వాషింగ్టన్లో సెప్టెంబర్ 23-24 తేదీల్లో, వంగూరి ఫౌండేషన్ వారు నిర్వహించిన పదవ అమెరికా తెలుగు సాహితీ సదస్సులో నా కీలకోపన్యాసం. వాకిలి మాసపత్రికలో ప్రచురణ.
నాకు పుస్తకాలంటే పిచ్చి ఎప్పుడు ఎలా మొదలయ్యిందో తెలీదు కానీ, జ్ఞాపకాలను తవ్వుకుంటే ఒకటి గుర్తొస్తుంది. నాకు దాదాపు ఎనిమిదేళ్ల వయసున్నపుడు, ఒక చిన్న పల్లెటూళ్ళో ఉండేవాళ్ళం. అక్కడ ఒక డాక్టర్ గారింటి నుండి పత్రికలు తెచ్చుకుని అక్షరం వదలకుండా చదవడం నా మొదటి జ్ఞాపకం. ఈరోజుకి కూడా అందులో ఒక సీరియల్ పేరు “ఇది ఒక పాంథశాల” అని గుర్తుంది. ఆ పేరంటే చెప్పలేనంత మోజు నాకు. రచయిత అంటూ ఒకరుంటారని కూడా తెలీని వయసు కాబట్టి వాళ్ళ పేరూ గుర్తు లేదు.
నా చిన్నప్పుడు నాన్న ఒక హైస్కూల్లో పనిచేసేవారు. అక్కడి లైబ్రరీలో, బొమ్మలతో పురాణ కథల పుస్తకాలూ, పాకెట్ సైజు కథల పుస్తకాలు, సోవియట్ కథల పుస్తకాలూ లెక్కలేనన్ని ఉండేవి. అవన్నీ మాకోసం ఇంటికి తీసుకొచ్చేవారు. వేసవి సెలవుల్లో నాన్న మధ్యాన్నం భోజనానికి ఇంటికి వచ్చివెళ్ళేప్పుడు, నేను కూడా తనతో సైకిల్ మీద వెళ్ళిపోయి, కావలసినన్ని పుస్తకాలు తీసుకొని, ఒక్కదాన్నే దాదాపు రెండు మైళ్ళు నడిచి వెనక్కి వచ్చేదాన్ని. ఇంటికి వెళ్ళేవరకూ కూడా ఆగలేక, దారి పక్కన చింత చెట్ల క్రింద కూర్చుని, కొంచెం కొంచెంగా పుస్తకం చదువుకుంటూ వెళ్ళడం బాగా గుర్తు. ఇంటికి వెళ్ళేలోగానే కొన్ని పుస్తకాలు పూర్తయిపోయేవి. బహుశా నాకు పుస్తకాల రుచి తెలియడం, వాటి మీద ఆకలీ, అలా మొదలయ్యిందనుకుంటాను.
అమ్మ టీచర్. పనితో ఎంత అలిసిపోయి ఉన్నా గానీ, కనిపించిన పుస్తకమల్లా చదివేది. అలా నాకు పన్నెండేళ్ల వయసులోనే “చిల్లర దేవుళ్ళు”, “బలిపీఠం”, “కళ ఎందుకు”, “శ్రీకాంత్” చదివే అవకాశం దొరికింది. ఇక చందమామ లాంటి పిల్లల పత్రికలూ, ఆంధ్రప్రభ లాంటి వారపత్రికలూ మామూలే. ఆ సమయంలో యండమూరి, మల్లాది, యద్దనపూడి సీరియల్స్ వరసబెట్టి వస్తూ ఉండేవి. అదీ ఇదీ అని లేకుండా అన్నిటినీ చదివేసేవాళ్ళం. ప్రక్కింటి అన్నయ్య, న్యూస్ పేపర్ల గుట్ట క్రింద దాచుకునే, స్పెషల్ పుస్తకాలకు తప్ప, దేనికీ ఆంక్షలు ఉండేవి కాదు. ఆఖరుకు కిరాణా సరుకుల పేపర్లూ, పకోడీ పొట్లం కాయితాలూ కూడా చదివిన తర్వాతనే చెత్తలోకి వెళ్ళేవి. ఎంత చదివినా దాహం తీరేదే కాదు.
