BG

Tuesday, June 4, 2024

ఆటా నవలల పోటీలు – నా అనుభవం

చిన్నప్పటినుండీ, నాకు దొరికిన ఏ కాగితం ముక్కనీ చదవకుండా పడేసింది లేదు. అది సరుకులు కట్టి, నలిగి చిరిగిన కాగితం అయినా, నూనె మరకల పకోడీ పొట్లం అయినా సరే వదిలేది లేదు. అక్షరాల మీద నా ఆకలి అలా ఉండేది. ఎవరి దగ్గర పుస్తకం ఉన్నా, సిగ్గుపడకుండా అడిగి తెచ్చుకుని చదివేసేదాన్ని. అయితే, ఎప్పుడూ ఒక పుస్తకానికి పరిచయం లాంటిది రాయగలను అన్న ఆలోచన కూడా లేదు, అటువంటిది, పుస్తకాల పోటీకి న్యాయనిర్ణేతగా ఉండటమా? నేను కలలో కూడా ఊహించని విషయం అది. అయినా, ఆ అవకాశం నాకు ఇప్పటికి రెండు సార్లు కలిగింది. 

ఎప్పుడూ కథలు, నవలల పోటీల ఫలితాలు చూడటమే తప్ప, అవి జరిగే విధానం గురించి నాకు ఏమాత్రం అంచనా లేదు. కానీ, గత కొన్నేళ్లుగా, ఈ నవలల పోటీల గురించీ, కథాసంకలనాల్లో కథల ఎంపిక గురించి చాలా గాసిప్స్ నా చెవిన పడుతూ ఉన్నాయి. మొదటిసారి ఈ ప్రక్రియలో భాగమైనపుడు, నా అనుభవం నేను విన్నదానికి పూర్తిగా విరుద్ధంగా ఉంది. ఆ గాసిప్స్ నేపధ్యంలో నా అనుభవం గురించి రాయాలని అనిపించింది, కానీ కుదరనే లేదు. ఈ సంవత్సరం ఆ అవకాశం మళ్ళీ వచ్చింది. ఇప్పుడు కూడా నా అనుభవం క్రిందటిసారి లాగానే, చెప్పాలంటే ఇంకాస్త బెటర్ గా కూడా ఉంది. 


మార్చి 2022 లో ఆటా నవలల పోటీ నిర్వాహకులూ, స్నేహితులూ అయిన రవి వీరెల్లి గారు, ఆ సంవత్సరం జూలై లో జరగబోయే 17వ ఆటా మహాసభల సందర్భంగా నిర్వహిస్తున్న నవలల పోటీకి సహాయం కావాలని అడిగారు. సహాయం అంటే ఏం చెయ్యాలి అని అడిగితే, ‘ఏమీ లేదు. కొన్ని నవలలు చదివి ఒక అయిదు పుస్తకాలు షార్ట్ లిస్ట్ చేయాలి’ అన్నారు. బోలెడు పుస్తకాలు చదివే అవకాశం సులభంగా దొరుకుతుంది అనే అత్యాశతో ఎగిరి గంతేసి ఒప్పుకున్నాను. 


సం. 2022 & 2024 లో, రెండుసార్లూ కూడా, వచ్చిన నవలల స్క్రీనింగ్, బహుమతి కోసం నవలల ఎంపిక దాదాపు ఒకే పద్ధతిలో జరిగింది. మొదటగా నాకు జడ్జీలు పాటించాల్సిన నిబంధనలు వివరించారు.


  • నేను ఆటా నవలల పోటీకి జడ్జీగా ఉన్నట్టు, పోటీ పూర్తయేవరకు ఎవరికీ చెప్పకూడదు. 
  • మా బృందంలో మిగిలిన సభ్యులు ఎవరో, మా లిస్ట్ రెడీ అయి, మొదటి మీటింగ్ సమయం వరకూ చెప్పరు. 
  • రచయితల పేర్లు గానీ, నవలల గురించి ఇంకే వివరాలూ చెప్పరు. కనీసం రచయిత/రచయిత్రి అనేది కూడా తెలీదు. (రెండుసార్లూ కూడా, పోటీ పూర్తయ్యి, బహుమతి నిర్ణయం అయ్యాకే, ఆ రచయితల పేర్లు చెప్పారు. అప్పటికీ, పైనల్ లిస్ట్ లోకి వచ్చిన నవలల తాలూకు రచయితల పేర్లు తప్ప, మిగిలినవాటి వివరాలు తెలీవు.) 
  • బహుమతి పొందిన రచనల గురించి తప్ప, పోటీకి ఇంకేం నవలలు వచ్చాయో, ఫైనల్ రౌండ్ వరకూ ఏ నవలలు వచ్చాయో (నవల పేరు, రచయిత పేరు) కూడా మేము, బయట ఎపుడూ, ఎవరికీ చెప్పకూడదు. 

