BG

Showing posts with label Musings. Show all posts
Showing posts with label Musings. Show all posts

Saturday, January 9, 2021

యారాడకొండ

 దిల్ ధూండ్తా హై వొహీ పుర్సత్ కే రాత్ దిన్... మేము చిన్నప్పుడు ఓ మూడేళ్లు వైజాగ్లో పూర్ణామార్కెట్ దగ్గర అద్దెకు ఉండేవాళ్లం. అంతకుముందు అమ్మా, నాన్నా ఇద్దరి ఉద్యోగ రీత్యా చోడవరానికి దగ్గర్లో ఉన్న ఓ పల్లెటూరు. పుట్టిందీ, ఎలిమెంటరీ స్కూల్ చదువూ అక్కడే. వైజాగ్ కి వచ్చాకా నన్ను కురుపాం మార్కెట్ దగ్గర ఉన్న మహారాణీ విద్యాదేవి హైస్కూల్ లోనూ, తమ్ముళ్ళని ఇంటిగలవాళ్ళ పిల్లలతో పాటూ సెయింట్ ఆంథోనీ స్కూల్లోనూ జాయిన్ చేసారు. నేను అక్కడే 7 నుండి 9 వరకూ చదువుకున్నాను.

స్కూల్ ఎదురుగా రోడ్ దాటితే లక్ష్మీ టాకీస్, అక్కడ నుండి కొంచెం దిగువగా నడిస్తే పాతపోస్టాఫీస్, క్వీన్ మేరీస్ హైస్కూల్, సోల్జర్స్ కాలనీ, ఇరుకు సందుల్లోంచి నడిస్తే వెంకటేశ్వరస్వామీ గుడి, సాగరదుర్గ గుడీ (పాత బస్తీ) వచ్చేవి. ప్రతీ నెలా రెండో శనివారం స్కూల్ సగం రోజే ఉండేది. ఆ శనివారం మధ్యానాలూ, ఎప్పుడన్నా సడన్గా స్కూల్ మధ్యలో పంపేసినప్పుడూ స్నేహితులం కలిసి సినిమాకో, ఈ పాతబస్తీకో విహారానికి పోయేవాళ్ళం. అందులో ఎక్కువసార్లు పాతబస్తీ వైపే ఉండేది. లక్ష్మీ టాకీస్ నుండి మొదలు పెట్టి పాతబస్తీ మీదుగా కానీ, లేదా వెనుకవైపు కురుపాం మార్కెట్ మీదుగా కానీ పాతపోస్టాఫీసుకి చేరేవాళ్ళం. అక్కడ నుండి ఒకవైపు వెళ్తే ఎగువగా ముస్లిములు ఉండే కొంచెం ఇరుకు సందులు. వీధిలో తాళ్ళ మీద కలర్ డై చేసి ఆరబెట్టిన బట్టలేవో ఎగురుతూ ఉండేవన్నది లీలగా గుర్తు. అక్కడ నుండి లోపలికి వెళ్తే ఓ వైపు గుట్ట మీద మసీదు, ఒక వైపు చర్చ్. ఇంకో పక్క వెంకటేశ్వరస్వామి గుడి. ఇంకోదారి కొంచెం విభిన్నంగా ఉండే కట్టడపు ఇళ్ళ ముందు నుంచీ సాగి సముద్రపు ఒడ్డు మీదుగా గుడికి చేరేది. ఆ ఇళ్ళలోనుంచీ వచ్చే వంటకాల వింత వాసనలూ, లీలగా వినిపించే సంగీతం (అదేంటో అప్పటికి మాకెవరికీ తెలీదు) పాతపోస్టాఫీసు జంక్షన్లో టీ తాగుతూ కనిపించే గూర్ఖాలూ, చుట్టుపక్కల ఉన్న క్రిష్టియన్ స్కూళ్ళ నుండీ ఇళ్లకు వెళుతూ కనిపించే నన్స్ (మబ్బురంగు లాంగ్ గౌన్లలో, తెల్లటి శరీర చాయతో బలే ఉండేవారు) అదో వింతలోకం మాకు. అసలు ఆంగ్లో ఇండియన్స్ నివాసం ఉండేది లక్ష్మీ టాకీస్ దగ్గర్నుంచీ మొదలవుతుంది. బహుశా అక్కడ దిగువతరగతి వాళ్ళు, ఈ సముద్రపుటొడ్డున మంచి ఇళ్ళల్లో పెద్ద ఉద్యోగులూ ఉండేవారేమో అని ఇప్పుడు అనిపిస్తుంది. 

గుడి మెట్లమీదుగా పైకి వెళ్లి విశాలమయిన ముందు హాల్లోకి వెళితే, ఒక వైపుగా సముద్రం, జెట్టీలు, సాగరదుర్గ గుడి, హార్బర్ కనిపిస్తూ ఉండేవి. అందరూ గుడంతా తిరుగుతూ అన్నీ చూస్తుంటే నేను మాత్రం ఆ గోడకే అతుక్కుపోయి గంటలు గడిపేసేదాన్ని. సముద్రం మీద నుంచీ వీచే చల్లని గాలి, దూరంగా కనిపించే దుర్గ గుడీ, యారాడకొండా, లైట్ హౌస్, సముద్రంలోని చిన్న పడవలూ, హార్బర్లో క్రేన్స్, ఆకుల గలగల కూడా వినిపించే నిశ్శబ్దం... అదొక సెరీన్ అనుభూతి. అప్పుడప్పుడూ పక్క కొండ మీద చర్చ్ నుంచీ వినిపించే గంటలూ. ఎప్పుడన్నా అక్కడున్నప్పుడు ఓమాదిరి వర్షం పడితే, ఆ వర్షంలో వాటి అందాన్ని వర్ణించడం సాధ్యం కాదు. అక్కడ నుంచి అందరూ తిరిగి వెళ్ళే సమయానికి ఆ గోడ దగ్గర నుంచి నా కాళ్ళను బలవంతగా ఊడదీసి తీసుకువెళ్ళాల్సి వచ్చేది. 

అక్కడ నుండీ సముద్రపు ఒడ్డున నడుచుకుంటూ టౌన్ హాల్ మీదుగా ఆర్కే బీచ్ దగ్గర తేలేవాళ్ళం. మధ్యలో జాలరి పేట దాటుతుండగా చిన్న చిన్న గుడిసేలూ, గుప్పున కొట్టే ఎండు చేపల వాసనా, ఇసుకలో ఆరబెట్టిన చేపలూ వలలూ, ఇసుకలోంచి బయటకు తొంగిచూసే పీతలూ గవ్వలూ ఎండ్రకాయలూ, విరిగిన చిన్న చిన్న పడవలూ ... ఆడుతూ పడుతూ అన్నిటినీ ముట్టుకుంటూ సాగేది మా ప్రయాణం. ఆర్కే బీచ్ దగ్గర విడిపోయి మహారాణీ పేట మీదుగా ఇంటికి చేరేవాళ్ళం. ఒక్కోసారి మధ్యలో చెంగల్రావుపేట వీధుల గుండా ఫ్రెండ్స్ ఇళ్ళ దగ్గర ఒక మజిలీ చేసి, మళ్ళీ కురుపాం మార్కెట్ దగ్గర తేలేవాళ్ళం. 

కొన్నిసార్లు శనివారం సాయంత్రం ఇంట్లో అందరం అదే గుడికి సాయంత్రం ఆరు తర్వాత అభిషేకం జరిగే టైంకి వెళ్ళేవాళ్ళం. అప్పటి వాతావరణం వేరుగా ఉండేది. అందరూ పూజలో కూర్చొంటే నా స్థానం మాత్రం ఆ మంటపం గోడ దగ్గరే ఉండేది. ఆ చీకట్లో సముద్రాన్ని, హార్బర్ చూడడం ఇంకో అనుభూతినిచ్చేది. ఇంటి దగ్గర దాదాపు ఒకేవయసు పిల్లలం ఓ పదిమంది ఉండేవాళ్లం. ఆదివారం సాయంత్రం అందరం నడుచుకుంటూ, పూర్ణామార్కెట్, రెల్లివీది, కలెక్టరేట్ మీదుగా నడుచుకుంటూ బీచ్కి వెళ్లి, చీకటి పడేవరకూ సముద్రంలో తడిసి ఇసకలో దొర్లి ఎప్పటికో ఇంటికి చేరేవాళ్ళం. దూరాలూ, అలసటలూ తెలీని వయసది. తరువాత అక్కడనుండి మారి సిటీకి కొంచెం దూరంగా వెళ్ళిపోయాము. హైస్కూల్, డిగ్రీ అయిపోయాయి. తరువాత తొంభైల్లో ఆంధ్రా యూనివర్సిటీలో MCA చదువుతూ,లేడీస్ హాస్టల్లో ఉండేటప్పుడు మళ్ళీ సముద్రపు ఒళ్లోకి వచ్చిపడినా, ఆ స్నేహాలూ అనుభవాలూ సోఫిస్టికేషణ్ అద్దుకున్నవి. స్కూల్ రోజుల ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కడున్నారో కూడా తెలీదు. ఆ రోజులూ, ఆ మధ్యాహ్నాలూ, ఆ తూరుపు గాలులూ ఇంకా మనసుని చల్లగా తాకుతూనే ఉంటాయి ఇప్పటికీ.

95లో దేశం వదిలి వచ్చేసాక, వెళ్ళినప్పుడల్లా అది చూడాలి ఇది చూడాలి ఆ రోడ్లు తిరగాలి అనుకుంటానే గానీ ఉన్న కొంచెం సమయంలో ఎప్పుడూ కుదిరేది కాదు. ఒక పదిహేనేళ్లనుండీ అయితే ఎప్పుడూ తిరిగిన రోడ్లు కూడా గుర్తు పట్టలేనంతగా మారిపోయి అపరిచితమైపోయాయి. జగదంబా జంక్షన్ లేదు, యూనివర్సిటీ గేట్స్ కాదు, ఆర్కే బీచ్ ఏవీ నాకు తెలిసిన రూపంలో లేవు. గుండెలో ఎక్కడో చివుక్కుమని గుచ్చుకున్న బాధ. నేను ఎగిరెళ్లిపోలేదూ అలాగే ఇదీనూ అని సర్దిచెప్పుకుంటాను. తరువాత ఇదెలా ఉంది అదెలా ఉంది అని అడగటమే మానేసుకున్నాను. 

