BG

Wednesday, September 19, 2012

Life of Pi - Yann Martel


మృత్యువు ప్రాణం వెంటే వీడని నీడలా
జీవితపు సౌందర్యాన్ని చూసి ఓర్వలేని అసూయతో
వాటేసుకుంది వీడలేని ప్రేమ బంధంతో
దొరికినంతా దోచుకోవాలన్న తాపత్రయం మృత్యువుది
చిన్న గాయాలతో బయట పడాలన్న పోరాటం జీవితానిది
విషాదం క్షణకాలంలో కురిసి పోయే కారుమేఘం
విజేతలా అగాధాన్ని దాటేస్తుంది జీవితం


"The reason death stick so closely to life isn't biological necessity – it’s envy. Life is so beautiful that death has fallen in love with it, a jealous, possessive love that grabs at what it can. But life leaps over oblivion lightly, losing only a thing or two of no importance, and gloom is but the passing shadow of a cloud."


(Image Source: Google)

పైన విశాల నీలాకాశం. చుట్టూ అంతులేని మహా సముద్రం.  మధ్యలో ఒక చిన్న లైఫ్ బోట్. కొన్ని నెలలకు సరిపడా నీరూ, ఆహారం.  అనంతమయిన ఏకాంతం.  చుట్టూ అల్లుకున్న ఎల్లలు లేని ప్రశాంతత. ఇలాంటి సమయంలో ఇంకొక్క నేస్తం పక్కన తోడుంటే బాగుంటుంది కదూ. How about a Bengal Tiger? Isn’t it getting excited?

కెనేడియన్ రచయిత Yann Martel రాసిన, మాన్ బుకర్ ప్రైజ్ గెలుచుకున్న పుస్తకం Life of Pi, the fictional story of Pi Patel. మధ్యవయస్కుడు  పై పటేల్ (Piscine Molitor Patel), భార్య, ఇద్దరు పిల్లలతో కెనడా లోని టొరాంటోలో నివాసం. ఇతను రచయితకి తన జీవితం గురించి చెప్తున్నట్టు కధ మొదలవుతుంది. కల లాంటి తన గడిచిన జీవితాన్ని గుర్తు చేసుకుంటూ, మృత్యువు ఎప్పుడూ విడవకుండా నీడలా తన వెంటే ఉందనీ, అయినా తనకి దాని మీద నమ్మకం లేదనీ అంటాడు.
My life is like a Memento Mori painting from European art: there is always a grinning skull at my side to remind me of the folly of human ambition. I mock this skull. I look at it and I say, “ You've got the wrong fellow. You may not believe in life, but I don’t believe in death. Move on!” The skull snickers and moves ever closer, but that doesn't surprise me. *** Memento Mori:  A Latin phrase means "Remember your mortality"
పై పటేల్ పాండిచ్చేరీలో ఒక జూ యజమాని కొడుకు. అమ్మ, నాన్న, అన్న రవితో కలిసి జూ ప్రాంగణంలోనే నివాసం. జూ లోని జంతువులతో సావాసం. పుట్టుకతో హిందువు, కానీ పద్నాలుగేళ్ళ వయసులో క్రిష్టియానిటీ, ఇస్లాం మతాల మీద కూడా నమ్మకం కుదిరి, మూడు మతాల ప్రార్ధనలూ చేస్తుంటాడు.  పై కి పదహారేళ్ళ వయసున్నప్పుడు, అతని తండ్రి ఎమర్జన్సీ టైంలో (1976 లో) పాండిచ్చేరీలో జూ నిర్వాహకానికీ, ఇతర వ్యాపారాలకి గానీ భవిష్యత్తు అంత ఆశాజనకంగా కనిపించక, కెనడా వలస పోవాలని నిర్ణయించుకున్నాడు. జూలోని కొన్ని ముఖ్యమైన జంతువులని అమెరికాలోని కొన్ని జూలకి అమ్మేసారు. ఆ జంతువులని ఓడలో కెనడా తీసుకెళ్ళి అక్కడ అప్పగించాలని  ఒప్పందం. తన కుటుంబం తోనూ, ఆ జంతువులతోనూ కలిసి, ఒక జపనీస్ ఓడలో పసఫిక్ మహా సముద్రం మీద ప్రయాణం. ఓ మూడు నాలుగు రోజుల ప్రయాణం తర్వాత స్పష్టంగా తెలీని కారణాలతో ఓడ మునిగిపోయింది. పై మాత్రం ఎలాగో ఒక చిన్న లైఫ్ బోట్లోకి చేరుకోగలిగాడు. తన మిగతా కుటుంబం అంతా ఓడతో పాటూ మునిగిపోయింది.

