విజ్ఞాన నేపధ్య గాథలు - డా. వక్కలంక వెంకటరమణ
(Image Source: Google) |
ఓ రెండు నెలల
క్రితం మిత్రులు నారాయణస్వామి గారు ఈ పుస్తకం పంపించి, వీలయితే చదివి పుస్తకం మీద
నా అభిప్రాయం వ్రాయమన్నారు. పుస్తకం చూడగానే ఎగిరిగంతేసినా, సైన్స్ ఫిక్షన్ అనగానే
కొంచెం నిరాశ పడ్డాను. సైన్స్ ఫిక్షన్ పూర్తిగా చదవటం అనేది నా వల్ల కాని పని. అయితే మొదటిసారి అడిగారు కదా అనీనూ, సెలవులే కదా
అనీను ఒప్పుకున్నాను. తరువాత గానీ తెలీలేదు, ఎందులో దూకానో. నేను ఎంపిక చేసుకున్న
పుస్తకంలా, నచ్చకపోతే వదిలేసేంత లక్జరీ లేకపోయింది. నిజాయితీగా అభిప్రాయం చెప్పాలి
కాబట్టి, దాదాపు ప్రతీ లైనూ, ప్రతీ కథా శ్రద్ధగా వదలకుండా చదవాల్సి వచ్చింది. నాకు
అంత సహనం ఉందని అప్పటివరకూ నాకే తెలీదు. నా చేత ఓ సైన్స్ ఫిక్షన్ పుస్తకాన్ని పూర్తిగా
చదివించినందుకు ఆయనకి అభినందనలు.
ఈ సంకలనంలో ఇరవై కథలున్నాయి. ఇందులో ఐదు కథలు
1995కు ముందు వ్రాస్తే, మిగిలిన 15 కథలు, 2015 లో వ్రాసినట్టు
ముందుమాటలో చెప్పారు. దాదాపు ప్రతీ కథలో ఎదో ఒక వైజ్ఞానిక విషయాన్నో లేదా కల్పననో పరిచయం
చెయ్యాలని ప్రయత్నించారు. Spontaneous Human Combustion, Cryogenics,
పూర్వజన్మల స్మృతులు, Genetically Modified Crops (GM Crops),
Cloning, psychokinesis, Reincarnations, ESP, ప్రేతాత్మలూ, మిరకిల్స్,
Super Computers మొదలైన అంశాలు ఈ
కథలకు ఆధారంగా తీసుకున్నారు.
వీటిని విజ్ఞాన నేపధ్య గాథలు (సైన్స్
ఫిక్షన్) అన్నా, విఠలాచార్య టైపు మాయలు, అతీతశక్తులూ ఎక్కువే ఉన్నాయి. అయితే 'విజ్ఞానానికి అందని
నిరూపించబడని కొన్ని గమ్మత్తులు, అర్ధం
అంతు పట్టనివీ, అతీతమయినవీ వ్రాసాను'
అని రచయిత ముందు మాటలోనే చెప్పుకున్నారు.
మొదట్లో వ్రాసిన కథలు (‘నా ప్రేమకు ముగింపు లేదు’ తప్ప) శ్రద్ధగా వ్రాసినట్టుగా, చదివించేవిగా ఉన్నాయి. ఈ సంకలనం కోసం
క్రొత్త కథలు పదిహేనూ ఉన్నపళంగా తక్కువ వ్యవధిలో వ్రాసారు అన్నారు. ఆ ఆతురత కథల్లో బాగా తెలుస్తుంది. చాలా
కథల్లో సైన్స్ కేవలం రెండు వాక్యాలకు పరిమితమయింది. అయితే అక్కడక్కడా కథాంశానికి సంబంధించి,
మనదేశంలో జరిగిన పరిశోధనల వివరాలు ప్రస్తావించడం ఒక
మంచి విషయం. 1995 లోనే క్రయోజెనిక్స్ గురించి చెప్పటం
నాకు ఆశ్చర్యం కలిగించింది. (సైన్స్
స్టూడెంట్ నయినా నాకు ఈమధ్య వరకూ తెలియదు.) అయితే చాలా
కథల్లో చెప్పాలనుకున్న విషయాన్ని, అనవసరమయిన
కథనం మింగేసి గందరగోళంగా తయారయ్యింది.
నీళ్ళ మీద నడిచిన మనిషి (మేజిక్ ట్రిక్స్), నాన్నా ఇంటికి ఎప్పుడు వెళదాం (పూర్వజన్మ స్మృతులు), ప్రియతమా
ఎక్కడున్నావ్ (ESP) మొదలైనవి కథలుగా
కన్నా చిన్నసైజ్ న్యూస్ ఆర్టికల్స్ లానో,
వ్యాసాలుగానో ఉన్నాయి. ఈ కథాంశాలతో చాలాకాలం
క్రితమే నవలలు, కథలూ, న్యూస్ ఆర్టికల్స్ వచ్చాయి. వీటిలో ఇపుడు క్రొత్తగా
చెప్పిందేమీ లేదు. అయితే 'ఇది
వైజ్ఞానికులకై వ్రాసినది కాదు' అని
కూడా రచయిత చెప్పారు. పుస్తకాలకీ,
సైన్స్ న్యూస్ కీ పెద్దగా ఎక్ష్పొజర్ లేనివాళ్ళకు ఉపయోగిస్తుంది. ఏమాత్రమయినా సైన్స్ ఫిక్షన్ చదివే
అలవాటున్నవారికి ఈ పుస్తకం నచ్చే అవకాశం చాలా తక్కువ.