ఇన్నేళ్ళకి ఇప్పుడు “యారాడకొండ” చదువుతుంటే మళ్ళీ అ చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ కళ్ళముందు నిలిచాయి. కథ మొదలైనప్పటి కాలానికీ, నాకు తెలిసినప్పటికీ నలభై ఏళ్ళకు పైగా అంతరం ఉన్నా, కొంచెం మార్పులతో చాలావరకూ ఆ పరిసరాలన్నీ అలానే ఉండేవి. నాస్టాల్జియాతో కొట్టుకుపోతూ, జ్ఞాపకాల ఉధృతి ముంచెత్తుతూ ఉంటే, మొదటి సగభాగం చదవడానికి నాకు ఎక్కువ టైం పట్టింది. 

మా బంధువుల్లో తాతల కాలం నుంచీ ఈతరం వరకూ కూడా అధికశాతం ఉద్యోగాలు పోర్ట్, షిప్ యార్డ్, BHPV, స్టీల్ ప్లాంట్ లోనే. అన్ని లెవెల్స్ లోనూ ఉద్యోగాలు చేసిన వారు ఉన్నారు. అయినా కూడా ఏ రోజూ నాకు అవన్నీ ఎలా ఎవోల్యుట్ అయ్యాయో క్లూ లేదు. అసలు వైజాగ్ మీద జపాన్ బాంబ్ దాడి చేసిందన్న విషయం కూడా నాకు తెలియదు. అది జరిగిన ఆరేడేళ్ల తర్వాత గానీ మా నాన్న పుట్టలేదు, ఆయనకయినా తెలుసో లేదో మరి. స్టీల్ ప్లాంట్, BHPV విస్తరణలో మా పొలాలు పోగొట్టుకున్న విషయం తెలుసు. కాస్తో కూస్తో కాల్టెక్స్ ప్రమాదాలు తెలుసు. అన్నట్టు మా స్వంత ఊరి ప్రసక్తి కూడా ఉంది మధ్యలో. ప్రొఫెసర్ నాయుడు, సింహాచలం లాంటి రిఫరెన్సులు ఎవరివో సరిగా పోల్చుకోలేకపోయాను. వైజాగ్లో విద్యాసంస్థల మీద ఆధిపత్యం ఉన్న ఇద్దరు వ్యక్తులు గుర్తుకొచ్చారు కానీ, నాకు తెలిసిన కొద్ది బాక్గ్రౌండ్తో చూసుకుంటే సరిపోలేదు. 

కథనం సాగదియ్యకుండా క్రిస్ప్ గా బావుంది. ప్రతీ ముఖ్యమైన సంఘటననీ కూడా తక్కువ వివరాలతో చెప్పడంతో విసుగనిపించలేదు. అయితే రెండోతరం మొదలయ్యాక కొంచెం కుదించవచ్చు అనిపించినా ఇంకెలా ముగించవచ్చో కూడా తెలియలేదు. గిరిధర్ నాయర్ ఎపిసోడ్ మాత్రం చర్నాకోల్ తగిలినట్టు తగిలింది. అయితే యూనివర్సిటీ రోజుల్లో సుందరయ్య ఆదర్శాలు అంటూ పార్టీ మీటింగులకు ఉద్యమాలలో తిరిగినవాళ్ళు, తర్వాతి కాలంలో అందరికన్నా ముందు అమెరికాకు వచ్చి సెటిలవడం గుర్తొచ్చి ఎంత వాస్తవం అనిపించింది. అలాగే ఉత్తరాంధ్రా వాళ్లకు ఆత్మవిశ్వాసం తక్కువ, అందరితో పోల్చుకుని తృప్తి పడతారు అంటూ చురకలెయ్యడం చూసి భుజాలు తడుముకున్నాను. ఎపిలోగ్ అనవసరం అనిపించింది నాకు. దానితో సాంద్రత కోల్పోయిన ఫీలింగ్ కలిగింది. 

అక్కడక్కడా ఎడిటింగ్ అవసరం అనిపించింది. (కథాపరంగా కాదు గానీ, భాష పరంగా). ఉదాహరణకి 20వ పేజీలో, “కన్నబాబు ఆక్రందనలని పట్టించుకోడానికి వాళ్లకి పురసత్తు లేదు” అంటారు. అక్కడ కథని కథకుడు (యారాడకొండ/రచయిత) చెపుతున్నాడు. జాలర్లు మాట్లాడుకున్నపుడు భాషలో యాస కనిపిస్తుంది. కథకుడి భాష చదువుకున్నవాళ్ల భాషలా సోఫిష్టికేటెడ్గా ఉంది. అటువంటప్పుడు ‘పురసత్తు’ కథకుడి భాష అయ్యే అవకాశం లేదు అది ‘పుర్సత్’ అయ్యుండాలి. అలాగే ఇంకో చోట ‘బిగినెస్ జాలర్ల దగ్గర నుండి’ అంటారు. అది కూడా జాలర్ల యాస, కథకుడిది కాదు. ఇంకా చదువుతుండగా అక్కడక్కడా కొన్ని అనుమానాలూ ఆలోచనలూ రేగాయి కానీ మొదటిసారి చదువుతుండటం వలన ఎక్కువ దృష్టి పెట్టలేదు. మళ్ళీ చదవితే ఇంకొన్ని కనిపిస్తాయి. 

చివరిగా పుస్తకం క్వాలిటీ గురించి చెప్పుకోవాలి. ఖరీదు Rs225, USలో రెండు పుస్తకాలు కలిపీ $35 అన్నారు. లోపలి పేపర్ అండ్ ప్రింట్ క్వాలిటీ చాలా చాలా సాదాగా ఉంది. పుస్తకాన్నినేను చాలా జాగ్రత్తగా మల్లెపువ్వులా హేండిల్ చేస్తాను. నలపడం, ఓపెన్ చేసి బోర్లా పెట్టడం లాంటి పనులేమీ ఉండవు. అటువంటిది ఒక్కసారి జాగ్రత్తగా పట్టుకుని చదివితేనే కార్నర్స్ నలిగి పొరలు వూడటానికి సిద్ధంగా ఉంది. ఒక్కసారి చేతిలోంచి జారి మెత్తటి కార్పెట్ మీద పడింది,దానికే ముందు కవర్ పేజీ సగం వంగిపోయి లేచినిలుచుని లొంగను అంటుంది. వెనక కవర్ పేజీ పై ఎడ్జ్ కటింగ్, గరుగ్గా ఉండే దళసరి పేపర్ మడతపెట్టి చింపితే ఉన్నట్టు frayed edge. నా OCD తో పోగులన్నీ పీక్కుని, నైల్ ఫైలర్ తో పాలిష్ చేసాను. ఎంత మంచి పుస్తకమయినా ఓ నాలుగు రోజులు నిలబడేట్టు ఎందుకు వెయ్యలేరో! ఎంత రేటు పెడితే అంతా పెట్టి కొనేవాళ్ళు ఉన్నారు కదా. కొననివాళ్ళు పదిరూపాయలు పెట్టినా కూడా కొనరు. ఇక్కడ డాలర్ స్టోర్లో దొరికే పిల్లల బొమ్మల పుస్తకాలు కూడా మంచి క్వాలిటీతో ఉంటాయి. Very Pathetic.



Tuesday, October 17, 2017

అవే కథలు ఇంకెన్నాళ్ళు?


వాషింగ్టన్లో సెప్టెంబర్ 23-24 తేదీల్లో, వంగూరి ఫౌండేషన్ వారు నిర్వహించిన పదవ అమెరికా తెలుగు సాహితీ సదస్సులో నా కీలకోపన్యాసం. వాకిలి మాసపత్రికలో ప్రచురణ. 





ప్రసంగవ్యాసం:

నాకు పుస్తకాలంటే పిచ్చి ఎప్పుడు ఎలా మొదలయ్యిందో తెలీదు కానీ, జ్ఞాపకాలను తవ్వుకుంటే ఒకటి గుర్తొస్తుంది. నాకు దాదాపు ఎనిమిదేళ్ల వయసున్నపుడు, ఒక  చిన్న పల్లెటూళ్ళో ఉండేవాళ్ళం. అక్కడ ఒక డాక్టర్ గారింటి నుండి పత్రికలు తెచ్చుకుని అక్షరం వదలకుండా చదవడం నా మొదటి జ్ఞాపకం. ఈరోజుకి కూడా అందులో ఒక సీరియల్ పేరు “ఇది ఒక పాంథశాల” అని గుర్తుంది. ఆ పేరంటే చెప్పలేనంత మోజు నాకు. రచయిత అంటూ ఒకరుంటారని కూడా తెలీని వయసు కాబట్టి వాళ్ళ పేరూ గుర్తు లేదు.

నా చిన్నప్పుడు నాన్న ఒక హైస్కూల్లో పనిచేసేవారు. అక్కడి లైబ్రరీలో, బొమ్మలతో పురాణ కథల పుస్తకాలూ, పాకెట్ సైజు కథల పుస్తకాలు, సోవియట్ కథల పుస్తకాలూ లెక్కలేనన్ని ఉండేవి.  అవన్నీ మాకోసం ఇంటికి తీసుకొచ్చేవారు. వేసవి సెలవుల్లో నాన్న మధ్యాన్నం భోజనానికి ఇంటికి  వచ్చివెళ్ళేప్పుడు, నేను కూడా తనతో సైకిల్ మీద వెళ్ళిపోయి, కావలసినన్ని పుస్తకాలు తీసుకొని, ఒక్కదాన్నే దాదాపు రెండు మైళ్ళు నడిచి వెనక్కి వచ్చేదాన్ని. ఇంటికి వెళ్ళేవరకూ కూడా ఆగలేక, దారి పక్కన చింత చెట్ల క్రింద కూర్చుని, కొంచెం కొంచెంగా పుస్తకం చదువుకుంటూ వెళ్ళడం బాగా గుర్తు. ఇంటికి వెళ్ళేలోగానే కొన్ని పుస్తకాలు పూర్తయిపోయేవి. బహుశా నాకు పుస్తకాల రుచి తెలియడం, వాటి మీద ఆకలీ, అలా మొదలయ్యిందనుకుంటాను.  

