BG

Friday, May 22, 2015

యాన్ మార్టెల్ కథలు

(ఈ పుస్తకపరిచయం మొదట మార్చ్ 15, 2015 న పుస్తకం.నెట్ లో ప్రచురించబడింది.)

(Picture Source: Google.com)
నాలుగేళ్ల క్రిందట ఓ స్నేహితులు, మీకు నచ్చుతుందేమో చూడండి అని యాన్ మార్టెల్ వ్రాసిన లైఫ్ ఆఫ్ పై రికమెండ్ చేసారు. మొదటిసారి చదివినపుడు కొన్ని చోట్ల కావలసిన దానికన్నా వివరణలు ఎక్కువయ్యాయేమో అనిపించినా పూర్తి చేసేసరికి మళ్ళీ ఇంకోసారి చదవాలనిపించింది. మొదటిసారి చదువుతూ ఉండగా అనవసరమేమో అనిపించినవన్నీ కూడా, ముందు జరగబోయే కథకూ, పాత్రల మానసిక ప్రవర్తనకూ బిల్డింగ్ బ్లాక్స్ అని అపుడు నా కాటన్ కేండీ బుర్రకి అర్థమయింది. They started making more sense at the second time, and I started liking the author. ఒకసారి ఎవరన్నా రచయిత నచ్చడం మొదలుపెడితే వాళ్ళ మిగతా రచనలు వెదికి చదువుకోవడం నాకున్న మాచెడ్డ అలవాటు. అదే అలవాటుతో వెదికితే, లైబ్రరీలో Beatrice & Virgil దొరికింది. అయితే ఆ పుస్తకం నన్ను కొంచెం నిరాశ పరిచింది. నిరాశ పరిచింది అనే కన్నా రచయిత స్థాయిని నేను అర్థం చేసుకోలేకపోయాను అని చెప్పుకోవడం మర్యాద. యాన్ రచనలు ఇంకా ఏమున్నాయా అని వెదుకుతుండగా,లైఫ్ ఆఫ్ పై వ్రాయడానికి చాలా ఏళ్ళ ముందే కొన్ని కథలు ప్రచురించారనీ అందులో We ate our children last‘ అనే కథ అతనికి చాలా పేరు తెచ్చిందనీ తెలిసింది. ఆ కథ గురించి రెండు మూడు చోట్ల గొప్పగా చదివి, దానికోసం వెదికితే అది ఎక్కడా ప్రింట్ లో లభ్యం లేదు అని కూడా తెలిసింది. పట్టువదలని విక్రమార్కురాలిలా కొన్ని నెలలు వెదగ్గా, ఎక్కడో ఇంగ్లాండ్ లోని పబ్లిషర్స్ సైట్ లో ఒక్క కాపీ దొరికింది. తీరా అది చేతికి వచ్చాక చూస్తే వేరే కథల సంపుటి. అయినప్పటికీ అదో serendipity గా మిగిలింది.

అలా అనుకోకుండా చేతికి చిక్కిన The Facts behind the Helsinki Roccamatios అనే కథల సంపుటి, మొదటిసారి 1993 లో ప్రచురించబడి, రచయిత ముందు మాటతో రెండవ ముద్రణ 2004 లో వచ్చింది. ఇందులో నాలుగు కథలున్నాయి. దేనికదే వైవిధ్యంగా ఉన్న కథలివి. రెంటిని నవలికలు అనొచ్చు. ఈ నాలుగు కథలూ రచయితకు బహుమతులు తీసుకొచ్చాయట.