కొన్ని చిరాకెత్తించే
విషయాలు... పుస్తకంలోని దాదాపు ప్రతీ స్త్రీ పాత్రా అతిలోక
సుందరి. (స్త్రీగా మారిన వింతజీవి నుండీ నోబెల్ పొందిన డాక్టర్ల వరకూ, కథకు అవసరం లేకపోయినా సరే) కళ్ళు చెదరిపోయే యవ్వనపు పొంగుతో
లేదా వర్ణించనలవి గాని అంగసౌష్ఠవంతో ఉంటుంది. కథకు ఏమాత్రం అవసరం లేని వాటి
ప్రస్తావనలు కూడా ఎన్నో పంటి క్రింద రాళ్ళలా. ఉదా., కార్ల మోడల్స్, రెస్టారంట్స్
లాంటి వివరాలు. (మూడోరోజే అర్ధాంతరంగా నా వాక్సాల్ వెలాక్స్ స్టేషన్ వాగన్లో వచ్చేసరికి
అర్ధరాత్రయింది. – నా ప్రేమకు ముగింపు లేదు కథలో). 'అదృశ్యమయితే ఆలస్యం కూడదు' అనే కథలో నోబెల్ గ్రహీతలయిన భార్యాభర్తలను, కథ ఆసాంతం పదే పదే (దాదాపు ఓ పది సార్లు) 'నోబెల్ గ్రహీతలయిన భార్యాభర్తలు'
అంటూ ప్రస్తావించడం విసుగెత్తిస్తుంది. మెజారిటీ కథల్లో ప్రతీ పాత్రా, గ్రహాంతరవాసుల నుండీ సైంటిస్టుల వరకూ,
రాజకీయ నాయకుల్లా పేజీలకు పేజీలు ఉపన్యాసాలు
ఇస్తాయి.
చాలా వాడుకలో ఉన్న సాధారణ పదాలకు కూడా
సమానార్ధాలు (తెలుగు వాటికి ఇంగ్లీష్, ఇంగ్లీష్ కు తెలుగు పదాలు ) ఇచ్చి, కొన్ని క్రొత్త
సైంటిఫిక్ పదాలకు, అందులోనూ మొదటిసారి ప్రస్తావించినపుడు సమానార్దాన్ని
ఇవ్వకపోవడం, టార్గెట్ పాఠకులకు ఇబ్బంది కలిగిస్తుంది.
ఈ పుస్తకానికి అతి పెద్ద లోపం ఎడిటింగ్. మలి
ముద్రణకు మంచి ఎడిటర్ అవసరం చాలా ఉంది. అయితే దానికి ముందు రచయిత స్వంత ఎడిటింగ్
చేసుకోవడం ఇంకా ముఖ్యం. చాలా చోట్ల వాక్యాలు దాదాపు ఓ మాదిరి పేరాగ్రాఫుల్లా
ఉండటమే కాకుండా, ఏం చెప్పాలనుకుంటున్నారో అర్ధం కాదు.
కొన్నిచోట్ల ఆ పెద్ద వాక్యాలు\పేరాగ్రాఫులు
సరైన ముగింపు లేకుండానే ఉండిపోయాయి. 'నా ప్రేమకు ముగింపు లేదు' అనే కథలో (42వ పేజీలో) మృత కళేబరాన్ని 600 సెంటీగ్రేడ్ లో
భద్రపరచాలని చెపుతారు. ఏ కొంచెం ఆలోచన ఉన్నవాళ్ళకయినా అది కళేబరాన్ని భస్మం
చేస్తుంది కదా అన్న అనుమానం వస్తుంది. క్రయోజెనిక్స్ గురించి పుస్తకంలో
ప్రస్తావించడం అదే మొదటిసారి. అటువంటప్పుడు అంత పెద్ద తప్పుని గమనించకపోవడం విచారకరం.
తరువాతి పేజీల్లో మైనస్ 600 సెంటీగ్రేడ్ అని చెప్పడం వలన
మొదటిది అచ్చుతప్పు అని అర్ధమవుతుంది. అలానే ఈ కథ దాదాపు పది పేజీల (32
నుండి 44 వరకు) నిడివి, అయితే ఎనిమిది పేజీల వరకూ ఉన్న విషయమంతా కథకు ఏ
మాత్రమూ ఉపయోగపడనిదీ, వాస్తవ దూరమైనదీ కూడాను (కథే అయినా సరే). ఇలాంటివి తిరిగి
వ్రాయాల్సిన అవసరముంది. లేకపోతే పాఠకుడి సహనానికి పరీక్ష తప్పదు.