అమ్మ టీచర్. పనితో ఎంత అలిసిపోయి ఉన్నా గానీ, కనిపించిన పుస్తకమల్లా చదివేది. అలా నాకు పన్నెండేళ్ల వయసులోనే “చిల్లర దేవుళ్ళు”, “బలిపీఠం”, “కళ ఎందుకు”, “శ్రీకాంత్” చదివే అవకాశం దొరికింది. ఇక చందమామ లాంటి పిల్లల పత్రికలూ, ఆంధ్రప్రభ లాంటి వారపత్రికలూ మామూలే.  ఆ సమయంలో యండమూరి, మల్లాది, యద్దనపూడి సీరియల్స్ వరసబెట్టి వస్తూ ఉండేవి. అదీ ఇదీ అని లేకుండా అన్నిటినీ చదివేసేవాళ్ళం.  ప్రక్కింటి అన్నయ్య, న్యూస్ పేపర్ల గుట్ట క్రింద దాచుకునే, స్పెషల్ పుస్తకాలకు తప్ప, దేనికీ ఆంక్షలు ఉండేవి కాదు.  ఆఖరుకు కిరాణా సరుకుల పేపర్లూ, పకోడీ పొట్లం కాయితాలూ కూడా చదివిన తర్వాతనే చెత్తలోకి వెళ్ళేవి. ఎంత చదివినా దాహం తీరేదే కాదు.    

కాలేజీకొచ్చేసరికి పుస్తకాల కోసం స్నేహాలు చెయ్యడం కూడా అలవాటయ్యింది. ఏ ఇంట్లో ఏ పత్రికలూ కొంటారో, ఏ పత్రిక ఏ రోజు వస్తుందో చిట్టా చేతివేళ్ల చివరే ఉండేది.  పత్రిక రాగానే మన చేతికి రావాలంటే, ఆ యింట్లో అత్తయ్యతో స్నేహం చెయ్యటం మంచిదా, లేక మావయ్యతోనా అనే రాజకీయాలు కూడా అప్పుడే అబ్బేయి. ఒకవైపు యండమూరి, మరోవైపు కుప్పిలి పద్మ, ఆ రోజుల్లో నన్నో ఊపు ఊపి వదిలేసారు. ఎవరి నాయికలను రోల్ మోడల్ చేసుకోవాలా అనే అప్పటి నా పరిస్థితి "రాక్సీ లో నార్మా షేరర్, బ్రాడ్వే లో కాంచనమాల” లా ఉండేది. మల్లాది, కొమ్మనాపల్లి లాంటి వాళ్ళు ఉండనే ఉన్నారు. మరోవైపు అందమైన అమ్మాయి ఫోటోలతో కిరణ్ ప్రభ గారి కవితలు వచ్చేవి. చాలాకాలం వరకూ ఆ అమ్మాయే కిరణ్ ప్రభ అనుకున్న అజ్ఞానం నాది.  

ఆంధ్రా యూనివర్సిటీలో కొందరు స్నేహితుల సాంగత్యం, పుస్తకాల మీద ప్రేమని ఇంకా పెంచింది. అప్పట్లో మహాప్రస్థానాన్నీ, అమృతం కురిసిన రాత్రినీ ఒకే తలగడ క్రింద పెట్టుకుని పడుకోగలిగిన విశాల హృదయం ఉండేది. యూనివర్సిటీ లైబ్రరీ వల్ల పుస్తకాల తృష్ణ కాస్త తీరింది.  బారిస్టర్ పార్వతీశం, చివరకు మిగిలేది, గోర్కీ అమ్మ, గీతాంజలి, గోదాన్ ... ఇవన్నీ చదువుకున్నది అక్కడే.  అప్పుడపుడూ కొన్ని ఇంగ్లీష్ పుస్తకాలు చదివినా అవి చేజ్, సిడ్నీ షెల్డన్ రచనలే. 

పెళ్లి తరువాత దేశం వదిలి వచ్చాను. పుస్తకాలు చదివే అలవాటున్న వారు దాదాపు లేని చోట,  ఉన్నా యండమూరి, యద్దనపూడి తప్ప మరో తెలుగు రచయిత ఉంటారని కూడా తెలీని వాళ్ళున్నచోట పడ్డాను. క్రొత్త జీవితం, క్రొత్త ఊరు, క్రొత్త ఉద్యోగం... అన్నీ బానే ఉన్నా, ఎక్కడో ఏదో లోటు. అది దేనిగురించో కూడా చాన్నాళ్ళు తెలిసేది కాదు.

అప్పుడప్పుడే వారపత్రికలు ఆన్లైన్ లో వస్తున్నాయి.  ఆంధ్రప్రభలో గొల్లపూడి సీరియల్ “సాయంకాలమయింది” కోసం వారం వారం  ఎదురుచూస్తున్నప్పుడు , ఏం మిస్ అవుతున్నానూ అన్నది సడెన్ గా అర్ధమయ్యింది. ఇక్కడ కూడా లైబ్రరీలు ఉంటాయి, పుస్తకాలు తెచ్చుకుని చదవొచ్చు, అన్న ఆలోచన ఎందుకనో నాకు చాన్నాళ్ళ వరకూ కలగనేలేదు. ఎంతసేపూ తెలుగు పుస్తకాల గురించే బెంగ. అప్పటినుండి  ఇండియా నుండి తిరిగి వచ్చేటప్పుడు, లగేజీలో పొడులూ పచ్చళ్ళ స్థానం పుస్తకాలు ఆక్రమించాయి. ఆన్లైన్లో పుస్తకాలు తెప్పించుకునే అవకాశాలూ, ఆనైన్ మేగజైన్లూ, ఎలెక్ట్రానిక్ పుస్తాకాలూ ఎక్కువవడంతో నాకు పుస్తకాల కొరత కొంతవరకూ తీరింది. 

ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, నాలో పుస్తకాల మీద ఎంత ఆపేక్ష ఉండేదో, పుస్తకాలు నా జీవితంలో ఎలాంటి ముఖ్యభాగమో చెప్పడం కోసం. పుస్తకాల కోసం నాలాంటి కొందరు ఎన్ని కష్టాలు పడాల్సి వచ్చిందో ఓసారి గుర్తుకు తెచ్చుకోవడం కోసమూనూ. బహుశా మీలో ఇక్కడున్న చాలామందికి ఇలాంటి అనుభవమే ఉండొచ్చు.

ఇన్ని రకాలుగా తెలుగు సాహిత్యం, రకరకాల మాధ్యమాల విరివిగా లభ్యం అవుతుంది. ఇలా దొరికిన పుస్తకమల్లా చదువుతున్నప్పటికీ, నాలో ఏదో చిన్న అసంతృప్తి. జాగ్రత్తగా గమనించుకుంటే, నాకు నచ్చుతున్న పుస్తకాల పట్ల నాకు ఒక ఛాయిస్ ఏర్పడటం మొదలయ్యింది.  ఇంతకు ముందులా చదివిన ప్రతీదీ నచ్చకపోవడమే కాకుండా, కొన్నిటిని పూర్తిచెయ్యకుండానే వదిలెయ్యటం, కొన్నిటిని అసలే చదవాలనిపించకపోవడం నాకే ఆశ్చర్యంగా ఉంది. 

అయితే పుస్తకాల కోసం అంత తపించిపోయి, అక్షరాన్ని అపురూపంగా హత్తుకున్న నేను,  చిత్తు కాగితాన్ని కూడా వదలకుండా చదువుకున్న నేను, ఇపుడు ఎంచి ఎంచి చదివే స్థితికి ఎందుకు చేరుకున్నాను?  దానికి కారణం నాకు మానసిక పరిపక్వత పెరిగిపోవడమో, లేదా ఇవేవీ రంజింప చెయ్యలేని స్థాయికి నేను బౌద్ధికంగా ఎదిగిపోవడమో ఎంతమాత్రమూ కాదు. 

ఆలోచించగా దీనికి నాకు తోచిన కారణాలు మీతో పంచుకుంటాను.  ఇవి కేవలం నా అభిప్రాయాలూ, ఆలోచనలూ మాత్రమే. మీరు నాతో ఏకీభవించొచ్చు, లేదా విభేదించనూవచ్చు.  మీలో నాలాంటి సామాన్య పాఠకులూ ఉన్నారు, రచయితలూ ఉన్నారు. కొందరికన్నా నా ఆలోచనల్లో సామీప్యం కనిపిస్తుందేమో అనే ఆశ, రచయితలకు చిన్న ఫీడ్ బేక్. 

నాకు తోచిన మొట్టమొదటి అతి ముఖ్యకారణం కథల్లో నాణ్యత తగ్గడం. ఒక్కమాటలో చెప్పాలంటే, రాశి ఎక్కువ వాసి తక్కువ. ఇప్పటి కథలను సమాచార సాధనాలూ, సోషల్ మీడియా అతిగా ప్రభావితం చేస్తుండటం దురదృష్టం అనిపిస్తుంది. 

ఇన్స్టంట్ ఎమోషన్స్ ... ఏదైనా ఒక సామాజిక విపత్తు జరగగానే, నేనే ముందు స్పందించాలన్న ఆత్రుత తప్ప, జరిగిన సంఘటనలపై గానీ, వాటికి మూలకారణాల పట్ల గానీ రచయితలకు పూర్తి అవగాహన ఉన్నట్టుగా నాకు అనిపించదు. దానితో సమస్య పట్ల రచయితకు సహానుభూతి లోపించి, రచనలో సహజత్వం కనిపించడం లేదనిపిస్తోంది. దీనివల్ల ఆ రచన పాఠకులకు ఏ అనుభూతీ మిగల్చడంలేదు. ఉదాహరణకు రోహిత్ మరణం గురించి వచ్చిన అన్ని రచనల్లోనూ, అట్టాడ అప్పలనాయుడు గారి కథ ‘ఎన్నెలో ఎన్నెలా’ మాత్రమే పూర్తిగా చదివించి, నన్ను కొంచెమైనా ఆలోచింపచేసింది.  శ్రీరమణ కథ రాయటం గురించి ఇలా అంటారు.  “ఒకసారి కథ మన మనసులోకి వచ్చాకా, దానికి రూపం ఏర్పడ్డాకా, ఇక రాయకుండా ఉండలేని స్థితి ఒకటి వస్తుంది. ఒక బరువులాగా ఉంటుంది లోపల.” అని.   అలా తనలో ఒక సంఘర్షణ కలిగే స్థితి వచ్చేవరకూ రచయితలు ఆగి రాస్తే ఎంత బావుంటుంది!!!  నిబద్ధత, సహానుభూతి లోపించిన కథలు చదివితేనాకు రుదాలీల ఏడుపు గుర్తొస్తుంది. 