కాలేజీకొచ్చేసరికి పుస్తకాల కోసం స్నేహాలు చెయ్యడం కూడా అలవాటయ్యింది. ఏ ఇంట్లో ఏ పత్రికలూ కొంటారో, ఏ పత్రిక ఏ రోజు వస్తుందో చిట్టా చేతివేళ్ల చివరే ఉండేది. పత్రిక రాగానే మన చేతికి రావాలంటే, ఆ యింట్లో అత్తయ్యతో స్నేహం చెయ్యటం మంచిదా, లేక మావయ్యతోనా అనే రాజకీయాలు కూడా అప్పుడే అబ్బేయి. ఒకవైపు యండమూరి, మరోవైపు కుప్పిలి పద్మ, ఆ రోజుల్లో నన్నో ఊపు ఊపి వదిలేసారు. ఎవరి నాయికలను రోల్ మోడల్ చేసుకోవాలా అనే అప్పటి నా పరిస్థితి "రాక్సీ లో నార్మా షేరర్, బ్రాడ్వే లో కాంచనమాల” లా ఉండేది. మల్లాది, కొమ్మనాపల్లి లాంటి వాళ్ళు ఉండనే ఉన్నారు. మరోవైపు అందమైన అమ్మాయి ఫోటోలతో కిరణ్ ప్రభ గారి కవితలు వచ్చేవి. చాలాకాలం వరకూ ఆ అమ్మాయే కిరణ్ ప్రభ అనుకున్న అజ్ఞానం నాది.
ఆంధ్రా యూనివర్సిటీలో కొందరు స్నేహితుల సాంగత్యం, పుస్తకాల మీద ప్రేమని ఇంకా పెంచింది. అప్పట్లో మహాప్రస్థానాన్నీ, అమృతం కురిసిన రాత్రినీ ఒకే తలగడ క్రింద పెట్టుకుని పడుకోగలిగిన విశాల హృదయం ఉండేది. యూనివర్సిటీ లైబ్రరీ వల్ల పుస్తకాల తృష్ణ కాస్త తీరింది. బారిస్టర్ పార్వతీశం, చివరకు మిగిలేది, గోర్కీ అమ్మ, గీతాంజలి, గోదాన్ ... ఇవన్నీ చదువుకున్నది అక్కడే. అప్పుడపుడూ కొన్ని ఇంగ్లీష్ పుస్తకాలు చదివినా అవి చేజ్, సిడ్నీ షెల్డన్ రచనలే.
పెళ్లి తరువాత దేశం వదిలి వచ్చాను. పుస్తకాలు చదివే అలవాటున్న వారు దాదాపు లేని చోట, ఉన్నా యండమూరి, యద్దనపూడి తప్ప మరో తెలుగు రచయిత ఉంటారని కూడా తెలీని వాళ్ళున్నచోట పడ్డాను. క్రొత్త జీవితం, క్రొత్త ఊరు, క్రొత్త ఉద్యోగం... అన్నీ బానే ఉన్నా, ఎక్కడో ఏదో లోటు. అది దేనిగురించో కూడా చాన్నాళ్ళు తెలిసేది కాదు.
అప్పుడప్పుడే వారపత్రికలు ఆన్లైన్ లో వస్తున్నాయి. ఆంధ్రప్రభలో గొల్లపూడి సీరియల్ “సాయంకాలమయింది” కోసం వారం వారం ఎదురుచూస్తున్నప్పుడు , ఏం మిస్ అవుతున్నానూ అన్నది సడెన్ గా అర్ధమయ్యింది. ఇక్కడ కూడా లైబ్రరీలు ఉంటాయి, పుస్తకాలు తెచ్చుకుని చదవొచ్చు, అన్న ఆలోచన ఎందుకనో నాకు చాన్నాళ్ళ వరకూ కలగనేలేదు. ఎంతసేపూ తెలుగు పుస్తకాల గురించే బెంగ. అప్పటినుండి ఇండియా నుండి తిరిగి వచ్చేటప్పుడు, లగేజీలో పొడులూ పచ్చళ్ళ స్థానం పుస్తకాలు ఆక్రమించాయి. ఆన్లైన్లో పుస్తకాలు తెప్పించుకునే అవకాశాలూ, ఆనైన్ మేగజైన్లూ, ఎలెక్ట్రానిక్ పుస్తాకాలూ ఎక్కువవడంతో నాకు పుస్తకాల కొరత కొంతవరకూ తీరింది.
ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, నాలో పుస్తకాల మీద ఎంత ఆపేక్ష ఉండేదో, పుస్తకాలు నా జీవితంలో ఎలాంటి ముఖ్యభాగమో చెప్పడం కోసం. పుస్తకాల కోసం నాలాంటి కొందరు ఎన్ని కష్టాలు పడాల్సి వచ్చిందో ఓసారి గుర్తుకు తెచ్చుకోవడం కోసమూనూ. బహుశా మీలో ఇక్కడున్న చాలామందికి ఇలాంటి అనుభవమే ఉండొచ్చు.
ఇన్ని రకాలుగా తెలుగు సాహిత్యం, రకరకాల మాధ్యమాల విరివిగా లభ్యం అవుతుంది. ఇలా దొరికిన పుస్తకమల్లా చదువుతున్నప్పటికీ, నాలో ఏదో చిన్న అసంతృప్తి. జాగ్రత్తగా గమనించుకుంటే, నాకు నచ్చుతున్న పుస్తకాల పట్ల నాకు ఒక ఛాయిస్ ఏర్పడటం మొదలయ్యింది. ఇంతకు ముందులా చదివిన ప్రతీదీ నచ్చకపోవడమే కాకుండా, కొన్నిటిని పూర్తిచెయ్యకుండానే వదిలెయ్యటం, కొన్నిటిని అసలే చదవాలనిపించకపోవడం నాకే ఆశ్చర్యంగా ఉంది.
అయితే పుస్తకాల కోసం అంత తపించిపోయి, అక్షరాన్ని అపురూపంగా హత్తుకున్న నేను, చిత్తు కాగితాన్ని కూడా వదలకుండా చదువుకున్న నేను, ఇపుడు ఎంచి ఎంచి చదివే స్థితికి ఎందుకు చేరుకున్నాను? దానికి కారణం నాకు మానసిక పరిపక్వత పెరిగిపోవడమో, లేదా ఇవేవీ రంజింప చెయ్యలేని స్థాయికి నేను బౌద్ధికంగా ఎదిగిపోవడమో ఎంతమాత్రమూ కాదు.
ఆలోచించగా దీనికి నాకు తోచిన కారణాలు మీతో పంచుకుంటాను. ఇవి కేవలం నా అభిప్రాయాలూ, ఆలోచనలూ మాత్రమే. మీరు నాతో ఏకీభవించొచ్చు, లేదా విభేదించనూవచ్చు. మీలో నాలాంటి సామాన్య పాఠకులూ ఉన్నారు, రచయితలూ ఉన్నారు. కొందరికన్నా నా ఆలోచనల్లో సామీప్యం కనిపిస్తుందేమో అనే ఆశ, రచయితలకు చిన్న ఫీడ్ బేక్.
నాకు తోచిన మొట్టమొదటి అతి ముఖ్యకారణం కథల్లో నాణ్యత తగ్గడం. ఒక్కమాటలో చెప్పాలంటే, రాశి ఎక్కువ వాసి తక్కువ. ఇప్పటి కథలను సమాచార సాధనాలూ, సోషల్ మీడియా అతిగా ప్రభావితం చేస్తుండటం దురదృష్టం అనిపిస్తుంది.
