BG

Friday, May 11, 2018

అంటరాని వసంతం

మిన్నూ పానుపుమీద 
దూదీ దుప్పటి పైన 
సుక్కాల పూల గుత్తి సూబద్రా 
నువ్వు పచ్చి పగడానివే సూబద్రా

చదవాలని ఎన్నో ఏళ్ళ కోరిక, ఇప్పటికి తీరింది. ఎన్నోసార్లు, కొనాలని ఎంత వెదికినా దొరకలేదు. ఇప్పుడు ఓ నేస్తం వల్ల కోరిక తీరింది. అత్తారుబత్తెంగా పుస్తకాన్ని తెచ్చి చేతిలో పెట్టిన పూలగుత్తి లాంటి పిల్ల చేతిని ముద్దాడటం మర్చిపోయానే అని మనసు పీకుతోంది.

ఎంత అందమయిన మనుషులు! పాటెల్లడు, మాతయ్య, శివయ్య, అందమయిన అంటరానివాడు రూబేను, అద్భుతంలో కలిసిన ఇమ్మాన్యుయేలు, పొన్నంగి పిట్ట జెస్సీ... భూదేవి, చుక్కల ముగ్గుకర్ర సుభద్ర, శశిరేఖ, ఎన్నెల పిట్ట రూతు, మేరీ సువార్త, రూబీ...

ఈ అందరినీ కలుపుతూ అంతర్లీనంగా సూబద్ర (సుభద్ర).  ఎట్టాంటి సూబద్ర. పాలపుంతలోని ఎన్నెల గువ్వ. పూదండలో దారంలా ఎల్లడి పాటలో ఒదిగిపోయిన సూబద్ర. ఎన్నెలదిన్ని చుక్కల ముగ్గుకర్ర సూబద్ర. ఎదురుచూపులే బతుకయిన సూబద్ర. నీళ్ళ కాల్వ కట్టు తెంచి, పారెత్తి నిలబడిన సూబద్ర. 'ఎట్టా ఉందీ అత్త' అని శశిరేఖని ముద్దుచేసిన సూబద్ర. 'ఆ బిడ్డనిట్టా ఇయ్యి' అని భర్తని ఒళ్లోకి తీసుకున్న సూబద్ర . కళ్ళు తెరిస్తే సూబద్ర. కళ్ళు మూస్తే సూబద్ర.

చదవడం ముగిసిన తర్వాత ఇంకేమీ ఆలోచించడానికీ, చెయ్యడానికీ చాతకాని స్తబ్దత మనసుని నింపేసింది. విచారమా అంటే, పూర్తిగా కాదు. తొందరగా మనల్ని వదలలేని పాత్రలు, జీవితాలు ... వెరసి ఓ వసంతం, అంటరానిదయితేనేం.

వివక్ష, దౌర్జన్యం, అస్తిత్వం కోసం పోరాటం .. వీటిని వెగటు కలగకుండా, ఆలోచింపచేసేలా రాసిన వాటిలో, తెలుగులో నేను చదివినది చిల్లర దేవుళ్ళు తర్వాత ఇదే. చాలామంది రూట్స్ లానే అన్నారు గానీ, తరాల వెదుకులాట తప్ప నాకు ఇంకేం పోలిక కనిపించలేదు. దేని దారి దానిదే.


ఆపకుండా చదివించే సరళమయిన, అందమయిన వచనం. లిరికల్ పోయెట్రీ అంటారేం, ఇదే&అది. ఇదే అది.

పుస్తకం పూర్తవగానే అప్రయత్నంగా నాకు “బావరా మన్ దేఖనే చలా ఏక్ సపనా “ పాట గుర్తుకొచ్చింది.


సూబద్రయినవే
సూరు కింద నీరు సిట్టేలికతాగే
సూబద్రయినవే
మబ్బూలేని సోట వానెట్టకురిసే ...