ఇన్స్టంట్ ఫీడ్ బేక్... ఒకప్పుడు రచయితలు కథ రాయాలంటే, దాని కోసం ఓపికగా విషయసేకరణ చేసేవారు. ఇప్పుడు దేనిగురించయినా  కావాల్సినంత సమాచారం ఇంటర్నెట్ పుణ్యమా అని క్షణాల్లో దొరికేస్తుంది. దానితో ఇన్స్టంట్ గా కథలు తయారయి, మనముందుకి వచ్చేస్తున్నాయి. సోషల్ మీడియా వల్ల పాఠకుల స్పందన కూడా, అంతే వేగంగా రచయితలకు చేరుతోంది. దీనివల్ల రచయితలు ఇన్స్టంట్ కుకింగ్ నే  ఇష్టపడుతున్నారనేది నా అభిప్రాయం. చాసో తన కథలు కొన్ని తనకే నచ్చక వదిలేసి, అవి అంత ప్రచురించాల్సిన కథలేం కావని అన్నారట. ఇపుడు అలా ఆలోచించే వారెవరయినా ఉన్నారా!!!  

నాకు తోచిన ఇంకొక కారణం, రచయితలకు తమ సాటి రచయితలతో బయటకి కనబడని పోలికా, పోటీ. ఎవరెన్ని కథలు రాసారూ, ఎవరివి ఎన్ని పుస్తకాలు వచ్చాయీ అనేది రచయిత ప్రతిభకు ఒక కొలమానంగా మారిపోయిందేమో అనిపిస్తుంది.  ఈ విషయంలో చాసో, సి. రామచంద్రరావు, అల్లం శేషగిరిరావు, కళ్యాణ సుందరీ జగన్నాధ్ లాంటి కొందరు రచయితల కథలు గుర్తుతెచ్చుకుంటే గంగిగోవుపాలు అనిపిస్తాయి.

రచయితలలో కథను మలిచే నేర్పు, ఓర్పు, ఎడిటింగ్ అనేవి లోపించడం కథలకు నాణ్యత తగ్గడానికి మరొక ముఖ్యకారణం. శ్రీరమణకు కొన్ని కథలు రాయడానికి ఏడాది కాలం పట్టిందట. ఆయన ‘కథను ముందు సన్నివేశాల వారీగా చిన్న కాగితం ముక్కలపై రాసుకుని, వాటిని ఒక పద్ధతిలో పేర్చుకుంటూ, క్రమం మారుస్తూ, అక్కర్లేనివి తీసేస్తూ కథను తయారు చేసుకుంటాను’ అన్నారు. అందుకనే మాలతీ చందూర్ గారు “బంగారు మురుగు” కథ చదివి, ‘మేం కథలు రాసేవాళ్లం కథలు చదివేటప్పుడు ఎక్కడన్నా ఒక వాక్యం తీసేయగలమా అన్న దృష్టితో చదువుతాం. అలా తీసేయగలిగింది ఏం దొరకలేదు నాకు’ అన్నారట. అలానే శ్రీపాద కథలు చాలా పెద్దవయినప్పటికీ, అనవసరమైనది ఒక్క వాక్యమూ కనిపించదు. పూర్తవగానే అపుడే అయిపోయిందా అనిపించేలా ఉంటాయి. ఇప్పుడు తమ కథలని, కనీసం తమకి సంతృప్తి కలిగేవరకూ అయినా తిరగరాసుకునేవారు ఉన్నారా అని నాకు అనుమానం వస్తుంది. అసలు చేతిరాతతో మాత్రమే కథలు రాయాలీ, తిరగరాయాలీ అన్న నిబంధన గనుక పెడితే, వచ్చేవాటిలో సగం పొల్లు ఎగిరిపోతుంది. 

ఇప్పుడు కథావస్తువు గురించి కూడా కొంచెం మాట్లాడుకుందాం. కథావస్తువును ఎవరూ నిర్దేశించరు, నిర్దేశించకూడదు కూడా. కానీ వైవిధ్యం ఉండాలని మాత్రం కోరుకుంటాం. కథావస్తువులో వైవిధ్యం ఎక్కువగా లేకపోవడం, సృజనాత్మకత లోపించడం వల్ల చాలా కథలు, వార్తాకథనాలుగానో,  ఉపన్యాసాలుగానో అనిపిస్తున్నాయి. ఒకే విషయాన్ని ఎంతమంది అయినా చెప్పొచ్చు, అయితే కథనంలో అయినా కొత్తదనం ఉండాలి కదా. 9/11 సంఘటన ప్రభావాన్ని కొత్త కోణంలో చూపించిన, మూసకు లొంగని ఒక చక్కని కథ కొత్తావకాయ బ్లాగులో వచ్చింది. ఆ కథ పేరు  “సుచిత్ర చెప్పిన కథ”. 

కొందరు తమ కథలకు గుర్తింపు తెచ్చుకోడానికి షాక్ వాల్యూస్ ను తోడు తెచ్చుకుంటున్నారు.  “జీవితాలన్నీ ముందే రాసిపెట్టుకున్న సమీకరణాల హద్దుల్లో సాగితే, ఆ ఏడురంగుల ఇంద్రధనసుకు ఎనిమిదో వర్ణాన్ని అద్దేదెవరూ?” అని ఎపుడో నా బ్లాగులో రాసుకున్నాను.  ఆ కొత్త వర్ణాల గురించి కూడా కథలు చెప్పండి, అయితే నేర్పుగా, ఇంపుగా చెప్పండి. పాఠకులను మెప్పించేలా చెప్పండి. కథావస్తువును ఆమోదించని వాళ్ళచేత కూడా, కథనాన్ని ఇష్టపడి, ఆ పాత్రల సంఘర్షణను అర్ధం చేసుకుని సానుభూతి చూపేలా రాయొచ్చు అనేదానికి ఒక ఉదాహరణ కల్పనా రెంటాల వ్రాసిన “తన్హాయి”. 

చాలాసార్లు రచయితలు వారి వాదాలూ, దృక్పథాలను సమర్ధించుకుంటూ, సమస్యలకు పరిష్కారాలు కూడా చెప్పేస్తున్నారు. ఈ సందర్భంగా పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారి మాటలు ఒకసారి గుర్తు చేసుకుందాం. ఆయన “నా చుట్టూ ఉన్న జీవితాన్ని సాంతంగా పరిశీలించడం, అందులో నన్ను కదిలించినదీ, కరిగించినదీ ఏదైనా ఉంటే రాయడం. అంతవరకే నా విధి. పాఠకుల తెలివితేటల మీద నమ్మకమున్న రచయితలెవరూ అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్లు పరిష్కారమార్గాలకోసం వ్రాయరు. రచయిత తెలివైన పాఠకులు సరిగ్గా ఆలోచించేటట్టు చేయగలడు” అంటారు. ఇప్పటి రచయితలకు పాఠకుల మేధ మీద బొత్తిగా నమ్మకం లేనట్టుంది. పజిల్స్ వాళ్ళే ఇస్తారు, సమాధానమూ వాళ్ళే  చెప్పేస్తారు.  

రచనల్లో కనిపిస్తున్న వివిధ వాదాలతో నాకు పేచీల్లేవు. వీటిలో నా దృష్టిని ఆకర్షించినది ‘ఫెమినిజం’. అప్పటి వరకు ఫెమినిజం, ఫెమినిస్ట్ అన్న పదాలకు అర్ధం తెలుసుకోవాల్సిన అవసరం రాకుండా పెరిగిన నాకు, దానిగురించి వివరంగా తెలుసుకోవాలనిపించి చదివాను. ఈ  మధ్యకాలంలో వస్తున్న కథలు చూస్తే,  ఫెమినిజం అంటే పురుష నింద లేదా స్త్రీ విశృంఖల స్వేచ్ఛ అనే భ్రమలో ఉన్నారేమో అని అనిపిస్తుంది నాకు. “I am a Happy African Feminist Who Does Not Hate Men” అంటారు చిమామండా అడిచె. ఈ నైజీరియన్ రచయిత్రి వ్రాసిన “A Feminist Manifesto in 15 suggestions”, “We should all be Feminists” పుస్తకాలు ఫెమినిజం మేన్యుయల్స్.  అడిచే ఇంగ్లీష్ లోనూ, రంగనాయకమ్మ తెలుగులోనూ ఒకటే చెప్పారు.  “స్త్రీ సమస్యల పట్ల స్త్రీకి ఎంత అవగాహన ఉండాలో పురుషుడికీ అవగాహన అంతే ముఖ్యం” అని. దీనికి  గొర్తి సాయిబ్రహ్మానందం కథ “అతను” ఒక ఉదాహరణ.  

కథాంశాల గురించి మాట్లాడుతూ, డయాస్పోరా గురించి కూడా కొంచెం మాట్లాడుకోవాలి. ప్రవాస రచయితల కథలకూ  కేవలం నాస్టాల్జియా, కల్చర్ షాక్, సాంస్కృతిక సంఘాల మీదా, సాటి దేశీయుల మీద విసుర్లూ వంటి విషయాలే ఇప్పటికీ   కథావస్తువులు. దాదాపు రెండు దశాబ్దాల క్రితం సత్యం మందపాటి గారు వ్రాసిన ఎన్నారై కబుర్లు కొత్తగా అమెరికా వచ్చినవారికి సర్వైవల్ మేన్యుయల్స్ గా ఉపయోగపడ్డాయనే చెప్పాలి.  అప్పటి నుండీ ఇప్పటి వరకూ, చిట్టెన్ రాజు గారి నుండి ఫణి డొక్కా వరకూ అదే పంధాలో చాలా మంది వ్రాసారు, వ్రాస్తున్నారు. అయితే ప్రవాస జీవితంలోని సంక్లిష్టతలను మాట్లాడిన కథలు నేను చాలా తక్కువగా చూసాను. ఉదాహరణలు చెప్పుకోవాలంటే వేలూరి వెంకటేశ్వరరావు గారి “గోమేజ్ ఎప్పుడొస్తాడో”, నారాయణస్వామి గారి “తుపాకీ”, గొర్తి సాయిబ్రహ్మానందం గారి “సరిహద్దు” లాంటివి కొన్నికథలు. పూర్తిస్థాయిలో ప్రవాసజీవిత ప్రస్థానాన్ని చిత్రించిన కథలు, పదిహేనేళ్ల క్రితం వచ్చిన ఝుంపా లాహిరి “నేమ్ సేక్” తరువాత, రెండేళ్ల క్రితం వచ్చిన సాయిబ్రహ్మానందం గారి “అంతర్జ్వలన” మాత్రమే నా దృష్టిలోకి వచ్చినవి.  