మొదటి కథ: The Facts behind the Helsinki Roccamatios
ఈ కథ ఉత్తమపురుషలో చెప్పబడింది. కథ కోసం ప్రొటాగనిస్ట్ పేరు బాబ్ అనుకుందాం. కథాకాలం 1986, కథాస్థలం కెనడాలోని,టొరాంటో నగరానికి దగ్గరలోని ఓ చిన్న ఊరు. ఇరవైమూడేళ్ళ బాబ్, డిగ్రీ ఆఖరి సంవత్సరం చదువుతున్న కాలేజీలో, పంతొమ్మిదేళ్ళ పాల్ జూనియర్ క్లాస్ లో కొత్తగా చేరాడు. ఇద్దరి మధ్యా తొందరలోనే మంచి స్నేహం కుదిరి, ఎక్కువ కలిసి గడపటం మొదలుపెడతారు.తరువాత కొద్ది నెలల్లోనే పాల్ ఆరోగ్యం పాడయ్యి తొందరగా క్షీణిస్తుండటంతో, డాక్టర్లు పరీక్ష చేసి అతనికి ఎయిడ్స్ అని తేల్చారు. ఆ విషయం తెలియడంతోనే అతని కుటుంబంలోని ఆనందమంతా ఎగిరిపోయింది. అతనికా వ్యాధి రావడానికి కారణం ఏమై ఉంటుందా అని ఆలోచిస్తే, అప్పటికి ఓ రెండేళ్ళ క్రిందట వారంతా వెకేషన్ కోసం బయట దేశానికి వెళ్ళినపుడు, కార్ ఏక్సిడెంట్ జరిగిన సమయంలో అతనికి ఎక్కించిన రక్తం కారణం అని తేలింది. పాల్ వ్యాధి గురించి తెలియగానే అతని తండ్రి, తల్లి, అక్క ముగ్గురూ విషాదంలో ములిగిపోయి, వాళ్ళ ఉద్యోగాలూ, చదువులూ ఎక్కడివక్కడ వదిలేసి జీవచ్ఛవాల్లా రోజులు గడుపుతున్నారు. విషయం తెలియగానే బాబ్ పాల్ ని చూడాడానికి వెళ్ళాడు. అక్కడ పరిస్థితి చూసిన బాబ్ ఓ రెండు రోజులు అక్కడే ఉండి తనకి చేతనయిన సాయం చేస్తాడు.అప్పటి నుండీ ప్రతీ వీకెండ్ పాల్ దగ్గరికి వెళ్ళి అతనితో టైం స్పెండ్ చెయ్యడం, ఇంట్లో వాళ్ళకు సాయం చెయ్యడం, పాల్ తో హాస్పిటల్ కు వెళ్లడం లాంటివి చేస్తుంటాడు. నెమ్మదిగా పాల్ ఇంట్లో వాళ్ళు షాక్ నుంచి అయితే తేరుకున్నారు కానీ, విషాదం మాత్రం తగ్గలేదు.

స్నేహితుడు అన్యాయంగా జబ్బుకి గురయి చనిపోబోవడాన్ని జీర్ణించుకోలేని బాబ్ కలత చెంది, చదువు మీద కాన్సంట్రేట్ చెయ్యలేక కాలేజీ మానేసి, ఎక్కువ కాలం పాల్ తోటే గడుపుతుంటాడు. పాల్ మాత్రం తన జబ్బు తగ్గుతుందని, జీవితం మీద ఎంతో ఆశతో ఉండటం బాబ్ మానసికంగా భరించలేకపోతాడు. స్నేహితులిద్దరి మధ్యా ఎంత వద్దనుకున్నా, మిగిలిన విషయాలతో పాటూ ఎక్కువగా పాల్ జబ్బు గురించిన చర్చలూ వస్తున్నాయి. వీలయినంతవరకూ వాటి నుంచి పాల్ దృష్టి మరల్చాలని ఆలోచించిన బాబ్ కు ఒక ఆలోచన వచ్చింది. అప్పటివరకు జరిగిన చరిత్రని తిరిగి వాళ్ళ మాటల్లో ఒక కథగా వ్రాయాలన్న ఆలోచనని పాల్ కి చెపితే, అతను కూడా ఒప్పుకున్నాడు. ఫిన్లాండ్ రాజధాని Helsinki ను కథాప్రాంతంగా తీసుకుని, Roccamatios అనే ఒక ఇటాలియన్ ఇమిగ్రంట్ కుటుంబాన్ని సృష్టించుకున్నారు. వారి కథ వ్రాయడానికి చరిత్రలో ఆ శతాబ్దంలో 1901 నుండి మొదలు పెట్టి ప్రస్తుతం, అంటే 1986వరకూ ప్రతీ సంవత్సరం జరిగిన ముఖ్యమైన సంఘటనలు తీసుకుని, వాటిని ఈ కుటుంబానికి అన్వయించి కథ వ్రాయాలి. ఒక సంవత్సరం కథ బాబ్ చెపితే, మరుసటి సంవత్సరం కథ పాల్ చెప్పాలి. దానికోసం బ్రిటానికా ఎన్సైక్లోపీడియా దగ్గర పెట్టుకుని ప్రతీ సంవత్సరం జరిగిన ముఖ్యమయిన విషయాలు చూసి, కథ తయారు చేసుకునేవారు. అలా కొంచెం పాల్ దృష్టి మరల్చగలుగుతాడు.అయితే మొత్తం అన్ని సంవత్సరాల కథ చెప్పకుండానే, పాల్ వ్యాధి బయటపడిన తొమ్మిది నెలలకు చనిపోతాడు.

