BG

Saturday, January 9, 2021

యారాడకొండ

 దిల్ ధూండ్తా హై వొహీ పుర్సత్ కే రాత్ దిన్... మేము చిన్నప్పుడు ఓ మూడేళ్లు వైజాగ్లో పూర్ణామార్కెట్ దగ్గర అద్దెకు ఉండేవాళ్లం. అంతకుముందు అమ్మా, నాన్నా ఇద్దరి ఉద్యోగ రీత్యా చోడవరానికి దగ్గర్లో ఉన్న ఓ పల్లెటూరు. పుట్టిందీ, ఎలిమెంటరీ స్కూల్ చదువూ అక్కడే. వైజాగ్ కి వచ్చాకా నన్ను కురుపాం మార్కెట్ దగ్గర ఉన్న మహారాణీ విద్యాదేవి హైస్కూల్ లోనూ, తమ్ముళ్ళని ఇంటిగలవాళ్ళ పిల్లలతో పాటూ సెయింట్ ఆంథోనీ స్కూల్లోనూ జాయిన్ చేసారు. నేను అక్కడే 7 నుండి 9 వరకూ చదువుకున్నాను.

స్కూల్ ఎదురుగా రోడ్ దాటితే లక్ష్మీ టాకీస్, అక్కడ నుండి కొంచెం దిగువగా నడిస్తే పాతపోస్టాఫీస్, క్వీన్ మేరీస్ హైస్కూల్, సోల్జర్స్ కాలనీ, ఇరుకు సందుల్లోంచి నడిస్తే వెంకటేశ్వరస్వామీ గుడి, సాగరదుర్గ గుడీ (పాత బస్తీ) వచ్చేవి. ప్రతీ నెలా రెండో శనివారం స్కూల్ సగం రోజే ఉండేది. ఆ శనివారం మధ్యానాలూ, ఎప్పుడన్నా సడన్గా స్కూల్ మధ్యలో పంపేసినప్పుడూ స్నేహితులం కలిసి సినిమాకో, ఈ పాతబస్తీకో విహారానికి పోయేవాళ్ళం. అందులో ఎక్కువసార్లు పాతబస్తీ వైపే ఉండేది. లక్ష్మీ టాకీస్ నుండి మొదలు పెట్టి పాతబస్తీ మీదుగా కానీ, లేదా వెనుకవైపు కురుపాం మార్కెట్ మీదుగా కానీ పాతపోస్టాఫీసుకి చేరేవాళ్ళం. అక్కడ నుండి ఒకవైపు వెళ్తే ఎగువగా ముస్లిములు ఉండే కొంచెం ఇరుకు సందులు. వీధిలో తాళ్ళ మీద కలర్ డై చేసి ఆరబెట్టిన బట్టలేవో ఎగురుతూ ఉండేవన్నది లీలగా గుర్తు. అక్కడ నుండి లోపలికి వెళ్తే ఓ వైపు గుట్ట మీద మసీదు, ఒక వైపు చర్చ్. ఇంకో పక్క వెంకటేశ్వరస్వామి గుడి. ఇంకోదారి కొంచెం విభిన్నంగా ఉండే కట్టడపు ఇళ్ళ ముందు నుంచీ సాగి సముద్రపు ఒడ్డు మీదుగా గుడికి చేరేది. ఆ ఇళ్ళలోనుంచీ వచ్చే వంటకాల వింత వాసనలూ, లీలగా వినిపించే సంగీతం (అదేంటో అప్పటికి మాకెవరికీ తెలీదు) పాతపోస్టాఫీసు జంక్షన్లో టీ తాగుతూ కనిపించే గూర్ఖాలూచుట్టుపక్కల ఉన్న క్రిష్టియన్ స్కూళ్ళ నుండీ ఇళ్లకు వెళుతూ కనిపించే నన్స్ (మబ్బురంగు లాంగ్ గౌన్లలో, తెల్లటి శరీర చాయతో బలే ఉండేవారు) అదో వింతలోకం మాకు. అసలు ఆంగ్లో ఇండియన్స్ నివాసం ఉండేది లక్ష్మీ టాకీస్ దగ్గర్నుంచీ మొదలవుతుంది. బహుశా అక్కడ దిగువతరగతి వాళ్ళు, ఈ సముద్రపుటొడ్డున మంచి ఇళ్ళల్లో పెద్ద ఉద్యోగులూ ఉండేవారేమో అని ఇప్పుడు అనిపిస్తుంది. 

