BG

Sunday, February 23, 2014

స్మృతిగీతం

మాంత్రికుని ప్రాణం చిలుకలో ఉన్నట్టు 
నా పంచప్రాణాలూ నీ పిలుపు మోసుకొచ్చే నీలిపిట్టలో 

నీ కబురు తెస్తుందని 
కళ్ళల్లో అఖండజ్యోతులు వెలిగించుకుని 
మెరుస్తూ మాయమవుతూ వచ్చే నీలిపిట్ట సందడి కోసం 
అది తీసుకొచ్చే నీ పిలుపు పంచాక్షరి కోసం 
ఆ పలకరింపులోనే  మోహ మల్హార్ వినడం కోసం 
నిశిరాత్రిలో కూడా ఆ చెట్టు కొమ్మకు కళ్ళు తగిలిస్తానా  
నీకేమో నా స్మృతైనా ఉండదు

ఎక్కడో దూరం నుండి నీ పాటొకటి వినిపిస్తుంది
చిత్రవర్ణ రాగాలు ఆలపిస్తూ 
లోకాన్నంతటినీ  మైమరపులో ముంచుతూ
నాకోసం ఆ ఒక్క రాగాన్నీ దాయవూ అని అడుగుతానా 
సెలయేరులా నవ్వి మాయమవుతావు 
ఏదీ ఎప్పటిలానే నా కోరిక
నీ చెవి దాటి గుండెగదిని చేరందే

ఇదుగో నేనిక్కడ ఇంకా ఇలానే 
నీ పిలుపు కోసం వేచి చూస్తూ...
యుగాలు వేచిన తర్వాత 
ఎపుడో వస్తుంది నీలిపిట్ట 
అమాయకంగా కళ్ళు ఆర్పుకుంటూ 

నీకోసం క్షణక్షణం తపించిన ఒక జీవి  
ఇక లేదన్న సంగతి 
నీకు తెలుస్తుందా 
ఎప్పటికైనా  

ఇంకా ఇక్కడే
పిట్ట వాలే చెట్టుకొమ్మకు 
హృదయాన్ని తగిలించి వూగిసలాడుతూ 
పురాస్మృతి గీతాలు పాడుకుంటూ 
నీ నవ్వు కోసం ...
నీ పాట కోసం ...
నీ పిలుపు కోసం ...
ఆ ఒక్క రాగం వినడం కోసం ...

Saturday, February 1, 2014

ఓ మతిమరపు ప్రొఫెసర్ ప్రేమకధ - The Housekeeper and the Professor




మనిషికి మరపు ఒక వరం. మరి ఆ మరుపే మనిషికి జీవితమయిపోతే??? ఓ మతిమరపు ప్రొఫెసర్, ఆయన అవసరాలు చూడటానికి ఏర్పాటు చెయ్యబడ్డ సహాయకురాలు, ఆమె కొడుకు... వీళ్ళ ముగ్గురి అపురూపమయిన, స్వచ్చమయిన ప్రేమకధకు పుస్తకరూపం జపాన్ కు చెందిన రచయిత్రి Yoko Ogawa  వ్రాసిన The Housekeeper and the Professor. 

ఈ పుస్తకానికి పరిచయం కౌముది సాహిత్య పత్రిక ఫిబ్రవరి సంచికలో 'పుస్తకం ఓ నేస్తం' శీర్షిక లో ...