“When you’re with people who are really sick, you discover what an illusion science can be.”

మొదట పాల్ ఫోన్ చేసి తనకు ఎయిడ్స్ అని చెప్పినపుడు బాబ్ ఆలోచన - అతనికి ఆ జబ్బు ఎలా వచ్చి ఉంటుంది? శారీరక సంబంధాలా, లేక పాల్ గే నా, లేక డ్రగ్స్ వల్ల వచ్చిందా అని రకరకాలుగా ఆలోచిస్తాడు. వెళ్ళి పాల్ ని అసలు కలవాలా వద్దా, తనకీ ఆ జబ్బు అంటుకుంటుందా అని కూడా ఆలోచిస్తాడు. ఆ జబ్బు కేవలం తాకటం వల్ల, దగ్గర కూర్చోడం వల్ల రాదు అని పదే పదే నచ్చచెప్పుకుంటాడు. అలాగే పాల్ మధ్యలో ఒకరోజు రక్తం కక్కుకున్నప్పుడు, వెంటనే రెస్ట్ రూం లోకి వెళ్ళి ఒళ్ళంతా సబ్బుతో కడుక్కుని, తనకి ఎక్కడన్నా శరీరం మీద చిన్నదయినా గీటు ఉందేమో, దాన్నుండి తనకీ అంటుకుంటుందేమో అని హిస్టీరికల్ గా వెదుక్కోవడం, ఆ భయం లోంచి బయట పడగానే గిల్టీగా ఫీల్ అవడం, పాల్ దగ్గర కూర్చుని ధైర్యం చెప్పడం  ఎదుటి వాళ్ళంటే మనకి ఎంత ప్రేమున్నా సరే, ఒక్కోసారి మన మీద మనకున్న ప్రేమ ముందు అది దిగదుడుపే అనిపిస్తుంది. పాల్ మానసికస్థితిని డైవర్ట్ చెయ్యడానికి బాబ్ ప్రయత్నమే హిస్టరీని తిరిగి సృష్టించాలనుకోవడం.

కుటుంబంలో ఒక్కరి పరిస్థితి, మిగిలిన అందరి జీవితాలనీ ఎలా మార్చేస్తుందీ అన్నది అతి కొన్ని వాక్యాల్లో, ఎంతో ఆలోచింపచేసేలా చెపుతారు రచయిత. కథను పాల్ కు ఎయిడ్స్ అన్న విషయం, విషాదం ఓవర్ టేక్ చెయ్యకుండా బేలన్స్ తో వ్రాసారు. మొదటి రెండు పేజీల్లోనే మనకి పాల్ తొందరలోనే చనిపోతాడని తెలుస్తుంది, అయినా మిగిలిన కథ చదువుతున్నంతసేపూ ఆ విషయం మనని బయాస్ చెయ్యదు. పాల్ నీ, అతని చుట్టూ ఉన్నవాళ్లని ముంచిన నైరాశ్యం, వాళ్ళు అనుభవించిన నరకం, ఆ విషాదాన్ని వాళ్ళు అనుభవించిన తీరు చెప్పడానికే ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చారు రచయిత. అయినా కథ పూర్తయ్యేసరికి మళ్ళీ మన కళ్ళు తడవుతాయి.