గుడి మెట్లమీదుగా పైకి వెళ్లి విశాలమయిన ముందు హాల్లోకి వెళితే, ఒక వైపుగా సముద్రం, జెట్టీలు, సాగరదుర్గ గుడి, హార్బర్ కనిపిస్తూ ఉండేవి. అందరూ గుడంతా తిరుగుతూ అన్నీ చూస్తుంటే నేను మాత్రం ఆ గోడకే అతుక్కుపోయి గంటలు గడిపేసేదాన్ని. సముద్రం మీద నుంచీ వీచే చల్లని గాలి, దూరంగా కనిపించే దుర్గ గుడీ, యారాడకొండా, లైట్ హౌస్, సముద్రంలోని చిన్న పడవలూ, హార్బర్లో క్రేన్స్, ఆకుల గలగల కూడా వినిపించే నిశ్శబ్దం... అదొక సెరీన్ అనుభూతి. అప్పుడప్పుడూ పక్క కొండ మీద చర్చ్ నుంచీ వినిపించే గంటలూ. ఎప్పుడన్నా అక్కడున్నప్పుడు ఓమాదిరి వర్షం పడితే, ఆ వర్షంలో వాటి అందాన్ని వర్ణించడం సాధ్యం కాదు. అక్కడ నుంచి అందరూ తిరిగి వెళ్ళే సమయానికి ఆ గోడ దగ్గర నుంచి నా కాళ్ళను బలవంతగా ఊడదీసి తీసుకువెళ్ళాల్సి వచ్చేది. 

అక్కడ నుండీ సముద్రపు ఒడ్డున నడుచుకుంటూ టౌన్ హాల్ మీదుగా ఆర్కే బీచ్ దగ్గర తేలేవాళ్ళం. మధ్యలో జాలరి పేట దాటుతుండగా చిన్న చిన్న గుడిసేలూగుప్పున కొట్టే ఎండు చేపల వాసనాఇసుకలో ఆరబెట్టిన చేపలూ వలలూఇసుకలోంచి బయటకు తొంగిచూసే పీతలూ గవ్వలూ ఎండ్రకాయలూ, విరిగిన చిన్న చిన్న పడవలూ ... ఆడుతూ పడుతూ అన్నిటినీ ముట్టుకుంటూ సాగేది మా ప్రయాణం. ఆర్కే బీచ్ దగ్గర విడిపోయి మహారాణీ పేట మీదుగా ఇంటికి చేరేవాళ్ళం. ఒక్కోసారి మధ్యలో చెంగల్రావుపేట వీధుల గుండా ఫ్రెండ్స్ ఇళ్ళ దగ్గర ఒక మజిలీ చేసి, మళ్ళీ కురుపాం మార్కెట్ దగ్గర తేలేవాళ్ళం. 

కొన్నిసార్లు శనివారం సాయంత్రం ఇంట్లో అందరం అదే గుడికి సాయంత్రం ఆరు తర్వాత అభిషేకం జరిగే టైంకి వెళ్ళేవాళ్ళం. అప్పటి వాతావరణం వేరుగా ఉండేది. అందరూ పూజలో కూర్చొంటే నా స్థానం మాత్రం ఆ మంటపం గోడ దగ్గరే ఉండేది. ఆ చీకట్లో సముద్రాన్ని, హార్బర్ చూడడం ఇంకో అనుభూతినిచ్చేది. ఇంటి దగ్గర దాదాపు ఒకేవయసు పిల్లలం ఓ పదిమంది ఉండేవాళ్లం. ఆదివారం సాయంత్రం అందరం నడుచుకుంటూ, పూర్ణామార్కెట్, రెల్లివీది, కలెక్టరేట్ మీదుగా నడుచుకుంటూ బీచ్కి వెళ్లి, చీకటి పడేవరకూ సముద్రంలో తడిసి ఇసకలో దొర్లి ఎప్పటికో ఇంటికి చేరేవాళ్ళం. దూరాలూ, అలసటలూ తెలీని వయసది. తరువాత అక్కడనుండి మారి సిటీకి కొంచెం దూరంగా వెళ్ళిపోయాము. హైస్కూల్, డిగ్రీ అయిపోయాయి. తరువాత తొంభైల్లో ఆంధ్రా యూనివర్సిటీలో MCA చదువుతూ,లేడీస్ హాస్టల్లో ఉండేటప్పుడు మళ్ళీ సముద్రపు ఒళ్లోకి వచ్చిపడినా, ఆ స్నేహాలూ అనుభవాలూ సోఫిస్టికేషణ్ అద్దుకున్నవి. స్కూల్ రోజుల ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కడున్నారో కూడా తెలీదు. ఆ రోజులూ, ఆ మధ్యాహ్నాలూ, ఆ తూరుపు గాలులూ ఇంకా మనసుని చల్లగా తాకుతూనే ఉంటాయి ఇప్పటికీ.

