BG

Saturday, February 21, 2015

చిన్నగీత - పెద్దగీత

Out beyond ideas of
Wrong doing and right doing
There is a field.
I'll meet you there. - Rumi

రోజూ ఉదయం ఆఫీస్ కు వెళ్ళే సమయంలో ఒక నేషనల్ రేడియో షో వినడం అలవాటు. ఆ షో క్రూ మొత్తం ఒక్కోసారి ఎంత సిల్లీ విషయాల మీద చర్చలు చేస్తారో, అప్పుడప్పుడూ మనల్ని ఒక్కసారి ఆపి ఆలోచింపచేసే విషయాలనూ సిన్సియర్గా చర్చకు తెస్తారు. ముఖ్యంగా ప్రోగ్రాం లీడ్ ఏంకర్ అయితే నన్ను బలే ఆశ్చర్యపరుస్తాడు. ఒక్కోసారి వాళ్ళ సిల్లీ వాగుళ్ళకి చిరాకు వేసినా, వినడం మాత్రం మానను.

మొన్నోరోజు ఉదయాన్నే అలవాటు ప్రకారం డ్రైవ్ చేస్తూ రేడియో వింటున్నాను. ఆరోజు చర్చకు పెట్టిన విషయం, ‘ మీ పిల్లలు గే అని తెలిస్తే మీరెలా ప్రవరిస్తారు లేదా ఎలా ప్రవర్తించారు?’ అనేది. రోజూ లానే శ్రోతలు కాల్ చేసి వాళ్ళ అనుభవాలు చెపుతున్నారు. నేనూ నాకున్న ప్రిజుడిస్ తో  అయిష్టంగానే వింటున్నాను. ఒకాయన చెప్పినది వినగానే నాకు కళ్ళు చెమ్మగిల్లాయి. ఆయన ఇలా చెప్పారు. ‘నా టీనేజ్ కొడుకు గే రిలేషన్లో ఉన్నాడు. మా ఇద్దరి మధ్యా కావాల్సినంత చనువుంది. అయినా తను ఆ విషయం నాకు చెప్పడానికి బిడియపడి, తల్లికి చెపితే, తను నాతో చెప్పింది. అపుడు నేను తనని పిలిచి ఇలా చెప్పాను. “నువ్వు ఎలా ఉన్నా, ఏం చేసినా ఎప్పటికీ నా కొడుకువే. నీకూ నాకూ మధ్య బంధంలో గానీ, నాకు నీమీద ఉన్న ప్రేమలో గానీ  ఏమాత్రం మార్పు రాదు. అయితే ఇపుడు బానే ఉంటుంది. కొన్నేళ్ళ తరువాత నువ్వెలా గుర్తింపబడాలనుకుంటున్నావూ అన్నది పూర్తిగా నీ నిర్ణయం.  ఫలానా గే జో అనో, ఫలానా ఇంజినీర్ జో అనో, లేదా ఆ మెకానిక్ జో అనో ఇలా నీకే గుర్తింపు కావాలో అన్నది నువ్వే నిర్ణయించుకోవాలి. నీకేం సహాయం కావాలన్నా చెయ్యడానికి నేనున్నాను.” ‘అని చెప్పారు. లోకాలు తలక్రిందులయిపోయినట్టు కాకుండా, అలా అతి చిన్నవిషయంలా తీసుకుని, సంతులనంతో ప్రవర్తించడం ఎంత కష్టం!!!!

నాకు చిన్న గీత - పెద్ద గీత సారూప్యం, Memories in March సినిమా, రూమీ వాక్యాలూ కలిసికట్టుగా గుర్తొచ్చాయి. ఆ సినిమాలో గే పాత్రధారి రితుపర్ణో ఘోష్, ఇంకో గే పాత్రధారి తల్లిని (దీప్తి నావల్), ‘నీకు నీ కొడుకు పోయాడన్న విషయమా, లేదా అతను గే అని తెలియడమా ఎక్కువ బాధ కలిగిస్తున్నది’ అని అడుగుతాడు. ఆ తల్లి మాత్రం ఏం చెప్పగలుగుతుంది??? ఏ తల్లికయినా జవాబు తేల్చుకోగలిగే గుండె నిబ్బరం, ఎన్ని జన్మలెత్తినా వస్తుందా??? హ్మ్మ్ ...

కులాలను దాటి, మతాలను వీడి సంబంధాలు నిలుపుకోడం కొత్తేం కాకపోయినా, గత రెండు దశాబ్దాలుగా అతిసాధారణం అయిపోయింది. అసహజ సంబంధాలకు సమానహక్కుల పోరాటం జరుగుతున్న కాలంలో ఉన్నాం. అయితే మాత్రం, కొత్తనీటి ప్రవాహంతో కొట్టుకుపోకుండా, ఇసుకలో కాళ్ళు అదిమి నిల్చోగలిగే నిబ్బరం, నాలాంటి సామాన్యులకి సాధ్యమేనా??? గత పదిహేనేళ్ల కాలంలో, పిల్లల గురించిన చర్చల్లో ‘పిల్లలు తెలుగు వాళ్లనే చేసుకోపోయినా పర్లేదు. ఫలానా ఉత్తరాది వాళ్ళు కాకుండా ఉంటే చాలు’ నుంచి, ‘ఇండియన్సే అక్కర్లేదు. ఫలానా జాతి వాళ్ళని తప్ప, ఇంకెవరయినా పర్లేదు’ ను దాటి, ‘ఏ దేశం వాళ్ళనయినా పర్లేదు, కానీ ఆడపిల్లలు మగపిల్లవాడిని, మగపిల్లాడు ఆడపిల్లనీ చేసుకుంటే అంతే చాలు’ అనే నిట్టూర్పుల వరకూ ప్రత్యక్ష్య సాక్షిని. అయితే చిన్నగీతకు గుర్తింపు పెద్దగీత గీయకుండా సాధ్యం కాదా???

మళ్ళీ నాలో అదే ప్రశ్న. జీవితాలన్నీ ముందే రాసిపెట్టుకున్న సమీకరణాల హద్దుల్లో సాగితే ఏడు రంగుల ఇంద్రధనసుకి ఎనిమిదో వర్ణాన్ని అద్దేదెవరూ? అయితే ఆ కొత్తవర్ణాలను ఆహ్వానించడానికీ, ఆస్వాదించడానికీ నేను సిద్ధంగా ఉన్నానా??? కాలమే జవాబు చెప్పాలి. 






No comments:

Post a Comment