BG

Friday, October 31, 2014

The Buddha in the Attic

కలలు కనడం మనసుకి పుట్టుకతోనే అబ్బిన లక్షణం. అయితే అన్నిసార్లూ అందరి కలలూ నిజం కావు. వాస్తవంలో కాస్త అటూఇటూ అయినప్పటికీ, దొరికిన వాటితో సర్దుకుపోడానికే ఎక్కువమంది ప్రయత్నిస్తారు. అయితే ఆ జీవితం అలా సాఫీగా సాగిపోతే చిక్కేలేదు.

కలలు కల్లలు కావటమే కాకుండా, మొత్తానికి జీవితమే దగాపడి, కలలు కనే మనసు జీవం కోల్పోయి, అస్తిత్వాలు ప్రశ్నించబడి, మూలాలు మూలనబడి, విశ్వాసాలు శంకించబడి, సర్వం పోగోట్టుకున్న స్థితి వస్తే, అసలు బ్రతుకంటూ మిగలకపోతే  ఏం చెయ్యాలి? ఎవరిని నిందించాలి? మనది కాని చోట మన అస్తిత్వాన్ని మాయం చేసి, మన లాయల్టీని అనుమానిస్తే ఏం చెయ్యగలుగుతాం? ఎలా ఋజువు చేసుకోగలుగుతాం?

అమెరికాలో మెరుగైన జీవితం మీద ఆశతో పిక్చర్ బ్రైడ్స్ గా జపాన్ నుండి వచ్చిన వేలమంది అమ్మాయిలు, వాళ్ళకి ఎదురైన అనుభవాలు, తగిలిన ఆశాఘాతాలు, జీవితంతో వాళ్ళు చేసుకున్న సర్దుబాట్లు, పరాయి దేశంలో వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు, క్రొత్త భాషనీ సంస్కృతినీ నేర్చుకునే దారిలో వాళ్ళ కష్టాలు, కడుపున పుట్టిన పిల్లలు తమ సంస్కృతినీ ఐడెంటిటీనీ తిరస్కరిస్తే పడిన వేదనా, పెరల్ హార్బర్ నేపధ్యంలో వాళ్ళ బ్రతుకులు తిరిగిన మలుపులు  Julie Otsuka వ్రాసిన  'The Buddha in the Attic'    పుస్తకానికి పరిచయం, కౌముది సాహిత్య మాసపత్రిక నవంబర్ 2014 సంచిక లో 'పుస్తకం ఓ నేస్తం' శీర్షిక లో. 


Wednesday, October 1, 2014

దగాకోరు జ్ఞాపకాల గారడీ - The Sense of an Ending

"హిస్టరీ అంటే ఏమిటి" అని క్లాసులో టీచర్ అడిగిన ప్రశ్నకు, ఓ ఆకతాయి పిల్లాడు టోనీ బడాయిగా  ‘హిస్టరీ అంటే విజేతల అబద్ధాలు/ప్రగల్భాలు’ అని జవాబిచ్చాడు ఒకప్పుడు. అసాధారణ తెలివితేటలున్న ఇంకో పిల్లాడు ఏడ్రియన్ "ఋజువులూ సాక్ష్యాలూ మాయమయిన దిగంతంలో, దగాకోరు జ్ఞాపకాల ఆసరాతో చరిత్ర సృష్టించబడుతుంది." అని వయసుకు మించిన జవాబు చెప్పాడు. ఎవరి జవాబు సరైంది? ఇద్దరిలో ఎవరికయినా హిస్టరీ ఎలా పుడుతుందో ఎప్పటికైనా తెలిసిందా? నలభయ్యేళ్ల తరువాత టోనీకి ‘‘హిస్టరీ అంటే విజేతలూ పరాజితులూ కాని శేషజీవుల జ్ఞాపకాల అల్లిక’ అని అర్ధమవడానికి దారితీసిన పరిస్థితులేంటి?  



మన జ్ఞాపకాలు మనం అనుకున్నట్టూ వందశాతం నమ్మదగ్గవీ కాదనీ, అవి మనల్ని దగాచేసే అవకాశాలు ఎక్కువేననీ, నిజానికి మనకి గుర్తున్నవి అచ్చం జరిగినవి జరిగినట్టు కాదు, మనం ఏం గుర్తుపెట్టుకుంటామో, గుర్తు పెట్టుకోవాలని అనుకుంటామో అవి మాత్రమేననీ చెపుతూ, వాటి మీద ఆధారపడి మనం చెప్పుకునే కథనాలు ఎంతవరకూ నమ్మదగినవీ అనే ప్రశ్నలను రేకెత్తించే పుస్తకం  Julian Barnes వ్రాసిన The Sense of an Ending పుస్తకానికి పరిచయం 'దగాకోరు జ్ఞాపకాల గారడీ   కౌముది సాహిత్య మాసపత్రిక అక్టోబర్ 2014 సంచిక లో 'పుస్తకం ఓ నేస్తం' శీర్షిక లో.