ఒక ఇంటర్యూలో  ‘మీరు డయాస్పోరా కథలు ఎందుకు రాయరు’ అన్న ప్రశ్నకు , ‘ఇక్కడ అంత జీవనవైవిధ్యం ఉండదు. ఊరికే రికార్డ్ చేయడానికి రాయబుద్ధి కాదు.’ అన్నారు చంద్ర కన్నెగంటి. ఈ మాటతో నేను ఏకీభవిస్తూనే, విభేదిస్తాను. ఎక్కడ ఉన్నా భారతీయులం మూసల్లో ఒదిగి, మన కంఫర్ట్ జోన్ దాటకుండా బ్రతకడానికి ఇష్టపడతాం, కాబట్టి జీవనవైవిధ్యం ఉండని మాట నిజమే. అయితే మన చుట్టూ ఉన్న జీవితాల్లో బోలెడు కథలు కనిపిస్తాయి. ఇక్కడ దాదాపు ప్రతీవారికీ ఓ గోమేజ్ పరిచయమయే ఉంటాడు. కదిలిస్తే బోలెడు కథలు చెపుతాడు. అవన్నీ రచనల్లో రావాలి. 

మీలో చాలామంది అమెరికాలో కనీసం రెండు తరాలను దగ్గరగా చూసి ఉంటారు. జీవితపు సంధ్యలో ఉన్నవారు, ఒంటరిగా మిగిలిపోయినవాళ్లు, శేషజీవితాన్ని గడపడానికి ఎంచుకున్న దారులూ, అందులోని కష్టనష్టాలూ మాట్లాడే కథలు ఎక్కడ? ఒక దరి చేరకుండానే చెదిరిపోయిన జీవితాలూ ఉన్నాయి. వాళ్ళ తరపున కథలు చెప్పే వారేరీ? అతివేగంగా మారుతున్న హార్దిక, ఆర్ధిక సమీకరణాలను లెక్కలోకి తీసుకుంటే, మూస  ముగింపులేవీ కూడా  ఇప్పుడు వాస్తవికమూ కాదు, సార్వజనీనమూ కాదు. కాబట్టి తాము  చూస్తున్న వాటి నుండి ఇంకేం ఆల్టర్నేటివ్స్ ఉన్నాయో కూడా  చెపితే బావుంటుంది. విన్నకోట రవిశంకర్ గారి “తోడు” కథ ఈ దిశలో ఒక మంచి ప్రయత్నం అని నేను అనుకున్నాను. 

నా చిన్న పరిధిలో చూసిన జీవితాల్లో నాకే ఎన్నో కథలు కంటబడ్డాయి, కలత పెట్టాయి. అయితే వాటి గురించి ఆలోచింపచేసేలా రాసే నైపుణ్యం నాకు లేదు. ఆ భారం దించుకొనేందుకు, మహా అయితే ఒక బ్లాగ్ పోస్ట్ రాసుకోగలుగుతాను. రచయితలైన మీరు, మీ చుట్టూ ఉన్నవాటి నుండే కథలు చెప్పండి. అవి మన కథలే అయ్యుండక్కర్లేదు. ఇలాంటి జీవితాలు కూడా ఉంటాయి అని  తెలుసుకోవడం కూడా అవసరమే. 

ఇప్పటివరకూ వర్తమాన సాహిత్యం మీద నా అసంతృప్తిని చెప్పాను కదా. ఇపుడు నా ఆకాంక్షలు గురించి కూడా కొంచెం మాట్లాడతాను. ఎప్పుడయితే నాకు తెలుగు సాహిత్యం సెలెక్టివ్ గా చదవడం అలవాటయిందో, సహజంగానే ఇంగ్లీష్ సాహిత్యం వైపు మళ్ళాను. అసంకల్పితంగానే రెండిటినీ పోల్చి చూడటమూ ఒక అలవాటపోయింది. ఇంగ్లీష్ లో వస్తున్న కొన్ని కథాంశాలు నన్ను చాలా ఆశ్చర్యపరుస్తాయి.  తెలుగులో ఇలాంటి అంశంతో వచ్చి ఉంటుందా, ఒకవేళ ఇదే కథను తెలుగులో రాస్తే మన నేటివిటీకి సరిపోయేట్టు ఎలా మారుస్తారు అని ఆలోచిస్తుంటాను. 
మంచి కథలన్నీ తెలుగులో కూడా అందరికీ అందుబాటులో ఉండేలా వస్తే బావుండని అనిపిస్తుంది. అనువాదాలు చేసేవారు చాలామంది కాఫ్కా, మార్కెజ్, చెహోవ్ లాంటి పాతతరం కథకులకు మాత్రమే పరిమితమవ్వడం గమనిస్తున్నాను. ఇపుడు క్రొత్త కథకులు ఎంతోమంది ఉన్నారు.  వైవిధ్యమయిన అంశాలతో మంచి రచనలు చేస్తున్నారు. క్రొత్త కథకుల దృక్పథాన్ని, భావజాలాన్ని కూడా పరిచయం చేస్తే బావుంటుంది. నాకు నచ్చిన కొన్ని కథలను నా బ్లాగు  ‘పడమటి కోయిల’ లోనూ, కౌముది మాసపత్రికలో ‘పుస్తకం ఓ నేస్తం’ అనే శీర్షిక ద్వారానూ పరిచయం చేసాను.

ఇంతకూ నువ్వెన్ని కథలు రాసావేంటి అని అడుగుతారేమో, నేను ఒక్కటి కూడా రాయలేదు. రాతగాళ్ళందరూ  రచయితలు కాలేరు. మరి ఒక్క కథ కూడా రాయని, రాయలేని నాలాంటి వాళ్ళకు, ఎలాంటి కథలు రావాలో చెప్పే హక్కు ఉంటుందా అని మీరడగొచ్చు. మీ రచనలనూ, పాత్రలనూ, వారి రాగద్వేషాలను సొంతం చేసుకుని, వాటితో పాటు ఏడ్చీ, నవ్వీ, మిమ్మల్ని బేషరతుగా అభిమానించే మీ పాఠకులం. కాబట్టి మాకా హక్కు ఉంటుందనే అనుకుంటున్నాను.  మీరు రచనలు చేసేదీ మాలాంటి పాఠకుల కోసమే. మాకోసమే మేము రాసుకుంటాం అని ఎవరన్నా అంటే నమ్మడానికి I wasn’t born yesterday.

మంచి కథలను వ్రాయగల సత్తా ఉన్నవాళ్ళు కూడా మూసకథలకు పరిమితమవ్వడం బాధాకరమయిన విషయం. ‘ఇలా కూడా ఆలోచించమని నిర్దేశించేదే మంచికథ’ అంటారు జలంధర.  అయితే నేను అల్పసంతోషిని. ఒక కథ చదివాక, నా టైం వృధా అనిపించకపోతే చాలు, నేను దాన్ని మంచి కథగానే జమ చేస్తాను.  కథలు సమాజానికి సందేశాన్ని ఇచ్చి తీరాలనే భ్రమ నాకు లేదు గానీ, పాఠకునికి కనీసం ఒక మంచి అనుభూతిని మిగల్చాలి. వీలయితే ఉత్తేజితం చెయ్యగలగాలి. అలాంటి కథలు ఇంకా ఎక్కువగా రావాలని కోరుకుంటున్నాను. 

ఈ సదస్సులో ఈనాటి తెలుగు సాహిత్యం పట్ల నా అసంతృప్తినీ, నా ఆకాంక్షలనూ తెలియజేసుకునే అవకాశం కలిగించిన వంగూరి ఫౌండేషన్ వారికి, సహనంతో విన్న మీ అందరికీ  నా హృదయపూర్వక కృతజ్ఞతలు. 

గమనిక: నా  ప్రసంగంలో ప్రస్తావించిన కథలూ, కథాంశాలూ, రచయితలూ,  నేను చదివిన లేదా నా దృష్టికి వచ్చినవాటి నుండి, నా జ్ఞాపకశక్తి మీద ఆధారపడినవి లేదా సమీపకాలంలో చదవటం వల్ల గుర్తున్నవీనూ. ఈ ప్రసంగ వ్యాసం సమగ్రం అని నేను కూడా అనుకోవడం లేదు. 

Wednesday, February 8, 2017

Friday Night Lights: In Our Lives

జంపాల చౌదరి గారు 2015లో చదివిన పుస్తకాల లిస్టు లో Friday Nights: H.G.Bissinger గురించి చెప్పగానే అది నన్ను చాలా ఆకర్షించింది. దానికి మా లైఫ్ లో చోటు చేసుకున్న ఫ్రైడే నైట్  లైట్స్ వెలుగులే కారణం. అప్పటికి సంవత్సరం పైగా ఒక్క పుస్తకమూ పూర్తిగా చదవలేకపోయినప్పటికీ, లిబ్రరీ నుంచి వెంటనే పుస్తకం తెచ్చుకుని చదవటం మొదలుపెట్టాను. అనుకున్నట్టుగానే చదువు అనేక కారణాల వల్ల పెద్దగా కదలలేదు. దాదాపు నాలుగు సార్లు తెచ్చుకోవడమూ, రెన్యూ చెయ్యడం, తిరిగి ఇవ్వడం ... కథ అలా సాగి సాగి మొత్తం ఓ ఆరో ఏడో నెలలు పట్టింది పూర్తి చెయ్యడానికి. 

మా అబ్బాయి తను హైస్కూల్లో ఉన్నప్పుడు మూడేళ్ళు ఫుట్బాల్ ఆడాడు. ఈ పుస్తకం గురించి నాకు తెలిసేటప్పటికే తన లాస్ట్ ఇయర్ ఫుట్ బాల్ సీజన్ అయిపోయింది. (తను మే 2016 లో గ్రాడ్యుయేట్ అయ్యాడు.) ఈ పుస్తకం చదువుతుంటే నాకు గత రెండేళ్ళుగా చూసినవెన్నో కళ్ళ ముందు కదిలి, ఆ ఎమోషనల్ మూమెంట్స్ అన్నీ మళ్ళీ గుర్తొచ్చాయి. లాస్ట్ సీజన్ అవ్వగానే నా అనుభూతులను రాతల్లో దాచుకోవాలనుకున్న దానికి, ఈ పుస్తకం ఇంకొంత స్పూర్తిని ఇచ్చింది. 