విభిన్నమైన నేపధ్యం ఉన్న నలుగురిని న్యాయనిర్ణేతలుగా ఎంచుకున్నారు. మొదటి రౌండ్ లో, ఒక ఇద్దరు, ముగ్గురు కలిసి, పోటీ కోసం వచ్చిన దాదాపు వంద నవలలను చదివి, స్క్రీన్ చేసి, అందులోంచి ఒక ఇరవై నవలలను ఎంపిక చేశారు. గూగుల్ డ్రైవ్ లో టాప్ 5, టాప్ 20, రిజెక్టెడ్ అని ఫోల్డర్స్ పెట్టి, అందులో ఈ నవలలు పెట్టి, న్యాయనిర్ణేతలకు వేర్వేరుగా షేర్ చేశారు. (ఎవరెవరితో షేర్ చేశారో కూడా తెలియలేదు నాకు.) మాకు వాటిని చదవడానికి ఒక రెండు నెలల సమయం ఇచ్చారు. వాటిని చదివి, మాకు నచ్చిన అయిదు నవలలు సెలెక్ట్ చేసుకుని, వాటికి మాకు నచ్చిన వరసలో, ఒకటి నుండి అయిదు స్థానాలలో పెట్టమని చెప్పారు. టాప్ 20 లో ఉన్న నవలలే కాకుండా రిజెక్టెడ్ ఫోల్డర్ లో ఉన్నవాటిని కూడా ఒకసారి చదివి చూడమని చెప్పారు. పొరపాటున అర్హత ఉన్న ఏ నవలైనా మిస్ అయితే, దాన్ని టాప్ 20 లోకి చేర్చే అవకాశం న్యాయనిర్ణేతలకి ఎప్పుడూ ఉంటుంది. (ఒకసారి , ఒక జడ్జి టాప్ 20 లో ఉన్న దాన్ని చదివి సజెస్ట్ చేయడం వలన, దాన్ని అందరు జడ్జీలు చదివి టాప్ 5 లోకి సెలెక్ట్ చేశాము.) 

 ఆ రెండు వారాల్లో, ఒకటి రెండు సార్లు ‘చదువు ఎలా సాగుతుంది’ అనో, ‘ఇచ్చిన సమయంలో మీ సెలెక్షన్ పూర్తి అయి, అందరితో కలిసి చర్చకు రెడీగా ఉండగలరా’ అనో రవి మెసేజ్ చేశారు. 

అది తప్ప ఇక వేరే ఏ విధం గానూ ఆయన కలిగించుకోవడం గానీ, నా ఎంపికను ఇన్‌ఫ్లూయెన్స్ చేసే ప్రయత్నం గానీ చేయలేదు. రెండు నెలల గడువు తర్వాత, అందరు జడ్జీలకు కలిపి ఒక మీటింగ్ పెట్టారు. మీటింగ్ కు ముందుగానే మేము ఎంచుకున్న నవలల లిస్ట్ తీసుకున్నారు. అప్పుడు కూడా నాకు మిగిలిన వాళ్ళ లిస్ట్ చెప్పలేదు. ఆ మీటింగ్ లోనే జడ్జీలు కలుసుకున్నాము. ఒక్కొక్కరం, వాళ్ళు సెలెక్ట్ చేసిన నవలలు, వాటికి ఆ స్థానం/రేంక్ ఎందుకు ఇచ్చామో వివరించాము. ఒక నవల ఇద్దరి లిస్ట్ లో మొదటి స్థానంలో ఉంటే, వేరొకరికి రెండో స్థానం లోనూ, ఇంకొకరికి మూడో స్థానం లోనూ ఉండేది. రెండు, మూడు స్థానాలలో ఎంచినవి కూడా ఒక్కొక్కరి లిస్ట్లో వేరు వేరుగా ఉన్నాయి. అందరి అభిప్రాయాలు విన్న తర్వాత, కొందరం వాటిని అంగీకరించి మా లిస్ట్ లో ఏవో చిన్న మార్పులు చేసుకున్నాం కానీ, మొదటి మూడు స్థానాలు నిర్ణయించడానికి కష్టం గానే ఉండేది. ‘మళ్ళీ అయిదు నవలలూ, మిగిలినవారు చర్చించిన అంశాలు కూడా దృషిలో పెట్టుకుని చదివి, ఒక వారంలో తిరిగి కలుద్దాం’ అని రవి సూచించారు.