ఈ కథను రచయిత అతని క్లోజ్ ఫ్రెండ్ ఎయిడ్స్ తో చనిపోయినప్పటి అనుభవం ఆధారంగా వ్రాసానని ముందుమాటలో చెప్పారు.బహుశా ఈ కథని రచయిత 1989- 1991 మధ్యలో వ్రాసి ఉండాలి. దీనికి 1991 లో కెనెడియన్ Journey Prize లభించిందట. ఈ కథ నాటకంగా మలచబడి, కెనడాలో సినిమాగా కూడా వచ్చిందట.

రెండవ కథ: The Time I Heard the Private Donald J. Rankin String Concerto with One Discordant Violin, by the American Composer John Morton

ఈ కథ కూడా ఉత్తమపురుషలో చెప్పబడింది. ఈ కథ కోసం ప్రొటాగనిస్ట్ పేరు జేమ్స్ అనుకుందాం. జేమ్స్ తన స్నేహితుడి దగ్గరకు కొన్ని రోజుల కోసం వాషింగ్టన్, డి.సి వస్తాడు. ఆ స్నేహితుడు ఒక పెద్ద కంపనీలో పని చేస్తూ, ఉద్యోగంలో రాత్రీ పగలూ బిజీగా ఉండటం వలన, జేమ్స్ ఒక్కడే ఊరు చూస్తూ కాలక్షేపం చేస్తుంటాడు. ఒకరోజు సాయంత్రం అలా తిరుగుతున్నప్పుడు ఒక మ్యూజిక్ కాన్సర్ట్ ప్రకటన కనిపిస్తుంది. అది వియత్నాం వార్ వెటరన్స్ చేస్తున్న ప్రోగ్రాం అని తెలుసుకుని కుతూహలంతో వెళతాడు. ఒక శిధిలమైన నాటకం థియేటర్లో ఆ ప్రోగ్రాం జరుగుతుంది. మ్యుజీషియన్స్ అందరూ కూడా తమ హాబీ గా ఆ ప్రోగ్రామ్స్ చేస్తుంటారు. ప్రొఫెషనల్ గ్రూప్ కాకపోవడంతో పెద్దగా ఆర్థిక సాయం గానీ, పబ్లిసిటీ గానీ దొరకదు వాళ్లకి. జేమ్స్ ఆ ప్రోగ్రాం మొత్తం బాగా ఆనందిస్తాడు, ముఖ్యంగా జాన్ మోర్టన్ అనే అతను చేసిన వయోలిన్ కాన్సర్ట్ అతన్ని ఏదో లోకాలకి తీసుకెళుతుంది. ప్రోగ్రాం అయిన తరువాత మోర్టన్ తో మాట్లాడాలని, అతని కారుని వెంబడిస్తాడు.

మోర్టన్ రాత్రి పూట ఒక బేంక్ క్లీన్ చేస్తుంటాడు. అతనితో మాట్లాడాలని వచ్చానని బయట నుంచే సైగ చేసిన జేమ్స్ ని లోనికి రానిస్తాడు మోర్టన్. అతని కాన్సర్ట్ తనకి ఎంతో నచ్చిందనీ, ఇప్పటివరకూ తనని అంతగా కదిలించిన ప్రోగ్రాం తను వినలేదనీ చెపుతాడు జేమ్స్.జేమ్స్ ని తను చేస్తున్న ఆఫీస్ క్లీనింగ్ పనుల్లో సాయం చేస్తూ మాట్లాడమని చెప్పి, వార్ రోజుల్లో తనని తను ఆ టెన్షన్స్ నుంచి తప్పించుకోడానికి మ్యూజిక్ ఎలా సాయపడిందో, ఎలా తను స్వంతంగా పాటలు వ్రాయడం ఎలా మొదలుపెట్టాడో మొదలైన విషయాలు చెపుతాడు. అలానే ప్రపంచం తీరూ, రొటీన్ ఉద్యోగాలు చేస్తూ గడిపేసే రొటీన్ బ్రతుకులూ, ఉన్నదానితో సరిపెట్టేసుకుని జీవితంలో కొత్తదనం ఎందుకు కోరుకోరూ అంటూ, జీవితం గురించి తను చుట్టూ చూస్తున్నవీ తన అభిప్రాయాలూ చెపుతాడు మోర్టన్.

