BG

Monday, March 9, 2015

SHAMITABH - The One and Only Amitabh



ఓ మూడేళ్ళ క్రిందట లోకమంతా కొలవెరి కొలవెరి కొలవెరి దీ అని కొలవెరి లో వూగిపోతుంటే, ఆ కొలవెరి సంగతేంటో ఓసారి చూద్దామని వెళ్ళిన నాకు, బక్క పోగులాంటి ధనుష్ ... ఏమాత్రమూ బావుందని అనిపించని మొహమూ, గడ్డమూ చూసి భయపడి మళ్ళీ ఆ పాట వీడియో జోలికి కూడా పోలేదు. పాట కూడా నాలో ఏ కొలవెరినీ కలిగించలేదు. ఆయన రజనీకాంత్ అల్లుడని తెలిసి బాగా ఆశ్చర్యపోయాను కూడాను (ఎందుకో నాకూ తెలీదు). ఆ తర్వాత Raanjhana చూసినా, మొత్తం నా ఇంట్రెస్ట్ లో సగం సొట్టబుగ్గల అభయ్ డియోల్ ఖాతాలోనూ, మిగిలిన సగం రహమాన్ సంగీతానికీ ఇన్వెస్ట్ చేసేసాను.



అమితాబ్ ... యాంగ్రీ యంగ్ మేన్ గా ఉన్నప్పుడు చూసిన సినిమాలే చాలా తక్కువ. అది కూడా ఏ బసు భట్టాచార్య సినిమాలోనో, హ్రిషికేష్ ముఖర్జీ సినిమాలోనో చూడడమే. అయితే నటుడిగా కన్నా, అతని గొంతు మాత్రమే నన్ను ఎక్కువ ఆకట్టుకుంది. ‘నీల ఆస్మాన్ సో గయా’ అన్నా, ‘తన్హాయి కి ఏక్ రాత్, ఇధర్ భీ హై ఉధర్ భీ హై ‘ అన్నా, ‘పెహలే తేరా స్వాగత్ కర్తీ హై మధుశాలా’ అన్నా ముందు నిలబెట్టి ఆపేది ఆ గంభీర కంఠమే. అతను అరవై దాటాక చేసిన సినిమాల్లో విచిత్రంగా అతని గొంతుతో బాటూ నటన కూడా నన్ను ఆకట్టుకోడం మొదలుపెట్టింది. బ్లాక్ నుంచీ మొన్నటి ‘The last Lear ‘ దాకా ఎంత వైవిధ్యం! ఇప్పుడు షమితాబ్.

ధనుష్ చిన్నప్పటి నుంచీ సినిమా హీరో కావాలని కలలు కనే ఒక మూగ యువకుడు. గొంతు లేకపోతేనేం, నటనా కౌశలం పుష్కలంగా ఉన్నవాడు. రాజ్ కుమార్ హీరానీయో, కరణ్ జోహరో తన నటన చూసి తనకో ఛాన్స్ ఇవ్వకపోతారా అన్న పిచ్చి ఆశతో ముంబాయ్ వస్తే, సెక్యూరిటీ గార్డులు గేటు దాటి స్టూడియోల్లోకి కూడా వెళ్ళనివ్వలేదు. ఎలాగో దొంగతనంగా లోపలికి ప్రవేశించి, హీరోల లక్జరీ ట్రైలర్ లో దాక్కుని అవకాశం కోసం ఎదురుచూస్తూ, ఒక యంగ్ అసిస్టంట్ డైరక్టర్ అక్షర కంట్లో పడ్డాడు. అతని టాలెంట్ చూసి ఆమె ఇంప్రెస్ అయి, తన డైరెక్టర్ కు ధనుష్ వీడియో చూపించింది. ధనుష్ నటనకి అతను కూడా ఇంప్రెస్ అయినా, ఒక మూగవాడు నటుడెలా ఎలా అవుతాడని కొట్టిపారేశాడు. ధనుష్ నటనా తపనా చూసిన అక్షర, అతనికి ఎలా సాయం చెయ్యాలో తెలీక మధనపడుతున్న సమయంలో, మెడికల్ టెక్నాలజీ లో ఒక కొత్త ప్రయోగం ఆమెకు ఒక ఆశను ఇచ్చింది. ధనుష్ గొంతులో ఒక మైక్రోచిప్ అమర్చి, ఒక ఇయర్ పీస్ పెడతారు. ఇంకొకరు రెండో ఇయర్ పీస్ పెట్టుకుని మాట్లాడితే, ఆ మాటలు మొదటి ఇయర్ పీస్ ద్వారా ట్రాన్స్మిట్ అయి, ధనుష్ గొంతులోని మైక్రోచిప్ ద్వారా ప్రతిధ్వనిస్తాయి. ధనుష్ చెయ్యాల్సిందల్లా లిప్ సింక్ అయ్యేలా చూసుకోడమే. అతనికి ఇపుడు తనకి సూటయ్యే గొంతుని వెదుక్కోవడం మిగిలింది. ఆ వెదుకులాటలో వాళ్లకు కనబడ్డాడు అమితాబ్ సిన్హా.