తదుపరి మీటింగ్ సమయానికి, మేమందరమూ మళ్ళీ వాటిని చదివి, మళ్ళీ వాటి రేంకింగ్స్ సరి చూసుకుని రెడీ అయ్యాము. ఈసారి మొదటి మూడు స్థానాలలో అందరూ ఎంపిక చేసినవి ఒకటే అయినా, ఏకాభిప్రాయం మాత్రం కుదరలేదు. దాదాపు రెండు గంటల వాదోపవాదాలు, ఘాటైన చర్చలు జరిగాయి. ఎవరి తరపు కారణాలు, వారికి కనిపించిన పాజిటివ్ అంశాలు లేదా అభ్యంతరాలు వివరించాము. షార్ట్ లిస్ట్ అయిన మూడు నవలలు మళ్ళీ చదివి, కొన్ని రోజుల్లో కలుద్దాం అని అనుకున్నాము. 

షార్ట్ లిస్ట్ లోకి వచ్చిన నవలలు మూడు మళ్ళీ చదివి, మా నిర్ణయాన్ని వివరిస్తూ పాయింట్స్ రాసుకుని, కలిసాము. వస్తువు, రచనా శైలి మాత్రమే కాకుండా, రచనలో ప్రస్తావించిన/సూచించిన విషయాలు పాఠకులను misguide చేస్తాయా, బహుమతి ఇస్తున్న సంస్థ ప్రతిష్ఠకు అపవాదు వస్తుందా అనే కోణంలో కూడా చర్చించాము. అందరి మధ్య చర్చలూ, వాదనలూ, సమర్థనలూ జరిగాక, బహుమతికి అర్హమైన నవలల నిర్ణయం జరిగింది. 

బహుమతి కోసం ప్రతిపాదించిన నవలలను, ఆ సబ్జెక్ట్ లో అనుభవం ఉన్న, తటస్థులయిన బయటి వ్యక్తుల చేత కూడా చదివించారు. జడ్జీలకు కొన్ని విషయాల్లో సందేహం వచ్చినపుడు, వాటి పట్ల అనుభవం/అవగాహన ఉన్నవాళ్ళతో చదివించి అభిప్రాయం తెలుసుకున్నాము. రెండుసార్లూ కూడా అది మాకు చాలా సహాయపడింది. మూడు నాలుగు విడతల చర్చల తరువాత కూడా, బహుమతికి ఎంచిన నవలలపై ఒక జడ్జీ నిర్ణయం వేరుగా ఉన్నప్పటికీ, ఎక్కువ మంది ఎన్నిక చేసిన నవలలకు ఇవ్వడానికి, ఆ జడ్జీ కూడా అంగీకరించారు. అప్పుడు బహుమతి పొందిన రచనల తాలూకు వివరాలు మాకు చెప్పారు రవి. దానికి ముందు, నవల శైలిని బట్టి రచయితని గెస్ చేసే ఆట ఆడాం. కొందరు కొన్ని సరిగానే ఊహించగలిగారు. 

రచనలో కనిపించిన అచ్చుతప్పులు, అవసరమైన ఎడిటింగ్ సూచనలు రవికి పంపించాము. బహుమతి నిర్ణయం ప్రకటించే ముందు, జడ్జీల సూచనలను రచయితలకు పంపి, ఆ సూచనలు అమలుపరిచే అంగీకారం తీసుకుంటారు. తరువాత జడ్జీలకు, రచయితకు కలిపి మీటింగ్ పెట్టారు. అందులో జడ్జీలు తమ సూచనలను, కారణాలతో సహా రచయితకు వివరించాము. బహుమతి ప్రకటన జరిగాక, జడ్జీలలో ఒకరు గానీ, లేదా వేరే సాహితీ మిత్రులు గానీ, రచయితలతో కలిసి పనిచేస్తూ, ఎడిటింగ్ పనిలో సహాయం చేశారు. ప్రచురణకి యోగ్యమైన ప్రతి తయారయేవరకు, ఎడిటింగ్, పర్యవేక్షణ పనులు సాగాయి. 