ఇన్స్టంట్ ఎమోషన్స్ ... ఏదైనా ఒక సామాజిక విపత్తు జరగగానే, నేనే ముందు స్పందించాలన్న ఆత్రుత తప్ప, జరిగిన సంఘటనలపై గానీ, వాటికి మూలకారణాల పట్ల గానీ రచయితలకు పూర్తి అవగాహన ఉన్నట్టుగా నాకు అనిపించదు. దానితో సమస్య పట్ల రచయితకు సహానుభూతి లోపించి, రచనలో సహజత్వం కనిపించడం లేదనిపిస్తోంది. దీనివల్ల ఆ రచన పాఠకులకు ఏ అనుభూతీ మిగల్చడంలేదు. ఉదాహరణకు రోహిత్ మరణం గురించి వచ్చిన అన్ని రచనల్లోనూ, అట్టాడ అప్పలనాయుడు గారి కథ ‘ఎన్నెలో ఎన్నెలా’ మాత్రమే పూర్తిగా చదివించి, నన్ను కొంచెమైనా ఆలోచింపచేసింది. శ్రీరమణ కథ రాయటం గురించి ఇలా అంటారు. “ఒకసారి కథ మన మనసులోకి వచ్చాకా, దానికి రూపం ఏర్పడ్డాకా, ఇక రాయకుండా ఉండలేని స్థితి ఒకటి వస్తుంది. ఒక బరువులాగా ఉంటుంది లోపల.” అని. అలా తనలో ఒక సంఘర్షణ కలిగే స్థితి వచ్చేవరకూ రచయితలు ఆగి రాస్తే ఎంత బావుంటుంది!!! నిబద్ధత, సహానుభూతి లోపించిన కథలు చదివితేనాకు రుదాలీల ఏడుపు గుర్తొస్తుంది.
ఇన్స్టంట్ ఫీడ్ బేక్... ఒకప్పుడు రచయితలు కథ రాయాలంటే, దాని కోసం ఓపికగా విషయసేకరణ చేసేవారు. ఇప్పుడు దేనిగురించయినా కావాల్సినంత సమాచారం ఇంటర్నెట్ పుణ్యమా అని క్షణాల్లో దొరికేస్తుంది. దానితో ఇన్స్టంట్ గా కథలు తయారయి, మనముందుకి వచ్చేస్తున్నాయి. సోషల్ మీడియా వల్ల పాఠకుల స్పందన కూడా, అంతే వేగంగా రచయితలకు చేరుతోంది. దీనివల్ల రచయితలు ఇన్స్టంట్ కుకింగ్ నే ఇష్టపడుతున్నారనేది నా అభిప్రాయం. చాసో తన కథలు కొన్ని తనకే నచ్చక వదిలేసి, అవి అంత ప్రచురించాల్సిన కథలేం కావని అన్నారట. ఇపుడు అలా ఆలోచించే వారెవరయినా ఉన్నారా!!!
నాకు తోచిన ఇంకొక కారణం, రచయితలకు తమ సాటి రచయితలతో బయటకి కనబడని పోలికా, పోటీ. ఎవరెన్ని కథలు రాసారూ, ఎవరివి ఎన్ని పుస్తకాలు వచ్చాయీ అనేది రచయిత ప్రతిభకు ఒక కొలమానంగా మారిపోయిందేమో అనిపిస్తుంది. ఈ విషయంలో చాసో, సి. రామచంద్రరావు, అల్లం శేషగిరిరావు, కళ్యాణ సుందరీ జగన్నాధ్ లాంటి కొందరు రచయితల కథలు గుర్తుతెచ్చుకుంటే గంగిగోవుపాలు అనిపిస్తాయి.