95లో దేశం వదిలి వచ్చేసాక, వెళ్ళినప్పుడల్లా అది చూడాలి ఇది చూడాలి ఆ రోడ్లు తిరగాలి అనుకుంటానే గానీ ఉన్న కొంచెం సమయంలో ఎప్పుడూ కుదిరేది కాదు. ఒక పదిహేనేళ్లనుండీ అయితే ఎప్పుడూ తిరిగిన రోడ్లు కూడా గుర్తు పట్టలేనంతగా మారిపోయి అపరిచితమైపోయాయి. జగదంబా జంక్షన్ లేదు, యూనివర్సిటీ గేట్స్ కాదు, ఆర్కే బీచ్ ఏవీ నాకు తెలిసిన రూపంలో లేవు. గుండెలో ఎక్కడో చివుక్కుమని గుచ్చుకున్న బాధ. నేను ఎగిరెళ్లిపోలేదూ అలాగే ఇదీనూ అని సర్దిచెప్పుకుంటాను. తరువాత ఇదెలా ఉంది అదెలా ఉంది అని అడగటమే మానేసుకున్నాను. 

ఇన్నేళ్ళకి ఇప్పుడు “యారాడకొండ” చదువుతుంటే మళ్ళీ అ చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ కళ్ళముందు నిలిచాయి. కథ మొదలైనప్పటి కాలానికీ, నాకు తెలిసినప్పటికీ నలభై ఏళ్ళకు పైగా అంతరం ఉన్నా, కొంచెం మార్పులతో చాలావరకూ ఆ పరిసరాలన్నీ అలానే ఉండేవి. నాస్టాల్జియాతో కొట్టుకుపోతూ, జ్ఞాపకాల ఉధృతి ముంచెత్తుతూ ఉంటే, మొదటి సగభాగం చదవడానికి నాకు ఎక్కువ టైం పట్టింది. 

మా బంధువుల్లో తాతల కాలం నుంచీ ఈతరం వరకూ కూడా అధికశాతం ఉద్యోగాలు పోర్ట్, షిప్ యార్డ్, BHPV, స్టీల్ ప్లాంట్ లోనే. అన్ని లెవెల్స్ లోనూ ఉద్యోగాలు చేసిన వారు ఉన్నారు. అయినా కూడా ఏ రోజూ నాకు అవన్నీ ఎలా ఎవోల్యుట్ అయ్యాయో క్లూ లేదు. అసలు వైజాగ్ మీద జపాన్ బాంబ్ దాడి చేసిందన్న విషయం కూడా నాకు తెలియదు. అది జరిగిన ఆరేడేళ్ల తర్వాత గానీ మా నాన్న పుట్టలేదు, ఆయనకయినా తెలుసో లేదో మరి. స్టీల్ ప్లాంట్, BHPV విస్తరణలో మా పొలాలు పోగొట్టుకున్న విషయం తెలుసు. కాస్తో కూస్తో కాల్టెక్స్ ప్రమాదాలు తెలుసు. అన్నట్టు మా స్వంత ఊరి ప్రసక్తి కూడా ఉంది మధ్యలో. ప్రొఫెసర్ నాయుడు, సింహాచలం లాంటి రిఫరెన్సులు ఎవరివో సరిగా పోల్చుకోలేకపోయాను. వైజాగ్లో విద్యాసంస్థల మీద ఆధిపత్యం ఉన్న ఇద్దరు వ్యక్తులు గుర్తుకొచ్చారు కానీ, నాకు తెలిసిన కొద్ది బాక్గ్రౌండ్తో చూసుకుంటే సరిపోలేదు. 