ఆ లైఫ్ బోట్లో పై తో పాటూ ఒక జీబ్రా, చింపాంజీ(Orangutan), ఒక hyena, ఒక పెద్దపులి కూడా చోటు సంపాదించుకున్నాయి. జీబ్రానీ  చింపాంజీనీ hyena, hyena ని పులీ తినెయ్యగా, చివరికి పులీ, పై మిగిలారు బోట్లో. అన్నట్టు పులి గారికి Richard Parker అని ఓ మంచి పేరు కూడా ఉంది. ఒకవైపు పై కి తను ఒంటరి కానందుకు కొంచెం సంతోషం, ఒకవైపు పులితో సావాసం...క్షణక్షణగండం. ఇపుడు పై ముందున్నవి రెండు సమస్యలు... ఒకటి పులిగారికి తను ఆహారం కాకుండా ఉండాలంటే, దానికి వేరే ఆహారం సమర్పించుకోవడం. రెండు ఆ చిన్న బోట్లో ఎవరి టెరిటరీస్ ఎంతవరకో, ఎవరు ఎవరికి యజమానో స్పష్టం చెయ్యడం.

రెండో దానికి తను జూ వాతావరణంలో పెరిగి, అక్కడ తండ్రి నుంచీ, ఉద్యోగుల నుంచీ గ్రహించిన ఏనిమల్ సైకాలజీ, ట్రైనింగ్ సమయానికి ఉపయోగపడ్డాయి. కానీ చుట్టూ అగాధం లాంటి మహా సముద్రంలో, పులి తినగలిగే ఆహరం సంపాదించడం ఎలా? పాపం దానికోసం పడరాని పట్లు పడ్డాడు. శుద్ధ శాకాహారి అయిన తను, సముద్రంలో దొరికే చేపలూ, తాబేళ్ళూ పట్టి, వాటిని చంపి పులి ఆకలి తీరుస్తాడు. మొదటిసారి చేపను పట్టుకొని, దానిని చంపడానికి ఒక దుప్పటిలో చుట్టి, గొడ్డలితో కొట్టడానికి పడే సంఘర్షణ నుండి, పాశవికంగా వట్టి చేతులతో కొట్టి చంపగలిగే మనస్థితికి చేరుకుంటాడు. ఆ నేపధ్యంలో పడిన వేదన, నెమ్మదిగా ఆ పనికి అలవాటు పడి యాంత్రికంగానూ కొంచెం క్రూరంగానూ మారిన వైనం చదువుతుంటే కొంచెం వొళ్ళు జలదరిస్తుంది. జంతువుతో సమానంగా దొరికిన అడ్డమైన దాన్నీ తినడం ... అసహ్యంతో పొట్టలో దేవేస్తుంది. కానీ అలాంటి గత్యంతరం లేని పరిస్థితుల్లో మనిషికి వేరే దారి, విచక్షణ ఉండవు మరి.
Lord, to think that I’m a strict vegetarian. To think that when I was a child I always shuddered when I snapped open a banana because it sounded to me like the breaking of an animal’s neck. I descended to a level of savagery I never imagined possible.

పులికి సరిపడా తిండి పెట్టాక, దానికి తన లిమిట్స్ ఏంటో తెలియచేయ్యడానికి, సర్కస్లో ఉపయోగించే ట్రైనింగ్ పద్ధతులు ఉపయోగిస్తాడు.  బోట్లో ఒక వైపు మాత్రమే పులి తిరగగలిగిన ప్రదేశమనీ, ఆ లిమిట్స్ దాటి బయటకు రావటానికి వీల్లేదనీ తెలియచేసి, తన చుట్టూ ఒక రక్షణ కవచం కట్టుకున్నాడు. అయినా కూడా భయమే, ఏ నిద్రపోతున్న క్షణంలోనో అది మీదపడి అంతు చూస్తుందేమో అని.  అసలు బోట్ లోంచి   పులి ఆదమరపుగా ఉన్నప్పుడు సముద్రంలోకి తోసేద్దామా అనుకుంటాడు కూడా ఒకసారి, కానీ ఒంటరిగా ఆ బోట్లో గడపటం కన్నా రిస్క్ తీసుకుని పులితో కలిసి బ్రతకడమే మేలు అనుకుంటాడు. కొన్నాళ్ళకి ఇంకొక షిప్ దూరంనుంచి వెళ్తుంటే చూసి, చూడు చూడు రిచర్డ్ పార్కర్, మనం రక్షించబడే సమయం వచ్చేసింది, ఎంతో సేపు పట్టదు అని ఆనందపడతాడు.  కానీ అందులో ఎవరూ వీళ్ళని చూడకుండానే దూరమయిపోతారు.