రచయితలలో కథను మలిచే నేర్పు, ఓర్పు, ఎడిటింగ్ అనేవి లోపించడం కథలకు నాణ్యత తగ్గడానికి మరొక ముఖ్యకారణం. శ్రీరమణకు కొన్ని కథలు రాయడానికి ఏడాది కాలం పట్టిందట. ఆయన ‘కథను ముందు సన్నివేశాల వారీగా చిన్న కాగితం ముక్కలపై రాసుకుని, వాటిని ఒక పద్ధతిలో పేర్చుకుంటూ, క్రమం మారుస్తూ, అక్కర్లేనివి తీసేస్తూ కథను తయారు చేసుకుంటాను’ అన్నారు. అందుకనే మాలతీ చందూర్ గారు “బంగారు మురుగు” కథ చదివి, ‘మేం కథలు రాసేవాళ్లం కథలు చదివేటప్పుడు ఎక్కడన్నా ఒక వాక్యం తీసేయగలమా అన్న దృష్టితో చదువుతాం. అలా తీసేయగలిగింది ఏం దొరకలేదు నాకు’ అన్నారట. అలానే శ్రీపాద కథలు చాలా పెద్దవయినప్పటికీ, అనవసరమైనది ఒక్క వాక్యమూ కనిపించదు. పూర్తవగానే అపుడే అయిపోయిందా అనిపించేలా ఉంటాయి. ఇప్పుడు తమ కథలని, కనీసం తమకి సంతృప్తి కలిగేవరకూ అయినా తిరగరాసుకునేవారు ఉన్నారా అని నాకు అనుమానం వస్తుంది. అసలు చేతిరాతతో మాత్రమే కథలు రాయాలీ, తిరగరాయాలీ అన్న నిబంధన గనుక పెడితే, వచ్చేవాటిలో సగం పొల్లు ఎగిరిపోతుంది.
ఇప్పుడు కథావస్తువు గురించి కూడా కొంచెం మాట్లాడుకుందాం. కథావస్తువును ఎవరూ నిర్దేశించరు, నిర్దేశించకూడదు కూడా. కానీ వైవిధ్యం ఉండాలని మాత్రం కోరుకుంటాం. కథావస్తువులో వైవిధ్యం ఎక్కువగా లేకపోవడం, సృజనాత్మకత లోపించడం వల్ల చాలా కథలు, వార్తాకథనాలుగానో, ఉపన్యాసాలుగానో అనిపిస్తున్నాయి. ఒకే విషయాన్ని ఎంతమంది అయినా చెప్పొచ్చు, అయితే కథనంలో అయినా కొత్తదనం ఉండాలి కదా. 9/11 సంఘటన ప్రభావాన్ని కొత్త కోణంలో చూపించిన, మూసకు లొంగని ఒక చక్కని కథ కొత్తావకాయ బ్లాగులో వచ్చింది. ఆ కథ పేరు “సుచిత్ర చెప్పిన కథ”.
కొందరు తమ కథలకు గుర్తింపు తెచ్చుకోడానికి షాక్ వాల్యూస్ ను తోడు తెచ్చుకుంటున్నారు. “జీవితాలన్నీ ముందే రాసిపెట్టుకున్న సమీకరణాల హద్దుల్లో సాగితే, ఆ ఏడురంగుల ఇంద్రధనసుకు ఎనిమిదో వర్ణాన్ని అద్దేదెవరూ?” అని ఎపుడో నా బ్లాగులో రాసుకున్నాను. ఆ కొత్త వర్ణాల గురించి కూడా కథలు చెప్పండి, అయితే నేర్పుగా, ఇంపుగా చెప్పండి. పాఠకులను మెప్పించేలా చెప్పండి. కథావస్తువును ఆమోదించని వాళ్ళచేత కూడా, కథనాన్ని ఇష్టపడి, ఆ పాత్రల సంఘర్షణను అర్ధం చేసుకుని సానుభూతి చూపేలా రాయొచ్చు అనేదానికి ఒక ఉదాహరణ కల్పనా రెంటాల వ్రాసిన “తన్హాయి”.
చాలాసార్లు రచయితలు వారి వాదాలూ, దృక్పథాలను సమర్ధించుకుంటూ, సమస్యలకు పరిష్కారాలు కూడా చెప్పేస్తున్నారు. ఈ సందర్భంగా పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారి మాటలు ఒకసారి గుర్తు చేసుకుందాం. ఆయన “నా చుట్టూ ఉన్న జీవితాన్ని సాంతంగా పరిశీలించడం, అందులో నన్ను కదిలించినదీ, కరిగించినదీ ఏదైనా ఉంటే రాయడం. అంతవరకే నా విధి. పాఠకుల తెలివితేటల మీద నమ్మకమున్న రచయితలెవరూ అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్లు పరిష్కారమార్గాలకోసం వ్రాయరు. రచయిత తెలివైన పాఠకులు సరిగ్గా ఆలోచించేటట్టు చేయగలడు” అంటారు. ఇప్పటి రచయితలకు పాఠకుల మేధ మీద బొత్తిగా నమ్మకం లేనట్టుంది. పజిల్స్ వాళ్ళే ఇస్తారు, సమాధానమూ వాళ్ళే చెప్పేస్తారు.