**********************

“ఎన్నెలదిన్ని మాలా మాదిగల యిళ్ళల్లో ఉట్టి మీద మీగడ లేదు. వెన్నముద్దలు లేవు. వుంటే ఎండుచాపలుంటాయి. అంతగా కాకపోతే ఎండొరిక లుంటాయి. వాటి కోసం ఏ బాలగోపాలుడు రాడు. వాడిని అంతా సుకుమారంగా నాట్యంలో కొడుతో సరిగమల్లో తిడుతో విన్నావా యశోదమ్మా అని అంటే వినేందుకు యశోదమ్మలు లేరు. ఎన్నెలదిన్ని యశోదత్త ఆ సమయాన తన బిడ్డపైన అందమైన, అతి సుకుమారమైన, రాగయుక్తమైన ఫిర్యాదు వస్తుందని ఆరుబయట ఎదురు చూస్తూ కూర్చోదు. కూరసట్లోకి యిసుకదూసరాకు కోస్తూ వుంటుంది. కాకపోతే తనది కాని పొలంలో నారు పీకుతూ వుంటుంది. ఆ పూట యింత సంకటి ముద్దకి భూమంతా వెతుకుతుంటుంది. అంతా అన్వేషణే. అంతా పోరాటమే. ఆ యశోదకి బాలగోపాలుడు నోరు తెరిస్తే భూమండలమంతా కనిపిస్తుంది. ఆ యశోద విస్తుపోతుంది. కానీ ఈ యశోదత్త బిడ్డ నోరు తెరిస్తే ఆకలి కనిపిస్తుంది. విస్తుపోదు. ఏడుస్తుంది. ... ”

“ఎంత ద్రోహం చేసింది ఈ సాహిత్యం బిడ్డ పాత్రకి. ఎంత అసహజంగా, ఎంత కృత్రిమంగా మలిచింది. తల్లి పాత్రకి అంత ద్రోహం చెయ్యొచ్చా ...”

***********************

పక్కనే రొద చేస్తూ వెన్నెల పిట్ట దూసుకుపోయింది. ఎల్లన్నకి నవ్వొచ్చింది.
“విను దాని రొద”
“ఏం వినిపిస్తుంది దాని రొదలో నీకు”
“అంటరాని వాడి గుండె గొంతుక”
“గుండె గొంతుక! ఎట్టా అల్లావు ఆ పదాన్ని”
“నేను కాదు బతుకు. బతుకు అల్లింది. కాదూ? బతుకు అల్లిన అల్లిక కాదూ?


**************************

“తన బిడ్డ ఇమ్మాన్యుయేలు. భూమితో మాట్లాడి ఉంటాడు. ఏం చెప్పి ఉంటుంది భూమి. బోలెడు రహస్యాలు చెప్పి ఉంటుంది. నిత్యం తనని నమ్ముకుని తనని సొంతం చేసుకోలేని తన బిడ్డల కథలు చెప్పి ఉంటుంది. కల్లాం గింజల బతుకులు చెప్పి ఉంటుంది. ... ఈ నేల మీది ఇంతెత్తు నెత్తుటి చారిక చూపి ఉంటుంది. తన గుండె పొరల్లో ఇంకిన పేదల చెమటని పరిచయం చేసి ఉంటుంది. ఎంత పొర్లినా ఇంత మట్టి వాళ్ళకి దక్కలా. రాత్రి పగలు తనని పెనవేసుకుని బతికినా వాళ్ళ వంటికి ఇంత మట్టి అంటలా. చూసావురా బిడ్డా అని చెప్పి ఉంటుంది. “


“ఎట్టాంటివాడు తన బిడ్డ. చాలా మెతక. జాలి గుండె. వర్షించే కళ్ళు. స్పందించే గుండె. మండే నెత్తురు. మొత్తంగా గొప్ప ప్రేమికుడు. ఓ అందమైన అద్భుతమైన ప్రేమికుడు. ఏడ్చుంటాడు. బిడ్డ ఏడ్చుంటాడు. భూమి తల్లిని వాటేసుకుని, చిన్నప్పుడు పాల కోసం తన్ని వాటేసుకుని ఏడ్చినట్టు. కన్నీళ్ళ రాత్రులు గడిపి ఉంటాడు. అట్టా పడి ఉంటుంది తన బిడ్ద అడుగు శ్రీకాకుళం వైపు. ప్రేమికులంతా అంతే కావచ్చు. పోరాటం వైపే నడుస్తారు కావొచ్చు. ప్రేమించడం చాతైన వాళ్ళంతా అంతే కావచ్చు.“


నోట్: పుస్తకం pdf ఆన్లైన్లో ఉంది. వెదకుడి. దొరుకును.