ముందు ఈ టీం (జె ఎఫ్; కేవలీయర్స్) కథ కొంచెం చెప్పాలి. వర్జీనియాలో ఓ చిన్న టౌన్ లోని హైస్కూల్ (జెఎఫ్) టీమ్ కేవలీయర్స్. 2013 వరకూ టీం గెలిచామా గుడ్, ఓడామా పర్లేదులే అన్నట్టు ఆడుతూ పాడుతూ సాగిపోయింది. అప్పటికి టీమ్ స్టేట్ రేంక్ 177, నేషనల్ లెవెల్ రేంక్ 6000 పైనే. అప్పుడొచ్చాడో కోచ్, బాబ్ క్రిస్మస్ అనీ పరమ చండశాసనుడు. అపర ద్రోణాచార్యుడు. ఎవరితోనైనా గేమ్స్ ఆడు కానీ నాతో కాదు అన్నట్టు ఉంటాడు. స్కూల్లో ఎన్ని వేషాలయినా వేసి, అందరినీ బురిడీ కొట్టించగల నా కొడుకు లాంటి వాళ్ళకు కూడా దాదాపు పేంట్ తడిచినంత పని చేసాడు. 

సమ్మర్ సెలవుల్లో మొదలయిన ప్రాక్టీస్, కండిషనింగ్ సెషన్స్, ఫాల్ సీజన్ లోకి సాగి పిల్లల జీవితంలో ఓ కొద్ది నెలలు, అదే జీవితమయిపోయినట్టు ఉండేది.  రోజూ స్కూల్ అవగానే సాయంత్రం నాలుగు నుండి దాదాపు ఎనిమిది వరకూ ప్రాక్టీస్. ఎండా, వానా, చలీ, మంచూ ఏదీ అడ్డంకి కానే కాదు. జోరున కురిసే వానలో, ఒంటిని ముళ్ళలా కోసేస్తున్న చలి గాలుల మధ్య కూడా ఆరుబయట ఫీల్డ్ లో ప్రాక్టీస్ చేస్తున్నపిల్లల్ని చూసినప్పుడు ఏదో తెలీని భావంతో నా ఒళ్ళు ఒణికేది. ఆ డెడికేషన్ కి కళ్ళంట నీళ్ళూ తిరిగాయి ఎన్నోసార్లు.  స్కూల్ వెనుకగా, దాదాపు ఏభై అడుగుల పల్లంలో ఉండే ఆ ఫుట్ బాల్ ఫీల్డ్ ని, పిల్లలు ముద్దుగా ‘డెత్ వేలీ’ అని పిలుచుకునేవారు.

ఫాల్ 2014 , టీం కి గెలుపు గుర్రం లొంగడం మొదలయ్యింది. సీజన్ చివరికి వచ్చేసరికి నేషనల్ రేంక్ 1400, స్టేట్ రేంక్ 43 కి చేరింది, కానీ స్టేట్ చాంపియన్షిప్ క్వార్టర్ ఫైనల్స్ లో ఓడిపోయింది. ఆ నాలుగు నెలలూ దాదాపు ప్రతీ శుక్రవారం వూరికి పండుగ. ఆరయ్యేసరికి పిల్లలతోనూ, గ్రాండ్ పేరెంట్స్ తో సహా ఫీల్డ్ లో హాజరు.  కొన్ని బయటి టీమ్స్ తో ఆడినపుడయితే ఊర్లోని ఇతర స్కూళ్ళకి చెందిన వాళ్ళు కూడా ఇక్కడే. ఒకప్పుడు ఈ స్కూల్ టీం ఒక వైభవంతో వెలిగిందంటారు. ఇపుడు మళ్ళీ కొంచెం కొంచెం తిరిగొస్తున్న ప్రాభవం, జనాల్లో ఆశ, కుతూహలం జేఎఫ్ ఏం చేస్తుందా అని.  

ఊర్లో బ్రుక్విల్ ఇంకో హైస్కూల్. తరతరాల నుండి రెండు స్కూళ్ళ మధ్య ప్రొఫెషనల్ వైరం. తాతల నుండి మనవల వరకు ఆ వైరం పాకుతూనే ఉంది. దానికి తోడూ ఆ స్కూల్ తో ఆడిన ఫుట్ బాల్ గేమ్స్ లో 2006 లో చివరి విజయం. అంతకుముందు కూడా గెలిచిన రోజుల్లోనూ, 2013 లో కూడా ఏదో గుడ్డిలో మెల్లలా, అతి తక్కువ స్కోరు తేడాతో గెలిచారు. అదో బడాయి వాళ్లకి. ఆ బడాయి కొల్లగొట్టే రోజు రానే వచ్చింది. కేవలీయర్స్ 2014 లో 34- 14 స్కోరు తో వాళ్ళని చితక్కొట్టుడు కొట్టారు. ఇక ప్లేయర్స్ కన్నా, పెద్దల సంబరం పట్టలేనిదయ్యింది. వర్క్ లో కూడా అదే టాపిక్ కొన్నాళ్ళు. (నా ఆఫీస్ రూమ్ లో పెట్టుకున్న టీం పోస్టర్ చూసి, తెలీని వాళ్ళు కూడా వచ్చి మాట్లాడేవారు.)  

ఫాల్ 2015, సీనియర్స్ కి ఆఖరు సీజన్. సీజన్ మొదలవ్వడమే మహోత్సాహంతో మొదలయ్యింది. మొత్తం 12 గేములు... మా ఇంటికొస్తావా, మీ ఇంటికి రమ్మంటావా, ఎక్కడయినా సరే అన్నట్టు చెలరేగిపోయారు. దాదాపు ప్రతీ గేం లోనూ స్కోర్ తేడా 30 పాయింట్లకు పైనే.
ఇక బ్రుక్విల్ తో గేం రోజున చెప్పనక్కర్లేదు. రెండు వైపులా గేలరీలు ఇసుక పోసినట్టు కిక్కిరిసిపోయాయి. ప్రత్యర్ధి టీంను స్కోర్ చేయ్యనీకుండా అడ్డుకున్నప్పుడు, వీళ్ళు స్కోరు చేసినప్పుడూ ఈలలూ, గోలలూ, కేకలూ, విపరీతమయిన చప్పుడు చేసే రేటిల్స్ ... ‘చంపండి, తొక్కండి, వేసెయ్యండి’ అంటూ అరుపులు. స్టూడెంట్స్, తల్లిదండ్రులు , గ్రాండ్ పేరెంట్స్, ఎక్స్టెండెడ్ ఫెమిలీస్, బంధు మిత్ర సపరివారంగా వచ్చేసారు. ప్రక్క ఊర్ల నుంచి కూడా ప్రత్యేకంగా జనాలు వచ్చారు. మాకైతే ఇండియా, పాకిస్తాన్ క్రికెట్ మేచ్ ప్రత్యక్షంగా చూసిన అనుభవం అయింది ఆ రోజు. అనుకున్నట్టుగానే ప్రత్యర్దులని చీపురు పెట్టి వూడ్చేసారు (స్కోర్ 55 -23) . టీమ్ నేషనల్ రేంక్ 364, స్టేట్ రేంక్ 7 కు చేరుకుంది.


సీజనల్ గేమ్స్ ముగిసాయి. ఆడిన 12 గేమ్స్ లోనూ విజయం సాధించుకొచ్చారు. ఆ మూడు నెలలూ, హోం గేం ఉన్న ప్రతీ శుక్రవారం ఓ ఉత్సవమే. ఊరంతా అక్కడే. ఓ పక్క చిన్న పిల్లలు ఆటలు, మిడిల్ స్కూల్ పిల్లల సోషలైజింగ్, ఫుడ్ స్టాల్స్ ఓ ప్రక్క. ఫ్లాగ్ బేరర్స్ ముందు రాగా, టీం ఫీల్డ్ లోకి వస్తుండగా హోరెత్తే చప్పట్ల నుండి, జాతీయ గీతం, హాఫ్ టైం  లో స్కూల్ బ్యాండ్ స్పెషల్ పెర్ఫార్మన్స్, హోం టీం టచ్ డౌన్ చేసినప్పుడల్లా ఫైర్ ఇంజన్ సైరన్లు, ఛీర్ లీడింగ్ టీం హడావిడీ ... ప్రతీదీ ఓ సంబరమే. 

క్వార్టర్ ఫైనల్స్ కూడా విజయవంతంగా ముగిసాయి.  టీం సెమీ ఫైనల్స్ కి చేరుకుంది. 12/5/2015 హోమ్ ఫీల్డ్ లో సెమీ ఫైనల్స్. ఇది దాటితే స్టేట్ ఛాంపియన్స్ అవడానికి ఇక ఒక అడుగు మాత్రమే. అసలే ఆ రోజు ఆడబోతున్న టీం ని, సీజన్ మొదట్లోనే చిత్తుగా ఓడించి వచ్చారు. అందరికీ బోలెడంత విశ్వాసం మనకిక తిరుగులేదని.  ఓ మహోత్సవం మొదలైంది. మధ్యాహ్నం మూడు గంటలకి స్కూల్ జిమ్ నుంచి, బయట దూరంగా ఉన్న ఫీల్డ్ లోకి ప్రాక్టీస్ కోసం టీం బయటకి వచ్చే సమయానికి, వందల కొద్దీ బయట బారులు తీరి, స్పెషల్ బ్యాండ్ తో, రంగుల కాగితాలు చల్లుతూ, విషెస్ చెపుతూ ఫీల్డ్ కి పంపారు. వీరతిలకాలు దిద్దటమొకటే తక్కువ. 

ఆట మొదలయ్యింది. అయితే పరిస్థితి అనుకున్నదానికి వ్యతిరేకంగా తయారయింది. సగం ఆట పూర్తయ్యే సరికి అవతలి టీం బాగా లీడింగ్లో ఉంది. టీం లో కీలకమైన ప్యేయర్స్ ని టార్గెట్ చేసుకుని వాళ్లనే అడ్డుకునే వ్యూహంతో ఉన్నారు అవతలి టీం.  మా టీం ఆరోజు డిఫెన్స్ కూడా సరిగా ఆడలేకపోయింది. సగం ఆట గడిచే సమయానికి ఇరవై పాయింట్ల పైనే తేడా ఉంది స్కోర్. జనాల్లో అసహనం, అపనమ్మకం, నిరసన మొదలయ్యింది.  ఆశ వదిలేసుకుని కొంతమంది అప్పుడే వెళ్ళిపోవడం మొదలుపెట్టారు. మూడో క్వార్టర్ గడుస్తుండగా వాళ్ళ లీడింగ్ ఇంకా పెరిగింది. మిగిలిన జనాలు కూడా నిరసనగా వెళ్ళిపోవడం మొదలుపెట్టారు. ఫీల్డ్ లో ప్లేయర్స్ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. చివరి క్వార్టర్లో అయినా ఫీనిక్స్ లా లేస్తారేమో అని నాలాంటి కొందరు ఇంకా ఆశగా ఎదురు చూస్తున్నారు. చివరికి 21 – 42 స్కోర్ తో సెమీ ఫైనల్స్ ఓడిపోయారు. ముందు వేలల్లో ఉన్న ప్రేక్షకులు అప్పటికి ఓ వంద మంది మాత్రం మిగిలారు. చూడటానికే బాధ కలిగించే పరిస్థితి.