రచనల్లో కనిపిస్తున్న వివిధ వాదాలతో నాకు పేచీల్లేవు. వీటిలో నా దృష్టిని ఆకర్షించినది ‘ఫెమినిజం’. అప్పటి వరకు ఫెమినిజం, ఫెమినిస్ట్ అన్న పదాలకు అర్ధం తెలుసుకోవాల్సిన అవసరం రాకుండా పెరిగిన నాకు, దానిగురించి వివరంగా తెలుసుకోవాలనిపించి చదివాను. ఈ మధ్యకాలంలో వస్తున్న కథలు చూస్తే, ఫెమినిజం అంటే పురుష నింద లేదా స్త్రీ విశృంఖల స్వేచ్ఛ అనే భ్రమలో ఉన్నారేమో అని అనిపిస్తుంది నాకు. “I am a Happy African Feminist Who Does Not Hate Men” అంటారు చిమామండా అడిచె. ఈ నైజీరియన్ రచయిత్రి వ్రాసిన “A Feminist Manifesto in 15 suggestions”, “We should all be Feminists” పుస్తకాలు ఫెమినిజం మేన్యుయల్స్. అడిచే ఇంగ్లీష్ లోనూ, రంగనాయకమ్మ తెలుగులోనూ ఒకటే చెప్పారు. “స్త్రీ సమస్యల పట్ల స్త్రీకి ఎంత అవగాహన ఉండాలో పురుషుడికీ అవగాహన అంతే ముఖ్యం” అని. దీనికి గొర్తి సాయిబ్రహ్మానందం కథ “అతను” ఒక ఉదాహరణ.
కథాంశాల గురించి మాట్లాడుతూ, డయాస్పోరా గురించి కూడా కొంచెం మాట్లాడుకోవాలి. ప్రవాస రచయితల కథలకూ కేవలం నాస్టాల్జియా, కల్చర్ షాక్, సాంస్కృతిక సంఘాల మీదా, సాటి దేశీయుల మీద విసుర్లూ వంటి విషయాలే ఇప్పటికీ కథావస్తువులు. దాదాపు రెండు దశాబ్దాల క్రితం సత్యం మందపాటి గారు వ్రాసిన ఎన్నారై కబుర్లు కొత్తగా అమెరికా వచ్చినవారికి సర్వైవల్ మేన్యుయల్స్ గా ఉపయోగపడ్డాయనే చెప్పాలి. అప్పటి నుండీ ఇప్పటి వరకూ, చిట్టెన్ రాజు గారి నుండి ఫణి డొక్కా వరకూ అదే పంధాలో చాలా మంది వ్రాసారు, వ్రాస్తున్నారు. అయితే ప్రవాస జీవితంలోని సంక్లిష్టతలను మాట్లాడిన కథలు నేను చాలా తక్కువగా చూసాను. ఉదాహరణలు చెప్పుకోవాలంటే వేలూరి వెంకటేశ్వరరావు గారి “గోమేజ్ ఎప్పుడొస్తాడో”, నారాయణస్వామి గారి “తుపాకీ”, గొర్తి సాయిబ్రహ్మానందం గారి “సరిహద్దు” లాంటివి కొన్నికథలు. పూర్తిస్థాయిలో ప్రవాసజీవిత ప్రస్థానాన్ని చిత్రించిన కథలు, పదిహేనేళ్ల క్రితం వచ్చిన ఝుంపా లాహిరి “నేమ్ సేక్” తరువాత, రెండేళ్ల క్రితం వచ్చిన సాయిబ్రహ్మానందం గారి “అంతర్జ్వలన” మాత్రమే నా దృష్టిలోకి వచ్చినవి.