అమితాబ్ సిన్హా ఒక తాగుబోతు వృద్ధుడు. స్మశానంలో నివాసం. మొగల్ ఏ అజాం సినిమా డైలాగ్స్ అంటే పిచ్చి. తన ఏకైక నమ్మిన బంటు చేత జహాపనా అని పిలిపించుకుంటూ ఉంటాడు. ఒకప్పుడు అతనూ ధనుష్ లాగా హీరో అవ్వాలని కలలుగని ముంబాయ్ చేరాడు. అయితే అతని గొంతు విలన్లకు తప్ప హీరోలకి పనికిరాదని తిరస్కరించబడ్డాడు. ధనుష్ కు స్క్రీన్ మీద తన గొంతు ఇవ్వడానికి ముందు తిరస్కరించినా. అతని నటన చూసిన మీదట 10% భాగస్వామ్యం మీద ఒప్పుకుంటాడు.

నటనా, వాచకం కలిసి DHANUSH + AMITABH = SHAMITABH అనే పేరుమీద హీరోగా పరిచయమయ్యాడు ధనుష్. మొదటి సినిమాతోనే సూపర్ స్టార్ అయిపోయాడు. ఓ రెండు సినిమాలు విడుదలయ్యేసరికి ఎక్కడా చూసినా షమితాబ్ మాత్రమే. ఇవన్నీ చూసి అమితాబ్ కు ఈగో వచ్చింది తన గొంతు లేకపోతే షమితాబ్ లేడని. ధనుష్ కి కూడా తన సక్సెస్ తలకెక్కింది. నేను లేకపోతే నీ గొంతుకి విలువే లేదన్నాడు ధనుష్. ఇద్దరి మధ్యా క్లాష్ మొదలయ్యింది. ఒకానొక తప్పని పరిస్థితిలో అమితాబ్ మీద ధనుష్ ఇచ్చిన స్టేట్మెంట్, అమితాబ్ ని ఉగ్రుడిని చేసి, ప్రెస్ ముందు ధనుష్ పరువు పోయేలా చేసింది. దానితో ఇద్దరి దారులూ పూర్తిగా విడిపోయాయి. ఈలోగా ఒక ఔత్సాహిక జర్నలిస్ట్ కి అనుమానం వచ్చి, తీగ కదిలిస్తే డొంకంతా కదిలింది. అతను ధనుష్ స్వగ్రామం వెళ్ళి ఋజువులతో సహా వెనక్కు వచ్చాడు.

చివరికి ఏమయ్యింది? తప్పు ఒప్పుకోడానికీ, క్షమాపణ అడగటానికి అడ్డొచ్చిన ఇద్దరి ఈగోలు వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్ళాయి? ఆ జర్నలిస్ట్ నిజం బయట పెట్టాడా? బయట ప్రపంచానికి షమితాబ్ వెనుక అసలు నిజం తెలిసిందా అనేది సినిమా చూస్తే తెలుస్తుంది.

తాగుబోతూ, ఈగోయిస్ట్, జెలసీ తో రగిలిపోయే అమితాబ్ సిన్హా గా అమితాబ్ ని చూసి తరించాల్సిందే. వర్ణించడానికి మాటలు చాలవు. జహాపనా, ఆప్ కా జవాబ్ హీ నహీ! A stunning, memorable, stealing performance. సినిమా మొత్తం ఒక్క డైలాగ్ కూడా లేకపోయినా, ధనుష్ కూడా అమితాబ్ తో పోటీపడి నటించాడు. అమితాబ్ తో ఉన్న సన్నివేశాల్లో అతని నటన, వెరీ ఇంప్రెస్సివ్. ఇద్దరి మధ్యా కెమిస్ట్రీ బాగా కుదిరింది.

పా, చీనీ కమ్ సినిమాలతో ఒక అంచనా కలిగించిన బాల్కీ ముగింపుకొచ్చేసరికి నిరాశ పరిచాడు. సినిమాలు ఓ మోస్తరు చూసేవాళ్ళు ఈజీగా ఊహించేస్తారు. నాకయితే ఇద్దరూ నిజం చెప్పి వాళ్ళ జోడీని కొనసాగిస్తే, ఆ ముగింపు కొత్తగా ఉండేదని అనిపించింది. (Dubbing taken to a different level). అలానే సెకండ్ హాఫ్ లో అక్కడక్కడా కొన్ని సీన్స్ సాగదీసినట్టుగానూ, సిల్లీగానూ అనిపించాయి.