అలా ఆ లైఫ్ బోట్లో పులితో కలిపి దాదాపు ఏడు నెలలు సముద్రంలో గడిపిన తర్వాత, మెక్సికో తీరం చేరుకుంటాడు. పై కూడా చివరికి కధ సుఖాంతం అవుతున్నందుకు సంతోషపడి, ఇన్నాళ్ళు తను ఒంటరితనంతో చావకుండా తనకి తోడున్నందుకు పులికి థాంక్స్ చెప్పి వీడ్కోలు తీసుకుందాం అనుకున్నాడు. ఇంకా ఎక్కడ పులి? తీరం చూడగానే పులి ఒక్క దూకు దూకి, ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడకుండా ప్రక్కనే ఉన్న అడవుల్లోకి పరిగెడుతుంది. "అయ్యో, రిచర్డ్ పార్కర్ నాకు ఆఖరిసారి వీడ్కోలు కూడా చెప్పకుండా ఎలా వెళ్ళిపోయాడో, ఇన్నాళ్ళు ఒకరికొకరం తోడుగా ఉన్నాం కదా, అలా ఎలా చెయ్యగలిగాడు?" అంటూ పై బాధపడతాడు. అన్ని నెలలుగా సరైన తిండి లేక, ఎండకు ఎండీ వానకు తడిసీ సరిగా నిలబడే శక్తి కూడా లేదు పై కి.  పై అక్కడ తీరంలో స్పృహ తప్పి పడి ఉంటే, కొందరు మెక్సికన్లు అతనిని చూసి వూర్లోకి తీసుకెళ్ళి శుభ్రంగా స్నానం చేయించి, తిండి పెట్టి హాస్పిటల్లో చేరుస్తారు.

పై హాస్పిటల్లో ఉండగానే, జపనీస్ ట్రాన్స్ పోర్ట్  మినిస్ట్రీ నుండి ఇద్దరు ఉద్యోగులు పై ని కలవడానికి వస్తారు. తమ షిప్ మునిగిపోడానికి కారణం ఏంటో చెప్తాడేమో అని వాళ్ళ ఆశ. పాపం ఎంతసేపూ నేనూ రిచర్డ్ పార్కర్ అంటూ కధలు చెప్తాడే గానీ, షిప్ కి ఏం జరిగిందో తెలీదు పొమ్మంటాడు. ఆ విషయం రాబట్టడానికి వాళ్ళు నానా రకాలుగా ప్రయత్నించి విసుగెత్తి వెళ్ళిపోవాలనుకుంటారు. అయితే మీరు నా కధ నమ్మటం లేదా అని అడిగాడు. ఋజువు చూపిద్దామంటే ఉన్న ఒకే సాక్షి రిచర్డ్ పార్కర్  కనీసం చెప్పకుండా వెళ్ళిపోయాడు అని వాపోయాడు. వాళ్ళు అలా కాదు గానీ, వేరే ఇంకేదన్నా నమ్మదగిన కధ చెప్పు చూద్దాం అన్నారు. సరే అని తను ఇంతకూ ముందు చెప్పిన కధే పాత్రలు మార్చి చెప్పాడు.

ఈసారి కధలో బోట్లో తనతో పాటూ తన అమ్మ, షిప్ లోని వంటవాడు, ఒక నావికుడు ఉన్నారు. నావికుడికి షిప్ లోంచి బయటపడి బోట్లోకి  వచ్చే సమయంలో కాలు విరిగి నడవలేకుండా ఉన్నాడు. వంటవాడు తను సర్వైవ్ అవ్వడానికి దేనికైనా తెగించగలిగే క్రూరుడు. తనని రక్షించుకునే ప్రయత్నంలో ఎలాగో చివరకు వంటవాడిని చంపి పై ఒక్కడే బోట్లో మిగులుతాడు. ఇదుగో కొన్నాళ్ళ తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇలా తేలాను, ఈ కధ ఎలా ఉంది? పోనీ ఇదైనా నమ్ముతారా లేక ఇంకేమన్నా మార్చాలా చెప్పండి అని అడిగాడు. వచ్చిన వాళ్ళిద్దరూ మొహాలు చూసుకుని, “అలా కాదులే షిప్ ప్రమాదం గురించి ఏమైనా చెప్పగలిగితే చెప్పు చాలు. నీకు రావాల్సిన నష్టపరిహారం జపాన్ షిప్పింగ్ కంపెనీ తొందర్లోనే అందే ఏర్పాట్లు చేస్తుంది” అన్నారు.  వాళ్ళు వెళ్ళిపోబోతుండగా పై ఆపి, మీరు నేను చెప్పిన రెండిటిలో ఏ వర్షన్ నమ్ముతారు అని అడిగాడు. వాళ్ళు తాము పులి ఉన్న కధే బావుంది అని చెప్తే, పై నవ్వి “so it goes with god” అంటాడు.