ఆట ముగియగానే, then it dawned upon them, that it was the LAST game they ever play on the team, and they would never play in that field in their life time. కొందరు ఫీల్డ్ లోనే ఏడవటం మొదలుపెట్టారు. చాంపియన్షిప్ దగ్గరికి వచ్చి పోయిందన్న బాధ ఒకవైపు. అలా ఎలా జరిగిందో అన్న అయోమయం ఒకవైపు. దాదాపు నాలుగేళ్ళు కలిసి ఇష్టంగా కష్టపడి, చెమటోడ్చి విజయాలను సొంతం చేసుకున్న స్నేహితులు. కొన్ని నెలలు పోతే ఎవరెక్కడో ...

ఫీల్డ్ నుంచి టీమ్ లాకర్ రూమ్ కి తిరిగి వెళ్ళగానే, అక్కడ అన్నీ చూడగానే అందరికీ వాస్తవం గుర్తుకు వచ్చింది. ఒకరినొకరు కౌగలించుకుని ఎంతో సేపు ఏడ్చారట. వాళ్ళ లాకర్స్ నీ, యూనిఫార్మ్స్ నీ చూసుకుని అందరూ పొగిలి ఏడ్చారని చెప్పాడు మా అబ్బాయి. ఆ రాత్రి గెలుపు సంబరాల కోసం ముందుగానే ప్లాన్ చేసుకున్న పార్టీల్లో స్నేహితులంతా కలిసి గడిపారు కానీ, ఎవరిలోనూ సంతోషం లేదు. అందరిలోనూ ఇంకా జరిగిన దానిపట్ల అపనమ్మకమే. అన్నేళ్ళు స్కూల్ అవగానే ఒక యజ్ఞంలా గంటల కొద్దీ ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి, మరునాటి నుండి సాయంత్రాలు ఏం చెయ్యాలా, ఎలా గడుస్తాయా అని దిగులు. ఆ తరువాత కొన్ని రోజులు, ఇంకా ఆ ఓటమి ఎలా జరిగిందా అని తర్కించుకుంటూ, పొరపాట్లను తరచి తరిచి విశ్లేషించుకుంటూనే ఉన్నారు. వాళ్ళ జీవితాల్లో ఓ ముఖ్యమైన ఘట్టం ముగిసింది. చివరిలో నిరాశ పరిచినా అపురూపమైన జ్ఞాపకాలనే మిగిల్చింది చాలామందికి. తరువాత కొన్ని నెలల పాటు, స్కూల్ న్యూస్ పేజీలో పిల్లలు (రకరకాల స్పోర్ట్స్ ఆడినవాళ్లు) కాలేజీ టీమ్స్ లో ఆడటానికి అడ్మిషన్ కాంట్రాక్ట్ సైన్ చేస్తున్న ఫోటోలు చూడటం మనసుకు ఓ పండగ.

ఇపుడు పుస్తకానికి, నాకూ అనుబంధం కుదిరిన విధం చెపుతాను. ఆచ్చం పుస్తంకంలో జరిగినట్టే (అది కూడా నిజంగానే జరిగిన కథ) ఇక్కడ కూడా వరుస ఘన విజయాలను సాధించిన టీం చివరలో ఓడిపోయింది. అన్ని నెలలు తమ ఎంటర్టైన్మెంట్ కోసం టీం మీద ఆధారపడి, ప్రతీ వారం వాళ్ళ విజయాన్ని ఆనందించిన వాళ్ళు, టీం ఓడిపోతుందని అనిపించగానే నిరసనతో వాళ్ళను మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోవడం నాకు ఎంతో దుఃఖాన్ని కలిగించింది.  పుస్తకం మొదట్లో కొన్ని ఫోటోలు  ఉన్నాయి, ఆఖరి గేం తరువాత ప్లేయర్స్ లాకర్ రూమ్లో క్రింద పడి ఏడుస్తున్నవి, స్నేహితులను కౌగలించుకుని, యూనిఫార్మ్స్ కౌగలించుకొని ఏడుస్తున్నవి, వాస్తవాన్ని జీర్ణించుకోలేక ఏం చెయ్యాలో తోచక అయోమయంగా కొందరు  బెంచెస్ మీద కూర్చున్నవి ...మా అబ్బాయికి చూపిస్తే, అచ్చం ఆ సంఘటనలు అలానే ఆరోజు లాకర్ రూమ్ లో జరిగాయని చెప్పి, తన ఫోన్లోని ఫొటోస్ చూపించాడు. (అప్పటికి సీజన్ ముగిసి దాదాపు రెండు నెలలు దాటింది.) 

I relived all those moments, while I was reading that book. It was so close to our story, and they were our heros. Still the memories fresh in my mind, the book caused a huge emotional stirrup in my heart.  

అస్సలు స్పోర్ట్స్ లో ఏ రకమైన ఇన్వాల్వ్మెంట్ లేని మాకు, ఇలా పర్సనల్గా ఇన్వాల్వ్ అవడం అనేది ఎపుడూ ఎక్స్పెక్ట్ చెయ్యనిది, మరిచిపోలేనిదీనూ. అదో ప్రత్యేకమైన అనుభవం మా జీవితంలో. 

From Wikipedia (since I don’t have the book with me at this time) 
For the players, high school football is over and a big part of their lives has just ended. Right after the game the team heads home. McDougal, who loved football to death, lingered in the team locker room for a little longer than everyone else but eventually left the locker room. Then Gaines and the coaches took down the magnetic names on the board. Bissinger ends the chapter saying, "The season had ended, but another one had begun. People everywhere, young and old were already dreaming of heroes.
BTW, there is a movie, and a TV series on Netflix based on this book. 

Related links:

Thanks a lot to V Chowdary Jampala garu for introducing such a wonderful book.

ps: I very rarely talk about my family, kids and/or personal life on social media. This is only my attempt to comprehend, those once in a life time special moments in our life, and also to share that how close a book can come to the real life (of course it is based on real story, but with no extra drama introduced).

Saturday, February 21, 2015

చిన్నగీత - పెద్దగీత

Out beyond ideas of
Wrong doing and right doing
There is a field.
I'll meet you there. - Rumi

రోజూ ఉదయం ఆఫీస్ కు వెళ్ళే సమయంలో ఒక నేషనల్ రేడియో షో వినడం అలవాటు. ఆ షో క్రూ మొత్తం ఒక్కోసారి ఎంత సిల్లీ విషయాల మీద చర్చలు చేస్తారో, అప్పుడప్పుడూ మనల్ని ఒక్కసారి ఆపి ఆలోచింపచేసే విషయాలనూ సిన్సియర్గా చర్చకు తెస్తారు. ముఖ్యంగా ప్రోగ్రాం లీడ్ ఏంకర్ అయితే నన్ను బలే ఆశ్చర్యపరుస్తాడు. ఒక్కోసారి వాళ్ళ సిల్లీ వాగుళ్ళకి చిరాకు వేసినా, వినడం మాత్రం మానను.

మొన్నోరోజు ఉదయాన్నే అలవాటు ప్రకారం డ్రైవ్ చేస్తూ రేడియో వింటున్నాను. ఆరోజు చర్చకు పెట్టిన విషయం, ‘ మీ పిల్లలు గే అని తెలిస్తే మీరెలా ప్రవరిస్తారు లేదా ఎలా ప్రవర్తించారు?’ అనేది. రోజూ లానే శ్రోతలు కాల్ చేసి వాళ్ళ అనుభవాలు చెపుతున్నారు. నేనూ నాకున్న ప్రిజుడిస్ తో  అయిష్టంగానే వింటున్నాను. ఒకాయన చెప్పినది వినగానే నాకు కళ్ళు చెమ్మగిల్లాయి. ఆయన ఇలా చెప్పారు. ‘నా టీనేజ్ కొడుకు గే రిలేషన్లో ఉన్నాడు. మా ఇద్దరి మధ్యా కావాల్సినంత చనువుంది. అయినా తను ఆ విషయం నాకు చెప్పడానికి బిడియపడి, తల్లికి చెపితే, తను నాతో చెప్పింది. అపుడు నేను తనని పిలిచి ఇలా చెప్పాను. “నువ్వు ఎలా ఉన్నా, ఏం చేసినా ఎప్పటికీ నా కొడుకువే. నీకూ నాకూ మధ్య బంధంలో గానీ, నాకు నీమీద ఉన్న ప్రేమలో గానీ  ఏమాత్రం మార్పు రాదు. అయితే ఇపుడు బానే ఉంటుంది. కొన్నేళ్ళ తరువాత నువ్వెలా గుర్తింపబడాలనుకుంటున్నావూ అన్నది పూర్తిగా నీ నిర్ణయం.  ఫలానా గే జో అనో, ఫలానా ఇంజినీర్ జో అనో, లేదా ఆ మెకానిక్ జో అనో ఇలా నీకే గుర్తింపు కావాలో అన్నది నువ్వే నిర్ణయించుకోవాలి. నీకేం సహాయం కావాలన్నా చెయ్యడానికి నేనున్నాను.” ‘అని చెప్పారు. లోకాలు తలక్రిందులయిపోయినట్టు కాకుండా, అలా అతి చిన్నవిషయంలా తీసుకుని, సంతులనంతో ప్రవర్తించడం ఎంత కష్టం!!!!

నాకు చిన్న గీత - పెద్ద గీత సారూప్యం, Memories in March సినిమా, రూమీ వాక్యాలూ కలిసికట్టుగా గుర్తొచ్చాయి. ఆ సినిమాలో గే పాత్రధారి రితుపర్ణో ఘోష్, ఇంకో గే పాత్రధారి తల్లిని (దీప్తి నావల్), ‘నీకు నీ కొడుకు పోయాడన్న విషయమా, లేదా అతను గే అని తెలియడమా ఎక్కువ బాధ కలిగిస్తున్నది’ అని అడుగుతాడు. ఆ తల్లి మాత్రం ఏం చెప్పగలుగుతుంది??? ఏ తల్లికయినా జవాబు తేల్చుకోగలిగే గుండె నిబ్బరం, ఎన్ని జన్మలెత్తినా వస్తుందా??? హ్మ్మ్ ...