అస్సలు నచ్చని విషయం.. రేఖ ధనుష్ కి అవార్డ్ ఇస్తే, అమితాబ్ గొంతుతో ధనుష్ థాంక్స్ చెప్పినపుడు, రేఖ ఓ క్షణం తడబడి తేరుకుని ‘I'm so proud of you. You are truly God's gift ... to cinema’ అంటుంది. ముగిసిపోయిన క్షణాలనీ, అనుబంధాలనీ ఇలా బయటకి తెచ్చి నవ్వులపాలు చెయ్యటం, వాటి విలువలని పోగొట్టడం ఈ జనాలకి ఏం పిచ్చో. అసలు రేఖ ఎలా ఒప్పుకుందో ఆ సీన్ కీ, ఆ డైలాగ్స్ కీ. “The heart is a demanding tenant; it frequently makes a strong argument against common sense.” అన్న కోట్ గుర్తుకొచ్చింది.

ఇంకో నచ్చని విషయం .. పిడ్లీ అన్న పాట. హీరోయిన్ ఆరుబయట బయలాజికల్ అవసరాన్ని తీర్చుకోవాలన్నదానికి, కమోడ్ పట్టుకుని తిరుగుతూ హీరో పాడే పాట. పాట అమితాబ్ గొంతులో వినడానికి బానే ఉన్నా, పిక్చరైజేషన్ మాత్రం చిరాకు పుట్టించింది. పిడ్లీ అన్న మాటను తీసుకుని , పాట రాసినందుకు స్వానంద్ కర్కరే కు వందనాలు.

ధనుష్ తన మావగారు రజనీకాంత్ లా, హీరో అయ్యే ముందు కొంతకాలం బస్ కండక్టర్గా పనిచేసిన సీన్, రజనీ లాగా నోట్లో సిగరెట్ తో ఫీట్స్ చెయ్యడం బావున్నాయి. అందరికీ ఈ సినిమా నచ్చకపోవచ్చు. కానీ One of a kind performances, movies ఇష్టపడేవాళ్లకు నచ్చుతుంది. ఇపుడు త్వరలో రాబోతున్న అమితాబ్ కొత్త సినిమా పీకో కోసం ఎదురుచూస్తున్నాను. ఒకవైపు అమితాబ్ మరో వైపు ఇర్ఫాన్ ఖాన్. ఈ కళ్ళకి ఇంకేం కావాలి?


4 comments:

  1. ఈ సినిమా లాస్ట్ వీక్ చూశానండీ..పెర్ఫార్మన్స్ వైస్ చాలా నచ్చింది..అమితాబ్ కి నేను వీరాభిమానిని..'ది లాస్ట్ లియర్' అమితాబ్ ఆక్టింగ్ కాలిబర్ కి పరాకాష్ట అనిపించింది..ఆ సినిమా నాకు అంతగా నచ్చింది..ధనుష్ నాకు అస్సలు నచ్చేవాడు కాదు,అతని raanjhna,ఇప్పుడు మళ్ళీ ఇది బావున్నాయి :) థాంక్స్ ఫర్ ది పోస్ట్ :)

    ReplyDelete
    Replies
    1. థాంక్స్ నాగిని గారూ. అయితే ధనుష్, అమితాబ్ విషయంలో మీదీ నా కేటగిరీ అన్నమాట. లాస్ట్ లియర్ -- ఎస్, అమితాబ్ విశ్వరూపం కనిపించింది. నాకనిపిస్తూ ఉంటుంది, ఎపుడూ నేను తన కమర్షియల్ సినిమాలు కావాలనే చూడలేదు. ఇపుడు మేరే ఆంగనే మే తుమ్హారా క్యా కామ్ హై అంటాడేమో.

      Delete
  2. మీ రివ్యూ చాలా బాగుందండీ.. అగ్రీ విత్ ఈచ్ వర్డ్... పెర్ఫార్మెన్స్ వైజ్ ఎక్సెలెంట్ మూవీ అమితాబ్ సింప్లీ సూపర్బ్.. ధనుష్ పెర్ఫార్మెన్స్ కూడా తనకు ధీటుగా ఉంది. పిడ్లీ సాంగ్ చిత్రీకరణ చిరాగ్గా ఉంది కానీ ఆ పాట చుట్టూ అమిత్ ధనుష్ ల ఇగో గేమ్ ప్రకారం చూస్తే మాత్రం కూల్ ఉంది :-)

    ReplyDelete
    Replies
    1. థాంక్స్ వేణూ. ఇదేం రివ్యూ కాదు. వూరికే వచ్చిన థాట్స్ అంటే. అసలు లాస్ట్ లియర్ చూసినపుడే రాయాలనిపించింది, కానీ నాకు వర్ణించడానికి కూడా మాటలు చాలలేదు. పిడ్లీ సాంగ్ - మీరన్నది కరక్టే. వాళ్ళిద్దరి తరపునా చూస్తే బానే ఉండేట్టు ఉంది. అమితాబ్ కమోడ్ మీద కూర్చుని పాట పాడటం, తన ఎక్స్ప్రెషన్ చూసి బలే నవ్వొచ్చింది. ఈసారి కూల్గ్గా ఆ పాట మళ్ళీ చూడాలి వాళ్ళిద్దరి కోసం.

      Delete