ఈ పోటీకి 2022 లో స్వాతి, రవి కలిసి మొదటి విడత స్క్రీనింగ్ చేసి టాప్ 20 లిస్ట్ చేశారు. రమణమూర్తి గారు, అనిల్ రాయల్ గారు, స్వాతి బండ్లమూడి గారు, నేను జడ్జీలుగా ఉంటే, రమణమూర్తి, స్వాతి, రవి ఎడిటింగ్ కో-ఆర్డినేషన్ బాధ్యతలు వహించారు. 2024 లో పోటీకి, రవీ, నేనూ కలిసి, పోటీకి వచ్చిన నవలలు అన్నీ చదివి టాప్ 20 నవలలు ఎన్నుకున్నాము. శంకగిరి నారాయణస్వామి (నాసీ) గారూ, శివ సోమయాజుల గారూ, గొర్తి సాయి బ్రహ్మానందం గారూ, నేనూ న్యాయనిర్ణేతలుగా ఉన్నాము. సాయి గారు, రవి ఎడిటింగ్ కో-ఆర్డినేషన్ బాధ్యతలు వహించారు.

జడ్జీలు అందరమూ, మేము బహుమతికి ఎంచిన నవలల ప్రత్యేకత, ఎందువల్ల అవి బహుమతికి అర్హమని నిర్ణయించామో వ్రాసి పంపించాము. ముఖచిత్రాలు వచ్చిన తరువాత, మార్పులూ చేర్పులూ సూచించడం, పబ్లిషర్ నుంచి వచ్చిన ప్రూఫ్ చెక్ చేయడం వరకు, అన్ని దశల్లోనూ మా ఉడతాసాయం ఉంది. 

జడ్జీల మీటింగ్స్, జడ్జీలు-రచయితలతో మీటింగ్స్ అన్నిటినీ రవి సమన్వయం చేశారు. అవసరమయినపుడు, బయట వారిచేత చదివించి వారి అభిప్రాయం సేకరించడం కూడా చేశారు. ఇన్ని చర్చలలోనూ, ఏ పుస్తకం గురించీ సానుకూలంగా కానీ, ప్రతికూలం గానీ ఏ కామెంట్స్ ఆయన చేయకపోవడం నాకు బాగా నచ్చింది. మేము ఏదన్నా ఒక విషయం మీద కామెంట్ చేస్తే, దానికి తగిన వివరణ/నిర్ధారణ మాత్రం చేసేవారు. ఏదన్నా ఒక మంచి నవలని మా లిస్ట్ లో లేకపోతే, అది చదివారా అని మాత్రం అడిగేవారు. మొదట వడపోత సమయంలో కూడా, ఒక నవల గురించి అడిగినపుడు, దాన్ని నేను ఎందుకు లిస్ట్లో పెట్టలేదో కారణాలు వివరిస్తే, దాన్ని గౌరవించారు. మొత్తం ఈ పోటీ పూర్తయ్యే వరకూ, ఏ దశలోనూ, ఏ రకమైన ఒత్తిడి గానీ, ప్రభావితం చేయడం గానీ నిర్వాహకుల తరపు నుంచి లేదు. 

నేను ముందు చెప్పినట్టుగా, ఈ పోటీల వల్ల నాకు చాలా ప్రత్యేకమైన అనుభవం కలిగింది. ఇప్పటివరకు కేవలం పాఠకురాలిని అయిన నాకు, కొన్నిసార్లు నేను చేతిలో పట్టుకునే పుస్తకం, ఆ రూపంలోకి వచ్చేముందు దాటి వచ్చే దశలు తెలిసాయి. నాకు చాలా పుస్తకాలు చదివే అవకాశం కలిగింది. (ఇది కొంచెం ఇష్టం, కొంచెం కష్టం కూడా.) ఒక పుస్తకం గురించి వైవిధ్యమైన ఆలోచనా పద్ధతిని, ముఖాముఖీ చర్చించుకునే, తెలుసుకునే అవకాశం కలిగింది. కొన్ని కొత్త స్నేహాలు కూడా కలిశాయి. 

అన్నిటికన్నా ముఖ్యంగా, ఈ పనికి ఎంత శ్రమ, శ్రద్ధ, సమయం, పేషన్ ఉండటం అవసరమో తెలిసింది. దాన్ని ఏళ్లుగా ప్రతిఫలం లేకుండా చేస్తున్న వాళ్ళందరి పైనా నాకు గౌరవం పెరిగింది. (మొదట విడత వడపోత ఒక్కటే చాలు, ఈ థాంక్ లెస్ జాబ్ కి నమస్కారం పెట్టడానికి.) ఈ నవలల పోటీలతో ఇదీ నా అనుభవం.