ఒక ఇంటర్యూలో ‘మీరు డయాస్పోరా కథలు ఎందుకు రాయరు’ అన్న ప్రశ్నకు , ‘ఇక్కడ అంత జీవనవైవిధ్యం ఉండదు. ఊరికే రికార్డ్ చేయడానికి రాయబుద్ధి కాదు.’ అన్నారు చంద్ర కన్నెగంటి. ఈ మాటతో నేను ఏకీభవిస్తూనే, విభేదిస్తాను. ఎక్కడ ఉన్నా భారతీయులం మూసల్లో ఒదిగి, మన కంఫర్ట్ జోన్ దాటకుండా బ్రతకడానికి ఇష్టపడతాం, కాబట్టి జీవనవైవిధ్యం ఉండని మాట నిజమే. అయితే మన చుట్టూ ఉన్న జీవితాల్లో బోలెడు కథలు కనిపిస్తాయి. ఇక్కడ దాదాపు ప్రతీవారికీ ఓ గోమేజ్ పరిచయమయే ఉంటాడు. కదిలిస్తే బోలెడు కథలు చెపుతాడు. అవన్నీ రచనల్లో రావాలి.
మీలో చాలామంది అమెరికాలో కనీసం రెండు తరాలను దగ్గరగా చూసి ఉంటారు. జీవితపు సంధ్యలో ఉన్నవారు, ఒంటరిగా మిగిలిపోయినవాళ్లు, శేషజీవితాన్ని గడపడానికి ఎంచుకున్న దారులూ, అందులోని కష్టనష్టాలూ మాట్లాడే కథలు ఎక్కడ? ఒక దరి చేరకుండానే చెదిరిపోయిన జీవితాలూ ఉన్నాయి. వాళ్ళ తరపున కథలు చెప్పే వారేరీ? అతివేగంగా మారుతున్న హార్దిక, ఆర్ధిక సమీకరణాలను లెక్కలోకి తీసుకుంటే, మూస ముగింపులేవీ కూడా ఇప్పుడు వాస్తవికమూ కాదు, సార్వజనీనమూ కాదు. కాబట్టి తాము చూస్తున్న వాటి నుండి ఇంకేం ఆల్టర్నేటివ్స్ ఉన్నాయో కూడా చెపితే బావుంటుంది. విన్నకోట రవిశంకర్ గారి “తోడు” కథ ఈ దిశలో ఒక మంచి ప్రయత్నం అని నేను అనుకున్నాను.
నా చిన్న పరిధిలో చూసిన జీవితాల్లో నాకే ఎన్నో కథలు కంటబడ్డాయి, కలత పెట్టాయి. అయితే వాటి గురించి ఆలోచింపచేసేలా రాసే నైపుణ్యం నాకు లేదు. ఆ భారం దించుకొనేందుకు, మహా అయితే ఒక బ్లాగ్ పోస్ట్ రాసుకోగలుగుతాను. రచయితలైన మీరు, మీ చుట్టూ ఉన్నవాటి నుండే కథలు చెప్పండి. అవి మన కథలే అయ్యుండక్కర్లేదు. ఇలాంటి జీవితాలు కూడా ఉంటాయి అని తెలుసుకోవడం కూడా అవసరమే.
ఇప్పటివరకూ వర్తమాన సాహిత్యం మీద నా అసంతృప్తిని చెప్పాను కదా. ఇపుడు నా ఆకాంక్షలు గురించి కూడా కొంచెం మాట్లాడతాను. ఎప్పుడయితే నాకు తెలుగు సాహిత్యం సెలెక్టివ్ గా చదవడం అలవాటయిందో, సహజంగానే ఇంగ్లీష్ సాహిత్యం వైపు మళ్ళాను. అసంకల్పితంగానే రెండిటినీ పోల్చి చూడటమూ ఒక అలవాటపోయింది. ఇంగ్లీష్ లో వస్తున్న కొన్ని కథాంశాలు నన్ను చాలా ఆశ్చర్యపరుస్తాయి. తెలుగులో ఇలాంటి అంశంతో వచ్చి ఉంటుందా, ఒకవేళ ఇదే కథను తెలుగులో రాస్తే మన నేటివిటీకి సరిపోయేట్టు ఎలా మారుస్తారు అని ఆలోచిస్తుంటాను.