పుస్తకం మొదట్లో వచ్చే దాదాపు మూడోవంతు భాగం, జూ లోని జంతువుల సైకాలజీ, వాటి శిక్షణ, అలవాట్ల గురించీ అవసరమైన దానికన్నా ఎక్కువ వివరాలుంటాయి. మొదటిసారి చదివేటప్పుడు, ఇవన్నీ ఇంత వివరంగా అవసరమా అనిపిస్తుంది. కానీ పుస్తకం చదవటం పూర్తయ్యాకా, లేదా మళ్ళీ రెండో సారి చదువుతున్నప్పుడు ప్రతీ వివరం “yes, makes sense and related” అనిపిస్తుంది. అలానే సముద్రంలో కనిపించే రకరకాల జీవజాలం గురించి కూడా ఎన్నో వర్ణనలూ, వివరాలూ. మనిషి వేరే మనిషి తో కన్నా, తనతో తనే ఎక్కువగా మాట్లాడుకోగలడు అనిపించేలా, పై అంతులేని ఆలోచనలు పేజీల కొద్దీ.  అంతా రచయిత మాటల గారడీ, మెస్మరిజం.... ఒక్కోసారి నిజమేనేమో అని నమ్మేలా, ఒక్కోసారి నిజంగానా అని తర్కించుకునేలా. వెరసి కనీసం ఒకసారి చదవాల్సిన పుస్తకం. చదవాలని అనుకుంటే అప్పుడప్పుడూగా కాకుండా ఏకబిగిన చదవగలిగిన సమయం చూసుకుని చదవాల్సిన పుస్తకం.

మనిషి తను సర్వైవ్ అవ్వడానికి ఎంత నీచంగానూ, క్రూరంగానూ ప్రవర్తించగలడో అని ఒకపక్క అసహ్యపడుతూనే, తర్వాత ఏమయింది అని ఎంతో ఆసక్తిగా చదువుతాం. అది రచయితో, లేకపోతే పై తన కధ చెప్తున్నట్టు మాత్రమే కాకుండా, మనం కూడా అక్కడ ప్రత్యక్షంగా ఉండి కళ్ళు విప్పార్చుకుని జరుగుతున్నదంతా చూస్తున్నట్టే ఉంటుంది. మనల్ని కూడా కధలో  భాగస్వాములను చెయ్యడంలో రచయిత కృతకృత్యుడయ్యాడు. పుస్తకం వెనక అట్ట మీద ఉన్న ఒక  అభిప్రాయంలో చెప్పినట్టూ, చదవటం పూర్తయిన తర్వాత కూడా ఆపడం ఇష్టం లేక మళ్ళీ మళ్ళీ వెనక్కి వెళ్ళి కొన్ని పేజీలు చదువుతూనే ఉండిపోయాను.

కుటుంబసభ్యుల్ని కోల్పోయిన లోటు గురించి  పై పటేల్ మాటల్లో, 
To lose a brother is to lose someone with whom you can share the experience of growing old, who is supposed to bring you a sister-in-law, nieces and nephews  creatures to the tree of your life and give it new branches. To lose your father is to lose the one whose guidance and help you seek, who supports you like a tree trunk supports its branches. To lose your mother, well, that is like losing the sun above you.

  • ఈ పుస్తకం గురించి పూర్ణిమ తమ్మిరెడ్డి ఆలోచనలు ఇక్కడ.
  • ఇది నవంబర్ 2012 లో సినిమాగా కూడా రాబోతుంది, సూరజ్ శర్మ పై పటేల్ పాత్రధారిగా. ఆ వివరాలు  వికీలో  మరియు IMDB లో ఇక్కడ. ఈ సినిమా ట్రైలర్ ఇక్కడ.
  • పుస్తకం గురించి మరిన్ని వివరాలు, ఎన్ని భాషల్లో తర్జుమా అయిందో, ఎన్ని ప్రైజులు అందుకుందో , ఈ కధకి ఇన్స్పిరేషన్ మొదలైన విషయాలు ఇక్కడ. 

*** ఈ పోస్టుకి పుస్తకం.నెట్ లింక్ ఇక్కడ.