కులాలను దాటి, మతాలను వీడి సంబంధాలు నిలుపుకోడం కొత్తేం కాకపోయినా, గత రెండు దశాబ్దాలుగా అతిసాధారణం అయిపోయింది. అసహజ సంబంధాలకు సమానహక్కుల పోరాటం జరుగుతున్న కాలంలో ఉన్నాం. అయితే మాత్రం, కొత్తనీటి ప్రవాహంతో కొట్టుకుపోకుండా, ఇసుకలో కాళ్ళు అదిమి నిల్చోగలిగే నిబ్బరం, నాలాంటి సామాన్యులకి సాధ్యమేనా??? గత పదిహేనేళ్ల కాలంలో, పిల్లల గురించిన చర్చల్లో ‘పిల్లలు తెలుగు వాళ్లనే చేసుకోపోయినా పర్లేదు. ఫలానా ఉత్తరాది వాళ్ళు కాకుండా ఉంటే చాలు’ నుంచి, ‘ఇండియన్సే అక్కర్లేదు. ఫలానా జాతి వాళ్ళని తప్ప, ఇంకెవరయినా పర్లేదు’ ను దాటి, ‘ఏ దేశం వాళ్ళనయినా పర్లేదు, కానీ ఆడపిల్లలు మగపిల్లవాడిని, మగపిల్లాడు ఆడపిల్లనీ చేసుకుంటే అంతే చాలు’ అనే నిట్టూర్పుల వరకూ ప్రత్యక్ష్య సాక్షిని. అయితే చిన్నగీతకు గుర్తింపు పెద్దగీత గీయకుండా సాధ్యం కాదా???

మళ్ళీ నాలో అదే ప్రశ్న. జీవితాలన్నీ ముందే రాసిపెట్టుకున్న సమీకరణాల హద్దుల్లో సాగితే ఏడు రంగుల ఇంద్రధనసుకి ఎనిమిదో వర్ణాన్ని అద్దేదెవరూ? అయితే ఆ కొత్తవర్ణాలను ఆహ్వానించడానికీ, ఆస్వాదించడానికీ నేను సిద్ధంగా ఉన్నానా??? కాలమే జవాబు చెప్పాలి. 






Friday, February 6, 2015

Book Reviewing: Art of Public Service




Though occasionally I follow my instincts in selecting the books I read, most of the time reviews drive me to them. Yet there were instances, where a book with exciting reviews totally disappointed me. I am personally thankful to all the reviewers out there (not the professional ones),  sharing a word about these wonderful books. Without them I wouldn't come across a lot of the books, those made into my way.

These reviewers help the readers like me to get to some books, other wise wouldn't have even know that  they exist. It is their art of presentation, that convinces you that your time is worth investing in it. So, I call it both, a public service and an art OR Art of Public Service in short. 

Here is an interesting article on the topic of book reviewing.  Is Book Reviewing a Public Service or an Art?  I liked some of the views expressed in this article.
The point of the review, after all, is not the reviewer: It’s the book. The book that somebody else wrote. 
Book reviewer, I salute thee. You absorb whole books and rotate them slowly in your mind. You stagger to the keyboard. You fulminate, you glorify. You try and think of something clever to say. Then you take off your rubber gloves, and fall asleep.
Book review bombast comes in three flavors: highbrow (“Every page witnesses the overflow of his vast erudition”), middlebrow (“magisterial . . . that rare thing”) or lowbrow (“Wade through burning gasoline to get this book”). 
And in the Internet era, in which everyone is a critic and provocative “smart takes” reign supreme, the bar has been set ever higher in terms of standing out from the crowd. As a result, writers often feel pressured to perform rather than inform.





Disclaimer: I don't write book reviews. Though I love to write introduction to the books I like, I wouldn't dare calling them reviews. Even if they classified as one, they are completely positive, since I only write about the ones I absolutely like. 

(Pictures Courtesy: google.com)

Monday, December 1, 2014

Kabhi Tanhayion Mein

"నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడెపుడో  అకస్మాత్తుగా నా ఆలోచనలు నిన్ను చుట్టుముడతాయి. నీ చుట్టూ గాడాంధకారం అలుముకుంటున్నప్పుడు, నా జ్ఞాపకం ఓ మెరుపై మెరుస్తుంది. ఆ మెరుపు నీ ప్రేమప్రపంచాన్ని దగ్ధం చేసి పోతుంది, ఆపై నువ్వు బ్రతకనూ లేవు, నీకు చావూ రాదు. ఎప్పుడో  నీ హృదయంలో నా ప్రేమ తుఫాన్ లా వెల్లువెత్తుతుంది. ఈ ప్రేమలో అగ్ని కూడా దహించుకుపోతుంది, ఇక నువ్వెంత? ఆ వెల్లువలో కొట్టుకుపోతావ్. ప్రేమలో మునిగి మురిసిన క్షణాల అనుభవాలు నీ మదిని తాకినపుడు, అది తట్టుకోలేక  నీ హృదయం పరుగులెడుతుంది. నీ వూపిరి రెపరెపలాడుతుంది. ఎపుడో  నా జ్ఞాపకం నిన్ను మెరుపయి భస్మం చేస్తుంది. అపుడిక నీకు బ్రతుకూ లేదు. చావూ రాదు. " 

ముబారక్ బేగం, 'కభీ తన్హాయియోన్ మే' పర్యాయపదాలుగా మారడం చరిత్ర. కొన్ని చరిత్రలు మాసిపోవు. చర్విత చరణాలవుతాయి. అందులో ఒకటి ఈ పాట. అసలు పాట మొదట్లో సంగీతమొకటే ఒక ఎత్తు, గుండెని సుడులు తిప్పుతూ ఆత్మను శరీరం నుండి వేరుచేస్తున్నట్టూ. బేగం గొంతు చేయించే కిన్నెరలోక సంచారం ఒకెత్తు. కేదార్ నాథ్ శర్మ గారి రచన అజరామరం చెయ్యడానికి కేవలం ఈ ఒక్కపాట చాలు. చాలనిదొక్కటే ... ప్యాసా దిల్. ఎక్కడ ఎన్నేళ్ళుగా వెదికినా కేవలం ఒక్క చరణం మాత్రమే దొరికింది.మొన్నెప్పుడో  దాహం తీరక ఇంకా ఇంకా వెదుక్కుంటుంటే మీనూ బక్షీ అనే ఆమె పాడిన వెర్షన్  దొరికింది. చివరి రెండు చరణాలూ ఒరిజినల్గా కేదార్ శర్మ వ్రాసినవేనా లేక స్వయంగా కవయిత్రి అయిన మీనూ బక్షీ వ్రాసినవో తెలియదు. ఫిర్ సే అనే ఆల్బం లో దీంతోపాటు  ఇంకా కొన్ని ఫేమస్ గజల్స్ పాడారు.

బేగం గొంతులో 'నేను లేకుండా నువ్వేం శాంతంగా ఉంటావో నాకు తెలీదా ' అన్న కవ్వింపు, 'నీకే తెలుస్తుందిలే ముందుముందు' అన్న ధీమా లీలగా విన్పిస్తుంటాయి. అదిగో, ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో కూడిన చిరు అతిశయం మిస్సయ్యింది మీను బక్షీ గొంతులో. మొదటిసారి వినగానే, ఒరిజినల్ తో పోల్చుకుని నిరాశ పడినా, వినగా వినగా మీనూ బక్షీ పాడినది కూడా ఇష్టంగా మారిపోయింది. 

kabhi tanhaiyon mein yun, hamaari yaad aayegi
andhere chhaa rahe honge, ke bijli kaundh jaayegi

ye bijli raakh kar jaeygi, tere pyaar ki duniya
na phir tu jee sakega, aur na tujh ko maut aayegi

tumhare dil mein ubharega, hamare pyar ka toofan 
jalegi is dagar aag bhi, ke tujhko rondh jaayegi 

jehan pe chaayenge jab, pyar mein gujare huye lamhe 
oh dhadkan tej ho jaayegi, saanse kaunf jaayegi


మొత్తం పాట - మీను బక్షీ వర్షన్ 


ఒరిజినల్ -ముబారక్ బేగం 



Sunday, February 23, 2014

స్మృతిగీతం

మాంత్రికుని ప్రాణం చిలుకలో ఉన్నట్టు 
నా పంచప్రాణాలూ నీ పిలుపు మోసుకొచ్చే నీలిపిట్టలో 

నీ కబురు తెస్తుందని 
కళ్ళల్లో అఖండజ్యోతులు వెలిగించుకుని 
మెరుస్తూ మాయమవుతూ వచ్చే నీలిపిట్ట సందడి కోసం 
అది తీసుకొచ్చే నీ పిలుపు పంచాక్షరి కోసం 
ఆ పలకరింపులోనే  మోహ మల్హార్ వినడం కోసం 
నిశిరాత్రిలో కూడా ఆ చెట్టు కొమ్మకు కళ్ళు తగిలిస్తానా  
నీకేమో నా స్మృతైనా ఉండదు

ఎక్కడో దూరం నుండి నీ పాటొకటి వినిపిస్తుంది
చిత్రవర్ణ రాగాలు ఆలపిస్తూ 
లోకాన్నంతటినీ  మైమరపులో ముంచుతూ
నాకోసం ఆ ఒక్క రాగాన్నీ దాయవూ అని అడుగుతానా 
సెలయేరులా నవ్వి మాయమవుతావు 
ఏదీ ఎప్పటిలానే నా కోరిక
నీ చెవి దాటి గుండెగదిని చేరందే

ఇదుగో నేనిక్కడ ఇంకా ఇలానే 
నీ పిలుపు కోసం వేచి చూస్తూ...
యుగాలు వేచిన తర్వాత 
ఎపుడో వస్తుంది నీలిపిట్ట 
అమాయకంగా కళ్ళు ఆర్పుకుంటూ 

నీకోసం క్షణక్షణం తపించిన ఒక జీవి  
ఇక లేదన్న సంగతి 
నీకు తెలుస్తుందా 
ఎప్పటికైనా  

ఇంకా ఇక్కడే
పిట్ట వాలే చెట్టుకొమ్మకు 
హృదయాన్ని తగిలించి వూగిసలాడుతూ 
పురాస్మృతి గీతాలు పాడుకుంటూ 
నీ నవ్వు కోసం ...
నీ పాట కోసం ...
నీ పిలుపు కోసం ...
ఆ ఒక్క రాగం వినడం కోసం ...