I come here during the day. I like it and nearly fall for it. I say to myself, you should get a daytime job here. … Then I catch myself. This place is dangerous, it’s so cunning. It crawls up on you stealthily. You get used to it, the routine, you know. You start to think it’s normal. Finally you think there’s nothing else. Then you blink, forty years have gone by, and your life’s over. Sometimes I come here during the day and I look in from the outside and I ask myself, Why don’t these people ask for more?“

అలా ఇద్దరూ కొన్ని గంటలు మాట్లాడుకున్నాక జేమ్స్ వెళ్ళిపోతాడు. మోర్టన్ మాటలు జేమ్స్ మీద ప్రభావం చూపించి అతనిలో కొన్ని తాత్వికాలోచనలు రేకెత్తిస్తాయి. అప్పటివరకూ వియత్నాం వార్ అమెరికాకూ, వియత్నాం కూ మధ్య జరిగిన యుద్ధం అనీ, దానికీ కెనడా దేశస్థుడయిన తనకూ ఎటువంటి సంబంధమూ లేదని అనుకునే జేమ్స్, మరుసటి రోజు వియత్నాం మెమోరియల్ చూడటానికి వెళ్ళి, అక్కడి మృతవీరుల సమాధులు తడిమి చూసి కన్నీళ్ళు కారుస్తాడు. ‘ఎన్ని డిగ్రీలు చదివినా, ఏం సాధించినా కొన్నాళ్ళకి తనూ అందరిలాగే సూట్ వేసుకుని టై కట్టుకుని ఏదో ఆఫీసులో ఓ ఉద్యోగం చేస్తాడు. అన్ని భోగభాగ్యాలు చెయ్యి చాస్తే అందేంత దూరంలో ఉంటాయి? అయితే మాత్రం ఏంటి?’ అనుకుంటాడు జేమ్స్. మోర్టన్ జేమ్స్ మధ్య సంభాషణలో కొన్ని వాక్యాలు ఆలోచింపచేస్తాయి.మనిషి ప్రాపంచిక విజయాలను సాధించడానికీ, సర్వం పోగొట్టుకోడానికీ మధ్య ఉండే కొన్ని క్షణాల అస్తిత్వాన్ని ఎత్తిచూపే కథ.

మూడవ కథ: Manners of Dying
మిస్టర్ హేరీ ఒక జైలు వార్డెన్. ఆ జైల్లో కెవిన్ బార్లో (Kevin Barlow) అనే యువకుడికి ఉరిశిక్ష అమలు చేసాక, అతని తల్లికి ఆ విషయం తెలియచేస్తూ వార్డెన్ ఒక ఉత్తరం వ్రాస్తాడు. అందులో ఉరిశిక్ష తేదీ తెలియచేసినపుడూ, ఆ తరువాతా కెవిన్ స్పందనా, అతని మానసిక స్థితి, ఉరి తీసే ముందురోజు అతని ప్రవర్తనా, అతను తన శిక్ష ఎలా అనుభవించాడూ అనేవి వ్రాస్తాడు. ఆ ఉత్తరానికి తొమ్మిది వర్షన్స్ వ్రాసారు రచయిత. ప్రతీ ఉత్తరం ఈ రెండు లైన్లతో మొదలవుతుంది. “మిసెస్ బార్లో, మీ కొడుకు కెవిన్ అతనిపై నిరూపించబడిన నేరాలకు గానూ విధించబడ్డ ఉరిశిక్షను ఎలా అనుభవించాడో మీకు తెలియచెయ్యడం, వార్డెన్ గా నా విధిగా భావిస్తున్నాను.” అలాగే దాదాపు ప్రతీ ఉత్తరం ఈ రెండు లైన్లతో ముగుస్తుంది. “ఉదయం 7:01 సమయానికి ఉరి తీయబడి, మీ కొడుకు ఏ విధమైన బాధా తెలియకుండా చనిపోయాడు. మీతో పాటూ మీ విచారంలో నేను కూడా భాగం పంచుకుంటున్నాను.

