబట్టి, వాటితో పోల్చడం కూడా సరైనది కాదు అనుకుంటున్నాను. అయితే ఒక్కటి మాత్రం చెప్పగలను, అవి ఎప్పటివైనా సరే వాటిలో క్లుప్తత, హద్దులు దాటని నాటకీయత, వస్తు వైవిధ్యం ఉన్నాయి. నీతిసూత్రాలు, ఉపన్యాసాలు దాదాపు లేవనే చెప్పాలి.