మంచి కథలన్నీ తెలుగులో కూడా అందరికీ అందుబాటులో ఉండేలా వస్తే బావుండని అనిపిస్తుంది. అనువాదాలు చేసేవారు చాలామంది కాఫ్కా, మార్కెజ్, చెహోవ్ లాంటి పాతతరం కథకులకు మాత్రమే పరిమితమవ్వడం గమనిస్తున్నాను. ఇపుడు క్రొత్త కథకులు ఎంతోమంది ఉన్నారు. వైవిధ్యమయిన అంశాలతో మంచి రచనలు చేస్తున్నారు. క్రొత్త కథకుల దృక్పథాన్ని, భావజాలాన్ని కూడా పరిచయం చేస్తే బావుంటుంది. నాకు నచ్చిన కొన్ని కథలను నా బ్లాగు ‘పడమటి కోయిల’ లోనూ, కౌముది మాసపత్రికలో ‘పుస్తకం ఓ నేస్తం’ అనే శీర్షిక ద్వారానూ పరిచయం చేసాను.
ఇంతకూ నువ్వెన్ని కథలు రాసావేంటి అని అడుగుతారేమో, నేను ఒక్కటి కూడా రాయలేదు. రాతగాళ్ళందరూ రచయితలు కాలేరు. మరి ఒక్క కథ కూడా రాయని, రాయలేని నాలాంటి వాళ్ళకు, ఎలాంటి కథలు రావాలో చెప్పే హక్కు ఉంటుందా అని మీరడగొచ్చు. మీ రచనలనూ, పాత్రలనూ, వారి రాగద్వేషాలను సొంతం చేసుకుని, వాటితో పాటు ఏడ్చీ, నవ్వీ, మిమ్మల్ని బేషరతుగా అభిమానించే మీ పాఠకులం. కాబట్టి మాకా హక్కు ఉంటుందనే అనుకుంటున్నాను. మీరు రచనలు చేసేదీ మాలాంటి పాఠకుల కోసమే. మాకోసమే మేము రాసుకుంటాం అని ఎవరన్నా అంటే నమ్మడానికి I wasn’t born yesterday.
మంచి కథలను వ్రాయగల సత్తా ఉన్నవాళ్ళు కూడా మూసకథలకు పరిమితమవ్వడం బాధాకరమయిన విషయం. ‘ఇలా కూడా ఆలోచించమని నిర్దేశించేదే మంచికథ’ అంటారు జలంధర. అయితే నేను అల్పసంతోషిని. ఒక కథ చదివాక, నా టైం వృధా అనిపించకపోతే చాలు, నేను దాన్ని మంచి కథగానే జమ చేస్తాను. కథలు సమాజానికి సందేశాన్ని ఇచ్చి తీరాలనే భ్రమ నాకు లేదు గానీ, పాఠకునికి కనీసం ఒక మంచి అనుభూతిని మిగల్చాలి. వీలయితే ఉత్తేజితం చెయ్యగలగాలి. అలాంటి కథలు ఇంకా ఎక్కువగా రావాలని కోరుకుంటున్నాను.
ఈ సదస్సులో ఈనాటి తెలుగు సాహిత్యం పట్ల నా అసంతృప్తినీ, నా ఆకాంక్షలనూ తెలియజేసుకునే అవకాశం కలిగించిన వంగూరి ఫౌండేషన్ వారికి, సహనంతో విన్న మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
గమనిక: నా ప్రసంగంలో ప్రస్తావించిన కథలూ, కథాంశాలూ, రచయితలూ, నేను చదివిన లేదా నా దృష్టికి వచ్చినవాటి నుండి, నా జ్ఞాపకశక్తి మీద ఆధారపడినవి లేదా సమీపకాలంలో చదవటం వల్ల గుర్తున్నవీనూ. ఈ ప్రసంగ వ్యాసం సమగ్రం అని నేను కూడా అనుకోవడం లేదు.