ఉత్తరంలో మిగిలిన విషయాలు కెవిన్ అతని లాస్ట్ భోజనం కోసం ఏం అడిగాడు - అది తిన్నాడా లేదా - చర్చ్ ఫాదర్ తో మాట్లాడటానికి అవకాశం ఇచ్చినపుడు అతని స్పందన - ఫాదర్ తో ఎంత సేపు గడిపాడు - ఆ చివరి రాత్రి అతను ఎలా గడిపాడు - మరణం చెయ్యి చాస్తే తగిలేంత దూరంలో ఉన్నప్పుడు అతని మానసికస్థితి, ప్రవర్తన ఇవన్నీ ఒక్కో ఉత్తరంలో ఒక్కోరకంగా క్లుప్తంగా చెపుతారు.

ఒకదాంట్లో కెవిన్ తనకి ఇష్టమయినవి అడుగుతాడు, కానీ అసలు తినడు. ఒక దాంట్లో ఇష్టమయినది మళ్ళీ మళ్ళీ అడిగి తింటే ఇంకో దాంట్లో మద్యం అడుగుతాడు. ఒకదాంట్లో ఫాదర్ సేవలని మౌనంగా తిరస్కరిస్తే, కొన్నిటిలో అతనితో కొంత సమయం మాట్లాడతాడు.ఒకదాంట్లో ఫాదర్ ఒళ్ళో తలబెట్టుకుని చిన్నపిల్లాడిలా ఏడుస్తాడు.

ఒక దాంట్లో మౌనంగా కిటికీ లోంచి బయటకు చూస్తూ రాత్రంతా నిద్రపోకుండా గడుపుతాడు. ఒక దాంట్లో కలతగా ఉంటూ తనలో తనే గొణుక్కుంటూ అసహనంగా రాత్రంతా గడుపుతాడు. ఒక దాంట్లో రాత్రంతా కూర్చుని తల్లికి పేజీల కొద్దీ ఉత్తరం రాస్తాడు. ఒకదాంట్లో చివరి నిమిషం వరకూ, ప్రతీ విషయం గురించీ పిచ్చిగా నవ్వుతూనే ఉంటాడు. ఒకదాంట్లో రాత్రంతా భయంగా అరుస్తూ, కేకలు వేస్తూ గడుపుతాడు. ఒకదాంట్లో ప్రశాంతంగా జైలు బయటి తోటలో గడుపుతాడు.

ఆఖరుగా ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా అని అడిగినపుడు, ఒకదాంట్లో నా తల్లికి నా ప్రేమని తెలియచెయ్యండిఅని చెపితే, ఒక దాంట్లో జరిగిన దానికి తన తల్లికి క్షమాపణలు చెప్పమనిఅడుగుతాడు. ఒకదాంట్లో వ్యంగ్యంగా నవ్వుతూ మీ అందరికీ తొందరగా ప్రమోషన్స్ రావాలని కోరుకోండిఅంటాడు.