కథనం సాగదియ్యకుండా క్రిస్ప్ గా బావుంది. ప్రతీ ముఖ్యమైన సంఘటననీ కూడా తక్కువ వివరాలతో చెప్పడంతో విసుగనిపించలేదు. అయితే రెండోతరం మొదలయ్యాక కొంచెం కుదించవచ్చు అనిపించినా ఇంకెలా ముగించవచ్చో కూడా తెలియలేదు. గిరిధర్ నాయర్ ఎపిసోడ్ మాత్రం చర్నాకోల్ తగిలినట్టు తగిలింది. అయితే యూనివర్సిటీ రోజుల్లో సుందరయ్య ఆదర్శాలు అంటూ పార్టీ మీటింగులకు ఉద్యమాలలో తిరిగినవాళ్ళు, తర్వాతి కాలంలో అందరికన్నా ముందు అమెరికాకు వచ్చి సెటిలవడం గుర్తొచ్చి ఎంత వాస్తవం అనిపించింది. అలాగే ఉత్తరాంధ్రా వాళ్లకు ఆత్మవిశ్వాసం తక్కువ, అందరితో పోల్చుకుని తృప్తి పడతారు అంటూ చురకలెయ్యడం చూసి భుజాలు తడుముకున్నాను. ఎపిలోగ్ అనవసరం అనిపించింది నాకు. దానితో సాంద్రత కోల్పోయిన ఫీలింగ్ కలిగింది. 

అక్కడక్కడా ఎడిటింగ్ అవసరం అనిపించింది. (కథాపరంగా కాదు గానీ, భాష పరంగా). ఉదాహరణకి 20వ పేజీలో, “కన్నబాబు ఆక్రందనలని పట్టించుకోడానికి వాళ్లకి పురసత్తు లేదు” అంటారు. అక్కడ కథని కథకుడు (యారాడకొండ/రచయిత) చెపుతున్నాడు. జాలర్లు మాట్లాడుకున్నపుడు భాషలో యాస కనిపిస్తుంది. కథకుడి భాష చదువుకున్నవాళ్ల భాషలా సోఫిష్టికేటెడ్గా ఉంది. అటువంటప్పుడు ‘పురసత్తు’ కథకుడి భాష అయ్యే అవకాశం లేదు అది ‘పుర్సత్’ అయ్యుండాలి. అలాగే ఇంకో చోట ‘బిగినెస్ జాలర్ల దగ్గర నుండి’ అంటారు. అది కూడా జాలర్ల యాస, కథకుడిది కాదు. ఇంకా చదువుతుండగా అక్కడక్కడా కొన్ని అనుమానాలూ ఆలోచనలూ రేగాయి కానీ మొదటిసారి చదువుతుండటం వలన ఎక్కువ దృష్టి పెట్టలేదు. మళ్ళీ చదవితే ఇంకొన్ని కనిపిస్తాయి. 

చివరిగా పుస్తకం క్వాలిటీ గురించి చెప్పుకోవాలి. ఖరీదు Rs225, USలో రెండు పుస్తకాలు కలిపీ $35 అన్నారు. లోపలి పేపర్ అండ్ ప్రింట్ క్వాలిటీ చాలా చాలా సాదాగా ఉంది. పుస్తకాన్నినేను చాలా జాగ్రత్తగా మల్లెపువ్వులా హేండిల్ చేస్తాను. నలపడం, ఓపెన్ చేసి బోర్లా పెట్టడం లాంటి పనులేమీ ఉండవు. అటువంటిది ఒక్కసారి జాగ్రత్తగా పట్టుకుని చదివితేనే కార్నర్స్ నలిగి పొరలు వూడటానికి సిద్ధంగా ఉంది. ఒక్కసారి చేతిలోంచి జారి మెత్తటి కార్పెట్ మీద పడింది,దానికే ముందు కవర్ పేజీ సగం వంగిపోయి లేచినిలుచుని లొంగను అంటుంది. వెనక కవర్ పేజీ పై ఎడ్జ్ కటింగ్, గరుగ్గా ఉండే దళసరి పేపర్ మడతపెట్టి చింపితే ఉన్నట్టు frayed edge. నా OCD తో పోగులన్నీ పీక్కుని, నైల్ ఫైలర్ తో పాలిష్ చేసాను. ఎంత మంచి పుస్తకమయినా ఓ నాలుగు రోజులు నిలబడేట్టు ఎందుకు వెయ్యలేరో! ఎంత రేటు పెడితే అంతా పెట్టి కొనేవాళ్ళు ఉన్నారు కదా. కొననివాళ్ళు పదిరూపాయలు పెట్టినా కూడా కొనరు. ఇక్కడ డాలర్ స్టోర్లో దొరికే పిల్లల బొమ్మల పుస్తకాలు కూడా మంచి క్వాలిటీతో ఉంటాయి. Very Pathetic.