BG

Saturday, February 1, 2020

ఎంత మోహనుడోయమ్మా ...

మోహనం అంటే మనసుని మంత్రించేది కదూ. మోహనా అన్న పిలుపుకి న్యాయం చేసినవాడీ మోహనస్వామి.

ఓసారెప్పుడో కథలలో కొత్త పోకడల గురించి మొత్తుకుంటూ, సహజ విరుద్ధమయిన బ్రతుకులు తప్పు కాదు, కానీ వాటిని అసహ్యించుకునేలా కాకుండా సహానుభూతి కలిగించేలా చెప్పండీ అని గోలపెట్టాను. ఇదుగో ఇప్పుడు కనిపించింది అలాంటి ఒక కథనం.

మోహనస్వామి ... ఎప్పుడో లత మోహనవంశీ పేరు చూసి ప్రేమలో పడ్డది నిజం. అయితే నాకెప్పుడూ మోహన్ అన్న పేరులో పెద్ద అందమేం కనిపించలేదు. మోహనస్వామి పేరు కూడా విన్నప్పుడు ఏమీ కొత్తగా అనిపించలేదు. అయితే మొదటి కథ / అంకం “చిక్కుముడి” ఒక్కటి చదవగానే అమాంతం ఆ పేరుతోనూ, మోహనుడి తోనూ ప్రేమలో పడిపోయాను.


చిక్కుముడి 28పేజీల కథ. ఒక్క పేజీలో కాదు కదా, కనీసం ఒక్క వాక్యం చదువుతున్నప్పుడు కూడా ఎక్కడా, వికారం, ఏహ్యత, చులకన లాంటి భావాలు కలగలేదు. పైగా ‘అయ్యో వెర్రి నాన్నా’ అని మనసు విలవిలలాడిపోయింది. సహజంగా గొప్పగా జీవిస్తున్నాం అనుకుంటున్న జీవాలన్నీ మోహనస్వామిని ఆ బురదలోకి లాగాలని ప్రయత్నిస్తుంటే, తిరిగి వాళ్ళ మీదే కోపం అసహ్యం కలిగింది, ‘వాడి బ్రతుకు వాడిని బ్రతకనియ్యరేం’ అని అరవాలనిపిస్తుంది. అయితే దానికి కారణం మన గొప్పతనమో, మనసు విశాలత్వమో కాదు. అతని బాధని బ్రతుకునీ నిజాయితీగా మన ముందుకు తెచ్చిన రచయితది. ఆ బ్రతుకులోని నిజాయితీది. ఓ అమ్మాయీ అబ్బాయీ ఒకరికొకరు అనుకుని, అబ్బాయి వేరే వాళ్ళ మోహంలో పడి అమ్మాయికి అన్యాయం చేస్తే ఎంత దుఃఖం కలుగుతుందో, అంతకు ఎక్కువే ఇప్పుడు కలుగుతుంది.


మోహనస్వామికి కార్తీక్ మీదున్న మోహం, ఆరాధన, ప్రేమ, లాలస, నిజాయితీ మిగిలిన ఏ బంధాల కన్నా తీసిపోయింది? కార్తీక్ కి కోపం వచ్చినపుడు, అతను తనకు దూరం అయిపోతున్నాడని తెలిసినా కూడా అతన్ని ప్రసన్నం చేసుకోడానికి పడిన పాట్లు, స్వార్ధంతో కార్తీక్ కొత్త జీవితాన్ని వెదుక్కుంటూ నిర్దాక్షిణ్యంగా వెళ్ళిపోతే విలవిలలాడిపోతూ, కృష్ణుడి ముందు కూర్చుని తన బాధను మొరపెట్టుకునే మోహనను చూసి మనకు గుండెలో కలుక్కుమంటుంది.

కార్తీక్ పెళ్ళిలో మోహన అనుభవించిన నరకం మనకు కళ్ళముందు జరుగుతున్నట్టే. స్నేహితులంతా కలిసి అక్షతలు మోహన మీద జల్లడానికి హింసిస్తుంటే, వాళ్ళని కాలర్ పుచ్చుకు లాగి చెంప పగలగొట్టాలని మనకు అనిపించకపోతే మనదే తప్పు. చెత్తదిబ్బ ముందు కూర్చొని అతను ఏడుస్తుంటే, ఆ మనుషుల్ని చూసి మనకూ వికారం వాంతులూ కలుగుతాయి.

తన కోరికే ఆమెదీ అయినపుడు ఏ విధంగా మొత్తం జగత్తు బహిరంగంగా ఆమెను సంతోషపరచడానికి కంకణం కట్టుకుని నించున్నది కదా అని అతనికి సంకటం కలుగుతోంది. తాను నోరు జారి తన కోరికను ఇక్కడ ఎవరిముందు చెప్పినా మొత్తం సభాంగణం తనను తరిమి కొడుతుందనే భయం కలిగింది.” తన బ్రతుకు లోని విషాదం మొత్తం ఈ రెండు వాక్యాల్లో ఉంది.

పది అవతారాలు ముగించావు కదా ? పదకొండో అవతారానికి మునివేళ్ళపై నుంచున్నావు కదా? అలాగైతే నీకొక శాపం పెడుతున్నాను. స్వీకరించు. నీ పదకొండవ అవతారంలో నాలా జన్మించు. పదహారు వేల స్త్రీలను అనుభవించిన నీకు ఒక్క స్త్రీని ముట్టడానికీ వీలుకాని దుఃఖం, అసహాయత అర్ధం కావాలి. ఎవరినీ చేయెత్తి కొట్టడానికీ సాధ్యం కాని ఈ నీరసపు జీవితంలో ఎలా దుష్టసంహారం చేస్తావో చూస్తాను. బాధపడ్డ మనస్సు శాపం నీకు తగలనే తగులుతుంది. మరొకసారి పుట్టిరా. ప్రజల కళ్ళల్లో అల్పుడివికా. మరొకరిని తాకలేని బాధను ఏకాకిగా అనుభవించు.” – YES, YOU DESERVE IT Krishna.

ఎప్పుడూ రాత్రి వేళ రెండో మూడో అయినా కూడా, ఇంకొక్క కథ లేదా ఇంకొక్క చాప్టర్ అనుకుంటూ చదువుతూ పోయే నేను, బహుశా మొదటిసారి ఇంకొక కథ చదివే ధైర్యం చెయ్యలేక పుస్తకం మూసేసాను. నాకు చాలా కోపంగానూ, పట్టలేని దుఃఖంగానూ ఉంది.

"జీవితాలన్నీ ముందే రాసిపెట్టుకున్న సమీకరణాల హద్దుల్లో సాగితే ఆ ఏడువర్ణాల ఇంద్రధనస్సుకి ఎనిమిదోరంగు అద్దేదెవరూ?" అని ఎంత మూర్ఖంగా రొమాంటిసైజ్ చేసి రాసుకున్నందుకు నామీద కూడా సిగ్గేస్తుంది. ఇంద్రధనసుకి నిచ్చేనేసే కష్టం నాకేం తెలుసనీ???

Brokeback Mountain సినిమా చూసి ఆ కథ రచయిత్రి "I felt as if my guts had been pulled out hand over hand one yard at a time" అని అన్నారట. అచ్చంగా అదే బాధ మనకి అనుభవమవుతుంది ఇది చదువుతుంటే.