ఒకదాంట్లో ఉరికి తీసుకెళ్ళే ముందు మౌనంగా గార్డ్స్ వెంట నడిస్తేమరొక దాంట్లో ఏడ్చి రానని గొడవచేస్తాడుఒకదాంట్లో తన తప్పుని క్షమించి ప్రాణబిక్ష పెట్టమని హృదయవిదారకంగా ప్రాధేయపడతాడుఒక దాంట్లో తనే టెన్షన్ భరించలేక, ‘తొందరగా కానివ్వండిఅని పరుగున వెళ్ళి ఉరితాడు తగిలించుకుంటాడుఒకదాంట్లో భయపడకుఉరి తీసినపుడు నొప్పి తెలియదువెంటనే ప్రాణం పోతుందనిచెప్పిన డాక్టర్ నుఉక్రోషంగా నీకెలా తెలుసని అడిగితేఇంకొక దాంట్లో భయంతో బట్టలు తడుపుకుంటాడుఒకదాంట్లో రాత్రంతా ప్రశాంతంగా కనిపించిమధ్య రాత్రి ఆత్మహత్య చేసుకుని చనిపోతేఒక దాంట్లో దగ్గర నుంచి ఉరికంబాన్ని చూసి కార్డియాక్ అరెస్ట్ అయి చనిపోతాడు.

ఏ ఉత్తరమూ రెండు పేజీలకు మించదు, కానీ అది కలిగించే ఇంపాక్ట్ మాత్రం చెప్పలేనిది. ఇన్నిటిలో కెవిన్ ఏ రకంగా చనిపోతేనేం, ఆ ఉత్తరం చదివిన తల్లి మనసు గిలగిలలాడక మానుతుందా? అలాంటి పరిస్థితి ఏ తల్లికీ రాకూడదనిపిస్తుంది. ఈ ఉత్తరాల నంబర్లు 18, 213, 319… 1096 ఇలా ఉంటాయి. మొత్తానికి రచయిత ఎన్ని వర్షన్స్ వ్రాసారో తెలియదు కానీ, బహుశా ఇన్ని రకాల ప్రవర్తనలు రచయిత ఊహించారేమో అనిపిస్తుంది. ఈ కథ చదువుతున్నంతసేపూ నాకు ఎపుడో చదివిన ఒక కథ/నవలిక, ఇలాంటిదే(యండమూరి వ్రాసినట్టుగా గుర్తు) గుర్తొస్తూనే ఉంది. ఎంత ఆలోచించినా ఎక్కడ చదివానో గుర్తు రాలేదు కానీ అచ్చం ఇదే సెట్టింగ్, ఇదే ఉత్తరాల పద్ధతిలో వ్రాయడం ఎన్నో ఏళ్ళ క్రితం చదివినట్టు బాగా గుర్తు. 1986 లో కెవిన్ బార్లో అనే ఆస్ట్రేలియన్ యువకుడిని,మాదకద్రవ్యాల స్మగ్లింగ్ నేరానికి మలేషియాలో ఉరి తీసారట. ఆ సంఘటన ఆధారంగా ఈ కథ వ్రాసారు రచయిత. ఈ కథ ఆధారంగాManners of Dying అనే సినిమా తీసారు. ఈ కథ నాటకంగా కూడా ప్రదర్శించారట.

నాలుగవ కథ: The Vita Aeterna Mirror Company: Mirrors to Last Till Kingdom Come
కథ స్థూలంగా జ్ఞాపకాలు, అనుభూతుల ఆధారంగా జీవితాన్ని ప్రతిబింబించుకోడం. అనగాఅనగా ఓ యువకుడు. అతనికి తన గ్రాండ్ మదర్ అటక మీద మూల పడేసిన సామాన్లలో అద్దాలు తయారు చేసే పాతకాలపు మిషన్ ఒకటి కనిపిస్తుంది. దాంట్లో అతి మెత్తని తెల్లని ఇసుక పోసి, ఓ పక్క మెర్కురీ పోసి, దాని హేండిల్ పట్టుకుని తిప్పుతూ, జ్ఞాపకాలని కలబోసుకుంటూ ఉంటే, కొంతసేపటికి ఆ మిషన్ లోంచి అద్దం తయారయి బయటకొస్తుంది. బయటకొచ్చిన అద్దం మీద ఆ జ్ఞాపకాలన్నీ ప్రింట్ చేయబడి ఉండి, నెమ్మదిగా కరిగిపోయి చివరికి మెరిసే అద్దం మిగులుతుంది. ఆ జ్ఞాపకాల గాఢతను బట్టి ఆ మిర్రర్ ఎంత స్వచ్చంగా లోపాలు లేకుండా ఉందీ అనేది ఆధారపడుతుంది.

ఈ కథ వ్రాసిన విధం కూడా కొత్తగా ఉంది. పేజీలో టెక్స్ట్ రెండు కాలమ్స్ గా విడదీయబడ్డాయి. ఎడమవైపు గ్రాండ్ మదర్ గుర్తుచేసుకుంటున్న తన జ్ఞాపకాలన్నీ ఉంటాయి. ఎపుడో అరవయ్యేళ్ళ క్రిందట తన భర్తని ఎలా కలిసిందీ, అతనితో ఎలా ప్రేమలో పడిందీ, పెళ్ళీ పిల్లలూ, భర్త మంచితనం, అతని మరణం తనలో మిగిల్చిన లోటూ అన్నీ ట్రాన్స్ లో ఉన్నట్టూ మాట్లాడుకుంటూ ఉంటుంది. కథలో ఎక్కువ భాగం బ్లాబ్లా బ్లా అనే నింపుతారు రచయిత. కుడివైపు కాలంలో అసహనంతో మనవడు తనలో తాను విసుక్కుంటున్న మాటలు ఈవిడ ఇప్పుడప్పుడే ఆపేలా లేదు, ‘ఈ వాగుడికి నా తల పగిలిపోయేలా ఉందిఇలా స్వగతం ఉంటుంది.

I thank the Lord every day for having put that man in my way. He took him away from me after tewnty-two years of bliss, but even if I had to go through that pain ten times over, those twenty-two years would still be worth it.”



కథ నోస్టాల్జియా, దూరమయిన ఆప్తులూ, జ్ఞాపకాలతో ఆ దూరాన్ని పూరించుకునే ప్రయత్నం  ఇవీ కథలో చెప్పాలనుకున్నవి అనిపించిది. అయితే కథ సరిగా నాకు సరిగా అర్థం అయిందా అనేదీ అనుమానమే. ఈ కథలన్నీ కూడా యాన్ బహుశా అతని వయసు 25 నుండి 28 మధ్య ఉన్నప్పుడు, లైఫ్ ఆఫ్ పై వ్రాయడానికి దాదాపు పదేళ్ళ క్రితం వ్రాసినవి. మొదటగా ఇది 1993 లో పుస్తకంగా వచ్చినా, అపుడు కెనడా బయట పెద్దగా గుర్తింపు పొందలేదట. అయితే లైఫ్ ఆఫ్ పై కి బహుమతి రాకుండా ఉండి, అంతర్జాతీయ గుర్తింపు పొందకుండా ఉంటే, ఈ కథలు మళ్ళీ పైకి వచ్చేవా అనేది అనుమానమే.అయితే ఈ కథలేవీ కూడా తక్కువగా చూడాల్సినవి కాదు అనే నా అభిప్రాయం. ఒక రకంగా ఇవన్నీ ప్రయోగాత్మక కథనం అనే చెప్పాలి. Manners of Dying లో తప్ప మిగిలిన మూడు కథల్లోనూ ప్రోటాగనిస్ట్ వయసు రచయిత అప్పటి వయసుకి దగ్గరగా ఉండటం, నేను నేను అంటూ కథ చెప్పడం, కథలో అతని వివరాలు కొన్ని చూస్తే ఇవి semi-autobiographical ఏమో అనిపిస్తుంది.రచయిత లై ఆఫ్ పై లో చూపించిన పరిణితికి మూలం, ఈ కథలు వ్రాసే కాలం నుండే ఉంది అనేది మాత్రం స్పష్టం. ఇందులో అన్ని కథలూ కూడా ఏదో ఒకరకంగా జ్ఞాపకాలు, వాటిని పదిలపరుచుకునే తీరు, వాటి ఆసరాతో కష్టాల్లో కూడా తట్టుకుని జీవితాన్ని ఈదగలిగే స్థైర్యం చూచాయగా చెపుతాయి. ఈ పుస్తకం ప్రస్తుతం అమెజాన్లో లభ్యం అవుతోంది.

No comments:

Post a Comment